‘ఆరోగ్య భాగ్యచక్రం’


బొమ్మ

ఒకరి జాతకం నుంచి అనారోగ్యం గురించి తెలుస్తుందా? తెలుసుకుని ఏమిటి చేసేది?జాతకంలో ఉన్న అనారోగ్యానికి ఏ రకమైన పరిష్కారం ఉన్నది?
పరిష్కారాలను బట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉండగలదా?
గ్రహాలకు,మూలికలకు/వివిధ మందులకు  ఏమిటి సంబంధం?
  జాతకంలో జెనెటిక్ కోడ్ ఎక్కడ దాక్కునుంటుంది? ఒకరి జాతకం నుండి అతని సూక్ష్మ శరీరాన్ని గుర్తించగలమా?
…ఏ దశలలో గుండె పోటు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను  ఇతర అంశాలతో పాటు ఈ పుస్తకంలో పొందు పరచటం జరిగింది.

అంతర్జాలంలో కొనాలనుకున్నవారు ఈ క్రింది link వాడగలరు

http://kinige.com/kbook.php?id=1475

ప్రింటు మాధ్యమంలో కావాలనుకున్నవారు 9553149339 కు సంప్రదించగలరు. or at 

Navodaya Book House , Kachiguda , Hyderabad

 

Phone:  (040) 24652387

Mobile:  9247471361

Address:   3-3-865, Kachiguda, Hyderabad- 500027, Andhra Pradesh

Landmark:  Opposite Arya Samaj Mandir

 

ప్రకటనలు

నిన్న లేని అందమేదో…
మొదటి భాగం

నా ఎదురుగా ఒక అందమైన కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఆ హోటల్ లో ఏది అడిగినా చాలా మెల్లగా, తీరికగా తీసుకుని వస్తున్నారు. అ కుర్రాడు దాదాపు గంట సేపు మెనూ చదివి ఆర్డర్ చెప్పి చేతులు కట్టుకున్నాడు. ఎందుకో తనలో తఓ లేక నన్ను చూసో ఊరకే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఎందుకైనా మంచిదని నా గుండీలు చెక్ చేసుకున్నాను. నన్ను చూసి కాదని అర్థమైనది. ఆపుకుందామనుకుంటాడు, వల్ల కాక మరల నవ్వుతునాడు.
‘ఎందుకయ్యా నవ్వుతున్నావు? ‘ అని అడిగాను.

కొద్దిగా కళ్లు పెద్దవి చేశాడు.’ వద్దు సార్, చెబితే బాగుండదు ‘
‘ అరే, చెప్పవయ్యా, పరవాలేదు, నేను నవ్వుకుంటాను కదా?’
‘ ఏమీ లేదు సార్. ఎందుకో మీకు చెప్పాలని ఉంది ‘
‘ వెరీ గుడ్. చెప్పు ‘
‘ నిన్ననే జీవితంలో మొదటి సారి లుంగీ తొడిగాను సార్ ‘
‘ శభాష్! అది నిజమైన ఉత్సవం! అయితే ఈ బిల్లు నువ్వే కట్టేస్తావన్నమాట! ‘
‘ అన్యాయం సార్! ‘
‘ అదేమిటి! పార్టీ ఇవ్వాలి మరి! ‘
‘ లుంగీ కట్టినందుకు పార్టీ అడగటం అన్యాయం సార్! పైగా మీరెవరో నాకు తెలియదు! ‘
‘ మంచి వాడివే! రేపు పెళ్లి చేసుకుంటావు. ఎవరెవరో వస్తారు. అందరినీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటావా? నో! అయినా వాళ్లు ఏవేవో తిని వెళ్లి పోతారు. ఒక్కో సారి మీ ఆవిడే నిన్ను మరచిపోతుంది! ‘
‘ అన్యాయం సార్! ‘
‘ పొనీలే వదిలేయి. బిల్లు ప్రక్కన పెట్టు. ఇంతకీ ఏమి జరిగింది? ‘
‘ లుంగీ కట్టాను సార్! ‘
‘ వెరీ గుడ్! ‘
‘ ఇందులో గుడ్ బాడ్ ఏమున్నాయి సార్? ‘
‘ అరే! ఎంతమందికి చీరె కట్టటం వచ్చు? కేవలం చుట్టుకుంటారు. ఎంతమందికి చక్కగా లుంగీ కట్టటం వచ్చు? అది కూడా ఒక కళే! నువ్వు కట్టావు అంటే ఆ వయసు, ఆ ప్రాయం నీకు వచ్చాయి…ఒక వసంతంలోకి అడుగు పెట్టావు మరి. అద్దీ! అందుకన్నమాట వెరీ గుడ్ అన్నది. ముందుకెళ్లు ‘

‘లుంగీ కట్టుకుని ముందు గదిలో నేల మీద పడుకున్నాను సార్.నేను అలానే పడుకుంటాను. నాకు అది ఇష్టం ‘
‘ గుడ్. దిండు వాడకుండా ఉంటే మరీ మంచిది. రక్త ప్రసారం బాగుంటుంది.’
‘ అర్థరాత్రి తరువాత ఎవరో వచ్చినట్లున్నారు. మా అమ్మ నన్ను లేచి మరో గదిలోకి వెళ్లమంటున్నది.’
‘ ఎవరొచ్చారు?’
‘ ఏమో సార్, దూరపు బంధువులు. భార్యా భర్తలు-పెద్ద వళ్లు, ఒక అమ్మాయి!’
‘ శభాష్! అమ్మాయి బాగుందా?’
‘ నిజంగానే చాలా బాగుంది సార్. కాకపోతే నేను లేవాలంటే ఇబ్బంది. దుప్పటి కప్పుకుని కూర్చున్నాను. లుంగీ ఊడిపోయింది లోపల!’
‘ ఓహో! వెరీ గుడ్! మరెలా? అమ్మాయి…’
‘ అమ్మాయి వాళ్ల అమ్మ చాటునుంచి ఓరగా చూస్తోంది సార్.’
‘ గుడ్. అసలు నీకు ఓ సంగతి చెప్పాలో! అమ్మయిలు ఓర కంట చూసినప్పుడు ఇంకా బాగుంటారు!’
‘ ఛా!’
‘ అవును. ఇంతకీ అమ్మాయికి అర్థమైనట్లు అనిపించిందా?’
‘ ఏమో సార్. అర్థమైనదో ఏమో నాకు తెలియదు. అమ్మ ఒకటే గోల. లేవమంటుంది. అమ్మాయి అరనవ్వు నవ్వుతోంది ఒక ప్రక్క. నాకు చెమట్లు!’
‘ వెరీ గుడ్! అమ్మాయిలతో అదే సమస్య! అర నవ్వులో పూర్తి కథ చెబుతారు…’
‘ కరెక్ట్!’
‘ ఇంతకీ ఏమి చేశావు? ‘
‘ ఏముంది సార్! నేను ఇంకా నిద్రలో ఉన్నానని అందరూ అనుకుని నా పేరు మరి మరీ అనటం మొదలు పెట్టారు.’
బేరర్ వచ్చి ప్లేట్లు పెట్టి ఎందుకో మరో అరనవ్వు నవ్వి వెళ్లి పోయాడు.
‘ ఏమి చేశావు? ‘
‘ దిష్టి బొమ్మలా అలానే లోపల సద్దుకునే ప్రయత్నం చేస్తూ వెర్రి వాడిలా చూస్తున్నాను. వచ్చిన పెద్ద మనిషి కదలడు. నేనో నువ్వో తేల్చుకుంటాను అన్నట్లు నడుము మీద చేతులు పెట్టాడు. ఆవిడేమో ఈ మధ్య కుర్రాళ్లు ఇంతే…అనేసింది. రాత్రంతా ఏవేవో దిక్కుమాలినవన్నీ చదువుతారు, పడుకోరు. ఎవరైనా లేపితే ఇలా ఇదిగో దయ్యం పట్టిన వాళ్లలా వ్యవహారం’
‘ బాగుంది. నీళ్లు చల్లారా?’
‘ ఓ, అదీ జరిగింది. జీవితంలో ఇలాంటిది ఎవరికీ జరగకూడదు సార్!’
‘ నో, బి బ్రేవ్ మై బాయ్, దీనినే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఇంతకీ ఏమి చేశావు?’
‘ కొంత సేపు చూస్తూ ఉండిపోయాను. చేసేది ఏముంది?’
‘ కరెక్ట్. మంచి పని చేశావు. అన్ని విషయాలలో మనం ఏదో చేయగలం అనేది తప్పు. కొన్ని చూడాలి. అంతే! కాలం కాకరొత్తు మీద నిప్పు లాంటిది. మనం ఎంత నిప్పోలమైనా కేవలం చూడాలి అంతే. ముట్టుకోకూడదు. అలా చూడటం వలన నీకు మంచిదే జరిగి ఉంటుంది.’
‘ లేదు సార్! లోపల ఎంత లుంగీని ముడి వేయాలనుకున్నా అవటం లేదు. అసలు నిలవనిదే!’
‘ పోనీలే! చాలా మందికి కొన్ని సందర్భాలలో గుడ్డ ఊడిపోవటం సహజం. నీకూ అదే జరిగింది. కాకపోతే అమాయిని ఒక కంట కనిపెట్టావా?’
‘ ఇంకేమి కనిపెడతాను సార్? నన్ను లేపే ప్రయత్నంలో దుప్పటీ లాగటం ప్రారంభించారు!’
‘ఛా!’
‘ ఇంకేముంది? నేను రెండు చేతులూ పైకి పెట్టి ద్రౌపదిలా అరుద్దామనుకున్నాను! కాని ఘోరం జరిగేది సార్!’
‘ కరెక్ట్. మరి పీకల మీదకి వచ్చాక ఎలా స్పందించావు?’
‘ ఏమిటి? స్పందన? భలే వారే. మానభంగం సమయంలో స్పందించటం ఏమిటి? మరల నేలకు వాలిపోయి దుప్పటిని ఉన్న బలంతో గట్టిగా పట్టుకున్నానూ
‘ ఎంత మంది లాగారు?’
‘ అప్పటికి మా ఇంటి వాళ్లే పూనకం వచ్చిన వాళ్ల లాగా పూనుకుని ఉన్నారు. వాళ్ల వల్ల కాకపోతే ఆ వ్చ్చిన పెద్ద మనిషి ఒక చేయి వెయ్యటానికి సిధ్ధ పడ్డాడు!’
‘ వెరీ గుడ్!’
‘ ఏంటి సార్ వెరీ గుడ్! నాకు ఇంత జరుగుతుంటే…’
‘ ఆ… అది కాదు.ఆయనకు సహాయ పడే నైజం ఉన్నందుకు సంతోషించాను. అంతే! ఇంతకీ…’
‘ మీరన్నట్లు కాకరొత్తు మీద నిప్పు జరిగిపోతోంది.’
‘ కరెక్ట్!’
‘ ఒక విలక్షణమైన ఆలోచన పువ్వొత్తులా మెరిసింది ‘
‘ శభాష్! ఏమి చేశావు?’
‘ ఏముంది? ఆ దుప్పటిని ఒక్క సారి ఒక ప్రేమికునిలా వొళ్లంతా చుట్టుకున్నాను. దానితో పాటుగా దొరలి దొరలి అలాగే హాల్లోకి జారిపోయి అలాగే బెడ్ రూం లోకి పరుగు తీశాను.’
‘ అంటే దుప్పటీనే ప్రేమికునిలా కప్పుకున్నావు!’
‘ కరెక్ట్! సరీరాన్ని అలా స్పందింప చేశాను ‘
‘ గుడ్!వాళ్లు ఏమి చేశారు?’
‘ వాళ్లు కబడ్డీ ఆడుతున్నట్లు వెంట వచ్చి ఎందుకో నేను దుప్పటీతో నిలబడగానే ఎక్కడ వారు అక్కడే ఆగిపోయారు. వాళ్ల మొహాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా నవ్వొస్తున్నది సార్!’
‘ భలే ఉంది. ఇంతకీ నీ పేరేమిటి నాయనా?’
‘ లింగం సార్. నిన్ననే లుంగీ కట్టాను!’
‘ గుడ్! మరి అమ్మాయి…’
‘ అమ్మాయి ఈ రోజు పొద్దున్నే పలకరించింది.’
‘ వమ్మో! ఏమందేమిటి?’
‘ రాత్రి దుప్పటీ వేషంలో చూసి బుధ్ధుడిలా ఊహించుకుందట!’
‘ కంగ్రాచులేషన్స్!’
‘ ఎందుకు సార్?’
‘ బుధ్ధిమంతుడవని ముద్ర వేసేసింది!’
‘ అది కాదు సార్! దుప్పటి లోంచి నా మొహం ఒక్కటే బయట ఉండి అలా కనిపించానట! నా బాధ అంతా చెప్పాను. విని నవ్వింది.’
‘ నవ్వినప్పుడు ఎలా ఉంది?’
‘ అర నవ్వే పూర్తి కథ చెబితే పూర్తి నవ్వు పద్యాలే పాడినట్లు ఉంది సార్!’
‘ శభాష్! ఇంకా ఏమైనా మాట్లాడారా?’
‘ పెద్దగా లేదు సార్. కాకపోతే చాలా చిత్రమైన కబుర్లు చెప్పింది సార్. ఎందుకో మీతో పంచుకోవాలని అనిపిస్తున్నది!’
‘ వెరీ గుడ్! పంచినదే పంచామృతం! పైగా మన కథ పంచెతో ప్రారంభమైనది. నువ్వేమి అనుకున్నా నాకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం. మాట్లాడేవాళ్లంటే మరీ ఇష్టం. మళ్లీ మళ్లీ మాట్లాడే వాళ్లంటే మరీ ఇష్టం. చూశావూ, నేను మళ్లీ మాట్లాడుతాను!’
ఆ అబ్బాయి లేచాడు.
‘ అదేమిటి?’
‘ లేదు సార్. ఉండండి. ఈ బిల్లు కట్టేస్తాను. ఆ అమ్మాయి చెప్పినవి మరో రోజు చెబుతాను. ఎందుకో మీరు నాకు మంచి సలహాలివ్వగలరని అనిపిస్తున్నది.’
‘ అనిపించటం కాదు. నీకు కనిపిస్తున్నది నిజం. నేను జీవితంలో సలహాలు తప్ప ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వలేను కూడా! సీయు!’

~~~***~~~

రెండవ భాగం

సూపర్ మార్కెట్ నిండా కొనే వారికంటే అమ్మే వారు అదో రకమైన దుస్తులతో నిలబడి ఉన్నారు. ఒకడు చేతులు కట్టుకుని ‘వెల్కం సార్ ‘ అన్నాడు.
‘నా గిఫ్ట్ ఏమయింది? ఏదో కార్డు ఇచ్చి స్వైప్ చేస్తున్నావు కదా?’ అడిగాను.
‘ గిఫ్ట్ ఇస్తాం సార్. మీ లిస్టు చెప్పండి. నేను తీస్తాను ‘
‘ థాంక్స్. ఇది లిస్టు లోని సామాను నువ్వు తీస్తానందుకు కాదు. అసలు ఈ రోజుల్లో కూడా లిస్టు వ్రాసుకునేటన్ని సామాన్లు నేను కొనగలనని నువ్వు అనుకున్నందుకు! ‘
‘ అదేమిటి సార్?’
‘ అవునోయ్, నా దర్జా పెంచేశావు ఉన్న పళంగా! నేను కొనేది ఒకటో రెండో. అవి లేకపోతే అదీ లేదు. ఇంటికెళ్లి లేవు అని చెప్పి చక్కగా పడుకుంటాను…’ అంటూ లోపలికి వెళ్లాను. గెడ్దం గీసుకునే రేజర్లు ఒక చోట రక రకాలుగా పడి ఉన్నాయి. వాటిని ఒక కుర్రాడు తెగ పరీక్షిస్తున్నాడు. ఎవరో కాదు. మన లింగమే!. భుజం మీద చేయి పెట్టి అతను నన్ను చూడగానే వెర్రి నవ్వు నవ్వేశాను.
‘ గెడ్డమా?’
‘ అవును సార్.’
‘ అడ్డంగా ఉందా?’
‘…’
‘ చెప్పవయ్యా? తప్పదౌ మరి. మగ పుటక పుట్టాక మరి లుంగీ కట్టాలి, దిక్కుమాలిన గెడ్డం గీయాలి, అలాగే …’
‘ దిక్కుమాలినది కాదు సార్!’
‘ ఒహో సారీ. కొత్తగా గీస్తున్నావు కదా, అంతేలే. ఇంతకీ అమ్మాయి మళ్లీ మాట్లాడిందా?’
‘ ఇక్కడొద్దు సార్.’
‘ ఇదేవన్నమాట? నేను ఏదైనా…’
‘ అది కాదు సార్! ఇక్కడందరూ సేల్స్ అమ్మయిలున్నారు. అలా రండి.’
ఇద్దరం ఇవతలకు వచ్చాం. అక్కడొక పాప్ కార్న్ వాడున్నాడు. రెండు కప్పులు తీసుకుని కూర్చున్నాం.
‘ యెస్ లింగా! గో ఆన్! ‘
‘ అమ్మాయి నిన్న డాబా మీదకి వచ్చింది!’
‘ వెరీ గుడ్!’

‘ డాబా మీదకు వస్తేనే వెరీ గుడ్ ఏంటి సార్? ఏదో నాతో ధాబా వరకు వస్తే ఒక మాట!’
‘ లింగా, ఆవేశం వద్దు. అమ్మాయిలు డాబా మీదకే రావాలి. అంటే పైకి రావాలి. అప్పుడే ఆకాశం చూసి ఆలోచనలలోకి వెళతారు. అందాల ప్రపంచం వారిని ఆహ్వానిస్తుంది. నిన్న లేని అందమేదో నిదుర లేచి కూర్చుంటుంది! ‘
‘ అంతుందా సార్? ‘
‘ మరీ? పూర్వం ముఖ్య మంత్రి విజయభాస్కర రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ఎలా మొదలు పెట్టే వారో తెలుసా?’
‘ తెలియదు సార్!’
‘ నో లింగా, ప్రపంచం చూడాలి నువ్వు. ఆయన తిన్నగా ఒకే మాట అనే వారు. మైకు మీద వేలితో తట్టి మహిళలందరూ నడుము కట్టి ముందుకు రావాలి, యువకులు ఉత్సాహం చూపాలి అనే వారు ‘
‘ అందుకేనేమో సార్, ఆర్.టి.సీ బస్సులో కూడా స్త్రీలను ముందు నుంచే లోపలికి రమ్మంటున్నారు!’
‘ గుడ్! అద్దీ. నీలో కళ ఉందయ్యా లింగం. లేకపోతే నాతో నువ్వసలు మాట్లాడలేవు. నేను నిన్ను పలకరించాను చూడు? అదీ, అసలు అదీ అమృత ఘడియ అంటే. పంచాంగమంతా ఎంత చెప్పినా ఘటన మీదనే నయా అంతానూ! ఇంతకీ డాబ మీద ఏమి జరిగింది? ‘
లింగడు కులికాడు. సూపర్ మార్కెట్ ముందు రోడ్డు మీద పొడుగాటి చీపురుతో ఎవరో ఊడుస్తూ నిన్న లేని దుమ్మంతా పైకి లేపేశారు. పొగ లాంటింది కమ్ముకుంది. కుర్రాడు నన్ను చూస్తూ మాట్లాడుతున్నా నిజానికి మరో ప్రపంచం లోకి వెళ్లిపోయి తన అనుభవాన్ని చెబుతున్నాడు…

~~~***~~~

‘సాయం సంధ్య వేళ కళాపోషణ కోసం అలా డాబా మీద నిలబడ్డాను. మా ఇల్లు చాలా పాతది ‘
‘ వెరీ గుడ్. ఆ ఎందుకంటే కొత్తగా ఇళ్లల్లో అసలు డాబాలేవి? అన్నీ అపార్ట్మెంట్లే! ముందుకెళ్లు ‘
‘ సూర్య బింబం ప్రక్కన ఆమె వచ్చి నిలబడింది!’
‘ ఛా! ‘
‘ అవును సార్. మీరు నమ్మరు. కరెక్టుగా ఆమె ఎందుకో అక్కడే ఆగిపోయింది.నాతో పాటు అలా ఆ బింబం వైపు చూసి సూర్యుడు అస్తమించగానే దిగబోయింది. నేను అదేంటి? ఇది చూడటం కోసం వచ్చావా? అన్నాను. నన్ను మరల ఇటు తిరిగి అరనవ్వుతో చూసింది సార్, నేను ఆ నవ్వుకు పిచ్చివాడినైపోతున్నాను.’
‘ గుడ్. ఉండాలి. ప్రతి మనిషికీ ఒక పిచ్చి ఉండాలి. ఉండి తీరాలి. అసలు సృష్టి యావత్తూ ఒక చిన్ని పిచ్చి ఆలోచనతో ప్రారంబ్జమైనదని పిచ్చ్య్య స్వామి గారు నిన్ననే పీ టివీలో చెపారు. అంతే కాదు. ఆ ఆలోచన తరువాత సృష్టి తనంతట తాను పిచ్చి పిచ్చిగా తయారయిందని కూడా విఙ్ఞాన పరంగా కూడా వివరించారు. వదిలేద్దాం. సృష్టిని పెద్దగా పట్టించుకోవదు. తరువాత ఏమి జరిగింది?’
‘ నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్లున్నావని…ఎందుకులే అని వెళ్లిపోదామనుకున్నాను! ‘, అన్నది.
‘ ఆలోచనా? నీకా? (ఆ పాప్ కార్న్ వాడిని మంచినీళ్లు అడిగి త్రాగాను.)సమస్య లేదని చెప్పవలసింది.’
‘ వేళాకోలం వద్దు సార్. ఎంత ఆలోచన లేకపోతే, అలా మానభంగపర్వం నుండి తప్పించుకున్నాను? ‘
‘ కరెక్ట్! దానినే ఇటు తిప్పి అను లింగా! నీలో ఆలోచన రగలాలీ అంటే అంత పని జరగాల్సిందే!’
‘ అన్యాయం సార్!’
‘ ఇంతకీ నువ్వేమన్నావు?’
‘ నేనేమీ ఆలోచించటం లేదు ఫరవాలేదు. వెళ్లక్కరలేదు.’
‘ చూశావా? నిజం చెబితే ఎవ్వరికీ బాగోదు. అమ్మాయి ఏమంది?’
‘ నిన్న రాత్రి మీ పరిస్థితి నాకు అర్థమయింది…అవును మీరు ఎందుకు సార్ లేచి నిలబడ్డారు? నేనేమైనా తప్పుగా అన్నానా?’
‘ లేదు. లేదు లింగా, జీవితంలో మొదటి సారి ఇంగితం ఉన్న అమ్మయి గురించి వింటున్నాను లింగా! ఊ ఆర్ అదృష్టం పర్సానిఫైడ్!’
‘ చాలా చక్కగా చెప్పింది సార్. మాట్లాడుతున్నప్పుడు అరచిరునవ్వు అలానే ఉంటుంది. కళ్లు ఓరగా ఉంటాయి సార్! అక్కడే మతి పోతోంది. మీరెన్నైనా చెప్పండి. నా వల్ల కాదు.’
‘ పోతుంది. చూడు లింగా, అన్నీ అక్కడే పోతాయి. కొద్దిగా ఆలోచన…సరే దాని గురించి నేను చెబుతాను గానీ తరువాత ఏమి జరిగింది?’

‘ మొదటి సారి లుంగీ కట్టావని అత్తయ్య చెప్పింది.మా క్లాస్ మేట్
మొదటి సారి చీరె కట్టినప్పుడు మేము బాగా ఏడిపించాం.’
‘ అవునా? ఎందుకు?’
‘ అసలు మేము గుర్తు పట్టలేదు ఆ అమ్మాయిని!’
‘ చెప్పు…నీ పేరు…’
‘ చెప్పిందా?’
‘ చెప్పింది. కానీ ఏదైతే అమ్మాయి అడగకూడదనుకున్నానో అదే అడిగింది. నా పేరు అడిగింది.’
‘ తెలీదా?’
‘ అమ్మాయికి ఇంటిలోని నా ముద్దు పేరు తెలుసు.’
‘ ఛా! నీకు ముద్దు పేరు కూడానా లింగా శభాష్! నాకు చెప్పలేదే!’
‘ ఒకటి తగిలించారు సార్! చిన్నప్పుడు నా తలకాయ తాటిపండులా ఉండేదని తాటిపండూ అంటారు సార్. సరే అసలు పేరు చెప్పాను. చెప్పి నీ పేరు చెప్పు అన్నాను.’
‘ రంగా!’
నిలబడ్డవాడిని కూర్చుండి పోయాను. అతను గట్టిగా పట్టుకున్నాడు. ‘ ఏమైంది సార్?’
‘ ఇదేంటయ్యా లింగా? లింగాకు ఆపోసిట్ ఏదో రౌడీవాడిలాగా రంగా ఏమిటి? నేను వస్తాను. చిన్న పని ఉంది!’
‘ అయ్యో ఆగండి సార్. పూర్తి పేరు రంగనాయకి! ఎంత మంచి పేరు సార్!’
‘ ఓహో! కరెక్ట్! ఇంతకీ కాలేజీలో ఏదో జరిగిందన్నావు చెప్పిందా?’
‘ చెప్పింది సార్!’
‘ శభాష్. అవునూ, రంగమ్మ గొంతు ఎలా ఉంటుంది?’
‘ సూపర్ సార్! క్రింద ఉన్న వీణ తీగెల మీద పైన ఉన్న తేనె తుట్టులోంచి ఒక డ్రాప్ జారిపోయి పడిపోతే ఒక అరస్వరం అలా వినిపించినట్లు ఉంటుంది మాష్టారూ! తీగెలోంచి తేనె వచ్చిందో, స్వరం వచ్చిందో తెలియదు! ఆమె అలా మాట్లాడుతోంది, నేను వింటున్నాను…’

~~~***~~~

మూడవ భాగం

లింగం చెప్పుకుంటూ పోతున్నాడు. అమ్మాయి గురించి చెబుతున్నప్పుడు అతను ఈ లోకంలో ఉండడని అర్థమైపోయింది.
‘ చక్కని గొంతు సార్.అర్థం కాకపోయినా ఏది చెప్పినా వినాలనిపిస్తుంది. తిట్టినా ఫరవాలేదు! ‘
‘ గుడ్! ఈ దేశంలో మగవాళ్లందరూ చక్కని గొంతు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని సుఖపడాలని కోరుకుంటున్నాను లింగా!’
‘ సార్, భార్యా భర్తలు సుఖపడాలంటే ఒకరికి మంచి గొంతు ఉంటే చాలా సార్?’
‘ నో! భార్యకే మంచి గొంతు ఉండాలి. కారణం ఏమిటంటే ఆమె తిడుతున్నా ఆ గొంతులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తిట్లని పట్టించుకోకుండా భర్త వెర్రి వాని వలే నవ్వుతూ పోట్లాటని సాగదీయకుండా జీవితాన్ని సాగించేయాలి!’
‘ మీరు నన్ను తిడుతున్నట్లు ఉంది సార్!’
‘ లేదు. ముందుకెళ్లు! నీకేదో చెప్పిందన్నావుగా?’
‘ కరెక్ట్. మా కాలేజీలో ఒక అమ్మాయి మొదటి సారి చీరె కట్టినప్పుడు చాలా బాగున్నవని చెప్పి జోధా అక్బర్ సినిమాకి బయలుదేరాం.’
‘ మొదటి సారి సారీ కడితే జోధా అక్బర్ ఎందుకు?’
‘ నాకు తెలియదు సార్. నన్నడిగితే ఆడవారి చాయిసులకు అర్థాలే వేరు సార్.’
‘ వెరీ గుడ్. రైల్లో చెయిన్ లాగినట్లు పాయింటు లాగావు. అసలు పైవాడు ఏ చాయిస్ లేనప్పుడు స్త్రీని సృష్టించాడని నాకనిపిస్తుంది…ఇంతకీ అక్కడ ఏమి జరిగింది?’
‘ వెళ్లారు. జోధా అక్బర్ చూడటానికి వెళ్లారు. వెళుతున్నంత సేపూ చీరెను సద్దుకోవటమె సరిపోయింది. మేమి థియేటర్ లో ఏదైనా తిన్నా, త్రాగినా చిత్రంగా అనిపించేది. తను ఆ కప్పు దూరంగా పట్టుకుని ఏదో మోదెలింగ్ చేస్తున్నట్లు నిలబడింది. సినిమాలో ఇంటర్వల్ ఇచ్చారు. మా వెనుక ఒక అంకుల్, ఆంటీ కూర్చుని ఉన్నారు. మెము మా కొత్త సరీని జోధా అని పిలవటం మొదలు పెట్టాం. జోధా, నీకేమి కావాలీ, మమ్మల్ని ఏమి తినమంటాం ఇలా అన్నమాట. మా వెనుక ఉన్న పెద్దావిడ అంటోంది, ‘ ఈ రోజు మన సమాజం లో అక్బర్ లాంటి మగవాళ్లు రావాలి!’
‘ ఎందుకు?’, ఆయన అడిగాడు.
‘ బాగుంటుంది! ఏమంటారు?’
‘ అవునూవచ్చు!’
‘ జోధా లాంటి అమ్మాయిలు కూడా తయారవ్వాలి ‘
‘ అదెందుకు?’
‘ ఇంకా బాగుంటుంది. ఏమంటారు?’
‘ కానూ వచ్చు!’
‘ మన ముందు వరుసలో చూడండి. ఆ అమ్మాయి పేరు జోధాట.’
‘ కాకపోవచ్చు!’
‘ ఏమితండీ, ఈ వచ్చు, వచ్చు బదులు అలా వెళ్లి కాఫీ తీసుకుని రావచ్చు కదా?’
‘ నువ్వెళ్లి త్రాగిరా! నేను పెద్దగా లేవలేను!’
‘ కుదరదు. ఇంకా టైం ఉంది. వాళ్లు చూడండి. చక్కగా ఏవో తింటున్నారు. నేను అడిగింది కాఫీ ఒకటే. ఒక కాఫీ చాలు.’
‘ రెండు ఖూడానా? నా వల్ల కాదు.’
‘ అలా అక్బర్ ని చూడండి. మీరూ ఉన్నారు.’
‘ ఇదెక్కడి గొడవే? ఇప్పుడు నన్ను అక్బర్ అవమంటావా కొంపదీసి?’
‘ అక్కరలేదు. కాఫీ తెండి చాలు.’
ఆయన లేచి పాపం కాఫీ కప్పులు చెరో చేత్తో పట్టుకుని లోపలికి వచ్చాడు. లైట్లు తీసేశాడు! అంతే. పాపం పెద్దాయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్నాడు. సీనియర్ జోధా చూస్తూనే ఉంది. లేచి అందుకోనూ లేదు! ఆయన కొద్దిగా వరుసలో ముందుకు వచ్చాడు. సర్కస్ లో తీగె మీద నడిచినట్లు నడిచాడు. కొద్దిగా బాలెన్స్ తప్పి అటు ఎవరి వొళ్ళోనో పడబోయాడు. అక్కడ మరో జోధాబయి ఉన్నట్లు గమనించి మరీ ఎక్కువ జాగ్రత్త పడ్డాడు. ఎడమ వైపు వంగి పాపం తడబడ్డాడు. అంతే! ఎడమ చేతిలో ఉన్న వామభాగానికి చెంద వలసిన కాఫీ కప్పు ఒరిగి మా ప్రక్కనున్న జోధా కొత్త చీరె మీద పడిపోయింది…’
‘ అయ్యబాబోయ్, ఇంకేమి మాట్లాడతాం? తరువాత ఏమయింది?’
‘ ఆయన గాభరాలో కాఫీ సారీ కాఫీ సారీ అన్నాడు!’
‘ అంటే?’
‘ ఏమీ లేదు. ఎంతగానో సారీ చెబుతున్నాను అని చెప్పాలని ఆయన బాధ.మా జోధా లేచి కాఫీ సారీ లెదు, టీ సారీ లేదు. నా కొత్త సారీ మీద కాఫీ పోశారు మీరు. వొళ్లంతా మండిపోతోంది, అన్నది.’
ఆయన ఊర్కోడే! ‘ కాఫీ సారీ అండీ.మీ వంటి మీద వేడిగా పడిందేమో అనుకుని భయపడ్డాను. సారీయే కదా, అయినా సారీ అండీ!’
అలా చాలా సేపు గడిచాక వెళ్లి కూర్చుని ఆ ఒక్క కప్పూ ఆవిడకు ఇచ్చాడు. ఈ అమ్మాయి చీరెను ఒకటే చూసుకుంటోంది. మమ్మల్ని చూసి మరీ బాధలోకి వెళ్లిపోతోంది. మాలో ఎవరో కప్పు దూరంగా పట్టుకుంటే గొడవుండేది కాదు అనెసింది. మరొకరు కాదే! దూరంగా పట్టుకున్నందుకే జోధా మీద పడింది…కొద్ది సేపు అలా సినిమా చూశాం. ఏమయిందో ఏమో ఒక్క సారి ఆమె లేచి ఆయన ఎదురుగా వెళ్లింది. ‘ మీరు సారీ చెప్పినంత మాత్రాన సారీ వస్తుందా?’ అని అరిచింది.ఆయన ఒకటే చెప్పాడు,’ కాఫీ సారీ అమ్మా. కాఫీ సారీ!’ మా వాళ్లు అరిచారు,’ ఏయ్, రా. కూర్చో. ఆయన ఏమి చేస్తాడు. కమాన్!’
అప్పటి నుంచీ ఆ అమ్మాయిని కాఫీ సారీ అనే పిలుస్తామన్నమాట.’
‘ మరి నన్నేమని పిలుస్తావు? జారిన లుంగీ అనా?’
‘ అయ్యో లెదు. ఊరకే గుర్తొచ్చింది. వస్తానూ?’
అని చెప్పి వెళ్లిపోయింది సార్.కాకపోతే నన్ను ఇంకా కొన్ని రోజులు ఆట పటిస్తుందా అని భయమేసింది సార్!’
‘ లేదు. నీతో చక్కని కబుర్లు పంచుకుంది. మామూలుగా దిగిపోయిందా లేక గబగబా దిగిపోయిందా?’
‘ మెల్లగా, జాగ్రత్తగా దిగింది సార్. ఆ మెట్లు తిరిగిన చోట తనూ తిరిగింది.’
‘ వెరీ గుడ్!’
‘ సార్, మెట్లు తిరిగిన చోట అనదరూ తిరగాలి. దీనిలో వెరీ గుడ్ ఏముంది?’
‘ లింగా, పూర్వకాలపు ఇళ్లల్లో మెట్లు అందంగా అమ్మయి నడుము తిరిగినట్లు తిప్పి తిప్పి కట్టేవారు. రంగనాయకి గురించి నువ్వు చెబుతుంటే అది గుర్తుకొచ్చిందిలేవోయ్. ఇంతకీ తిరిగి ఏమి చేసింది?’
‘ అదే సార్, ఈ సృష్టిలోని అందం ‘
‘ ఛా!’
‘ అవును సార్. తిరిగి మరో అర చూపు విసిరి అరికాలు కందిపోతుందేమోనన్నట్లు అలా తేలుతూ కిందకి వెళ్లిపోయింది సార్! నా వల్ల కావటం లేదు…’

ఇద్దరం లేచాం.
‘ శిశువా…’
‘ సార్!’
‘ అమ్మాయిల గురించి ఒక మాట అనుకుందాం.’
‘ చెప్పంది సార్ ‘
‘ అమ్మాయిలు వారు కట్టుకునె చీరెలను ప్రేమించినంతగా దేనినీ ప్రేమించరు.’
‘ కరెక్ట్!’
‘ కానీ మనసారా ప్రేమించిన వ్యక్తిని చుట్టూ చీరెలా చుట్టుకోగలరు!’
‘ అది ఆడవారికే చేతవుతుంది సార్ ‘
‘ నువ్వు నేత చీరెవవుతావో, పట్టు వదలని ప్రేమికునిలా పట్టు చీరెవవుతావో, అంతా నీ చేతిలో ఉంది మరి ‘
‘ కాదు సార్.’
‘ అదేంటి?’
‘ మీ చేతిలో ఉంది. నన్ను మీరే కడ తేర్చాలి…’
అక్కడ ఎందుకు లెనా అని ఆకాసం వైపు చూశాను.
‘ సరే శిశువా. నా ప్రక్కన కూర్చోవటమే నీకొక ఎడ్యుకేషన్! నువ్వంతగా కోరుకుంటుంటే కాదంటానా? ఇదిగో నా కార్డు. మరి మరల ఎప్పుడు?’
‘ త్వరలోనే సార్. నా గుండె పరుగులు తీస్తోంది.’
‘ వెరీ గుడ్!’
~~~***~~~

నాల్గవ భాగం

పండుగ రోజున లింగం తిన్నగా ఇంటికే వచ్చాడు.
‘ విరోధి శుభాకాంక్షలు సార్!’
‘ ఓహో! విరోధికి మిత్రుని శుభాకాంక్షలు! కూర్చో!’
‘ నేను మీ శిష్యుడిని.’
‘ కరెక్ట్ ‘
‘ విరోధిని కాను ‘
‘ మన సంవత్సరం పేరు శిశువా! మనం చేయగలిగిందేమీ లేదు. నీ డాబా అమ్మాయి పేరు చూడు-రంగా…రంగనాయకి అని తరువాత అనుకోవాలి.అమ్మాయి ఉగాది రోజున ఏమంటోంది?’
‘ అమ్మాయిలు పండుగ రోజున మరోలా ఉంటూ ఇంకోలా అంటారా సార్?’
‘ కాకపోతే?’

‘ మీరెలా కనిపెట్టారు సార్?’
కళ్లజోడు తీసేశాను.’ దేర్ యు ఆర్! లోకాన్ని చూసిన కళ్లు లింగా. ఈ రోజు వరకు నా కళ్లజోడు నేను తుడవలేదు. దీనిని తుడిస్తే చాలు ఎంతో ఙ్ఞానం అబ్బుతుందని ఎవరో ఒకరు తుడిచేసే వారు.’
‘ ఇవ్వండి. నేను తుడుస్తాను.’
‘ వద్దు. పండుగ అనగానే తొందరగా నిద్ర లేపేసి ఆడవాళ్లు నానా హంగామా చేసేస్తారు. ఆ రోజు మొత్తం మగ వాళ్లని కొద్ది సేపు ఆడుకోవాలని చాలా మంది అనుకుంటారు.’
‘ కరెక్ట్! నన్ను కూడా ఇంటిలోని ఆడవారంతా ఇంక్లూడింగ్ రంగా తీరికగా ఆడుకున్నారు. అసలు ఏది ఎలా ఉన్నా ఒక లాగే ఉండేది మగవాళ్లే సార్!’
‘ బంగారం లాంటి మాట బయటకు తీశావు లింగా. అసలు మారనివాడే మనిషి!’
‘ ఛా!’
‘ అవును. ఇంతకీ మీ వ్యవహారం ఎలా నడుస్తోంది?’
‘ ఒకటి అడుగుతాను సార్.’
‘ ఈ రోజు ఏదైనా అడుగు. నీదే! కర్ణుడే వచ్చాడు, మరల నెనే వచ్చాను. మధ్యలో ఎవరూ లేరు. పైగా ఇప్పుడే చెప్పాను, నేను మారను!’
‘ కరెక్ట్. నాకు ప్రవచనాలు, కవచ కుండలాలు వద్దు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి.’
‘ గుడ్. నీలో తెలుసుకోవలనే జిఙ్ఞాస చాలా ఉంది. అడిగేసేయ్ ‘
‘ అసలు అమ్మాయి అంటే ఏమిటి సార్?’

సినిమా పక్కీలో కిటికీ దగ్గరకు వెళ్లి ఒక చేయి గోడ మీద పెట్టాను. అంతే! పవర్ కట్! కరెంటు పంఖా ఆగిపోయింది.
మా శ్రీమతి ఇద్దరికీ ఉగాది పచ్చడి తెచ్చి ఇచ్చింది.
‘ గుడ్ క్వెష్చన్! చూశావా అబ్బీ, కరెంటు పోగానే ఉగాది పచ్చడి వచ్చింది చూడు, అదీ అమ్మాయి అంటే! అమ్మాయి అంటే ఆలోచన! పైవాడు సృష్టి చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఒక్క సారి ఆగాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అనుకుని కొద్దిగా ఆలోచించి చేద్దామనుకున్నాడు. ఇంతలోనే అమ్మాయి తయారయింది! తదుపరి ఆయన ఇంక ఏమీ చేయలేదు. సృష్టి తనంతట తానే తయారయిపోతూ వెళ్లిపోయింది… ఆలోచనలో అమ్మాయుంది. పచ్చడి తిను ‘
అతను పచ్చడి తిని నన్ను బాధగా చూశాడు.
‘ వెరీ గుడ్. దటీస్ అమ్మాయి! చూశావా? ఏదో చేదుగా అనిపిస్తే ప్రక్కనుంచి తీయగా తగులుతుంది. అంతా తీయగా సాగిపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒకటి చేదుగా తగులుకుంటుంది…’

లింగం ఆలోచిస్తూనే పచ్చడి తిన్నాడు.ప్రక్కన ఉన్న పంచాంగం తీశాడు.
‘ నాకు ఎలాంటి అమ్మాయి వస్తుంది సార్?’
‘ పంచాంగం తీశావుగా! నీ అదృష్టం నీది. భార్యలు రెండు రకాలు తమ్మీ…’
‘ సార్!’
‘ మొదటిది నీ అదృష్టం కత్తిలాంటిదయితే నేను ఉన్నాను అనే భార్య వస్తుంది. లేకపోతే నేనూ ఉన్నాను అనే భార్య వస్తుంది.’
లింగం పంచాంగం ప్రక్కన పెట్టాడు.
‘ ఏమైంది?’
‘ ఆలోచిస్తున్నాను. రంగా ఎటువంటిదీ అని…’
చేయి అడ్డు పెట్టాను.’ నో లింగా ఆ పని చేయకు. అమ్మాయిని ముందుగా విశ్లేషించవద్దు. అంతా పోగొట్టుకుంటావు.’
‘ ఓహో! పెళ్లి తరువాత…’
ముక్కు మీద వేలు పెట్టుకున్నాను.’ ససేమిరా. పెళ్లి తరువాత అసలు చిశ్లేషించకు. అది పొరపాటుగా కూడా చేయకు.’
‘ ఎందుకు సార్?’
‘ పిచ్చివాడా! పెళ్లి తరువాత విశ్లేషణ కాదు, అంతా శ్లేష మిగులుతుంది. అదే శేష జీవితం.ఇంతాంటే ఈ విషయంలో నేనేమీ చెప్పలేను.’
‘ సార్, నేనున్నాను అనే భార్య ఎలా ఉంటుందో విపులంగా చెప్పే ముందు నేనూ ఉన్నాను అనే భార్య ఎలా ఉంటుందో చెప్పండి. నాకు ఆసక్తిగా ఉంది.’
‘ అనుకున్నాను. ఈ ఆసక్తి అంత మంచిది కాదు. ఇక్కడ, ఈ గదిలో వద్దు. ఎక్కువ అడిగితే ఇక ఊరుకోను. నీకు అసలు నేనే ఉన్నాను అనే భార్య వచ్చేలాగా ఆశీర్వదిస్తాను. ‘
‘ అయ్యో వద్దు సార్! వదిలేద్దాం. మరో సారి చర్చించుకుందాం. కానీ పండుగ రోజున ఒక్కటి చెప్పండి.’
‘ వెరీ గుడ్. అడిగేయ్!’
‘ మీ గతంలో కూడా ఒక అమ్మాయిని చూసి గుండె కొట్టుకుని ఉంటుంది. నిజం చెప్పండి. పండుగ రోజున అబధ్ధం వద్దు!’
‘…’
‘ ఆంటీ గారు నవ్వుతున్నారు. చెప్పండి.’
ఎందుకో పవర్ వచ్చి కరెంటు పంఖా మరల తిరగటం ప్రారంభించింది. ఏమిటో…నిజమైన జీవితం జరిగిపోయినదానిలోనే కదా? జరుగుతున్నది జరుగుతోంది కాబట్టి జరుగుతోంది…
‘ సార్? ఎక్కడికో వెళ్లిపోయారు.’
‘ కరెక్ట్. నువ్వడిగింది ఎక్కడికో వెళ్లిపోయి కానీ చెప్పలేను లింగా! రైలులో ప్రయాణిస్తున్నాను…’

~~~***~~~

‘ నువ్వడిగావు చూడు, గుండె కొట్టుకుని ఉంటుందని? ‘
‘ కొట్టుకుందా సార్?’
‘ దానిదుంప తెగ. అది కొట్టుకోవాలిలే! అదలా ఉంచు. కొట్టుకుంటోంది అని ఆ రోజు తెలిసింది. ఎదురుగా వచ్చి కూర్చున్న మెరుపు తీగె లింగా.’
‘ చెప్పంది సార్. నా గుండె కూడా కొట్టుకుంటోంది!’
‘ వార్ని! సరే. నన్ను చూస్తుంది, కిటికీలోంచి చూస్తుంది.’
‘ అమ్మయిలందరూ ఇంతే సార్. చూస్తారు, చూడలేదంటారు.’
‘ కరెక్ట్. ఆలోచన అమ్మాయి అయితే ఈ అమ్మాయి నన్ను చూసి కిటికీలోంచి చూసి ఆలోచిస్తోందనిపించింది. ఎలా చీకటి పడిందో కూడా తెలియదు. టిఫిన్ తీసి మీరేమీ తినరా? అని అడిగింది…’
‘ ఛా!’
‘ అవును.’
‘ గొంతు ఎలా ఉంది సార్?’
‘ గుడ్. మంచి ప్రశ్న! రైలు చప్పుడుకి వినిపిస్తున్న తాలానికి అనుగుణంగా శృతిలో పాడినట్లు ఉంది…’
‘ వాహ్!’
‘ అవును. ఆ గొంతులో టి.టి.ఈ వచ్చినప్పుడు టికట్ నేను కొనను అని చెప్పినా మాట్లాడకుందా వెళ్లిపోతాడు!’
‘ మీరేమి చెప్పారు సార్?’
‘ వెరి నవ్వు నవ్వాను. డబ్బా తెచ్చుకున్నా ఒక పోస్ పెడదామని శనివారం అన్నాను.’
‘ ఇమేజ్ బిల్డింగ్!’
‘…’
‘ ఓకే ఒకే! చెప్పండి ‘
‘ అమ్మాయి మొహమాట పడకండి, అంది. వద్దబ్డి అన్నాను. ఆమెది క్రింద బర్త్, నాది మధ్యలోనిది. రాత్రి పైకెక్కి పడుకున్నాను. రైలు ఎన్ని సార్లు నా గుండె చప్పుడులా శబ్దం చేసిందో అన్ని సార్లు ఏవేవో కలలు కనేశాను.’
‘ వెరీ గుడ్ సార్!’
‘ బాగా పొద్దు పోయాక ఎవరో నన్ను తాకినట్లయింది. ఇటు చూశాను. అమ్మయి నన్ను లేపి ఎదో మాట్లాడాలని చుస్తోంది!’
లింగం లేచి నిలబడి పోయాడు. కష్తం మీద కూర్చోపెట్టాను.
‘ అమ్మాయి చేతిలో ఒక దుప్పటి! ‘
‘ సార్! మీరు దుప్పటీ కూడా తెచ్చుకోలేదని బాధ పడి మీకు ఇస్తోందన్నమాట. నేనున్నాను అంటోంది.’
‘ నేను ఆ దృశ్యానికి నేను అసలు లేను అనుకుని గాలిలో తేలిపోయాను. నా ప్రక్కన బర్త్ మీద పడుకున్న ఆసామి గురక ఏ మాత్రం వినిపించలేదు!’
‘ ఇంతకీ తీసుకున్నారా సార్?’
‘ వదండి, అన్నాను. నేను తెచ్చుకున్నాను, అన్నాను!’
‘ అదేమిటి సార్?’
‘ అదే మరి. అమ్మాయి చిన్నగా నవ్వింది. ఇది మీదేనండీ! ఇప్పటికి మూడు సార్లు జారి నా బర్త్ మీదకి వచ్చి పడింది!’
‘ అయ్యో సార్, ఎంత పని జరిగిపోయింది?’
‘ అంతే లింగా. ఇంతకంటే నా జీవితంలో అమ్మాయిల విషయంలో చెప్పవలసినదేమీ లేదు.రంగా సంగతి చెప్పు ‘
‘ ఇప్పుడొద్దులేండి. తీరికగా చెపవలసింది చాలా ఉంది. వస్తానూ, మరో సారి శుభాకాంక్షలు!’
‘ అలాగే అందరికీ శుభాకాంక్షలు!’

~~~***~~~

అయిదవ భాగం

సామాన్యంగా సన్నని చారల చొక్కా తొడుక్కుంటే పెద్ద అధికారి అనో లేక మంచి స్థాయిలో ఉన్నవాడో అనేటట్లుగా కంపిస్తారని కాబోలు చాలా మంది స్ట్రైప్స్ షర్ట్ వాదుతూ ఉంటారు. దాని కింద డార్కు కలరు పాంటు తొడిగి ఇస్త్రీ మడతను జాగ్రత్తగా ముందుకు పెట్టి చిత్రంగా నడుస్తూ ఉంటారు. వీళ్లని చూసినప్పుడల్లా మా ద్గగరలో ఉన్న ఆసుపత్రిలోని రోగులు గుర్తుకొస్తూ ఉంటారు! వాళ్లకి ఇలాంటి చారల దుస్తులే ఇస్తారెందుకో. కాకపోతే వాలు కొద్ది సేపు పెద్ద వాళ్ల లాగా అనుకోవాలని వాళ్లకు ఇవి ఇస్తారేమో అనుకుంటూ ఉంటాను. ఎందుకో ఇష్టం లేకపోయినా అటువంటి చారల చొక్కా వేసుకుని మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న చెరువు గట్టు వైపుకు వెళ్లాను. ముందుగా పైన ఉన్న చెట్టు మీదనుంచి ఏదో పిట్ట సూటిగా నా మీదనే రెట్ట వేసిందనుకున్నాను. కాలరు దగ్గర తడిగా అనిపించి అటూ ఇటూ చూశాను. ఇలాంటప్పుడు వెంటనే పైకి చూడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పడేది రెండో ఇన్స్టాల్మెంట్ సూటిగా నోటిలోకో, కళ్లలోకో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కానీ ఇది చెట్టు మీద పిట్ట కాదనిపించింది. నీటిలోకి ఎవరో రాళ్లు విసురుతున్నట్లు అనిపించింది. ఇంతలోనే నా ప్రక్కన ఉన్న చెట్టు ప్రక్క నుంచి ఒక రాయి వచ్చి నీళ్లలోకి పడింది. చెట్టు ప్రక్కకు వచ్చి చూశాను. అదీ సంగతి! అక్కడ సిమెంటు బెంచీ మీద కూర్చుని లింగా ఊరకే ఒకటే రాళ్లు విసురుతున్నాడు.
‘ ఏమైంది లింగా?’
‘ సార్, రండి. ఏమీ తోచటం లేదు.’
‘ దానికి రాళ్లెందుకు? అసలే నీళ్లు మురికిగా ఉన్నాయి.’
‘ ఎవరైనా ఆపే వరకూ అలా విసురుదామనుకున్నాను సార్!’
ప్రక్కన కూర్చున్నాను. ‘ మంచోడివే! రంగాతో పోట్లాడావా?’
‘ లేదు సార్. అసలు ఈ మధ్య డాబా మీదకి వస్తే కదా?’
‘ ఛా! ‘
‘ అవును. ఏమయిందో తెలియదు. మా నాన్న కూడా అదోలా మాట్లాడుతున్నారు.’
‘ ఏమంటారాయన?’
‘ ఎక్కువగా ఆయన నేను భోజనం చేస్తున్నప్పుడే వచ్చి హాల్లో కూర్చుని ఒక చిన్న లెక్చర్ ఇస్తూ ఉంటారు.’
‘ ఉత్తప్పుడు కుర్రాళ్లు మరి తండ్రికి కనపడరు కదా?’
‘ …’
‘ అవునోయ్! అదే మరి నాకు తెలియకపోతే ఒక మాట! ఇంతకీ ఏమంటారాయన?’
‘ అన్ని పనులకూ ఒక సమయం, ఒక సందర్భం, ఒక అవస్రం ఉంటుంది!’
‘ కరెక్ట్!’
‘ ప్రస్తుతం నేను చదువు మీద శ్రధ్ధ చూపాలని సెలవిచ్చారు!’
‘ వెరీ గుడ్!’
‘ ఏమి వెరీ గుడ్ సార్? నేను బాగానే చదువుతున్నాను సార్. ఎందుకు నన్ను ఎత్తి పొడవాలి?’
‘ నిన్ను ఎత్తి పొడవటం కాదు లింగా పెద్ద వాళ్లు వాళ్ల అభిప్రాయాలను పార్టీ మేనిఫెస్టోలో జనరల్ గా చెప్పినట్లు చెబుతారు. వాటిని అలానే చదవాలి!’
‘ అవుననుకోండీ, కానీ నాకు అనుమానం గా ఉంది.’
‘ తప్పు. ఏమీ తెలియకుండా రంగనాయకి మీద అనుమాన పడటం చాలా తప్పు!’
‘ మీరుండండి సార్! నాకు రంగనాయకి మీద అనుమానం లేదు. మా నాన్నకి మేము కలసి మాట్లాడుకోవటం అంతగా నచ్చినట్లు లేదు.’
‘ నో లింగా. పొరబాటు పడుతున్నావు. ఇది చదువుకునే వయసు. అందు చేత వారు ఒక స్టాండు ముందే తీసుకుంటున్నానని చెబుతున్నారు. తెలుగు సినిమాలో లాగా కాలేజీకి వెళ్లటం పెళ్లి కోసమనో లేక అక్కడకొచ్చిన అందరూ సినిమా చివరికి పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోవాలనో కాదు.అర్థమయిందా?’
‘ నిజమే! సినిమాలో చదువుకుంటున్నట్లు ఎవరూ చూపరు సార్. కాకపోతే కాలేజీలలో ఈ గోలకి అస్సలు ఎవరి దగ్గరా సమయం ఉందదు! పీకలకి ఉరి వేసినట్లు ఉంటాయి మా చదువులు! కానీ…’
‘ చెప్పు లింగా. నీకు ఎక్కడో బాధగా ఉంది. కానీ భయపడకు. చూశవూ, బాధపడటంలో తప్పు లేదు. భయపడకూదదు!’
‘ నా వల్ల రంగా స్వాతంత్ర్యం కోల్పోయిందేమోనని చింత!’
‘ శభాష్! ఇదే తెలుగు వాడి అసలు సిసలైన లక్షణం. తనకు కావలసినది మరొకరి వైపు నుంచి మాట్లాడతాడు!’
‘ అన్యాయం సార్! నాకు రంగా మీద….’
‘ మీద?’
‘ నో! మీరు నన్ను ఏడిపిస్తున్నారు. నేను చెప్పను.’
‘ చెప్పకు. మరి కొన్ని రాళ్లు అందులో వెయ్యి. తరువాత మాట్లాడదాం!’
‘ అసలు ఈ వయసులో అమ్మయిల జోలికి వెళ్లకూడదా? కరెక్ట్ గా చెప్పండి!’
‘ గుడ్ క్వెష్చన్!. అమ్మయిల జోలికి ఎప్పుడు వెళ్లాలి? నో కాంప్రమైస్! ఇప్పుడే!’
అతను లేచాడు.
‘ అరే. దూకుతావా? వద్దు. లింగా, ఈ కళ్లజోడు ఉంది చూశావా ‘
‘ తుడుస్తాను. ‘
‘ వద్దు. లోకాని చూసినదని నువ్వనుకుంటున్నావు. కాదు. లోకమంతా ఇందులో ఏముందోనని చూస్తారు.’
‘ ఎందుకు సార్?’
‘ నిజం, న్యాయం-రెండూ ఒకే మాటలో నేను ఎలా చెప్పగలుగుతానా అని!’
‘ ఛా!’
‘ కరెక్ట్! ‘
‘ ఇంతకీ అమ్మయిల…’
‘ ఆ! నీకు ఏది ఇష్టం, నాకు ఏది ఇష్టం అనుకునే వయసులో ఇష్టంగా ప్రేమించాలి లింగా! ఈ లోకాన్ని ఒక ప్రేమికునిలా గట్టిగా కౌగిలించుకోవాలి. దటీస్ లైఫ్! నీకు ఏమి తింటే పడదు, నాకు ఏ మందు వేసుకోకపోతే నిద్ర పట్టదు అనే వయసులో ప్రేమించి చేయగలిగింది ఏమీ లేదు!’
‘ సార్! నిజం చెప్పారు. రేపే ఈ మాట మా నాన్నకు చెబుతాను.

నేను ఆలోచించే లోపే బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. ఏమిటీ తొందర? ఏమో అనుకున్నాను…

~~~***~~~

కొన్ని రోజులవరకూ లింగం నన్ను కలవలేదు. ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తుండగా ఒక రోజు ఫోను మ్రోగింది.
‘ సార్, నేను లింగం!’
‘ వెరీ ఘూద్. ఛేఫ్ఫూ.’
‘ వెరీ గుడ్ కాదు సార్. ఆస్పత్రిలో ఉన్నాను.’
‘ అయ్యో ఏమైంది?’
‘ చారల చొక్కా, చారల పాంటూ తొడిగి ఇలా పడుకుని ఉన్నాను.’
‘ ఎక్కడ పడ్డావు?’
‘ ప్రేమలో!’
‘ ఛా!’
‘ అవును సార్. మీరు చెప్పిన మాట నాన్నకి ఎలా చెప్పాలా నుకుంటూ పడుకున్నాను. ఆ రాత్రి నిద్రలోనే నడిచానని చెబుతున్నారు అందరూ. నాన్న వచ్చి పట్టుకున్నారు. నేను-పెళ్లి అనేది నీకేది ఇష్టం, నాకేది ఇష్టం అనుకునే సమయంలో చేయాలి. నీకేది పడదు, నేను ఏ టైం లో ఏ మందు వేసుకోవాలో అని మాట్లాడే సమయం లో కాదు-అన్నానుట.’
‘ అంటే అన్నావు, ఆ తరువాత?’
‘ ఇంకేముంది? మర్నాడే ఒక డాక్తర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆయన కొన్ని పరీక్షలు చేశాడు. సిలిండర్ అంత సిరింజుతో ఒక ఇంజక్షన్ చేసి ఇలా పడుకో పెట్టారు.’
‘ రోగ నిర్ధారణ జరిగిందా?’
‘ నాకు ఏ రోగమూ లేదు సార్. జనాలు వస్తున్నారు, పోతున్నారు.’
‘ మీ నాన్న ఏమి చేస్తాడు?’

‘ మా నాన్న ఆడిటర్ సార్. చిన్న పాయింటు దొరికితే చాలు చాలా పెద్ద రిపోర్టు వ్రాస్తారు. ఈ డాక్టర్ ఆయనకు, మాకు ఉచితంగా సేవలందిస్తాడు. పైగా…’
‘ పైగా?’
‘ ఈ మధ్య యువకుల మీదా, యువతుల మీదా , వారి మనస్తత్వాల మీద పిచ్చి పిచ్చిగా రిసర్చ్ చేస్తున్నాడు సార్!’

‘ భయ పడకు లింగా! నేను మొన్న కూడా చెప్పాను. బాధ పడటంలో తప్పు లేదు!’
‘ నేను భయపడటం లేదు సార్. ఆంధ్ర రాష్ట్రం ఒక భ్యుదయ యువకుడిని ప్గొట్టుకుంటోందని బాధ పడుతున్నాను…’
‘ శభాష్! దట్ ఈస్ ద స్పిరిట్! ‘
‘ సార్! ఆంటీ మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు నన్ను తలచుకోండి!’
‘ తప్పకుండా లింగా! కాకపోతే నువ్వు తొందర పడుతున్నావు. ఇంకా ఏమీ కాలేదు.’
‘ అయ్యేందుకు ఏమీ మిగలలేదు సార్. మొన్న జూనియర్ డాక్తర్ వచ్చి ఒక్కొక్క అవయవాన్నీ ఎందుకో కదిలించి నర్స్ వైపు చూసి తల అడ్డంగా తిప్పాడు. ఆమె అవునన్నట్లు తలూపింది సార్!’
‘ అదేవన్నమాట?’
‘ నేను రాను. రిపోర్టు వస్తుంది.’
‘ పోనీలే లింగా! భావి ప్రేమికులకీ, ఈ మర మనుషులు తిరిగే మరుభూమికీ, ఒక సంచలనాన్ని సృష్టించగలిగిన ఒక మహాత్ముని లాగా మిగిలిపోవటమే కాకుండా ఈ సమాజానికి కొన్ని మందులు కనిపెట్టేందుకు ఉపయోగపడినవాడివవుతావు!’
‘ సార్? మరల ఏదో బాటిల్ పట్టుకుని ఎవరో వస్తున్నారు. నన్ను చూస్తే మీకేమనిపిస్తోంది సార్?’
‘ బల్లి నోటిలో ఇరుక్కుని సగం చచ్చి పూర్తిగా చావబోతున్న బొద్దింక లాంటిదని అభివర్ణించాచ్చును లింగా! ఇది కేవలం అకాదమిక్ గా చెబుతున్న విషయం. మరోలా అనుకోవద్దు.’
‘ అనుకునేందుకు ఏమీ లేదు…అరే…’
ఫోన్ కట్ అయిపోయింది. పాపం ఇంజెక్షన్ ఇచ్చారనుకున్నాను. ఇంతలో మరల మ్రోగింది.
‘ సార్!’
‘ యస్ లింగా. గో ఆన్! నొప్పి ఎలా ఉంది?’
‘ పడ్డ వాడు చెడ్డవాడు కాడు సార్, నాకు పునర్జన్మ వచ్చింది.’
‘ ఛా!’
‘ అవును సార్! కిటికీ అద్దం బయట ఒక పెయింటింగులా రంగనాయకి నిలబడి ఉంది సార్! ‘
‘ వెరీ గుడ్!’
‘ నా కోసం భోజనం తెచ్చినట్లుంది!’
‘ అద్దీ! దటీస్ లింగా! నీ పంట పండింది. అమ్మాయి భోజనం తెచ్చిందంటే తిరుగులేదు…’
‘ సార్, నా పుట్టిన రోజు మార్చేసుకుంటున్నాను!’
‘ ఎందుకు?’
‘ ఈ రోజే ఇక నుంచీ నా పుట్టిన రోజు. దేవుడున్నాడు!’
‘ కరెక్ట్!’

~~~***~~~

ఆరవ భాగం

ఈ లింగం నాకు ఏ ముహూర్తంలో దాపురించాడో గానీ నా చేత సేవలు కూడా చేయించుకుంటున్నాడు. నా చేతిలో టోకన్లు పెట్టి వెళ్లి టేబిల్ దగ్గర కూర్చున్నాడు. కాఫీ కప్పులు రెండు తిసుకుని దగ్గరకు వెళ్లి కూర్చున్నాను.
‘ టైం …’, అన్నాడు. వాచీ చూసి ‘అయిదు ‘ అన్నాను.
‘ టైం ఎంత అని నేను అడగలేదు సార్. అసలు టైం అంటే ఏమిటి? ‘
వెనక్కి వాలాను.
‘ ఏమైంది?’
‘ ఆస్పత్రికి వచ్చి ఖేరేజీ ఇచ్చింది.’
‘ వెరీ గుడ్!’
‘ వెరీ గుడ్ కాదు. నేను థాంక్స్ చెబుదామనుకున్నా. ఎందుకో మీరు గుర్తుకొచ్చారు.’
‘ గుడ్. నేను నిన్ను తలచుకుని ఉంటాను.’
‘ కాదు. ఒక మంచి డైలాగ్ కొడితే బాగుంద్టుందనిపించింది.’
‘ శభాష్! ‘
‘ రంగా, నా గురించి…’, అన్నాను. అమ్మాయి కళ్లు పెద్దవి చేసింది. నీ గురించి? అడిగింది. గుడ్లు తేలేశాను. అయినా బలం పుంజుకున్నాను.’
‘ వెరీ గుడ్! ధైర్యే సాహసే జ్యోతిలక్ష్మీ అన్నారు! ‘
‘ నా గురించి బాధపడకు. త్వరలోనే వచ్చేస్తాను, అన్నాను. కాకపోతే అంత వెటకారంగా నన్ను ఇంతవరకూ ఎవరూ చూడలేదు.’
‘ ఏమంది ఇంతకీ?’
‘ లింగా రావూ, నీకు చాలా రోగాలున్నాయని తెలిసింది.’
‘ ఛా!’
‘ అవును సార్. అసలు ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు. అయినా మరల ఊపిరి తీసుకున్నాను. పోనీలే అన్నాను. ఏది ఏమయినప్పటికీ నువ్వు నా దగ్గరకు ఇలా నన్ను చూడటానికి రావటం నాకు ఎంతో నచ్చింది అన్నాను.’
‘ గుడ్! ప్రేమ అనేది ఊరంతా తరిమినా చూరు పట్టుకుని వేళాడేది. చివరి శ్వాస వరకూ నీలో రగిలిన దానిని మరింత కదిలించి తగులుకోవాలి. తరువాత ఏమైంది?’
‘ నా కోసం కాదు, అన్నది. డాక్టర్ని చూడటానికి వచ్చాను అన్నది.’
చుట్టూతా చూశాను.
‘ ఏమిటి సార్, చూస్తున్నారు?’
‘ ఏమీ లేదు. దగ్గరలో శాలువా ఉంటుందేమోనని…ఇదరికీ మాయరోగాలు ఉన్నట్లున్నాయి. గీతాంజలి లా వెళ్లిపోవచ్చేమో!’
‘ వెటకారం వద్దు సార్. ఆమె డాక్టర్ తో మాట్లాడి అసలు నేను ఎన్ని, ఎలాంటి రోగలతో బాధలు పడుతున్నానో తెలుసుకుందామని వచ్చిందిట!’
‘ వదిలేయి. నువ్వేమన్నావు?’
‘ రంగా, అసలు మగవాళ్ల మీద నీ అభిప్రాయం ఏమిటీ అని అడిగాను.’
కాఫీ మొత్తం తాగేసి కప్పు గట్టిగా టేబిల్ మీద పెట్టాను.
‘ నో! లింగా! నా పరువు తీశేశావు. నా శిష్యుడనిపించుకుని ఎంత పని చేశావు? అసలు ఆడ్వారిని ఒక మగ వాడు మగ వాడి గురించి అడగవచ్చా? నో! లింగా…’
‘ నేనెలా కనపడుతున్నాను? అని అడిగింది.’
‘ ఏమన్నావు?’
‘ నిజం చెప్పాను సార్.’
‘ నిజమే చెప్పాలి. అబధ్ధం చెప్పినట్లు చెప్పాలి.ఇది అబధ్ధం కాదు అని బాధ పడుతున్నట్లు చెప్పాలి. చిన్నగా చెప్పాలి, మెల్లగా చెప్పాలి, మల్లె విరిసినట్లు చెప్పాలి. అదే ప్రేమ…’
చుట్టూతా నిశ్శబ్దం కమ్ముకుంది. అందరూ నన్నే చూస్తున్నారు. ఎవడో మొబైల్ లో నా ఫొటో తీశేసాడు ఏకంగా! లింగా చేతులు కట్టుకున్నాడు.
‘ నిజమే చెప్పాను. నువ్వెలా కనపడుతున్నాను అంటే నేను చెప్పలేను. కొండపల్లి బొమ్మలా కనపడుతున్నావని అన్నాను.’
‘ గుడ్!’
‘ చాలా కోపంగా చూసింది.’
‘ బుగ్గ కందిందా?’
‘ తెలీదు. కళ్లు మటుకు బొగ్గులు కాలినట్లు కాలాయి సార్!’
‘ ఛా!’
‘ అవును. మగవాళ్ల గురించి అడిగావు కదూ. చెబుతున్నాను. అందరూ ఒకటే! వెర్రి పొగడ్తలు! మామూలుగా ఎందుకు ప్రవర్తించరు? అని ఆ సామాను అక్కడ పెట్టి త్రాచు లాంటి జడ ముందుకు ఒకా ఊపులో తెచ్చి పడేసింది.’
‘ ఛా!.’
‘ నేను తేరుకునే లోపల పాము పారి పోయినట్లు బయటకి వెళ్లిపోయింది.’
‘ తిరిగి చూడలేదు.’
‘ లేదు.’
‘ ఒక్క సారి కూడా?’
‘ అర సారి కూడా!’
‘ అయితే నువ్వు చూస్తావని అనుకుంది.’
‘ తెలియదు.’
‘ భయపడకు. కోపంలో కూడా అందంగా ఉండేది బొమ్మల్లాంటి ఆడవాళ్ళే లింగా. నేను కోపంలో పిసాచంలా ఉంటాను. నీ సంగతి తెలియదు.’
‘ సార్?’
‘ యస్?’
‘ అసలు నేను పెళ్లి చేసుకోను. ‘
‘ ఎంత మాట?’
‘ నిజం సార్! నాకు మాట్లాడటం తెలియదు. తరువాత చాలా సమస్యలొస్తాయి సార్!’
‘ నో. అన్నీ తెలిసే మేమంతా పెళ్లిళ్లు చేసుకున్నామా? నో! కొండపల్లి బొమ్మలు మాట్లాడితే ఇలానే ఉంటుంది. భయపడకు. నీలో అప్పుడే సన్యాసి రంగులు రావటం విచారకరం. కాకపోతే పెద్దలకు ఈ సంగతి తెలుసు. అందుకే పెళ్లి ముందు కాశీ యాత్ర పెడతారు.’
‘ అంటే?’
‘ పెళ్లి అనగానే ప్రతి వాడికీ ఒక భయం వేస్తుంది. జీవితం యొక్క సత్యాలను శోధించాలని ఆలోచన ప్రారంభిస్తాడు. సరే కానీ అని గొడుగు ఇచ్చి పదమంటారు.’
‘ కరెక్ట్! బామ్మర్ది వస్తాడు.’
‘ అదీ! కాశీ ఎందుకు నాయనా, మా రాకాశి ఉంది ఇదుగో అంటాడు. అక్కడ నీ సినిమా ప్రారంభం! టైటిల్స్ అప్పుడు పడతాయన్నమాట!’
లింగా లేచాడు.
‘ ఏమైంది?’
‘ అంటే! ఇదంతా మీకు సినిమాలా ఉన్నదా? నో!’
‘ ఆవేశం వద్దు లింగా. ప్రతి వాడూ ఆనందించేది ఇంకొకరి ప్రేమ, ఇంకొకరి పెళ్లి. నేనూ నిజమే చెబుతున్నాను. ఆ జనాల్ని చూడు, వాళ్లు మాట్లాడుకుంటున్నా మన మాటలనే ఎందుకు వింటున్నారు? ఇదా లోకం అనకు. ఇదే లోకం…’

~~~***~~~

ఏడవ భాగం

‘లింగా ‘
‘ సార్ ‘
‘ ఏమయ్యా లింగా?’
‘ సార్ ‘
‘ మనిద్దరం ఎలా కూర్చున్నామో తెలుసా?’
‘ చెప్పండి సార్ ‘
‘ పోట్లాడుకున్న భార్యా భర్తలిద్దరూ ఎలాగో అలాగ ఒక హోటల్ కి వచ్చి మొహాలు చూసుకోకుండా ఒకరు అటూ, ఒకరు ఇటూ కూర్చుంటారు ‘
‘ కరెక్ట్!’
‘ నేను అందరినీ చూస్తున్నాను. నువ్వు కిటికీ బయటకు చూస్తున్నావు ‘
‘ బాగా చెప్పారు సార్ ‘
‘ మై క్వెష్చన్ ఈస్ వెరీ సింపుల్!’
‘ యస్? ‘
‘ అలా ఎందుకు చేస్తున్నావు?’
లింగా ఇటు తిరిగాడు. చేతులు కట్టుకున్నాడు.
‘ ఏమీ లేదు సార్. రోడ్డు మీద మీ వయసు వారు చాలా మంది కనపడుతున్నారు. ఆలోచిస్తున్నాను. నాకు మంచి కోచ్ ఎందుకు దొరకలేదా అని ‘
‘ అంత దూరం వచ్చావా లింగా? గురువునే అనుమానిస్తున్నావన్నమాట. కోచ్ అంటే ఎవరు? ఆటగాడైతే సరిపోదు. ఆడే వాడుండాలి ‘
‘ అన్యాయం సార్. నేను ఆడటం లేదా?’
‘ ఏదీ? ఇంతకీ అమ్మాయిని అడిగావా?’
‘ ఏమని?’
‘ సరిపోయింది. నువ్వు మగాళ్ల మీద అభిప్రాయం అడిగావు. పని కాలేదు. పోనీ ప్రేమ పట్ల అభిప్రాయం తెలుసుకోవయ్యా!’
‘ మీరు చెప్పే ముందే ఒక ట్రయల్ వేశాను సార్.’
‘ వెరీ గుడ్. చెప్పు.’
‘ బట్టలు ఆరేయటానికి డాబా మీదకి వస్తుందని అక్కడ ఒక పుస్తకం పట్టుకుని నిలబడ్డాను. చప్పట్లు వినిపించాయి.’
‘ శభాష్! నువ్వు రా ఖిలాడీవి. నీకు అసలు కోచ్ అక్కరలేదు. చూశావా? చప్పట్లు మ్రోగాయంటే…’
చేయి అడ్డు పెట్టాడు లింగా.
‘ కాదు సార్. మెట్ల వైపు చూశాను. అక్కడ రంగా నిలబడి ఉంది.’
‘ క్యా బాత్ హై! చేయి పట్టుకుని పైకి ఎక్కటం లో సహాయపడమంటోందా? నువ్వు అదృష్టవంతుడవు లింగా. ఇంక చెప్పకు.’
‘ కాదు. నన్ను ఒకలా చూసింది.’
‘ ఛా! అమ్మాయిలు ఒకలా చూస్తే చాలా మంచిదని ప్రేమానంద సరస్వతి నిన్ననే మూడు సార్లు ఒకే ఛానెల్ లో చెప్పాడు.ఒకలా చూస్తే లేదా అలా చూడటం మొదలు పెడితే కథలోకి స్వయంగా ప్రవేశిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని వారు గూఢార్థం తెలిపారు!’
‘ ఏమి గూఢార్థమో! రంగా అలా ఎందుకు చూసింది అని అటూ ఇటూ చూశాను.ఆమెకు కుడి ప్రక్కన కింద ఒక బాల్టీ ఉంది.అందులో తడి బట్టలున్నాయి.’
‘ అడది అబల లింగా! సాయం పట్టమంది. అవునా.. అసలు…’
‘ సాయం కాదు. అక్కడే ఉంది సమస్య. ఎకంగా ఆ బల్టీ తీసుకుని వెళ్లి అన్నీ ఆరేసి కిందకు వచ్చి బాల్టీని కడిగి సరైన చోట్లో పెట్టమని కేవలం సైగలతో చెప్పి నేను తేరుకునే లోపల ఎలా మాయమైందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు.’
వెనక్కి వాలాను.
‘ ఆరేశావా?’
‘ నేనెలా కనపడుతున్నాను?’
‘ శభాష్! రిటర్న్ ఇచ్చావా? నాకు తెలుసు. నువ్వు అసలు మగాడివి!’
‘ కాదు. కష్టపడి ఆరేసి నా బ్రతుకు గురించి ఆలోచిస్తుండగా నెత్తి మీద ఏవో పడ్డాయి!’
‘ ఓహో! నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు లింగా! రంగా నీతో సరసం ఆడుతోంది! ఏమి విసిరింది?’
‘ కరెక్టే! రంగానే కింద నుంచి విసిరింది.’
నాకు తన్మయం అయింది! హాయిగా మరల వెనక్కి వాలి వొళ్లు విరుచుకున్నాను.
‘ నేను చెప్పాను లింగా. ఈ విషయంలో నేను వెళ్లినంత లోతుగా మారేడ్పల్లి వాళ్లు కూడా వెల్లలేదు. మరేమిటో అనుకోకు. వాళ్లు వేలకు వేల అడుగులు తవ్వినా కొన్నాళ్లు నీళ్లు రాలేదు! అసలు అమ్మయిల గురించి ఎలా ఆలోచించాలో తెలుసా? అదీ! అసలు ఆలోచన కాదు చేయ వలసినది.కల్పనలోకి వెళ్లాలి. ఎందుకో తెలుసా? యస్! ఆడదే అసలు ఒక కల్పన!’
లింగా తల పట్టుకున్నాడు.’
‘ ఈ తల ఎందుకు పట్టుకున్నానో తెలుసా? మీ గొడవ వినలేక కాదు. అది అలవాటయిపోతోంది. ఈ తల మీద పడ్డవి మీరు అంటున్నట్లు ట్రయల్ తలంబ్రాలు కాదు!’
‘ ఛా!’
‘ ఆ బట్టలు ఆరేసేoదుకు కావలసిన క్లిప్పులు! ఒకటయితే మరీ గట్టిగా తగిలింది!’

‘ ఓహో! పోనీలే!డైరెక్ట్ గా విసిరేసిందా లేక ఇదిగో అని నిన్ను ఆ తీగె లాంటి కంఠంతో పిలిచిందా?’
‘ ఏమీ లేదు. నేను ఇటు తిరిగే లోపల సూటిగా వచ్చి పడ్డాయి. కొద్దిగా గాభరా కూడా పడ్డాను!’
‘ గురి గట్టిది!’
‘…’
‘ లేదులే లింగా. ఇక్కడ కూడా ఆలోచించవలసినది ఉంది. అంత సూటిగా విసిరిందీ అంటే నువ్వు ఎక్కడ ఉంటావొ గమనించి నీ అడుగులను గ్రహిస్తున్నది లింగా! అక్కడ కూడా ప్రేమార్థాన్ని తిసుకోవాలి!’
‘ ప్రేమార్థమూ పేడార్థమూ కాదు సార్! మీకు నా కంటే ఎక్కువ ఆశ ఉన్నట్లుంది. అందుకే అలా మాట్లాడుతున్నారు!’
‘ నో లింగా. అయాం కోచ్! నాకు ఎక్కువ ఉండాలి!’
లింగా ముందుకు వచ్చాడు.
‘ ఏమిటి?’
‘ ఆ…అలా అడక్కు! ఎక్కువంటే అదీ… మీ ఇద్దరి మీద నమ్మకం!అదీ!’
‘ సరేలెండి కానీ మీరు చేతులూ కాళ్లూ చూస్తారని తెలిసింది.’
‘ వాట్ డు ఊ మీన్? నేను దయ్యాలను పట్టే వాడిలా కనిపిస్తున్నానా?’
‘ అది కాదు సార్. మీరు జాతకాలు చెబుతారటగా?’
‘ జాతకంలో ఉన్నది చెబుతాను. నువ్వు విన్నది రైటే!’
‘ నా గురించి చెప్పండి!నేను మీకు ఏ వివరం చెప్పను. మొహం చూదండి ‘
‘అది చూస్తూనే ఉన్నాను.ఈ మధ్య నా మొహం కూడా చూసుకోవటం మానేశాను. ఇంతకీ నువ్వు పుట్టగానె ఏమి జరిగింది?’
‘ మా ఊళ్లోని పొలాలన్నీ మంటలలో మాడిపోయాయి.’
‘ నామకరణం రోజున ఏమయింది?’
‘ మా తాతయ్యకు ఒక కంట్లో చూపు పోయింది ‘
‘ మరునాడు అక్షరాభ్యాసం అనగా ఏదో జరిగినట్లుంది.’
‘ కరెక్ట్! కోచ్ బాగానే ఉన్నాడు. కోచింగే బాలేదు!’
‘ ఇంతకీ ఏమి జరిగింది?’
‘ మా నాన్నకు నిద్రలో లేచి తిరగటం అలవాటు…’
‘ మీ ఇంటిలో అందరికీ నిద్రలో ఏదో ఒకటి చేయటం అలవాటు అనిపిస్తోంది.’
‘ అలా లెవబోయి మంచం మీదనుంచి జారి పడ్డారు.’
‘ ఏమయింది?’
‘ ఒక కాలు మూస్కుంది!’
‘ గొప్ప యోగజాతకుడివిరా లింగా!’
లింగా లేచాడు.
‘ ఏమిటి సార్ ఉపయోగం? రోగ నిర్ధారణ చాలదు డాక్టర్! తదుపరి కార్యక్రమం?’
‘ మంచి వాడవే! దేశంలో నూటికి తొంభై మంది డాక్టర్లకు రోగనిర్ధారణే చేతకాదు. మనం మొదటి ఇన్నింగ్సులోనే సెంచరీ కొట్టాం. ఇక చూసుకో మన కోచింగ్!’
‘ ఛా!’
నేనూ లేచాను.
‘ ప్రేమ మాట వరసలో ఉండదు లింగా. జాతకాలలో అసలు ఉండదు! ప్రేమ దుర్యోధనుడు మయసభలో కాలు పెట్టిన చోట నీరు ఉందనుకుంటే ఉండదు. ఇక్కడ లేదనుకున్న చోట అనుకోకుండా కనపడుతుంది.ప్రతి అమ్మాయిలో ఉండే ఎన్నో భావాల మధ్య ఒక ఉపనదిలా, ఒక పాయలా, ఉల్లిపాయలోని ఘాటులా, ఒక్కో సారి చల్లని అంతర్వేదిలా అలా అలా…’

తప్పుకో సారూ అన్నాడు టిప్ తీసుకుని బేరర్!

తప్పనుకుని ఇద్దరం బయటకు వచ్చాం!

~~~***~~~

ఎనిమిదవ భాగం

ఫోన్ మ్రోగింది.

‘ హలో ‘
‘ నిజమైనా, కలయైనా…’
‘ ఎవరిది?’
‘ నిరాశలో ఒకటేలే…’
‘ హలో ‘
‘ ఒకటేలే!’
‘ ఎవరండీ?’
‘ ఇంకెవరు సార్, లింగా!’
‘ వార్ని! ఏమైంది? మందు కొట్టావా?’
‘ మందెందుకు సార్? ప్రేమకు మందు మందు కాదు.’
‘ ఫోను వాళ్లని బాగు చేయటం దేనికి? ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుందాం.’
‘ కరెక్ట్. మాట్లాదేందుకు ఏమీ లేదు సార్.’
‘ ఎవరితోనో పెళ్లికి శుభలేఖ ప్రింటు అయిందా?’
‘ ఓహో, గురువుగారి స్పీడే స్పీడు. ఇంకా అంత లేదు. కానీ అయిపోవచ్చు. మీతో చివరి సారి మాట్లాడటానికి వస్తున్నాను.’
‘ వెరీ గుడ్!’
‘ ఏంటీ? చివరి సారి అంటే వెరీ గుడ్డా?’
‘ చివరి సారి అని నువ్వంటున్నావు లింగా. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది. నువ్వు ఫెయిల్ అయిపోతే  నీ కథ నుంచి చక్కని పాఠం బయటకు తీసి మరొకరికి చెబుతాను. నేను ఓడిపోను.’
‘ అయితే వస్తున్నాను.’
‘ వెరీ గుడ్!’
‘ కాదు. చివరి సారి కాదు!’
‘ శభాష్! నా మాటలలో అంత స్ఫూర్తి ఉంటుంది. చూశావా? ఫోనులోనే నిన్ను మార్చేశాను!’
‘ ఛా! ‘
‘ అవును మరి…’
‘ కాదు. నా కథలోంచి పాఠం చెబుతారా? చూద్దాం. ఇక మీదట ఏ పాఠం చెబుతారో నేనూ చూస్తాను.’
‘ ఆవేశం అన్ని విధాలా అనర్థం లింగా! అమ్మయి. నువ్వు పోట్లాడుకున్నారంటే అది శుభ సూచకం. ఒక బంధం లేకుండా పోట్లాట కూడా ఉండదు!’
‘ ఓహో! అదిరింది మాష్టారూ!’
‘ అవును మరి. నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నప్పుడు కోపం కూడా టైం వేస్ట్! ఇటు తిరిగి ఆలోచించు!’
‘ కరెక్ట్! ఇప్పుడు అదే జరుగుతోంది. హు ఆర్ యూ అన్నట్లు గానే ఉంది.’
‘ ఓహో! అయితే పోట్లాట లెదా?’
‘ అసలు పోటీ లేదు సార్!’
‘ అంటే కరివేపాకులాగా తీసేసిందా?’
‘ కాదు. కంచంలో పడ్డ జుట్టును అసహ్యించుకుని తీసినట్లు తీసేసింది!’
‘ ఛా!’
‘ అవును.’
‘ ఆలోచిద్దాం. వాన నీరు పూర్తిగా సముద్రం లోకి జారి వెళ్లిపోయిన తరువాత అడుగు నుంచి ఎండ వేడికి మరల పైకి లేస్తుంది. ఇంకా ఆలోచించు! నీ మీద పూర్తి ద్వేషం కలిగిన తరువాతనే నీ మీద ప్రేమ చిగురిస్తుంది!’
‘ ఐ సీ!’
‘ కరెక్ట్!’
ఫోను పెట్టేశాడు. కానీ అరగంటలో ఇంటి ముందు ఉన్నాడు.చేతిలో ఒక స్వీట్ పాకెట్!
‘ ఇప్పుడొద్దు!’
‘ మీకు కాదు…’, అంటూ లోపలికి వచ్చాడు.
‘ ఆంటీ తినకూడదు!’
‘ ఆంటీకి కూడా కాదు.’
‘ పోనీ ఎవరికో చెప్పద్దులే. లింగా…’
అతను కూర్చున్నాడు.
‘ నేనెలా కనపడుతున్నాను?’
‘ పెళ్లి కొడుకులా ఉన్నావు!’
వెనక్కి వాలిపోయాడు.
‘ ఇదే వద్దు సార్.ఈ స్వీట్ పాకెట్ ఎవరికో ఇప్పుడు చెబుతాను.’
‘ రంగాకి పెళ్లి చూపులు అయి ఉంటాయి!’
‘ ఓహో మీ కళ్లు మెరిసిపోతున్నాయి. మీరెక్కడ దొరికారు సార్!’
‘ ఇంతకీ అంతేనా?’
‘ ఏమో! ఆవిద గారికి సంగీతం, నృత్యం అన్నీ నేర్పేందుకు ఒక…’
చేయి అడ్డు పెట్టాను.’ ఓస్, అంతే కదా? ఒక ముసలి మాష్టారును చూసి భయపడుతున్నావా?’
‘ కాదు! ముసలి వాడు కాదు. ఎంతో అందగాడు. కుర్రాడు. జెం! ఈ సాయంత్రమే వస్తున్నాడు. ఈ దొరసానికి సినిమాలలో రాణించాలని ఒకటే కోరిక!’
‘ ఛా!’
‘ ఇంతే! ఇదిగో దీనితో పాటూ ఒక డజను అరటి పండ్లు, పూలు…ఊహించుకుంటేనే వొళ్లంతా గొంగళి పురుగు అడుగడుగునా గుచ్చి గుచ్చి పాకినట్లుంది!’
‘ అంతగా తలచుకోకూడదు!’
‘ సినిమాలా కనిపిస్తోంది సార్! నా బాధ…వాడు కూర్చుంటాడు. రంగనాయకు అతని పాదాలకు నమస్కారం చేస్తుంది. చేతికి పండ్లు స్వీట్ పాకెట్ అందిస్తుంది…’
‘ నిన్ను మంచి నీళ్లు అందించమంటారు!’
‘ సార్!’
‘ ఊరుకోవయా! నేనున్నాను!’
‘ అంటే? ఈరందుస్తారా?’
‘ ఛా! అదేవన్న మాట! ఇలాంటి మాష్టార్లని టిఫిను క్రింద తిని…ఇదిగో ప్లేటు అలా బాల్కనీలో పారేసినట్లు పారేశాను! నువ్వు వర్రీ కాబోక!’
అతను లేచాడు. బాల్కనీ వైపు చూశాడు. సూర్య రశ్మి లోపలికి వస్తోంది.అర్జునుడికి ధైర్యం వస్తున్నట్లు ఏదో వస్తోంది. నన్ను ఓ చూపు చూశాడు…

~~~***~~~

తొమ్మిదవ భాగం
 

‘ ఇంత బుధ్ధిమంతునిలా కూర్చున్న కుర్రాడిని నేను
ఈ మధ్య చూడలేదు ‘
లింగా ఎదురుకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాడు.
‘ ప్రేమ అనే ఏదో ఒక వింత వస్తువు నన్ను ఇలా బంధిస్తోంది. లేకపోతే టెరరిస్టులందరూ ఒక వైపు, నేనొక వైపు!’
‘ కరెక్ట్ ‘
‘ అంటే?’
‘ ప్రేమలో ఉన్న ఒక అద్భుతమైన స్వభావాన్ని నువ్వు గుర్తించావు ‘
‘ అసలు నా ప్రేమ ఫలిస్తుందంటారా?’
‘ నీ లుంగీ ఊడిపోయిన ముహూర్తం గెట్టిది లింగా. నీ సంగతేమో గానీ నాకు ఆ ధైర్యం ఉంది.’
‘ లుంగీ సంగతి ఏమో కానీ మిమ్మల్ని కలుసుకున్న ముహూర్తం మటుకు దగ్ధ యోగంలో కలుసుకున్నాను ‘
‘ అదేవన్నమాట?’
‘ అవును మరి. మీ కామెంట్ల కంటే రంగా చీదరింపులే బాగున్నాయి. ‘
‘ చూశావా? రంగా చీదరింపులు బాగున్నాయి అనేందుకు నేనొక మూలస్తంభానిగా పని చేశానా లేదా? రంగా ఒక నడక నేర్చుకుంటున్న అమ్మాయి…’
‘ బాగుంది. ఇంకా నయం, పాకుతున్న పాప అనలేదు.’
‘ నో లింగా! ప్రతి ప్రేమికునిలో ముందర ఒక పసివాడు పుడతాడు. మెల్లగా పాకుతాడు. తరువాత పీకులాడుతాడు. ఆ పైన పాకాన పడతాడు. దటీస్ ప్రేమ. నువ్వు నన్ను చీదరించుకుంటున్నావు కానీ నీ హావ భావాలలో నా పట్ల గౌరవం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది లింగా, ఐ నో, నాకు తెలుసు!’
‘ ఏమి కొట్టొచ్చినట్లో! నిన్న ఆ సంగీతం మాష్టారికి పళ్లు, పూలు ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకుంటుంటే నాకు కొట్టాలనిపించింది సార్!’
‘ ఎవరిని?’
‘ ఇద్దరినీ!’
‘ ఇంతకీ సంగీతం మొదలియిందా?’
‘ అతగాడు లోనకి ప్రవేశించాడు ‘
‘ వెరీ గుడ్ ‘
‘ అందరినీ పరిచయం చేశారు.రంగా వచ్చి ఏకంగా పాదాలకు నమస్కారం చేసింది.’
‘ నెత్తిమీద చేయి పెట్టాడా?’
‘ చిన్నగా నిమిరాడు కూడా!’
‘ ఛా!’
‘ నేను కుమిలాను.’
‘ నిన్ను ఏమని పరిచయం చేశారు? ‘
‘ నాకు ఇంట్రోడక్షనే లేదు సార్. కొద్ది సేపు అక్కడ నిలబడితే హార్మోనియం తుడవమంటారని అర్థమైంది.’
‘ నువ్వు ఏక సంధాగ్రాహివి. ఏఫ్టరాల్, నువ్వు నా శిష్యుడివి. ‘
‘ రంగాను అక్కడ వదిలేసి అందరూ వెళ్లిపోయారు.’
‘ ఛా!’
‘ పాట నేర్పాలి కదా? అదీ! అతను కళ్లు మూస్కున్నాడు.’
‘ ఎందుకు?’
‘ గొంతు శృతి చేసుకుని కళ్లు తెరిచాడు.ముందు రంగాను ఎంత గట్టిగా అరవ గలిగితే అంత గట్టిగా అరవమన్నాడు. ‘
‘ ఓహో! నువ్వు ఇంక భయపడనవసరం లేదు లింగా!’
‘ ఎందుకు?’
‘ వీడు పెళ్లి అయిపోయినవాడు. లేకపోతే అలా అడగడు. అతని భార్య గొంతు వినలేక చస్తున్నాడు.’
‘ కాదు సార్. పెళ్లి కాలేదు. సంగీతం ముసుగులో గుద్దులాట కాదన్నాడు. అంచేత బిడియం మాని గొంతు పైకి లేపమన్నాడు.’

‘ అది సంగీతం వ్యవహారం లింగా! వదిలేద్దాం. అమ్మాయి సంగతి ఏమిటి?’
‘ రంగా మంజు భార్గవి లాగా అతగాడి ఫొటో పెట్టి రాత్రంతా గొంతు లేపుతూనే ఉంది!’
‘ భక్తి లింగా! శిష్యురాలు కదా, ఆ మాత్రం ఉండాలి.’
‘ ఆ మాటకొస్తే అతనూ మామూలుగా లేడు.నా దగ్గర నీకివ్వటానికి ఏమీ లేదు, అన్నాడు. నాకేమీ వద్దు అన్నది రంగనాయకి! నా చేత పాడించండి చాలు. అతను లేచి హాలంతా అటూ ఇటూ తిరిగాడు.’
‘ ఎందుకు?’
‘ ఏమో సార్! అతని ఇంటిలో అంత పెద్ద హాలు లేదేమో!’
‘ ఏమన్నాడు?’
‘ నువ్వు నన్ను సరిగ్గా అనుసరిస్తే సప్త సముద్రాలు నీ చేతిలో పెడతాను అన్నాడు.’
‘ ఛా!’
‘ అవును. సప్త సముద్రాలంటే సప్త స్వరాలుట! వీడికి కవిత్వం ఒకటి మధ్యలో!’
‘ ఫరవాలేదు లింగా. కాయ గట్టిదై ఉండాలి కానీ ఏ ఆవకాయైనా పెట్టుకోవచ్చు! ఒక పైత్యం బాగా ముదిరితే అన్నీ కలసిపోతాయి లింగా. ఇది మామూలే!’
‘ రంగా పరవశించింది. అలా అప్పుడప్పుడు వింత వింత మాటలు, కొద్ది సేపు సంగీతం కలబోసి ఒక గంట కాలక్షేపం చేశారు. అయిపోయాక అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. ఆ సంగీత కళానిధిని ఏదైనా ఒక పాట పాడమన్నారు!’
‘ పాడేశాడా?’
‘ పాడక? ఏ కానుకలందించగలనో చెలీ…పూర్తిగా పాడేశాడు!’
‘ పాడనీ లింగా, ఎంత లేదన్నా సంగీతం మాష్టారు కదా? పాడకపోతే ఎలా?’
‘ అది కాదు సార్! పాడుతున్నప్పుడు అమ్మాయినే చూస్తూ

పాడాడు. అదీ నా బాధ! అమ్మాయి సిగ్గు పడుతోంది.

ఎందుకు సిగ్గు పడాలి?’
‘ గుడ్ క్వెష్చన్! అలా పాడకూడదు, అలా పడకూడదు.

కాకపోతే ఆలోచించు లింగా! అమ్మాయి అన్న తరువాత అలా జరుగుతుంది లింగా.’
‘ ఎలా జరుగుతుంది సార్! తప్పు. తేడా ఉంది!’
‘ ఊరుకోవయ్యా! అలా తల వంచుకుని సిగ్గు పడకపోతే లేచి డ్యూయట్ పాడుతుందా? మరీనూ!’
‘ ఊ…ఇంతకీ నా బాధ చెప్పలేని బాధ! అతన్ని ఆటో ఎక్కించి రమ్మన్నారు. నన్ను పేరు కూడా అడగలేదు. ఆటోలో కూర్చునే ముందు ఎందుకో నా భుజం మీద చేయి పెట్టి రెండు బాదులు బాదాడు.’
‘ ఎందుకు?’
‘ ఏమో! నువ్వింక మూస్కోవచ్చనేమో! ఏమిటో సార్! మీరేమో ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెబుతూ ఉంటారు. అసలు నా జాతకమే బా లేదు! పై వాడు కొన్ని జాతకాలు ఎందుకో నూనెలో ముంచి వ్రాస్తాడనిపిస్తోంది.’
‘ ఛా!’
‘ కాకపోతే ఏమిటి సార్? అసలు ఈ అమ్మాయి ఇలా నా జీవితంలో ఎందుకు ప్రవేశించాలి, ఇలా అన్నీ విఘ్నాలు ఎందుకు కలగాలీ?…’
‘ ధైర్యంగా ఉండు లింగా! నేనున్నాను. రంగా ఈస్ యువర్స్! నేను చెబుతున్నాను!’
‘ ఇంకేమి యువర్స్ సార్! యువర్స్ అని అతగాడికి చెప్పేస్తుంది రేపో మాపో! నేను రేపటి నుంచీ నిద్ర లేవను.’
‘ ఎందుకు?’
‘ పేపరు తీసి అందులో నా ఫొటో మధుర స్మృతి కాలం కింద లేకపోతేనే లేచి నిలబడతాను.’
‘ లేకపోతే?’
‘ మరల పడుకుటాను!’
‘ గుడ్! దటీస్ ద స్పిరిట్! నిజమైన ప్రేమకు రాత్రి పగళ్లు లేవు.ప్రేమికుడు ప్రేమలో పడుకుంటాడు, ప్రేమలో లేస్తాడు. ప్రేమనే తాగుతాడు. ప్రేమనే తింటాడు. ప్రేమనే పీలుస్తాడు.’
అతను బరువుగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు.
‘ లింగా…’
‘ సార్…’
‘ బాధ పడకు.ఇటు అస్తమించిన సూర్యుడు అటు ఉదయించక పోడు!ఆ రోజు వస్తుంది…రంగా మీ ఇంటి డాబా మీద ఒక పక్కగా తల వంచుకుని నిలబడుతుంది.’
అతను ఆగాడు.’ ఎందుకు? నన్ను కిందకి తోసెయ్యటానికా?’
‘ ఎంత మాట? నో! రంగా అలాంటిది కాదు. ఇపుడే కొత్త

ప్రపంచంలోకి అడుగు పెడుతున్నది. నువ్వు పుస్తకం పట్టుకుని వెల్లిపోతుంటే ఆపి నిన్ను …ప్లీస్… అంటుంది. చూస్తూ ఉండు!’
‘ అంతే అంటారా?’
‘ అంతే!ముమ్మామటికీ అంతే!కేటరేక్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఓ ఇరవై మందికి ఒక్క సారే మొదలు పెడతాడు. మనం లైనులో ఉంటే రెండవది మన కన్ను అవ్వాలని కోరుకోవాలి. మొదటిది కాదు!’
‘ అంటే?’
‘ సంగీతం మాష్టారు మొదటి వాడు!’
‘ ఎంత అన్యాయం సార్! నేను సెకండ్ హాండా?నో!ఇదా మీ దగ్గర శిష్యరీకం నాకు ఇచ్చేది, ఇప్పించేదీనూ?!’
‘ నో లింగా. అతనితో ఏమీ వ్యవహారం ఉండదు. అమ్మాయి అబ్బాయిలను పరిశీలిస్తున్నది. చూసి చూసి నీ దగ్గరకే వస్తుంది!’
దూరంగా ఎవరో గుడిలో గంట కొట్టారు.

~~~***~~~

పదవ భాగం

 
లింగా చేయి చాచాడు.
'చెయ్యి బాగుంది '
' అంతేనా?'
' అంటే?'
' గీతలు...అవేమంటున్నాయి?'
' మేము చేతిలోనే ఉన్నాము అంటున్నాయి '
చేయి వెనక్కి లాగేసుకున్నాడు.
' అంటే?'' నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది!'
'...'
' ఎనీ మోర్ క్వెష్చన్స్?'
' నాకు ...ప్రేమ నా భవిష్యత్తులో ఉన్నదా?'
' ప్రేమ భవిష్యత్తులో ఉండదు శిశువా! ప్రేమ మనస్సులో ఉంటుంది, వర్తమానం లో ఉండాలి.'
వెనక్కి వాలిపోయాడు.
'అసలు ప్రేమ కనిపిస్తుందా?'
'ప్రేమ కనిపించదు. కనిపించేది ప్రేమ కాదు. కనిపించనిదే అందంగా ఉంటుంది !'
' నేనేమి చేయాలి?'' ప్రేమించాలి!'
' ఖర్మ!'
' కరెక్ట్!'
' ఎలా?'
' పాడుకుంటున్నారా?'
' పిచ్చి పిచ్చిగా!'
' నువ్వూ పాడు.'
' వేళాకోలమా?'
' అమ్మాయి సంగీతం నేర్చుకుంటున్నదా?'
' చక్కగా నేర్చుకుంటోంది '
' గుడ్! జంట స్వరాలు వస్తున్నాయా?'
' యుగళగీతం పాడుతుంటే ఇంకా జంట స్వరాలు ఏమిటి సార్?'
' వెరీ గుడ్!'
నువ్వు రంగాని ప్రేమించలేదు లింగా!'
' నాన్ సెన్స్!'
' కాదు. నిజంగా ప్రేమిస్తే అమ్మాయి పాడుకునే పాటను రికార్డు చేసుకుని మరి మరీ వింటావు. ప్రేమ శరీర ఆకర్షణ కాదు. ప్రేమ అనేది సుగుణాలని పోషించ గలిగే తత్వం. నీకు సంగీతం ఇష్టం లేదా?'
' ఎంత మాట?'
' మరి? వాళ్లు పాడుకుంటున్నప్పుడు తెలియకుండా రికార్డ్ చేసి ఆమెకు తెలియకుండా వింటున్నట్లు నటించి చక్కగా తాళం వెయ్యి. ఆమె మెట్ల మీద నిలబడి చూస్తుంది...'
అతను లేచాడు. ' కరెక్ట్! నేను తన్మయత్వంలో ఉన్నప్పుడు నన్ను చూసి స్పందిస్తుంది...నాలో ఇంత ఆరాధన ఉన్నదని గ్రహిస్తుంది...'
' నీ పట్ల ఒక గౌరవం, మెల్లగా అనురాగం పెరుగుతాయి. అమ్మాయిలు అగ్గిపిడుగులు. ముందు మెరుస్తారు. తరువాత అరుస్తారు. ఆ పైన ప్రేమ వర్షం కురిపిస్తారు...'లింగా అప్పటికే తన్మయత్వం లోకి వెళ్లిపోయాడు. లేచి నడవటం మొదలు పెట్టాడు. పట్టుకుని ఆపాను.
' ఎక్కడికీ?'
' వర్షం. ప్రేమ వర్షం!'
' ఇలా రా. కూర్చో! అది అంత తేలికగా కురవదు శిశువా! ఉరుములు, మెరుపులు పక్కన పెట్టు. ముందు వర్షం కురిసే ఫార్ములా గురించి ఆలోచించు. '
' కరెక్ట్!'
' ఏమిటి అది?'
' చెప్పండి సార్! ఇలా చేతులు కట్టుకుంటాను. '
' వెరీ గుడ్! ప్రేమను పొందాలనుకుంటున్నవా? ప్రేమ రసాన్ని పొందాలనుకుంటున్నావా?'
'...'
' శిశువా! వయసు మీద కనిపించే అందం ఉల్లిపొరలాగా తొలగిపోతుంది. '
' కరెక్ట్!'
' ఒక అస్తిత్వాన్ని నిలిపి చూపించే ప్రతిభను గుర్తించి మసలుకో! మరో ప్రపంచం దగ్గరవుతుంది!'
అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతని చేయి తీసుకుని చూశాను.
' గీతలలో ఏమీ ఉండదు లింగా! ప్రేమించేందుకు ఒకరి మనస్తత్వం లోకి తాళం చెవిని తీసుకుని బయలుదేరాలి. ఇద్దరికీ ఒకటే తాళం చెవి! తాళం తప్పిందా, రసాభాస తప్పదు. ఇది కనిపించని తాళం. అందుకే అందంగా ఉంటుంది...'
~~~***~~~
పదకొండవ భాగం

చల్ల గాలి వీస్తోంది. చాలా సార్లు కూర్చుని మాట్లాడుకున్న మేమి ఈ సాయంత్రం ఎందుకో నడుస్తూ మాట్లాడుకుంటున్నాం.

‘లింగా…’
‘ సార్ ‘
‘ మన ప్రేమ…’
‘ …’
‘ అ… సారీ! నీ ప్రేమ నిదుర లేచి ఇప్పుడు నిలబడి నడుస్తున్నట్లుంది ‘
‘ కరెక్ట్!’
‘ ఎందుకు? ‘
‘ సింపుల్! ఒక పర్పస్ కనిపిస్తోంది ‘
‘ వెరీ గుడ్. ఇంతకీ డాబా మీదకి మరల వచ్చిందా?’
‘ వచ్చింది సార్. నేను చేతులు కట్టుకుని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ నిలబడ్డాను.’
‘ వెరీ గుడ్ ‘
‘ అమ్మాయి గొంతు సవరించినట్లు చప్పుడు చేసింది ‘
‘ చూశావా? అదివరకు అదీ లేదు ‘
‘ నేను తల తిప్పాను. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావు కదూ? అని అడిగింది. అప్పుడప్పుడు చూస్తాను, అన్నాను. ఎందుకడిగావు? ‘
‘ మంచి ప్రశ్న. నీలో ఇప్పుడు ధైర్యం కూరలో ఉప్పు ఎక్కువేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయి ఏమంది? ‘
‘ నేను అననివ్వలేదు!’
లింగాని మొదటి సారి కౌగిలించుకున్నాను. పార్కులో ఎవరో ఈల వేశారు. వెంటనే వదిలేశాను.
‘ నేను అడిగాను. రంగా, నాతో సినిమా చూడాలని ఉన్నదా? అన్నాను!’
‘ లింగా..నాకు మాటలు రావటం లేదు.నేను ఇంటికెళ్లే ముందు నన్ను కొద్దిగా చూసుకోవాలి లింగా!’
‘ అమ్మాయి నవ్వింది. నన్ను మొదటి సారి అదోలా చూసింది. నీలో నిజంగా భావుకత ఉన్నదో లేక సినిమాల వలన అలా తయారయ్యావో తెలియదు అన్నది.’
‘ ఛా!’
‘ అవును. నేను తొణకలేదు. నడుము మీద చేయి పెట్టాను…’
‘ సూపర్!’
‘ నీ బాధేమిటి? అని అడిగాను.’
‘ భేష్!’
‘ ఇలా సూర్యుని వైపు, చంద్రుని వైపు ఎందుకు చూస్తూ ఉంటావు? అని అడిగింది!’
‘ నా ఇష్టం అన్నావా, లేదా?’
‘ లేదు సార్.’
‘ పోనీలే! ఈ సారి అందాం.’
‘ అంత కంటే మంచి మాట అన్నాను.’
‘ ఛా!’
‘ వాటినే కాదు, నిన్ను కూడా చూస్తున్నాను, అన్నాను!’
‘ లింగా! నువ్వు మణిపూసవి. ప్రేమ ప్రపంచానికి …సామ్రాజ్యాధిపతివి. నువ్వు అందరికీ దారివి. నువ్వు…’
‘ అంత వద్దు సార్. అమ్మాయి తల కొద్దిగా వంచుకుంది.’
‘ మరి? సిగ్గు లింగా…దటీస్ అమ్మాయి. అది లేకపోతే ఏముంది చెప్పు? ఆ చెట్టుకు కూడా చీరె కట్టవచ్చు!’
‘ నిజమే! నేను మరల అడిగాను. ఈ రోజు నాతో ఇంత మాట్లాడుతున్నావు, ఏమిటీ కథ? అన్నాను.’
‘ కరెక్ట్! బండీ అన్న తరువాత ముందుకు వెళ్లాలి. నిలబెట్టి పూజ చేయటానికి కాదు!’

‘ అమ్మాయి కొద్దిగా మెల్లగా అడిగింది. నిన్నొకటి అడుగుతాను అంది.’
‘ గుడ్! అలా ఒక అమ్మాయి అన్నప్పుడు లోపల ఒక పిట్ట అప్పుడే గుడ్డు లోంచి లేచి బయటకి వచ్చి అలా ఆకాశంలోకి ఎగిరినట్లు ఉంటుంది కదూ? ఏమన్నా ఫరవాలేదు.’
‘ కరెక్ట్! నేను అడుగు అనలేదు.’
‘ అదేమిటి?’
‘ కన్ను ఎగరేశాను.’
‘ నిజం?’
‘ అవును. నా వల్ల నీ చదువు చెడిపోతోందేమోనని భయంగా ఉంది, అన్నది.’
‘ ఓహో! అంటే నువ్వు చదవటం లేదా?’
‘ కాదు. నేను మీరు చెప్పినట్లు ఆమె పాటను రికార్డ్ చేసి టేబిల్ మీద పెట్టుకుని వింటూ ఏదో చదువుకుంటుంటే తన గదిలోంచి విన్నదట!’
‘ అది లింగా! అసలు ఎయిర్ క్రాఫ్ట్ కి డిసైన్ వేస్తే కలాం గారే వెయ్యాలీ, ప్రేమ క్రాఫ్టుకి ప్లాను వెయ్యాలంటే నేనే వెయ్యాలి. చెప్పు!’
‘ చల్ల గాలి బాగుంటుంది. చదువుకుంటున్నామని కిటికీ మూసేస్తామా? అన్నాను!’
‘ లింగా! లింగా!…ఇది కలా? నిజమా? నా కళ్లల్లోకి చూసి చెప్పు, ఇవన్నీ నువ్వు అనాలనుకున్నవా లేక నిజంగా అన్నవా?’
లింగా కళ్లలోకి చూశాడు.
‘ మీరు నమ్మరు సార్. మీ మాటలు కావు, నాలో ఎక్కడినుంచో మాటలు వస్తున్నాయి. అంతే!’
‘ గుడ్! ఈదటం నేర్పాలి కానీ ఎవరైనా కలసి ఈదుతారా? ముందుకెళ్లు.ఈ రోజు పుట్టిన రోజు!’
‘ ఎవరికి సార్? మీదా? మెనీ హాపీ రిటర్న్స్!’
‘ నాకెందుకు లింగా, ఈ రోజు ప్రేమ అనే తత్వానికి పుట్టిన రోజు పండగ! చెప్పు!’
‘ అమ్మాయి ఒక్క సారి పైకి చూసి మరల తల దించుకుంది. చిరునవ్వు నవ్వింది.’
‘గుడ్!’
‘ కానీ నా సంగీతం, క్లాసులు ఇవన్నీ మరి…నాకు నీ చదువంటే భయంగా ఉంది!వస్తానూ ‘అంటూ మెట్లు దిగటానికి అటు తిరిగింది.
‘ నువ్వు ఆపావా?’
‘ లేదు. జేబులలో చేతులు పెట్టుకున్నాను.’
‘ వెరీ గుడ్!’
‘ చూడు రంగా, అన్నాను.అగింది కానీ ఇటు తిరగలేదు. నువ్వేమైనా అనుకో! నీ పాట వలన నాకు ఇబ్బంది ఏమీ లేదు! నిజానికి నీ పాట లేకపోతే నేను ఇప్పుడు చదవలేను.’
‘…’
‘ అదేమిటి సార్? ఇంత మాటకి ఏమీ అనలేదు మీరు?’
‘ లింగా! రత్నం మెరిసినప్పుడు ఎలా మెరిసిందీ అని చెప్పగలమా? లేదు. నిజాలకు భాషతో పని లేదు. అటువంటి మాట చెప్పావు. అమ్మాయి ఏమంది?’
‘ ఏమీ అనలేదు. గబగబా నడచి కొద్దిగా ఆ అరచూపు చూసి దిగిపోయింది.’
‘ మెట్లు గబగబా దిగి ఉంటుంది.’
‘ కరెక్ట్! ఎలా చెప్పారు?’
కళ్లజోడు తీసేశాను.
‘ లింగా, లోకాన్ని చూసిన కళ్లు ఇవి.నువ్వు చెప్పిన నిజం ఒప్పుకోవాలా? వద్దా? అది తన గురించి నీ మాటలో నువ్వు చెప్పిన నిజం. ఇన్ని ఉన్నప్పుడు మరి అమ్మాయిలు అలాగే స్పందిస్తారు! గాడ్ బ్లెస్ యు! ఇంతకీ అమ్మాయి కళ్లలోకి అసలు గట్టిగా చూశావా?’
‘ ఇన్ని చెప్పినా ఆ పని చేయలేకపోతున్నాను సార్! గట్టిగా లుంగీయే కట్టలేని వాడిని అలా చూడలేనేమో అనిపిస్తున్నది.’
‘ ఫరవాలేదు లింగా. ఇంక దారి మీద పడ్డావు. లుంగీ ముడి గట్టిగా వెయ్యి! ఈ సారి అమ్మాయి కళ్లలోకి చూడు. హోమియో దాక్టర్ చూసినట్లు కాదు! నీ కళ్లను కొద్దిగా పెద్దవి చేయి.’
‘ అమ్మాయి కళ్లల్లో ఏదో ఉంటుంది సార్!’
‘ ఏదో ఏమిటి లింగా? సంగీతం తెలియని వాడు కొన్ని ప్రపంచాలను కోల్పోతాడు. సాహిత్యం పట్ల ఆసక్తి లేని వాడు ఇంటి ఆవరణలోనే లంకె బిందెలు ఉన్నట్లు తెలియకుండానే బ్రతికేస్తాడు. అమ్మాయి కళ్లల్లోకి చూసిన వాడు భగవంతుని చూస్తాడు!’
‘ అన్యాయం సార్! మరీ భగవంతుడు అన్న మాట బాగాలేదు.’
‘ నో లింగా! అదే మర్మం. అమ్మాయి కళ్లలోకి జాగ్రత్తగా చూసినవాడు ఈశ్వరుని సృష్టి లోని ఆంతర్యం తెలుసుకుంటాడు.అసలు ఈశ్వరుడు కూడా తొలుత ఆలోచన లేని వాడే! శక్తి కనులలోని సౌందర్యం చూడగానే హృదయంలో ఆలోచన అనేది ప్రారంభమైనది…’

~~~***~~~

పన్నెండవ భాగం

‘ లింగా…’
‘ సార్!’
‘ నిన్న లేని ఈ విచిత్రం ఏమిటి లింగా?’
‘ ఏమైంది సార్?’
‘ ఆ రోజు చక్కగా ప్రేమ లేచి నిలబడి మనతో పాటు నడిచింది అని ఎంచక్కా జెండా ఎగరేశామా?’
‘ కరెక్ట్. నేనే ఎక్కువగా చొక్కా చించుకున్నాను.’
‘ మరి ఇలా నా వొడిలో వాలి నా ప్రాణాలు తీస్తూ అలా దిగులుగా ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నావు?’
‘ నాకూ అదే అర్థం కావటం లేదు సార్! నాకు కలిగిన ఆ ధైర్యం, ఆ మాటలు క్షణికమేనా?’

‘ ఏమైంది లింగా?’
‘ డాబా మీదకి మరల నిన్న వెళ్లాను!’
‘ వెరీ గుడ్!’
‘ ఎదురుగా రంగా!’
‘ ఛా!’
‘ అవును. ఈ రోజు తను ముందుగా డాబా మీదకి వచ్చింది…’
‘ నువ్వు లేవ వయ్యా లింగా! లే!’
‘ ఎందుకు సార్?’
‘ అరే! నేను స్పందించాలంటే ఇలా కుదరదు!’
లింగా లేచాడు.’ యస్?స్పందించండి మరి!’
‘ ఆ…అర్థమైంది.అమ్మాయి మనసు కదులుతోంది. నువ్వు నా వొడిలోంచి లేచినట్లు, బుట్ట లోంచి పాము ఉన్న పళంగా లేచినట్లు, నేను ఇలా స్పందించుటకు కదిలి సద్దుకున్నట్లు ఒక సున్నితమైన భావం ఒక కెరటంలా అలా కొట్టుకుని వస్తోంది లింగా. ఆలోచించు!’
‘ నన్ను చూడగానే అటు తిరిగి పిట్టగోడ దాకా అలా వెళ్లిపోయింది సార్!’
‘ సిగ్గు లింగా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా?’
‘ కావచ్చు. కానీ మరీ అలా తేలును చూసినట్లు పారిపోతే ఎలా సార్?’
‘ తప్పు లేదు లింగా.ప్రేమ విషయంలో తేలయినా తొండైనా ఫరవాలేదు. అలా వెళ్లకుండా అమాంతం మీద వాలిపోతే ఆలోచించాలి గానీ…’
‘ అన్యాయం సార్!’
‘ ఏమిటీ?’
‘ అబ్బా ఇంతకీ చెప్పేది వినండి సార్!’
‘ చెప్పు. అటు తిరిగి సూర్యాస్తమయాన్ని చూస్తూ తన ఆలోచనలను నీతో పంచుకుందా? లేక సాయం సంధ్య రాగం ఒకటి నీ కోసం ప్రత్యేకంగా పాడటం మొదలు పెట్టిందా?’
‘ చేతులు కట్టుకుంది.’
‘ వెరీ గుడ్!’
‘ నా పాట వింటే గానీ చదవలేవా లింగా? అని అడిగింది.నీకు నమ్మకం లేదా? అని అడిగాను. నాకు ఇటువంటివి నచ్చవు అనేసింది.’
‘ ఓహో! నువ్వు తగ్గద్దు. ఏమన్నావు?’
‘ నేను నిజం చెప్పాను అన్నాను.’
‘ అద్దీ!’
‘ నువ్వు ఒకటి నమ్ముతావనీ, మరొకటి నమ్మవనీ నేను మాట్లాడను, అన్నాను ‘
‘ ఇంత ధైర్యంగా మాట్లాడి ఇలా నీరు గారుతావేమిటి లింగా?’
‘ ధైర్యంగా మాట్లాడటం ఒక వైపు. ఆమెకు నొప్పి కలుగకుండా మాట్లాడటం మరో వైపు…’
ఇది ఆలోచించాలి అనిపించింది.
‘ అది కాదు లింగా!మనసు విప్పి నిజం చెప్పే వాళ్లని అమ్మాయిలు ఇష్ట పడతారు కదా?’
‘ కావచ్చు. అన్ని చోట్లా పనికి రాదు.కావాలని ఓడిపోవటం ప్రేమలో ఒక భాగమని అర్థమవుతోంది సార్!’
‘ ప్రేమ ఎక్కడుందో ఏమో! దానితో పాటు చాలా నేర్చుకుంటున్నావు లింగా!’
‘ నిజమే సార్!ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ రాజధాని అంటే కాదనను!’
‘ ఛా!’
‘ అవును. హైదరాబాదేమో అంటాను!’
‘ మరి అమ్మాయితో ఏమన్నావు?’
‘ రంగా,నేను అలా నీ పాట విషయంలో ఎందుకన్నానో తెలుసా? అని అడిగాను. నా కళ్లల్లోకి సూటిగా చూసింది.’
లింగా భుజం మీద చేయి వేశాను.
‘ ఎలా అనిపించింది లింగా?’
‘ నేను ఇంతకాలం గుడ్డివాడిలాగానే బ్రతికాను అనుకున్నాను సార్! అదేదో వెలుగు కొత్తగా అనిపించింది. నేను ఈ మధ్యనే అసలు చూడటం మొదలు పెట్టాను…’
‘ ఇంతకీ ఏమన్నావు?’
‘ నేను…రంగా నేను…’
‘…’
‘ అమ్మాయి అలా చూస్తూనే ఉంది…’
‘ చెప్పు లింగా, ప్లీస్ చెప్పు లింగా.మానవ జాతి జీవిత చరిత్ర ఈ రెండు పెదాల మధ్య లోంచి జారే ఈ రెండు పదాల మధ్య ఉంది.’
‘ రంగా…అదేమిటో సార్, అమ్మాయి రెప్ప ఆర్పకుండా చూసింది.ఆ చూపులో అర్థమేమిటో తెలియలేదు. నేను లోలోన కొట్టుకున్నాను కానీ మాట రాలేదు.’
‘ నో! అమ్మాయి వెళ్లిపోయిందా?’
‘ నేను కళ్లు మూసుకుని తెరిచే లోపు అటు తిరిగి నాలుగు అడుగులు వేసింది. నీ బాధ ఏమిటో నాకు తెలుసు లింగా. కుర్రాళ్లు చాలా మంది ఈ వయసులో ఇలాగే ప్రవర్తిస్తారు.ఏదో ఊహించుకుంటారు.ఇది అంత తేలిక కాదు…నేనూ ఆగలేదు.’
‘ గుడ్! ఏమన్నావు?’
‘ నువ్వేమైనా అనుకో రంగా! నేను చెప్పదలచుకున్నది చెప్పే తీరుతాను. నేను…అమ్మాయి నువ్వు అంది ఇటు తిరగకుండానే!’
‘ చెప్పావా?’
‘ నేను నిన్ను ప్రేమిస్తున్నానేమోనని అనుమానంగా ఉంది రంగా అన్నాను!’
నా తెరచిన నోరు అలానే ఉంది!’ ఏమిటది? అనుమానమా?’
‘ అమ్మాయి కూడా అటు తిరిగి అదే మాట అంది. ఈ మాట దగ్గరే అనుమానం అయితే ఇంకా ఆ పైన ఏది ఎలా ఉంటుందో, లింగా, గాడ్ బ్లెస్ యు! అని గబ గబా దిగిపోయింది!’
‘ అనుమానం…ఇదేమిటి లింగా?’
‘ తెలియదు సార్! ఇప్పుడు ఏమవుతుందోనని ఇంతాకటి నుంచీ ఆకాశం వైపు చూస్తున్నాను.’
‘ అనుమానమే! వాన కురవక పోవచ్చు!’

~~~***~~~

పదమూడవ భాగం

‘ లింగా…’
‘ సార్ ‘
‘ ఏమిటి అలా ఈ గడ్డి మీద పడుకుని ఆకాశం లోకి చూస్తూ ఆలోచిస్తున్నావు?’
లింగా లేచి కూర్చున్నాడు.
‘ సార్, ఇంతవరకూ నేను ఆలోచించగలను అని ఎన్నడూ అనుకోలేదు. అమ్మాయి మనసు నన్ను కూడా బుర్ర పెట్టి ఆఓచించమని చెబుతోంది.’
‘ రంగా నువ్వు లాభం లేదని చెప్పినట్లుంది? ఇంకా ఆలోచన దేనికి?’
‘ అదే తమాషా! అమ్మాయి ఆరోగ్యం లాంటిది సార్! దగ్గర లేనప్పుడు మరి మరీ గుర్తుకొస్తుంది. కేన్సర్ లాంటిది. అది ఉన్న వారికీ, లేని వారికీ ఇద్దరికీ ముఖ్యమే!’
‘ అదే వరుసలో డబ్బు కూడా చెప్పు ‘
‘ కావచ్చు. అలవాటుగా నిన్న డాబా మీదకి వెళ్లాను.’
‘ గుడ్ ‘
‘ ఇంటిలో పవర్ పోయి అంతా చీకటి మయంగా ఉంది. అలా డాబా మీద పిట్ట గోడకు ఆనుకుని నిలబడ్డాను.’
‘ రంగా ఎంటర్ అయిందా?’
‘ లేదు.’
‘ ఇంక రాదు లింగా! ప్రేమించినట్లు అనుమానంగా ఈ లోకం లో నువ్వొక్కడివే చెప్పగలవు. పోనీలే! ఆ తృప్తినైనా ఇచ్చింది నీకు.’
‘ కాదు సార్. ఆమె అప్పటికే అక్కడ ఉంది.’
‘ ఛా! ‘

‘అటు తిరిగి సన్నగా పాడుతోంది.’
నేను లేచి కూర్చున్నాను.
‘ ఏమి పాడుతోంది లింగా? నీ కోసమే నే జీవించునది…’ నా పాట వినకుండానే పల్లీల పాప వచ్చి ఎందుకో సిగ్గు పడి వెళ్లిపోయింది.
‘ వదిలేయి…చెప్పు. ‘
‘ మనసూ పలికింది, ఏదో తలచింది…మదిలోని మాటలన్ని, జత కోరి జతి చేరి…మమతే గెలిచిందీ…మనసూ పలికింది!’
‘ శభాష్! నిన్ను చూసి ఆగిపోయిందా?’
‘ లేదు. అవునూ, ఈ మధ్య మీరు ఇంత రివర్స్ ఎందుకయ్యారు? అమ్మాయి నాకు దగ్గరవటం ఇష్టం లేదా?’
‘ లేదు లింగా. అమ్మాయి వ్యవహారం గురించి తెలుసుకుందామనుకుటున్నాను. నాకూ ఈ మధ్యనే అమ్మాయిల గురించి తెలుస్తున్నది…’
‘ అదీ సంగతి. కొత్త డాక్టర్ దగ్గర నాకు వైద్యం జరగటం వలన ఇలా తిప్పలు పడుతున్నాను. ఇంతకీ అమ్మాయి అటు ఆకాశం వైపు చూస్తూ పాడుతున్నది. అక్కడ చంద్రుడు, మబ్బులు..ఓహో! నేను వెనుక అలా నిలబడి వింటూనే ఉన్నాను సార్. బాగా పాడింది. ఆ యూస్ లెస్ ఫెలో బాగానే నేర్పుతున్నట్లున్నాడు.’
‘ నువ్వు విన్నట్లు తెలిసిందా?’
‘ పాట పూర్తి చేసి ఇటు తిరిగి అర చూపు చూసింది.’
‘ ఎలా అనిపించింది? ‘
‘ అక్కడి చంద్రుడు బుగ్గల మీదుగా అలా జారిపోయాడా అనుకున్నాను.మరల అటు తిరిగి ఎందుకో తల వంచుకుంది.’
‘ నువ్వు విన్నావని కావచ్చు. ఇంకెవరికైనా వినిపిస్తే బాగుండుననఏమో! ఎవరి బాధ వారిది!’
‘ ఊరుకోండి సార్. పాట బాగుంది, అన్నాను.’

‘ అర నవ్వు నవ్విందా? ‘
‘ లేదు. చంద్రుని వైపు చూసింది.’
‘ వెరీ గుడ్! ‘
‘ చీకట్లో పాడుతున్నావెందుకు?, అడిగాను. వెలుతురులో పాడేందుకు ఏమీ ఉండదు, అన్నది…’
‘ ఛా! ‘
‘ నాకు మతి పోయింది. దగ్గరగా వెళ్లాను.’
‘ గుడ్! వెళ్లాలి. ఆ మాట సామాన్యమైనది కాదు.’
‘ అదేంటి?, అడిగాను.లింగా…అని చాలా మెల్లగా పలికింది.’
‘ చెప్పు రంగా, ఎనీ ప్రాబ్లం? ‘
‘ వీణ మీద తీగె మీటితే వినిపించే నాదం ఎక్కడి నుంచి వస్తుంది?’
‘ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం లోంచి స్పందన అడుగును తాకి మరల తీగె లోంచి బయటకు వస్తుంది.’
‘ తీగెలో ఏమి జరుగుతుందో కనిపిస్తుందా?’
‘…’
‘ కనిపించదు లింగా! ‘
‘ ఏదైనా గుర్తుకు వచ్చిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ‘
‘ ఏమీ లేదు. నేను పాట నేర్చుకునేదీ, ఆట నేర్చుకునేదీ ఊరకే కాదు…’
‘ వామ్మో! కథ ఉందా? ‘
‘ కథ కాదు. నిజం ఉంది. మా అమ్మ నాకొక దీక్ష ఇచ్చింది…నా వైపు తిరిగింది. లింగా…’
‘ ఏమిటి రంగా? ‘
‘ ఎవరికీ చెప్పవు కదూ? ‘
‘ నో! ‘
‘ మా అమ్మకీ నాన్నకీ మధ్య కొన్ని సుడిగుండాలున్నాయి…ఇద్దరూ ఎవరికీ చెప్పరు. ఇద్దరూ చదువుకున్న వారే! ఒక చిత్రమైన విషయంలో ఒక పోటీ వచ్చి అలా నా దగ్గర ఆగింది. నువ్వేదో ప్రేమా దోమా అంటున్నావు కాబట్టి చెబుతున్నాను…’

~~~***~~~

పదునాల్గవ భాగం

ఆ పలెటూరులో దూరంగా ఒక గుట్ట మీద ఒక పెద్ద ఇల్లు ఉండేది. చాలా మంది ఆ ఇల్లు ఎవరో ఒక పెద్ద ఆఫీసరు గారిది అని చెబుతూ ఉండే వారు. వారానికి రెండు రోజులు ఒక పెద్దాయన వచ్చి అందులో ఉండే వాడు. ఏమి చేసే వాడో పెద్దగా తెలిసేది కాదు. గుడి దగ్గర ఉన్న సోమసుందరం ఆ రెండు రోజులూ ఆయనను దొర లాగా చూసుకుని పంపించే వాడు. సోమసుందరాన్ని చాలా సార్లు మా అమ్మ అడిగింది. అప్పుడు ఆమె మా తాతకి ముగ్గురు ఆడ పిల్లలలో పెద్ద పిల్ల. సోమసుందరం రక రకాలుగా చెప్పే వాడు.
‘ వాసంతీ, ఈ ఊరును పాలించే ఓరు ఆళ్లు. ఒస్తారు, పోతారు.’
‘ నువ్వెందుకు వెళతావు?’
‘ మరి నేనే కదా సూడాలి.’
‘ ఆయన ఏమి చేస్తాడు?’
‘ అరె! ఇప్పుడే కదా చెబుతా…నీకెందుకు పిల్లా? ఇక్కడ ఏదో ఓ పెద్ద ఫేక్టరీ కడతారుట.’
‘ ఈయన కట్టిస్తాడా?’
‘ మరి? రాళ్లు మోసి ఆయనెట్టా కడతాడు పిల్లా? మంచి దానివే!’
‘ అవునూ…’
‘ అవును?’
‘ ఆ ఇల్లు ఒక సారి లోపల చూపిస్తావా?’
‘ ఎందుకు పిల్లా?’
‘ నాకు చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో!’
‘ అవునులే. ఇల్లు నిజంగానే చాలా బాగుంటుంది. కానీ పని వాళ్లు ఇల్లు తుడుస్తారు, ఎల్లిపోతారు. మన పని అంతే. నీకెందుకులే?’
‘ వద్దులే సోమూ.’
అలా వదిలిపెట్టేది కానీ ఎందుకో లోపలికి వెళ్లాలనీ, చూడాలనీ ఉండేది.ఒక రోజు ఆ ఇంటికి వెనుక వైపుకు నలుగురు అమ్మాయిలు కలసి వెళ్లారు.చెరువు గట్టు దగ్గర నుంచి చూస్తే ఒక కిటికీ కనిపించింది. అటు వైపు ఒక కురాడు కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు.
‘ నిన్నే చూస్తున్నాడు ‘
‘ కాదు. నిన్ను.’
‘ కాదు అసలు ఎవరినీ చూడటం లేదు. ఏదో వ్రాసుకుంటున్నాడు.’
‘ ఏమయ్యుంటుంది?’
‘ అడుగు.’
‘ సిగ్గు లేదు.’
‘ ఇక్కడంతా చాలా బాగుందీ, సెలయేరు, పిల్ల గాలీ, కొండలు, గుట్టలు…’
‘ అమ్మాయిలు!’
‘ నోరు ముయ్యి పిల్లా. సినిమాలు ఎక్కువయ్యాయి.’
‘ ఎవరికి వ్రాస్తున్నాడు?’
‘ వాళ్ల ఇంటికి.’
‘ జాగ్రత్తగా చూడు, వ్రాస్తున్నది ఉత్తరం కాదు.’
‘ మరి?’
‘ పేజీలు పేజీలు వ్రాస్తున్నాడు.’
‘ అమ్మో నవల!’
‘ నీకెలా తెలుసు?’
‘ చెరువు గట్టు చూస్తూ కిటికీ దగ్గర కూర్చున్న వారందరూ అలాంటి పనే చేస్తారు.’
‘ ఎవరు చెప్పారు?’
‘ నేను నవలలోనే చదివాను ‘
‘ ఈ నవలలు ఎవరి గురించో కాకుండా వాటి గురించే చెబుతాయి. నేను అందుకే చదవను.’
‘ మన స్కూల్లోనే కాదు.ఊళ్లో కాలేజీలో మాష్టారు కూడా అంతే! పాఠం తరువాత, తన పాట ముందు.’
‘ నిజమే! ఇతను మనల్ని చూస్తున్నాడు.’
‘ ఏ, ఇటు తిరగండి. మనం అటు తిరిగినప్పుడల్లా చూస్తున్నాడు.’
‘ నిన్ను ఎవరు తిరగమన్నారు?’
‘ తిరగకపోతే చూస్తున్నాడో లేదో తెలియటం లేదే!’
‘ అయినా కిటికీ అతనిది, కళ్ళు అతనివి ‘
‘ కిటికీలో కరెక్టుగా ఫ్రేములో ఫొటో కట్టినట్లున్నాడే…’
వాసంతి ఈ సారి జాగ్రతగా చూసింది.నిజమే! నొక్కుల జుట్టు,కళ్లజోడు, గొంగళిపురుగు మీసం, చక్కని నుదురు,చెక్కినట్లున్నాడు. ఏమి వ్రాస్తున్నాడో?
ఒక అమ్మాయి లేచి నిలబడింది.
‘ ఏమయిందే? నిన్ను పిలిచేశాడా?’
‘ ఊరుకోవే! లోపలికి వెళ్లాడు.’
అందరూ లేచారు. అటు తిరిగి చూశారు.మెల్లగా పరికిణీ కొద్దిగా పైకి పట్టుకుని దొంగ తనంగా పైకి ఎక్కారు. కిటికీ లోపలికి చూశారు.ఎంత పెద్ద ఇల్లో! టేబిలు మీద చాలా పెద్ద పుస్తకం ఒకటి. దాని పక్కన ఏవో కాగితాలు.ఒక కాగితం దగ్గరగా లాగింది వాసంతి…
‘ అదేదో పదమంటుంది
పదం కాదు పాదం కదలనంటుంది
నిన్న లేని అందమేదో నిలచి పొమ్మంటుంది
ఎన్ని చోట్ల పొడిచినా ఈ కాగితం వదలనంటుంది…’

~~~***~~~

పదిహేనవ భాగం

ఇంటిలోని పనులన్నీ గబ గబా ముగించుకుని ఎందుకో ఆ గుట్ట మీద ఉన్న ఇంటి వైపు చూస్తూ కూర్చోవాలనిపించేది. ఒక్కో సారి అక్కడి దాకా వెళ్లి ఆ నీటి ఒడ్డున కూర్చుని ఆ కిటికీ వైపు చూసే దానిని. ఆ కుర్రాడికి ఏమి కనిపిస్తోందని అలా ఏదో వ్రాస్తూ ఉంటాడు? ఆకాశమా? నక్షత్రాలా? ఈ నీళ్లా? ఏమో! ఏదో పదమంటుంది…అంటే ఎక్కడికో ఏదో వెళదామంటోందనా లేక ఒక పదము తనతో మాట్లాడుతున్నదా?

ఒక్కో సారి ఒంటరిగా ఆ నీటితో పాటు నడుచుకుంటూ అలా దూరంగా వెళ్లిపోయి వెనక్కి తిరిగి చూసేది. ఆ ఇల్లు ఒక చిన్న బొమ్మలా కనిపించేది. ఆ ఇంటికీ ఈ నీటికీ మధ్య పెరిగిన దూరం వలన ఇప్పుడు ఆ గుట్ట, తన చిన్న పల్లెటూరు ఒక చక్కని దృశ్యం లా కనిపించేది. పదములు కావు, పాదములు కదలవంటుంది…కదలనివి పదములు కావా? ఆ కవితల్ ఓని పాదములు ముందుకు వెళ్లటం లేదా? ఓహో! అంత బాగుందా ఈ ఊరు? ఆలోచిస్తుండగా ఎందుకో తనూ కదల లేదు. ప్రక్కన నీళ్లు అలా చిన్న శబ్దం చేసుకుంటూ జారి పోతున్నాయి. ఎవరో మాట్లాడుతున్నట్లనిపించింది. చుట్టూతా చూసింది. ఏమీ లేదు.వాసంతికి తనతో తాను మాట్లాడుకోవటం ఎందుకో అలవాటయిపోయింది. అలాంటప్పుడు ఎవరూ లేకపోయినా ఎవరో మాట్లాడినట్లుంటుంది! ఒక చెట్టును ఆనుకుని నీటి వైపు చూసింది.నిజమే! ఇంత దగ్గరగా ఉంటున్నా ఈ అందాలు ఎన్నడూ కనపడలేదు. నీటిలో కనిపిస్తున్న తన ప్రతిబింబం, ఆ చెట్టూ తనని నిలబెట్టేసినట్లు ఉంది. నిన్న లేని అందమేదో నిలబడి పొమ్మన్నది! నిలబడమన్నదా? నిలబడి పొమ్మన్నదా? ఒక్క సారి గుండె ఝల్లు మంది.
నీటికి అటు వైపు ఆ కుర్రాడు ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు.తనని చూసి అలా చూస్తూ ఉండి పోయాడు.ఈ లోకం లోకి వచ్చి మెల్లగా వెనక్కు తిరిగింది.

‘ నా పాట…’

వెనుక నుంచి వినిపించింది.ఆగి అటు తిరిగింది.

‘ ఏ పాట? ‘
‘ నిన్న లేని అందమేదో…’
‘ నాకు తెలియదు!’
‘ నా కాగితం మీరే తీసుకున్నారు ‘
‘ మీకెలా తెలుసు నేనేనని? నాతో ఇంకా ముగ్గురున్నారు!’
‘ ఆ పాట మీరే పాడుతున్నారు. నేను వింటూ మీ వెనుక వస్తున్నాను.’
‘ నిజమా?’
‘…’

~~~***~~~

ఒక్క ఉరుకున పరుగు తీసి ఇంటిలోకి వచ్చి ఊపిరి తీసుకుంది.అతను ఏదో అంటున్నాడు. వినిపించలేదు. వినిపించుకోలేదు. నవ్వొచ్చింది. చీకటి పడుతోంది. అమ్మో! మళ్లీ అలా వెళ్లకూడదు. ఇంకేమైనా ఉందీ? చదువుతున్న ఒక నవల లోంచి ఆ కాగితం తీసింది. ఎన్ని సార్లు పొడిచినా ఈ కాగితం వదలనంటున్నది…

~~~***~~~

పదహారవ భాగం


గబ గబా కిటికీ దగ్గర కూర్చుని ఆ తెల్ల కాగితాన్ని తెరచి చూసింది. అవునూ, ఇంత ధైర్యంగా ఇలా ఎలా తెచ్చేసింది? ఏమిటో! ఈ పాటను తనకు తెలియకుండానే ఎలా పాడుకుంటూ వెళుతోందీ? ఇది నిజమేనా?
‘…ఎన్ని సార్లు పొడిచినా తెల్ల కాగితం వదలనంటున్నది…’
ఎవరిని వదలనంటోంది? శ్వాస బరువుగా సాగుతోంది. తను చేస్తున్నది తప్పు. ఇవి పిచ్చి వ్రాతలే కావచ్చు. కానీ ఈ కాగితం అతనిది. అతనికి తిరిగి ఇచ్చేయాలి. కుర్చీలో వెనక్కి వాలింది వాసంతి. ఒక పుస్తకంలో భద్రంగా దాచి పెట్టింది. ఒక్క సారి తల విదిలించుకుని వంటింటి వైపు నడిచింది. వెనక్కి తిరిగి పుస్తకాన్ని మరల తెరచి ఆ కాగితం ఉన్న పేజీ తిప్పింది. పేజీ పైన పేజీ నంబరు చూసింది…212 అయిదు తన అదృష్ట సంఖ్య! ఒక్క సారి గట్టిగా మూసేసింది. గబ గబా మరల ఆ టేబిలు వదలి నాలుగు అడుగులు వేసింది.  తెల్ల కాగితం వదలనంటోంది…
~~~***~~~

లేదు. ఇది అతను ఏదో చూసి మరేదో వ్రాసుకున్న గీతలు. తనని వదలననటం ఏమిటి? పిచ్చి కానీ! ఆలోచనలు అలానే పొడుస్తూ ఉన్నాయి. క్షణం తీగెలా సాగి కాలం సాగనన్నట్లున్నది. సాయంత్రం త్వరగా కాదు కదా! కావాలి. తనకి ఏదో కావాలి. ఆవలి గట్టున ఏదో ఉంది. ఈ కాగితం ఇచ్చేయాలి. సాయంత్రం కావాలి. మరల టేబిలు దగ్గరకు వెళ్లి ఆ పుస్తకాన్ని తడుముకుని చూసింది. ఏముంది ఈ కాగితంలో? ఏమీ లేదు. ఎలా తీసుకుని వెళ్లాలి? పుస్తకం తో పాటుగా అయితే బాగుంటుంది. దారిలో ఎగిరిపోకుండా ఉండాలంటే అంతే చేయాలి మరి. ఈ అమ్మాయిలు రాకుండా ముందే బయలు దేరి పోవాలి. అవునూ…కాగితం తిరిగి ఇవ్వటానికేనా ఇంత ఆతృత? అతను ఏమి చేస్తాడు తనని, కాగితాన్నీ చూసి? ఇలా లాక్కుని అలా వెళ్లిపోతాడు. వెళితే మటుకు? తనకేమిటి? లేదు. అలా చేయడు. మరి? పేరడుగుతాడు. ఎందుకు లాక్కెళ్లావని అడుగుతాడు. ఏమి చెబుతుంది? ఆలోచన బాగుంది అందుకని…
అందుకని? తీసేసుకోవాలనిపించింది!
తీసుకుని?
పాడుకోవాలనిపించింది!
తరువాత?
రెండు చేతులతో మొహాన్ని కప్పుకుంది.

నిజమే. కాగితమే పొడుస్తోంది…
~~~***~~~
మరో సారి సూర్యుడు ఆ కొలను చాటున ఒదిగాడు. ఉదయం నుంచి వేచి వున్న ఆ నీటి మీద స్వర్ణ రేఖలు దిద్దాడు. మండే మార్తాండుడు కూడా ఒక్కింత చన్నీటిని కవ్వించాడు. కొండల మాటున కొద్ది సేపు ఆ కొలను ఏమి చేస్తుందా అన్నట్లు దాగాడు!
వాసంతి జింకలా అటు దూకింది. అటూ ఇటూ చూస్తూ పరుగిడుతున్నట్లు అడుగులు వేసింది…అవునూ, అసలు ఆ మనిషి ఎందుకు రావాలి? అక్కడికే ఎందుకు రావాలి? ఆగింది. చుట్టూతా చూసింది. మెల్లగా గుట్ట మీద ఉన్న ఆ కిటికీ దగ్గర ఆగి జాగ్రత్తగా చూసింది. ఎవరూ లేరు. నిర్ధారించుకుని నీటితో పాటు ఉరకలు వేస్తూ వెళ్లిపోయింది.దారి సన్నగా ఉంది. ఎవరూ కనిపించరే? చాలా దూరం నడిచింది. లేదు. ఈ రోజు రాడేమో! ఇంక వెళ్లిపోదాం, చీకటి పడుతోంది…
‘ ఈ రోజు పాడరా? ‘
ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది. అతను నవ్వుతున్నాడు.
‘  నన్ను ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ‘
‘ ఆ పుస్తకం లోంచి నా కాగితం జారిపోతుందేమోనని అనిపించినప్పటినుంచీ…’
పుస్తకం తీసి వెంటనే కాగితం తీసి ‘ తీసుకోండి ‘, అంది.
అతను పుచ్చుకుని తనివి తీరా తన కవితను చూసుకున్నాడు. ఎందుకో నవ్వి జేబులో పెట్టుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. అటు తిరిగి నడక ప్రారంభించాడు.
మెల్లగా అనుసరించింది.
‘ ఆ కాగితం అంటే మీకు అంత ప్రాణమా?’, అడిగింది.
వెనక్కి తిరగకుండానే చెప్పాడు, ‘ ప్రాణమంటే?’
‘ అదేంటీ? ప్రాణం అంటే మరి ప్రాణం…’
‘ అది ఎక్కడుంటుంది? ‘
‘ …’
‘ తెలియదు కదూ? నాకు తెలుసు. ‘
‘ ఎక్కడుంటుంది? ‘
‘ నా మాటలు కాగితం గుండెకు హత్తుకున్నప్పుడు కాగితం లో ప్రాణం చేరుతుంది. దాని గుండె కొట్టుకుంటుంది. ఒక లయ ఎక్కడి నుంచో జలపాతంలా ఉరకలు వేస్తుంది. ఆ కాగితం కనపడనప్పుడు నాలో ఎక్కడో ప్రళయం కనిపిస్తుంది. అక్కడే నా ప్రాణమని నాకు తెలుసు…’
‘ మీ కవిత బాగుంది ‘
‘ కవితలో ఏది బాగుంది?’
ఓరి నాయనో! ఎలా?
‘ నిన్న లేని అందమేదో…’
‘ మరి నిలబడక నడుస్తున్నారెందుకు? ‘
‘ మీరు ఆగటం లేదు కదా?’
‘ మీ పేరు? ‘
‘ వాసంతి! ‘
‘ చదువుతారా?’
‘ ఏమిటి?’
‘ అందాన్ని! ‘
‘…’
‘ జవాబు చెప్పలేదు? ‘
‘ తెలియదు. ‘
‘ నా వెనకాలే వస్తారా? మీ ఇలెక్కడ? ‘
‘ తెల్ల కాగితం వదలనంటోంది ‘, అనేసి నాలుక కరుచుకుంది!
అతను ఆగిపోయాడు. ఇటు తిరిగాడు. అదోలా చూసి నవ్వాడు.
‘ ఈ కాగితం మీద ఎన్ని సార్లో ఈ కలం తో పొడిచాను. అయినా వదలనంటోంది…’
వాసంతి కళ్లు పెద్దవి చేసింది. ‘ కాగితమే దెబ్బ తిన్నదా? ‘
‘ ఎన్ని సార్లో! అయినా అందంగానే నిలబడి వదలనంటోంది ‘
‘అటు తిరిగి మరల నడక ప్రారంభించాడు.
‘ ఇదే జీవితం…ఏదో పదమంటుంది…పదములు కావు, పాదములు కదలవంటుంది…’
మెల్లగా వెనుక నడిచింది వాసంతి. చీకటి పడుతూ ఉంది. ఆ నీటి ఒడ్డున ఏవో శబ్దాలు అలా వినిపిస్తున్నాయి. కాగితాలెందుకు, పొడవటం ఎందుకు? పదములెందుకు? పాదములెందుకు?
ఈ కవితలో సంగీతం ఉందా? ఈ ఆలోచనలో నాదం ఉన్నదా? ఏమో! లేకపోతే తను పాట ఎలా పాడేసింది? ఏమో!
~~~***~~~

పదిహేడవ భాగం

‘ వాన రాదు. ఎందుకు మబ్బులను చూస్తున్నారు? ‘
వెనుక నుండి వినపడింది.ఉలిక్కి పడి చూసింది. భుజాన సంచీ ఒకటి తగిలించుకుని నవ్వుతున్నాడు అతను.
‘ మీరు నన్ను పేరు అడిగి తెలుసుకున్నారు.నా పేరు మటుకు చెప్ప లేదు!’ అంటూనే రెండు అడుగులు వేసింది.
‘ మీతో సంవత్సరం ప్రారంభమవుతుంది. నా లాంటి ఋతువులు వందకు పైగా ఉండాలని అందరూ కోరుకుంటారు!’
ఎంత అహంకారం. తను వాసంతి అయితే వసంతం గురించి చెబుతున్నాడా? చ్హీరె జాగ్రత్తగా పట్టుకుని ఆ సన్నని దారి మీద నడుస్తోంది.
‘ మీరు శరత్ అంటారా?’
‘ అనటం ఎందుకు? నా పేరు శరత్! పశ్యేమ శరదశ్శతం! ‘

‘ అయితే మీరు కోటికొక్కరౌ కారు. వందలలో ఉంటారు. అవునా? చాలా కామన్!’
‘ కరెక్ట్. కానీ నవ రసాలూ, నవ రాత్రులూ నా దగ్గరే!’
ఆగిపోయింది.సెలయేరు చక్కగా పారుతోంది.
‘ నేను లేకుండా ఏదీ చిగురించదు!’ అనేసి ఎందుకో భయపడింది. తల వంచేసుకుని బిత్తరపోయింది! అతను మెల్లగా దగ్గరకు వచ్చాడు.
‘ నిజమా?’
మొహం చేతులతో కప్పుకుంది.
‘ మీలో కళ ఉంది ‘
అలాగే మాట్లాడింది.
‘ మీకెలా తెలుసు?’
‘ మీ చేతి వేళ్లు చాలా పొడుగు.కనుబొమ్మలను కప్పిన ఆ వేళ్లు మీ కళ్లకు అందమైన కిరీటాన్ని అమర్చినట్లుంది.’
చేతులు తీసేసింది.
‘ కిరీటం వద్దా?’
వద్దన్నట్లు తలూపింది.అక్కడ ఉన్న చెట్టును ఆనుకుని ప్రక్కకు తిరిగింది.

అతను ఆ సన్నని దారి మీదే నిలబడ్డాడు.
‘ మీరలా నిలబడితే ఎలా ఉందో తెలుసా?’
కళ్లు పెద్దవి చేసి అతన్ని చూసింది.అతను సిగరెట్ తీసి జాగ్రత్తగా ముట్టించాడు.
‘ ఓ బాటసారి ఇలా వెళుతూ మిమ్మల్ని చూసి ఏమీ చేయలేక ఇలా నా లాగా ఆగి కేవలం చూస్తూ ఉండిపోయినట్లు…అదలా ఉంచండి. ఎవరైనా ఆగిపోవాల్సిందే!’
‘ ఎందుకో?’
‘ నిన్న లేని అందమేదో నిలబడిపొమ్మంటోంది!’
‘ ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు?’
అతను విరగబడి నవ్వాడు.
‘ నేను మిమ్మల్ని ఇది చేయమని ఎలా చెప్పను? కాకపోతే ఒకటి. మబ్బులని చూడండి.’
‘ ఎందుకు?’
‘ ఆ మబ్బులని కాదు. ఇదిగో…’ అంటూ సంచీలోంచి ఒక ఆల్బం ఇచ్చాడు.
మెల్లగా తెరచి చూసింది. మొదటి ఫొటో…ఒక మబ్బు ఒక రథం లాగా ఉంది.మరో మబ్బు నడ్పుతున్నట్లుంది.
పేజీ తిప్పింది.ఉల్లి పొరలలాగా రింగులు రింగులుగా ఉంది మరో మబ్బు. మరో మబ్బు నిండు గర్భిణీ లాగా బరువుగా సాగుతోంది. ఒకటి ఎవరో చేయి పైకి లేపి పిలుస్తున్నట్లుంది.అలా తిప్పుకుంటూ పోయింది. చివరి పేజీలలో ఒకటి తనని కదలనీయలేదు. రెండు మబ్బులు ఉన్నాయి. ఒకటి పైన నిలువుగా సన్నగా ఉండి పైకి వెళ్లిపోతున్నట్లుంది. దాని అంచును పట్టుకుని మరొకటి అదే ఆకారంలో కదులుతున్నట్లుంది. జాగ్రత్తగా చూస్తే ఇద్దరు మనుషులు ద విన్సీ చిత్రం లోని వారిలాగా ఉన్నారు. ఆల్బం మూసేసింది.
‘ఎక్కడ దొరికాయి?’
‘ ఏమిటి?’
‘ మబ్బులు ‘
‘ అవి దొరకలేదు. వచ్చి వెళ్లిపోయాయి. నేను కెమెరా పట్టుకున్నప్పుడల్లా వస్తాయి. అలా అని నేను కెమెరా పట్టుకుని ఒక చోట కూర్చోను. వచ్చినదానిని క్లిక్ చేయను. ఉన్న దానిని ఒక కోణంలోకి చేరుస్తాను. శరత్ అందుకే కేవలం కోణంలో…ఒక మూలనే ఉంటాడు. దట్ ఈస్ శరత్!’
‘ నేను పబ్లిక్ లోకి వస్తానా?’
నవ్వాడు.
‘ ప్రతి దానికీ మీతో పోలిక ఎందుకు?’
‘ నేను వాసంతిని ‘
‘ నిజమే! ఈ ప్రకృతి బ్రతికి బట్ట కట్టేది మీ దగ్గరే! పోలిక లేకుండా ఎలాగా?’
‘ అంటే?’
‘ ఈ శరత్ కూడా వసంతం తోనే పరవశిస్తాడు!ఈ ప్రపంచం లోకి వస్తాడు! పబ్లిక్ అవుతాడు!’
సిగ్గుతో మొహం ప్రక్కకు తిప్పింది. పైన మబ్బులు అలా సాగిపోయాయి…
~~~***~~~

18

అంతా నిశ్శబ్దంగా ఉంది. నదిలోని నీటి మీద మెల్లగా అడుగులు వేస్తున్నా ఎందుకో ఏమీ కావటం లేదు. కింద ఉన్నది నీళ్లా లేక ఏవైనా రాళ్లు ఉన్నాయా? ఏమో…ఎక్కడో ఒక ముసలి వారెవరో ఏదో విన్న పాట లాగా ఉంది, చక్కగా పాడేస్తున్నాడు. ఎవరో తెలియటంలేదు.ఇంతకీ ఆవలి ఒడ్డుకు ఇలానేనా వెళ్లటం? నీటి మీద నడకేమిటి? నీళ్లలో ఏవో ప్రతిబింబాలు…ముందు తన మొహమే కనిపిస్తోంది, తరువాత మబ్బులు కైలాయి. అవి కదలగానే అటూ ఇటూ తల తిప్పింది వాసంతి. టక్కున మెలకువ వచ్చింది. లేచి కూర్చుంది. ఏమిటీ కల? కిటికీ బయటకు చూసింది. చల్లని గాలి ఎటు వైపో పయనిస్తోంది. దూరంగా ఆ కిటికీ కూడా తెరిచే ఉంది. ఎందుకో తల వంచుకుంది. ఈ మబ్బుల్లో ఏముంది? అవునూ, అసలు ఈ మధ్య ఈ ఆలోచనలేమిటి? మబ్బులు, నీళ్లు, అవునూ, ఈ కలలేమిటి? చిన్నగా నవ్వుకుంది. తనలో ఏదో మార్పు వస్తోంది. దుప్పటీ దగ్గరకు లాక్కుంది. అసలు గతంలో ఇంత ఆలోచన చేసేదా? ఏమో! మోకాళ్ల మీద తల ఆంచి మరీ ఆలోచిస్తోంది. కిటికీ రెక్క చిన్నగా కదులుతోంది. తల ఆంచే కను మూల నుంచి అటు చూసింది…మబ్బులు దూరంగా చంద్రుడిని దాటి వాటి దారిన అవి వెళ్లిపోతున్నాయి. ఈ మబ్బులకు పని లేదు! మధ్యలో వస్తాయి, మధ్యలోనే వెళ్లిపోతాయి. ఎందుకో మధ్యలో కొద్ది సేపు ఆ జాబిలిని కప్పేసి వింత ఆట ఒకటి ఆడుకుంటాయి. ఈ చంద్రుడికి ఎన్నడూ నిలకడ లేదు. నిలకడ లేని మబ్బులను సైతం కవ్విస్తాడు. అమాయకుని లాగా కనిపిస్తాడు…ఇదేంటి? లేచి కిటికీ రెక్క దగ్గరకు వచ్చింది…ఏవో పాటలు పాడుకునే తను ఇలా వింత ఆలోచనలతో కవిత్వం చేసేస్తోంది? నో! ఏదో ఉంది…
తనెవరు? అతనెవరు? ఎవరేమిటి? తను వాసంతి, అతను శరత్…దట్స్ ఆల్!
కాదు. కాకూడదు. ఎందుకో ఊపిరి గట్టిగా పీలుస్తోంది. మరల మబ్బుల వైపు చూసింది. ఇలా ఎందుకు కాకూడదు? హృదయమే పెళ్లికూతురు, హృదయమే పెండ్లి కొడుకు, ఆ మబ్బుల మీదకి పరుగులు తీయాలి, అక్కడే ఎక్కడో బొమ్మల పెళ్లిలాగా పెళ్లి జరిగిపోవాలి.
మరల దిండు దగ్గరకు వచ్చింది వాసంతి. తెలుగు సినిమాలు ఇంతగా చూడకూడదు!
నిజమే! జీవితం కటిక నేల. ఆకాశం మబ్బుల లాంటి వాటికి పుట్టినిల్లు. నిలబడేది ఏది?
పైన ఫాను తిరుగుతోంది. శరత్ మాటలను బట్టి అతను దుర్మార్గుడు కాడు. ఎవరు చెప్పారు? నిజమే!
కళ్లు మూసుకుంది. మరల మబ్బులు తిరుగుతున్నాయి. అతను కళా పిపాసి. వింత ప్రేమికుడు. పిచ్చి వాడు కాడు…
భావుకుడు కావచ్చు. నాన్న ఒక సారి అన్నట్లు భావుకులు తొందరగా బావుకోలేరు!
ఊ…అసలు తనకి ఏమి కావాలి? తెలియదు! నిద్ర పట్టటం లేదు. మబ్బులే ఎందుకు పీడిస్తున్నాయి?
శరత్ గీసిన మబ్బులా? కాదు. అతను ఉన్న మబ్బులను ఫొటో తీశాడు. అతను ఏమీ గీయలేదు. అతనికే ఎందుకు దొరుకుతాయి ఇలాంటివి? ఏమో!
కళ్లు మూసుకుని అటూ ఇటూ ఒరిగింది. ఎవరో తట్టినట్లు మరల కళ్లు తెరిచింది. తనకు నిద్ర పట్టటం లేదని తెల్లారిపోవాలా? సరే! పడుకుందాం అనుకుంది.నిశ్శబ్దం అలానే ఉంది. మనసు ఊయల ఊగుతోంది. అయినా వెర్రి పిల్లకు నిద్ర రావటం లేదు! చిరు గాలి ఏదో ఈల పాట కూడా పాడేస్తోంది. అయినా రెప్ప వాలటం లేదు! ఊయల ఇక్కడ కాదు, ఆ మబ్బుల మీదకి వెళ్లి ఊగాలనున్నప్పుడు శరీరంలో కూడా ఏదో వద్దన్నా ఉత్సాహం, పాట ఇక్కడ కాదు, ఆ చంద్రునితో…అవునూ…శరత్ చంద్రునితో కలసి అక్కడే పాడాలి! ఎంత ఆశ! నవ్వుకుంది…అర్థమయ్యేవన్నీ మరోలా అనిపిస్తున్నాయి. కనిపించనివి కూడా కనిపించినట్లు కదులుతున్నాయి. ప్రపంచమంతా ఊగుతోంది. ఏదో అవుతోంది. మరేదో అయిపోతోంది!
…ఇదేనా ప్రేమ ఓ పిచ్చి వాసంతీ? ఎందుకో ఇంక కాసేపట్లో నిద్ర పట్టేయగలదు అనిపించింది. కలలోని ఆ నీటి మీద నడక సాగి ఆగిపోవచ్చేమోననిపించింది. ఒక తీరం అక్కడే దొరకగలదేమో అనిపించింది వాసంతికి!
~~~***~~~

19

రాత్రి పెద్దగా నిద్రపోలేదని వాసంతికి తెలుసు. ఏదో అలవోకగా ఉదయం పనులన్నీ చేసుకుని పోతోంది. జారుతున్న తీగెను గట్టిగా కట్టి బాల్టీలోని బట్టలు తెచ్చి ఆరేస్తోంది. ఎవరో లోపలి నుంచి అంటున్నారు,’ ఈ పిల్లవి అన్నీ వెర్రి చేష్టలే! ఒక వైపు వాన వస్తుంటే ఈ బట్టలు ఆరేయటం ఏమిటీ?’
ఈలోకం లోకి వచ్చింది వాసంతి. నవ్వొచ్చింది. నిజమే! తడుస్తున్నా తనకి తెలియలేదు. గబ గబా అన్నీ తీసేసి లోపలికి వెళ్లిపోయింది. కిటికీ దగ్గర చూస్తూ నిలబడింది. తోటలోని మట్టిలోకి నీరు జారుకుంటూ వస్తోంది. ఏవరో ఆహ్వానిస్తున్నట్లు ఆ ధార మీద ఒక్కొక్క చినుకు అలా పడి ఆడుకుంటోంది…పెళ్లి వారు లోపలికి వస్తుంటే అక్కడ నిలబడి ఎవరో చక్కగా పన్నీరు చల్లినట్లు ఉంది.
‘ కాఫీ కూడా తాగవా?’
వెనక్కి తిరిగింది. కిటికీలోనే పెట్టి ఉంది కాఫీ! గబుక్కున గ్లాసు తీసుకుంది.
‘ దయ్యాన్ని చూసినట్లు చూడకు వాసంతీ! నిద్రలో చూసినట్లున్నావు. వాటిని అక్కడే వదిలేయి! ‘, పిన్ని తలుపు దగ్గర నిలబడి అంటోంది…
‘ నీ దుంప తెగ! నీ పిన్నినే! ఏమయింది నీకు?’
గొంతు సద్దుకుంది. ఇంక మాట్లాడకపోతే ఇంకో అరగంటలో డాక్టరు ఇంటి ముందు ఉండగలడు!
‘ ఏమీ లేదు పిన్నీ…వాన…’
‘ ఓహో! వాన కదూ? కరెక్టే! ఈ మధ్య మనం వాన చూడటం మరచిపోయాం. కొన్నాళ్లకి ఇదో పెద్ద వింత అయిపోతుంది. నిజమే! ఏమిటీ నీ సమస్య? స్నానం చేసి శృతి చేసుకోవా?’
‘ ఓ! చేస్తాను పిన్నీ! కొద్దిగా నీరసంగా…’
‘ కానీ…ఆడ పిల్లలకు అంత బధ్ధకం పనికి రాదు!’
పిన్ని వెళ్లిపోయింది. నిజమే. ఈ పిన్ని అసలు మాట వెతుక్కోదు. ఏ రోజూ సంగీతం అభ్యాసం మాన నీయదు. మంచిదే! కిటికీ బయట సంగీతం వింతగా ఉంది. వాన కూడా ఒక విచిత్రమైన ఒరవడి అలవరచుకున్నట్లు ఉంది. అక్కడో చినుకు తుళ్లు మంటోంది, ఇక్కడో చినుకు ఇదిగో అంటోంది. దీపావళి రాత్రి అన్ని టపాకాయలు అయిపోయాక అక్కడక్కడ ఒకటో రెండో పేలుతూ ఉంటాయి…అలా ఉంది వరస!
ఇంక పడదు ఈ వాన అనుకుని మరల కిటికీలోంచి చూసింది. ఇంతలో గబ గబా స్కూలు పిల్లలు ఒక్క సారి బయటకు వచ్చినట్లు జోరుగా అందుకుంది. భార్యా భర్తలిద్దరూ మాటకు మాటా అనుకుంటున్నట్లు, కొత్త దంపతుల సరాగంలా, వంటింటిలోంచి వినిపిస్తున్న ఏదో కొత్త ఆగంలా, బాలమురళీ గారి సరిక్రొత్త రాగంలా, టి.వీ సీరియల్ లోని తరువాయి భాగంలా…చినుకుల చప్పుడు పోటీ పడుతోంది…
~~~***~~~

వీణను జాగ్రత్తగా పట్టుకుంది వాసంతి. వాకిట్లో వాన వెలిసింది. ఏదో పసివాడి ఏడుపు ఆగిపోయి నిద్రలోకి జారిన నిశ్శబ్దం…తోటలోని నీరు నేను కావాలనే జారిపోతాను అంటున్నట్లుంది. వీణను పట్టుకుని కూడా వాసంతి వినపడనివి వింటోంది. ఏమిటో ఆ ఆలోచన. అలా ఆ పిల్లని ఎవరైనా గుమ్మం దగ్గర నుంచి చూస్తే ఒక బొమ్మ గీస్తున్న కళాకారుడికి మాడల్ లా కూర్చుందా? అనిపిస్తుంది. ఆ ప్రశాంతతలోకి ఈ నాదం ఎలా పంపాలి? ఎందుకు పంపాలీ? నీరు ఎక్కడికో జారిపోతున్న చప్పుడు ఎందుకో తనని కదిలిస్తోంది. రోజూ శృతి చేసుకోవాలి…ఈ వీణను పలికించాలి…అసలు ఈ తీగెలు ఇలా ఎందుకు? తీగెలను ఇలా అటూ ఇటూ లాగి, బంధించి, అక్కడ తాకీ, ఇక్కడ కదిలించి సరిగమలనీ, సంగీతమనీ, సామవెదమని ఒక పాట పాడేస్తాడు మనిషి! ఈ మనిషి అసలు ఎంత దుర్మార్గుడు?…ఏమిటీ ఈ ఆలోచన? వీణ మీద ఉన్న తీగెలను ప్రేమతో నిమిరింది. అలవాటుగా వేలి కొసలతో కదిలించింది. అవును మేమే అన్నట్లు ఏదో వినిపించింది. మేమె! అంటున్నాయి ఆ తీగెలు. వీణ మీద నుంచి తల పకి ఎత్తింది వాసంతి. ఎదురుగా కిటికీ! ఆ తరువాత తోట, జారుతున్న నీరు, దూరంగా మరేదో… మరో కిటికీ…ఎక్కడో ఒక మెరుపు, ఒక ఉరుము…
ఎంతో కాలంగా వీణ వాయిస్తోంది వాసంతి. ఎందుకో మొదటి సారి ఆ తీగెలలోంచి మరేదో నాదం, తెంచుకు పోవాలనే నినాదం వినిపిస్తోంది. మరల వీణ వైపు చూసింది. ఇందులో వినిపించని పాటలు దాక్కున్నాయా? ఆలోచించింది.
‘ శృతి…శృతి చేయి వాసంతీ, ఏమిటి ఆ పరధ్యానం?’
పిన్ని చెబుతోంది.
కట్టు బాటులే విద్యలకు ఆయువు పట్టులా? సరిగ్గా బంధింపబడటమే నిజమైన శృతా?
ఏమిటి ఈ ఆలోచన? ఈ లోకం లోకి వచ్చింది. మరల తీగెలను మీటింది.
కొద్దిగా ఈ సారి బాధగా ఉంది. ఎవరైనా శృతి చేసి ఇయ్యమంటే క్షణంలో శృతి చేసి ఇచ్చే వాసంతి చిత్రంగా తీగెలను కదిలిస్తోంది. ఇవన్నీ భిన్నంగా మ్రోగాలనే అనిపిస్తోంది ఆ పిల్లకి…
శృతి తప్పాలని ఉన్నది. పాలు విరగాలని అనిపిస్తోంది. పొంగాలని ఆశ లేదు. ఏమో! విరిగిన పాలే కదా కళాఖండాలను తయారు చేసేది? ఆపి నవ్వుకుంది. కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది. నీరు జారిపోయినట్లుంది. మోత ఇక లేదు. మట్టి సువాసనలు వెదజల్లుతోంది. పెళ్లి మేళాలు ఆయిపోయినట్లున్నాయి.

పన్నీరు కంటే గంధమే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది.

‘ నీరు లేన్ని గంధం ఎలా ఉంటుంది? నీరు జారిపోయినా తనలో దాచుకుని నేను ఇదిగో అంటోంది ఈ నేలగంధం! చూశావా  పిన్నీ?’

పిన్ని తలుపు దగ్గర నిలబడింది. నడుము మీద చేయి పెట్టింది.

‘ ఏమయింది నీకు? పిచ్చి పట్టిందా?’

జవాబు చెప్పలేదు వాసంతి. చిరునవ్వు నవ్వింది. కళ్లు పెద్దవి చేసింది. పిన్నికి పిచ్చి పిచ్చిగా ఉంది.
అవునన్నట్లు తల ఆడించింది వాసంతి…
~~~***~~~

20

ఆ ఊరుకు బస్ స్టాప్ చిత్రం గా ఉంటుంది. ఒక కొండకు అటు పక్క బస్ స్టాప్. బస్సు వచ్చేది రెండు సార్లే. ఉదయం ఎనిమిదికి ఊరు దాటి లోయ వైపు వెళ్లేది, మరల సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుండి ఇటు వెళ్లిపోయేది.
‘ ఇంకా రాలేదు బస్సు? ‘, శరత్ అక్కడ హాయిగా కింద కూర్చుని బీడీ తాగుతున్న ఒకరిని అడిగాడు. అతను పైకి చూశాడు.
‘ లోయకా సార్?’
‘ అవును. ఇంకెక్కడికి వెళ్లగలను?’
‘ ఒత్తది లేండి. దారిలో సరుకు పడాల మరి ‘
‘ ఏమి సరుకు?’
‘లోయ దాక ఎల్లాల గదండి మరి. పడాలి లెండి ‘
‘ ఏంటి బస్సే?’
‘ చ చా కాదండీ. ఆ డ్రైవరు మనూరే. లారీల యాపారం ఉండేది ఆడికి. ఓ బాగ బతికేశాడండీ. మనోడే.’
‘ ఇంతకీ ఏంటి నింపుకుంటాడు? ‘
అతను నవ్వాడు. ‘ ఏటి సార్ మీరు మరీనూ! సరుకంటే తెల్దా? మడిసికి మసాలా ఉండాలి గదండీ.’
‘ నింపుకోమనూ. మరి దానికి ఆలస్యం ఎందుకు?’
‘ మంచోరే! పనికొచ్చేదీ తొందరగా రెడీ గాదు లెండి. కొద్దిగా నానుడు ఉంటేనే గదండీ ఏదైనా దొరికేదీ? మన పక్కూరే లెండి. ఈ పాటికి ఇచ్చేసి ఉంటాడు.’
‘ నువ్వేమి చేస్తూ ఉంతావు?’
‘ మనకి ఓ పనేటండీ? పాత సామాను కొంటానండీ.’
‘ ఎక్కడికెళుతున్నావు?’
‘ఆ లోయకేనండీ ‘
‘ పాత సామాను లోయలో పడేస్తావా?’
‘ మంచోరే! అదుగో ఒచ్చేసాడండీ. ఓ…ఆ టర్నింగు సూడండి. ఉషారంటే ఉషారండి. రండి. కూకుందాం. బండి మందే!’
ఇద్దరూ లోపలికి వెళ్లారు గాలి చల్లగా వీస్తోంది. డ్రైవరి టి కోసం దిగలేదు. అయినా సరుకు పడిపోయిందిగా. పది నిముషాలలో బయలు దేరింది.
‘ లోయకెందుకండీ?’
‘ బాగా కిందకి వెళ్లి కాసేపు పడుకుంటాను! ‘
‘ సా! ఓ మాటనుకుందామండీ! అంత కిందకెళితే పండుకోనక్కరలేదండీ. ఎల్లే లోపలే మన స్టోరీ మూస్కుంటుందండీ!’

‘ కాకపోతే లోయకెందుకెళతానయ్యా? చూడటానికే కదా?’
‘ ఏమో లెండి. దొరబాబులకు ఏమి పని ఉంటుందో ఏమో! ‘
‘ నువ్వెందుకెళుతున్నావు?’
‘లోయకు ఇంకా దాటి పోటెనండీ, ఓ సిన్న గుడండీ. ఓ సాములోరుంటారండీ. నన్ను రమ్మన్నారండీ.’
‘ ఎందుకు? నిన్ను చేర్చుకుంటాడా?’
‘ సా లేదండీ.’
‘ ఆయన దగ్గర సామానుందా?’
‘ సా కాదండీ. కిందటి సారి ఎల్లానండీ. నన్ను సూసి ఎందుకో వచ్చే మాసం కనపడమన్నాడండీ.’
‘ అప్పుడెందుకెళ్లావు?’
‘ మీరు పేపరోల్లా? కొంప దీసి? ఓ అడుగుతూనే ఉన్నారు?’
‘ కాదులే. చెప్పు ‘
‘ అలాక్కాదండి. మనసులో ఎట్టుకోండీ, నా సెయ్యి సూసిన్ అపెతి ఓడూ మూడు పెల్లిల్లన్నాడండి.’
‘ ఖర్మ ‘
‘ సా కాదండీ. మూడో పెల్లి ఊరి ప్రెసిడెంటునయ్యాక సేసుకుంటానని మూడో ఓడు నా కాలు నలిపి మరీ సెప్పాడండి.’
‘ చెబితే చెప్పాడు. కాలు నలపటం ఎందుకు?’
‘ మంచోరే. కాలు నలపకుండా ఎలాగండీ? మా దగ్గర అది పధ్ధతి. ఏమైనా అడిగితే మన కాలు మీద కాలు ఏట్టేస్తరండీ ముందర ‘
‘ ఛా! ‘
‘ అద్దీ. ఆ తరాత ఒక్కొక్క పస్నకీ ఇపరీతంగా నలిపి జవాబు సెపుతారు.’
‘ కాలు సంగతి ఏమిటి?’
‘ ఎక్కువ అడిగినోడికి కాలు మూస్కుంటుందండీ మరి. ఆడు ఆచారి దగ్గరికెల్లి మందు పూసుకుంటాడు.’
‘ అదీ! ఆచారికీ, ఈనకీ అగ్రిమెంటు మరి ‘
‘ అలాక్కాదండి. నేనూ మగాడినేనండి.’
‘ ఛా!’
‘ సా అవునండి! నేను మీ లాగే తెగ పస్నలడుగుతానండి.’
శరత్ వంగి అతని కాలు వైపు చూశాడు.
‘ కాలు బానే ఉందండి. మీరు మరీనూ! ఇలా ఎందుకు నలిపేత్తావయ్యా అని అడిగేసానండి.’
‘ ఏవన్నాడు?’
‘ సుస్టిలో ఒకటుంటే ఒకటి ఉండదన్నాడండి.’
‘ అంటే?’
‘ సుస్టండి. అంటే తెలవదా? ఇదిగో ఈ సుట్టూతా ఉన్నది సూడండి, ఇదే సార్, సుస్టి అంటే!’
‘ ఛా!. సృస్టి. బాగుంది. అంటే చెయ్యి ఉంటే కాలు ఉండగూడదా?’
‘ అలాక్కాదండి. మీది మరీ ఎటకారమండీ. సెయ్యి సూడాలా అంటే కాలు ఎంబడి అదేదో సెయ్యి దాకా పాకాలటండీ.’
‘ సర్లే వాడి గోల నాకెందుకు. ఇంతకీ ప్రెసిడెంటువవుతావన్నాడు ‘
‘ అలాగండి. అయితే ఆ పని అవ్వాలంటే ఒకటి ఊడాలన్నాడండి!’
‘ ఏంటది? కాలా?’
‘ సా కాదండీ! నా ఉద్దోగం ఊడి రెండో పెల్లి అయ్యాక ఇక ప్రెసిడెంటేనండీ!’
‘ నువ్వు ఉద్యోగం వదిలేశావా?’
‘ లేదండి. నన్ను తీసేసారండి.’
‘ ఛా! ఎందుకు?’
‘ ఆపీసులో పాత సామాను అమ్మేసానండీ!’
‘ ఓ! కొత్తవి వదిలేశావు!’
‘ ఎంత మాటండీ.ఆపీసు బాగు పడుతుందని అట్ట సేసానండీ. ఆపీసు నిండా సెత్తే! ‘
‘ మంచి పనేగా?’
‘ లేదండీ. నేనే సెత్త పని సేసానని పొమ్మన్నారండీ ‘
‘ ఇంతకీ ప్రెసిడెంటు అయిపోతావన్నమాట ‘
‘ ఆ సాములోరు సెప్పాలండీ. అంతమంది ఉన్నా నన్నే ఎందుకు రమ్మన్నాడో తెల్దు సార్. అందుకే ఎలుతున్నాను మరి ‘
ఊరు అవతల ఆ చెరువు దాటిన తరువాత చెట్ల చాటున ఆడుకుంటున్న సూర్యకాంతి రమణీయంగా ఉంది. అక్కడ పనులు చేసుకునే వాళ్లు ఒక వరుసలో దూరంగా ఒక గట్టు దిగి వెళ్లిపోతుంటే అందరూ ఎటో మాయమైపోతున్నట్లున్నారు. ఆకాశం అంచున పర్వత శ్రేణి ప్రకృతికాంతకు పెద్ద పీట వేసింది.
‘ అవును నీ పేరేమిటి…’
‘ సత్తిబాబు సార్. సెత్త కొని అమ్మేత్తాను. ‘
‘ సత్తిబాబూ, లోయ వెళ్లటానికి ఎంత టైం పడుతుంది?’
‘ మూడు గంటలు. మద్దెలో ఆపుతాడు మనోడు. కాపీ టీలు తాగి మల్లీ ఎల్లిపోతాం.’
‘ నువ్వు ప్రెసిడెంటువవుతావు సత్తిబాబూ!’
అతని మొహం వెలిగిపోయింది.
‘ ఎలా సెప్పేసారండీ?’
‘ నీ దగ్గర చాలా సమాచారం ఉంది. చూస్తున్నాను కదా?’
అతను తల వంచుకుని కాలుతోనే కాలు గోక్కున్నాడు.
‘ అదెందుకు?’
‘ ఇలా ఎవవరైనా అన్నప్పుడు కాలు నొప్పి గుర్తుకొచ్చి అలా గోకేస్తానండీ. అది నిజమవ్వాలని సెంటిమెంటు సార్!’
శరత్ కెమెరా సద్దుకుని పనిలోకి దిగిపోయాడు. అతను కళ్లు విప్పార్చి చూస్తున్నాడు. ‘ అనుకున్నాను సార్ ‘
‘ ఏమిటి?’
‘ మీరు ఇలాటిదేదో సేత్తారని!’
‘ ప్రెసిడెంటు అయ్యాక నన్ను పనిలో పెట్టుకుంటావా?’
‘ సత్. ఓ మాటనుకందామండీ.’
‘ ఏమిటది?’
‘ అయితే గంక పేపరోల్లకి ఏదైనా సెప్పాలంటే మీరే ఉండాల …అవునూ, మీరు ఈ ఊల్లో ఏమి సేత్తారు సార్?’

కెమెరా పక్కన పెట్టాడు శరత్. ‘ మేము ఒక ఫేక్టరీ పెడుతున్నాం…’
‘ సా అద్దా సంగతీ! ఆ ఇంద్రబొవనం లాంటి ఇల్లు మీదేనా? గుట్ట మీద? ఎక్కడా సూసా అనుకున్నా లెండి. పేక్టరియా? మీదేనండీ?’
‘ మా నాన్నదిలే! ఇంకా చాలా టైం ఉంది.’
‘ లోయ సూడ్డానికి ఎల్తున్నారా? బాగుంటుందిలెండి ‘
‘ లోయలో ఇంకా ఏముంటుంది?’
‘ జారత్తగా ఎల్లగలిగితే జలపాతం తగుల్తుంది సార్! నాలుగు గుహలున్నాయి. ఒకటి సాలా కస్టం. ఒకటి ఎల్లగూడదు.’
‘ ఎందుకు?’
‘ ఎందుకేటి? అంతే! బాబో…ఎల్తారా?’
‘ ప్రెసిదెంటువి భయపడతావా?’
‘ బయ్యం కాదు సార్! ఎందుకు?’
‘ వదిలేయి. తరువాత చూద్దాం. జలపాతం బాగుంటుందా?”
‘ ఓ నీరు ఎక్కడి నుంచి ఒత్తుందో తెల్దు గానీ గమ్మత్తుగుంటుంది…’
‘ జారి పడుతున్న నీటిలోకి జాగ్రత్తగా చూశావా?’
‘ నాకు తెల్దండి. ఏముంటుంది సార్?’
‘ రాతి శిల్పానికి మెరుపు చీరె సింగారించినట్లు ఉంటుంది.’
‘…’
‘ ఆ పరవశంలో నీరు కూడా కొద్ది సేపు ఒక శిల్పంలా మారాలని అనుకుంటున్నట్లు ఉంటుంది. కానీ ఎందుకో కుదరదు. పాపం ప్రతి అందమైన వస్తువుకు ఒక పారిపోయే గుణం, ఒక జారిపోయే గుణం…కదలిపోయే తత్వం. నీతిలోకి వెళ్లావా సత్తిబాబూ?’
‘ లేదండి. మీ మాటలు ఇంటుంటే ఎంత బయ్యంగా ఉందో ఆ నీటిలోకి ఎల్లాలంటే అంతే బయ్యం!’
‘ ఈత రాదా?’
‘ వచ్చు ‘
‘ మరి?’
‘ జలపాతం అట్టుందదండీ! రాల్ల మీద జారిపోతే మడిసికి ఈత ఒచ్చి ఏమిటి ఉపోగం?’
‘ అదే తమాషా! ఈత రాకుండానే జారిపోవాలి ఎక్కడికో! అందాన్ని వెతకద్దు. అది మన మీదుగా జలపాతంలా జాలువారాలి…ఒక ఆలోచన ఉప్పెనలా ఎగిసి పడాలి, ఒక క్షణంలో ఒక అనంతం దిగిపోవాలి. అనంతకాలగమనంలో అటువంటి ఒక ఖణం కోసం చూడాలి. ఈ కెమెరా ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి…’
‘…’
‘ ఏమీ మాట్లాడవు సత్తిబాబూ?’
‘ తెలీని దాని గురించి మాట్టాడను సార్!’
‘ ఆకాశాన్ని చూస్తున్నావా?’
‘ ఆ…’
ఇద్దరూ కిటికీ వైపుకు చూస్తున్నారు.
‘ ఆకాశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. జీవితకాలం వృధా అయిపోతుంది. అలా ఆనందించి చూడు. మరో జీవితకాలం నీ ముందుంటుంది…’
‘ అద్దం కాలేదు!’
శరత్ నవ్వాడు. ‘ కొద్ది సేపట్లో జలపాతం దగ్గరకు వెళతాము కదా?’
‘ ఆ…’
‘ జలపాతం పక్కగా నిలబడి అలా చూద్దాం.’
‘అప్పుడప్పుడు అమ్మాయిలు స్నానాలు…’
‘  వార్ని! ‘
‘ కాదండీ. ఆల్లు అవతల పక్క దూరంగా ఉంటారండీ. మనకి ఈ జలపాతం అడ్డొత్తుంది…’
‘ జలపాతం మనకి అడ్డు కాదు సత్తిబాబూ…’
‘ అంటే మీ కెమెరాలో…’
‘ కాదు. ఆ ఆలోచన మానేయి! అందులో ఏమీ లేదు! జలపాతంలోకి జాగ్రతాగా చూడు. నీరు ఎందరో అందమైన వనితలలాగా ముస్తాబయి అలా మారిపోయి మాయమైపోతూ ఉంటుంది. నువ్వు తొంగి చూడాల్సింది అక్కడ! అందానికి అందం కలుపు. ఆలోచనని నుదుటి బొట్టులాగా అలంకరించు. కల్పనను చీరెలా సింగారించు. నీలో మరో ప్రపంచం నిన్ను మరో సృష్టి వైపు నడిపిస్తుంది…’
~~~***~~~

21

ఒక మలుపు తిరిగ గానే దూరంగా చాలా చిన్న ఆకారంలో మా ముందు వెళ్లిపోతున్న మరో బస్సు కనిపించింది. దానితో నాకు పని లేదన్నట్లు ఈ బస్సు పక్క త్రోవ పట్టి ఒక చిన్న కాఫీ హోటల్ ముందు ఆగింది. అందరూ హమ్మయ్యా అనుకుని దిగారు. అక్కడ మరో రెండు బస్సులు నిలబడి ఉన్నాయి.సత్తి బాబు ఎటో వెళ్లిపోయాడు. శరత్ ఒక బల్ల మీద కూర్చుని టీ కోసం నిరీక్షిస్తున్నాడు.అతని పక్కగా కుర్తాలో ఉన్న ఒక వ్యక్తి బడ్డీ కొట్టు వరకూ వెళ్లి ఒక సిగరెట్ ముట్టించి అతనినే ఎందుకో చూస్తున్నాడు. టీ వచ్చింది.మెల్లగా టీ తాగుతూ అటు చూశాడు శరత్. అతనూ ఎక్కడో చూసినట్లుంది అనుకున్నట్లు చూస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు.
‘ ఎందుకలా చూస్తున్నారు? ఎక్కడైనా కల్సుకునామా?’, అడిగాడు శరత్.
అతను నవ్వాడు. ‘ మంచి వారిలా కనిపిస్తున్నారు…’
శరత్ గ్లాసు టేబిల్ మీద పెట్టాడు. ఏదో అనబోయే ముందర అతనే అన్నాడు, ‘ కానరాడు మంచివాడు కనీసం మంచివాడి వేషంలో…’
‘ బాగుంది ‘
‘ కానరాడు మంచివాడు కనీసం మంచివాడి వేషంలో, కనిపించదు కరుణ ఋణమాత్రపు రూపంలో ‘
‘ ఓహో! అప్పుగానైనా కరుణ దొరకదు, కరెక్ట్!’
‘ కానరాడు మంచివాడు కనీసం మంచి వాడి వేషంలో, కనిపించదు కరుణ ఋణమాత్రపు రూపంలో…వాన రాదు, రానే రాదు కనీసం వర్షాకాలంలో! ‘
‘ వాహ్! నిజం చెప్పారు సార్….’
‘ వాన రాదు రానే రాదు కనీసం వర్షా కాలంలో, వినిపించదు మంచి మాట కనీసం ఒక పిచ్చివాడి నోటిలో!’

చప్పట్లు కొట్టాడు శరత్. అతను చేయి శాయర్ పధ్ధతిలో పెట్టి బదులిచ్చాడు.
‘ ఆదుర్దా…’, అన్నాడు.
‘ ఎందుకు?’
‘ మంచోరే!నా పేరది.ఆచార్య ఆదుర్దా!’
అంటూనే బల్ల మీద పక్కన కూర్చుని టీ కుర్రాడికి ఒకటి అన్నట్లు సైగ చేశాడు.
‘ టైటిలా అది నిజంగా మీ పేరా?’
‘ మంచోరే! టైటిలంటే టైటాన్ లాంటి టైటిళ్లున్నాయి మనకి.ఒకటే చెబుతాను. నవకవిటా విదూషక! ‘
‘ ఇది చాలు!’
‘ బా మాట్లాడతారు! లోయకా? ‘
‘ అవును. శరత్ నా పేరు. టైటిల్ ఏదీ పెట్టుకోలేదు! ‘
‘ మంచోరే! నేను పెట్టుకున్నది కాదు. మనకి ఒకళ్లు పెట్టినదేలెండి! ఏం చేస్తుంటారు? ‘
‘ ఆకాశం లోకి చూస్తూ ఉంటాను. దట్స్ ఆల్.’
టీ పుచ్చుకున్నాడు ఆదుర్దా.’ చాలు సార్ అది చాలు! ఇక్కడేమీ మిగలలేదు మనకి ఈ భూమి మీద.’
‘ ఎందుకు సార్ అలా అంటారు? ‘
‘ నాటకాలు ఎవడిక్కావాలి సార్? పిచ్చివాడిలాగా ఈ కళను కడుపుతో పట్టుకుని ఇంతకాలం బ్రతికేశాననుకున్నాను!’
‘ ఆటకాలు మరల పుంజుకుంటున్నాయి సార్! ‘
‘ అలా అనుకునే కడుపులో పెట్టుకున్నాను. పాతికేళ్లు …’
బస్సులు హార్నులు మ్రోగిస్తున్నాయి. ఇద్దరూ లేచారు.మరో బస్సు వైపు నడిచాడు ఆదుర్దా.
శరత్ చేయి ఊపాడు.’ లోయలో కలుద్దాం.’
‘ మంచోరే! గోతిలో దింపుతారన్నమాట!’
‘ హ కాదు లెండి.ఉంటాను…’
బస్సు బయలు దేరింది. సత్తి బాబు తేగలు పట్టుకుని కూర్చున్నాడు.

కెమెరా తన పని చేసుకుంటోంది.
‘ ఈ మబ్బులు నన్ను వదలవు ‘
సత్తిబాబు ఇటు తిరిగాడు.
‘ ఇంతగా మాట్లాడుతారు సార్ ‘
‘ ఎంతలా?’
‘ కాదు సార్. సిత్రంగా మాట్లాడుతారు!’
‘ మూడు మబ్బులు నిచ్చెనలా ఉన్నాయి. మూడూ ఇలా ఆ సెలయేరు లోకి దిగుతానంటున్నాయి.’
‘ అలా ఎలా అంటాయి సార్…’
‘ నాకు వినిపిస్తోంది మరి.’
‘ కదలిపోతున్నాయి సార్…’
‘ అవి మబ్బులు. కదలి పోక? ‘

ఎందుకో ఆ సెలయేరు చివర చిన్నగా జరుగుతున్న మబ్బులను చూస్తే వాసంతు గుర్తుకొచ్చింది. అసలు వాసంతిని కూడా తీసుకువచ్చి యుంటే ఈ సత్తిబాబు చోట్లో కూర్చుని ఉండేది. ఆశ! ఊహలలో కంజూసీ ఎందుకు? అయినా రమ్మనగానే వచ్చేయాలని ఎక్కడా వ్రాసిలేదు కదా?
బస్సు మబ్బులను వదిలిపెట్టింది. ముందుకు మరో మలుపు తిరిగింది. ప్రొద్దు తిరిగుడు పూలు అలా సూర్యుని వైపు తిరిగి ఉన్నాయి. మునులందరూ సూర్యుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నట్లు ఉంది. అకశంలో ఈ సారి చిన్న చిన్న మబ్బులు చూస్తున్నాయి. కిందకి దూకేందుకు సిధ్ధంగా ఉన్నట్లున్నాయి. ఇంత మంది విడ్వామిత్రులకు ఇందరు మేనకలేమో!
లోయ రానే వచ్చింది. కాకఓతే అక్కడి నుంచి మరల ఓ నాలుగు ఇలోమీటర్లు నడవాలి. మెల్లగా నడుస్తూ చుట్టూతా చూశాడు శరత్.
‘ పదండి మిస్టర్ ఆకాశం…’ వెనుక నుండి గొంతు వినిపించింది.
వెనుక ఆదుర్దా ఉన్నాడు. ‘ సార్, ఇక్కడో ఫొటోనో లేక లైవ్ గానో నన్ను కొట్టకూడదు?’
శరత్ ఆగాడు. నిజమే. నాటకం మనిషిది మంచి టేస్టే!
కెమెరా పట్టుకుని ఫోకస్ చేశాడు. వెనుక చేట్లు కురళ్ల గుంపు పి.టీ చేస్తున్నట్లుంది.
‘ బాగుంది సార్. కాకపోతే ఏదైనా డయిలాగ్ లాంటిది చెప్పండి. నాకు గుర్తుండి పోతారు ‘, అన్నాడు శరత్. అతను మఫ్లర్ సద్దాడు. గొంతు సద్దుకున్నాడు.
‘ జీవితానికి చాలా దగ్గరగా రాసుకుని, జీవించేందుకు నాలుగు మాటలు వ్రాసుకుని, తెర వెనుక ఆవుపాలవంటి భావాలను మరిగించి, కృషించి, అర నిముషంలో కనుమరుగైపోయే కళాకారులం. ఏ నాడో జరిగిపోయిన కాలం లోని చప్పట్లను దుప్పట్ల లాగా కప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏ లోకంలోనో నిదురించే పసి వాళ్లం. ఇలా ఈ ప్రకృతి ముందర నిలబడటం, ఒక కళాపోషకుని కెమెరాలో బందీ అవటం కళామతల్లి ఒడిలో వాలి అపారమైన ఆనందానుభూతిని ఇస్తున్నట్లుంది…’
శరత్ ఆ వ్యక్తి కళ్లలో మరో ప్రపంచాన్ని చూస్తున్నాడు…
~~~***~~~

22

లోయ కొద్ది దూరంలోనే ఉంది.ఆదుర్దా, సత్తిబాబూ, శరత్ కలసి ముందుకు దూకుతున్నారు. శరత్ ఆగిపోయాడు.
‘ ఈ కిందకి ఒక దారి పోతోంది…’
‘ అది ఓ సిన్నూరు సారూ. మనం ఇటెల్లాల ‘, అన్నాడు సత్తిబాబు.
‘ అక్కడినుండి లోయకు మరో దారుందా? ‘
‘ ఉంది. కానీ దూరం. ఎందుకు సారూ? ‘
‘ నేను అలా వస్తాను. మిమ్మల్ని లోయలో కలుసుకుంటాను…’, అంటూనే శరత్ దిగిపోయాడు. ఇద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుని ముందుకు వెళ్లిపోయారు. కెమెరా పట్టుకుని మెల్లగా శరత్ కిందికి దిగాడు…

~~~***~~~

మర్రి ఊడల కింద గుబురుగా ఉన్న స్థలంలో ఒక మేకపిల్ల ఆడుకుంటోంది. కుడి వైపు ఒక గోతం పరుచుకుని గొర్రెల కాపరి నిదురిస్తున్నాడు. కెమెరా ముందుకు దూకుతోంది.
పెరిగిన సరగుడు చెట్ల మధ్యలోంచి ఏదో తోటలా ఉంటే అందులోకి వెళ్లిపోయాడు శరత్. కాలి బాటలా ఉన్న చోట ఒక ఎండుటాకు పడిపోయి అటూ ఇటూ కదులుతోంది. ఎలా వచ్చిందో కొద్దిగానే ఉన్న సూర్యరశ్మి దాని మీద గుండ్రంగా ఎవరో గీసినట్లు ఉంది. నేను ధన్యురాలను అన్నట్లు ఆ ఆకు పరవశంలో కదులుతున్నట్లుంది…
పాము పుట్ట ఒకటి చాలా పెద్దగా ఉంది. దాని చుట్టూతా ఎవరో దీపాలు పెట్టి వదిలేసినట్లున్నారు.పుట్ట వెనుక ఎన్నో నాగబంధాలు శిలలలో కనిపిస్తున్నాయి. వాటి వెనుక పొలాలు అందంగా ఉన్నాయి. దూరంగా ఉంటే దండం పెడతారు, దగ్గరకి వస్తే చంపేస్తారు అని కాబోలు అటూ ఇటూ కాకుండా పుట్టల్లో దాక్కున్నాయి ఈ పాములు!
పొలాల పైన నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి. కిరణాలు చాటు నుండి చేతులు చాపుతున్నాయి. ఏది అడ్డం వచ్చినా నేను ఇచ్చేవాడినే కానీ పుచ్చుకునే వాడిని కానన్నట్లు అవి కిందికే దూరంగా భూమిని తాకుతున్నట్లున్నాయి!

పొలాల వెనుక ఒక గుట్ట మీద చాలా పాతగా కనిపిస్తున్న ఒక చిన్న గుడి ఉన్నట్లుంది. అటు కదిలాడు శరత్.
మెట్లు కూడా ఉన్నాయి. గుట్ట బలే ఉంది. పై నుంచి జాగ్రత్తగా చూస్తే ఆ చిన్న పల్లె దాదాపు పదిహేను పాకలతో కనిపిస్తోంది.
గుట్ట మీద ఎవరూ లేరు. గుడిలోనూ ఎవరూ లేరు!’ దిద్గిపోండి…’, ఎవరో వెనుకనుండి అంటున్నారు.
‘ ఎందుకు? ‘
అడుక్కునే వాడిలా ఉన్నాడు.
‘ దిద్గిపోండి ‘
‘ దిగను ‘
‘ సచ్చిపోతావు ‘
‘ పర్లేదు ‘
‘ పిచ్చి గానీ ఉందేటి? ‘
‘ లేదు. రావాలి ‘
‘ ఏటి? ‘
‘ పిచ్చి ‘
‘ ఎందుకు? ‘
ఫొటో తీశాడు శరత్. అతను కర్ర గట్టిగా పట్టుకున్నాడు.
‘ ఫొటో పంపిస్తానులే! నీ చోటుకు ఏమీ కాదు. వెళ్లిపోతాను. ఏ గుడిది? ‘
‘ సిలంగోరు ‘
‘ అంటే? ‘
‘ సిలంగోరు తెల్దా? పెద్దాయన! ఎల్లిపో! ‘
నవ్వుకుని సిలంగోరు అనుకుని నమస్కారం పెట్టి కిందికి వచ్చేశాడు శరత్.

~~~***~~~

వాన మొదలయింది. మట్టి సువాసన మనిషి పుట్టిల్లును గుర్తు చేసింది. కెమెరాను సంచీలో భద్ర పరచాడు శరత్. గుబురుగా ఉన్న తోటలోకి మరల దూరాడు. చిన పిల్లవాడిలా కావాలని తడుస్తున్నాడు. ఆ ఎండుటాకు కోసం వెతికాడు. అది అక్కడే ఉంది. మీద మట్టి పోసుకుని మరీ కసిగా తడుస్తోంది. దాని దగ్గర కూర్చుని చెట్ల మధ్యనుంచి తెల్లగా కమ్ముకుని పోయిన దృశ్యాన్ని చూస్తున్నాడు.సిలంగోరి గుడి ఆ వానలో అసలు కనిపించటం లేదు. వాన కొద్దిగా తగ్గింది. దూరంగా ఒక ఇంద్రధనుస్సు  నిలబడింది. దాని కిందకి వెళ్లి దానిని గొడుగుగా చేసుకుని ఈ వాననీ, ఈ ప్రకృతినీ చూసి ఆ అందని గొడుగుని తనలోకి మూసేసుకుంటే ఎంత బాగుండు…అన్ని రంగులూ నింపుకున్న తెల్ల కాగితానికి రంగుల అంచులెందుకు? అనంతమైన ఆలోచనలకు అంతరంగాలెందుకు?
ఎందుకో వాసంతి గుర్తుకొచ్చింది…
ఎండుటాకును తీసి గబుక్కున సంచీలో వేసుకున్నాడు. అవునూ…ఎందుకు వాసంతి గుర్తుకొచ్చింది?
జాగ్రత్తగా నాలుగడుగులు వేసి తోటలోంచి ఇవతలకి వచ్చాడు.
ఎందుకు గుర్తుకొచ్చిందీ?…ఏమో!

~~~***~~~

23

లోయ దగ్గరకి వెళ్లేసరికి శరత్ బాగా అలసిపోయాడు. విశ్రాంతి కోసం గదులు వెతికి చివరికి ఒక గెస్ట్ హవుస్ మేడ మీద ఒక గది సంపాదించి భోజనం చేసి సాయంత్రం చీకటి పడే వేలకి పిట్ట గోడ మీద కాలు పెట్టి అలవాటైన ఆకాశం లోకి చూస్తూ కూర్చున్నాడు. ఆ గెస్ట్ హవుస్ ఎవరో చక్కని ప్రదేశంలోనే కట్టారు. దూరంగా ఒక నది పాయ అలా ప్రవహిస్తోంది. చంద్రుని కాంతి అందులో చిత్రంగా ప్రతిబింబిస్తున్నది. వాన బాగా కురిసి వెలిసింది. ‘సార్…’, ఎవరో వెనుకనుండి అంటున్నారు.
‘ ఏమి కావాలి? ‘
‘ ఏమి లేదు సార్…’
అటు తిరగలేదు శరత్. ‘ నాకిప్పుడు తినేందుకేమీ అక్కరలేదు. రాత్రి చూద్దాం…’
‘ అది కాదు సార్…’
విసుగ్గా అటు తిరిగాడు. అక్కడ ఉన్నది ‘ ఆదుర్దా ‘. సంచీ తగిలించుకుని ఉన్నాడు. ఇద్దరూ ఒకే సారి అన్నారు, ‘అరే! ‘
‘ సార్, మీరు ఇంటికి వెళ్లిపోయారనుకున్నాను. ఇక్కడే ఉన్నారా?’
‘ లేదు ఆదుర్దా గారూ, అలసిపోయానని ఉండిపోయాను. మీరేంటి?’
అతను పిట్ట గోడ మీద చిన్నగా ఆనుకున్నాడు.
‘ నేను వానలో తడిసిపోయాను సార్. నేనూ వెళ్లలేకపోయాను. ఇక్కడ కొద్దిగా ఈ రాత్రికి తల దాచుకుందామని కింద అడిగాను. పొమ్మన్నారు. ఆ వాచ్మన్ ఎవరో ఇలా పైన ఒక సారు దిగారు, అడిగి చూడమంటే ఇక్కడికి వచ్చాను. నేను గదిలోకి రాను లెండి. ఇలా ఈ డాబా మీద పడుకుంటాను. ‘
శరత్ సిగరెట్ తీశాడు. ముట్టించి అతనికీ ఒకటి అందించాడు.
‘ ఆదుర్దా గారూ, నన్ను అవమానించకండి. ప్రకృతి ఒడిలోకి కవల పిల్లల్లాగా ఊడి పడ్డాం. కాకపోతే మరల ఇలా ఎందుకు కలుసుకుంటాం? పైగా నాకూ తోచదు. మీరూ నాతోనే ఉండండి. ‘
ఆదుర్దా శరత్ ను చూసి చిరునవ్వు నవ్వాడు.
‘ కూర్చోండి. ఏదైనా చెప్పండి. అలా చూడండి. ఏమీ అనిపించటం లేదా?’
ఆదుర్దా అక్కడున్న మరో కుర్చీలో కూర్చున్నాడు.

‘ ఏమిటో శరత్ గారూ, నా ముందు ఎవరైనా ఒక చక్కని విషయం మీద తప్పుగా వ్యాఖ్యానం చేస్తే తీవ్రంగా ఖండించి పోట్లాడేవాడిని. అదేంటో ఆ రోజులు వెళ్లిపోయాయి. ఒకప్పుడు ఆశువుగా ఎన్నో చెప్పే వాడిని. నేను ఓ గొప్ప రచయితని అనే గట్టిగా నమ్మేవాడిని…’
‘ అదేంటి? నమ్మటం ఎందుకు? కారా?’
‘ కాను. ఎవడైనా ముందు మనిషి. తరువాత రచయితో లేక కవో లేక పండితుడో…’
‘ మీరు ఎందుకో బాధలో ఉన్నట్లున్నారు ‘
‘ ఈ శరీరం ఉంది చూశారూ, ఇది మహా మోసం. దీని పోషణకే ముప్పావు జీవితం గడిచిపోతుంది. సమాజాన్ని నేను ప్రశ్నించాలన్నా ఈ సమాజం నాకు తిండి పెట్టాలి! ‘
‘ కరెక్ట్!’
‘ కంటిలో నలుసు పడ్డప్పుడు ఎదురుగా ఏడుకొండలవాదు వచ్చి నిలబడ్డా ఏమీ చేయలేము. ఆ నలుసును ఊదేసి అదుగో కళ్లు తెరు అనే వాడే దేవుడు! ‘
‘ నలుసు? ‘
‘ నలుసా…అదీ అది ఏమిటి?’
‘ అది సృష్టిలోని భాగం కాదా?’
‘ నిజమే. ఇది చిత్రంగా ఉంది. ఆలొచించాలి. ‘
‘ మీ నలుసు ఇంతకీ ఏమిటి? ‘
‘ వదిలేయండి. తరువాత మాట్లాడుకుందాం. ఆ నీటిలో చక్కని ప్రతిబింబం కనిపిస్తోంది. అయితే మీరన్నట్లు మబ్బు ఒకటి అడ్డు వస్తే ఆ కాంతి మరింత విరజిమ్మి మరో దృశ్యం కనిపిస్తోంది…’
‘ ఇందులో నేనేమన్నాను?’
‘ నలుసు. ఏదో అడ్డం రావాలి. నిజమే. అదే జీవితం! ‘
‘ అబ్బో! క్షణంలో ఎక్కడికో వెళ్లిపోయారు. ‘
అతను అలా ఎందుకో చూస్తూ ఉండిపోయాడు.
‘ చెప్పండి ‘
‘ ఆకాశానికి ఈ నది ఎంత చక్కగా అద్దం పడుతోంది? ‘
‘ అంత ఆకాశానికా?’
‘ కాదు. నేను నది గురించి చెప్పటం లేదు. మన మనస్సుల గురించి అంటున్నాను. ఈ చిన్న చోటులో ఎన్ని భావాలు?’
శరత్ ఆలోచించాడు. ఆలోచన బాగుంది.
‘ ఇంటిలో అద్దం ముందు చాలా సేపు నిలబడతారన్న మాట!’
అతను నవ్వాడు. ఎందుకో నవ్వుతూ నవ్వుతూ ఆగిపోయాడు. సిగరెట్ పడేశాడు.
‘ అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనని తప్ప మరొకటి చూడలేనివాడు కవి…’, మెల్లగా అన్నాడు, ‘…అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనను తప్ప మరొకటి చూడలేని వాడు కవి. అద్దం ముందు నిలబడే వయసు లేదు, అబధ్ధాన్ని నిలదీసే మనసూ లేదు. ఆలోచనలు పెరగటం వలన వయసు వచ్చేస్తుందో లేక వయసు మీద ఆలోచనలు మీద పడతాయో తెలియదు…నాకూ వయసు వచ్చేసింది శరత్ గారూ! ‘
దూరంగా ఎవరో నిప్పు వెలిగించినట్లున్నారు. అలా పొగ ఆ గుబుర్లలోంచి పైకి వస్తోంది. గాలి చల్లగా వీస్తోంది…

~~~***~~~

24

బాగా నిద్ర పట్టిన తరువాత ఎందుకో శరత్ కు మెలకువ వచ్చింది. బయట ఏదో నలుగురు మాట్లాడుకుంటున్న చప్పుడు. గదిలో లైటు వేశాడు. కొద్దిలో కాలు తగిలేది…ఎందుకో ఎంత చెప్పినా వినకుండా ఆదుర్దా అని తనని తాని పిలుచుకుంటున్న ఈ మనిషి కిందనే పడుకున్నాడు. బాగా చితికిపోయిన వ్యక్తి లాగా ఉన్నాడు. తలుపు తెరచి బయటకు వచ్చాడు శరత్. బయట ఎవరో నలుగురు కుర్రాళ్లు పిట్ట గోడ మీద ఆనుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శరత్ ను చూసి ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు.
‘సార్…’, ఒకడు ముందుకు వచ్చాడు..’ ఎక్కడా పడుకునేందుకు చోటు దొరకలేదు. ఇలా పడుకుంటా
ము. ఏమీ అనుకోకండీ…’
‘లోయకు పిక్ నిక్కా?’
‘ అవును సార్ ‘
‘ చదువుకుంటున్నారా?’
‘…’
‘అదేంటీ? అలా నిలబడిపోయారే?’
‘ చదువులు అయిపోయాయనుకుంటున్నాము సార్. బేవార్సుగా ఉన్నాము. అదీ సంగతి!’
‘ ఓహో! ఉద్యోగం వేటలో ఉన్నారా?’
‘ ఉంటే వేటాడతాం సార్. ‘
‘ ప్రస్తుతానికి పడుకోండి…గుడ్ నైట్! ‘
‘ థేంక్ యు సార్.గుడ్ నైట్!’
శరత్ లోపలికి వెళ్లిపోయాడు. తలుపు బయట నుంచి వినిపిస్తోంది…’ ఒక్కడే ఉన్నాడంటావా? ‘
‘ ఇక్కడికి ఒక్కడే ఎందుకు వస్తారబ్బా, ఒకరో…ఇద్దరో …తెచ్చుకోకుందా ఎందుకొస్తారు?’
‘ లేదు రా. నాకు అనిపించలేదు.’
‘ అంతే అంటావా?’
‘ అంతే! పడుకోరా…’
‘ ఊ…కడుపు కాళేశ్వర రావు మార్కెట్టూ, ఒళ్లు ఒంగోలు చింతపoడు అయిపోయాయిరా నాన్నా! ఇంక ఒకటే నిద్ర!’
‘ అవునొరే, నువ్వు ఎప్పుడైనా ఒక మనిషిని భుజం మీద మోశావురా?’
‘ లేదు. ‘
‘ ఇప్పుడు మొయ్యాలి. రేపు ఉదయం లేచిన దగ్గర నుండీ నీ డ్యూటీ అదే! ‘
‘ ఎవరిని మొయ్యాలి?’
‘ ఇంకెవరు? నన్నే! ‘
‘ ఈ లోయ ప్రోగ్రాం వేసింది ఎవరు? ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. ‘
‘ ఎందుకు? ‘
‘ ఇంతవరకూ జీవితంలో ఎవరినీ కొట్టలేదు. రేపు ఆడు నా చేతిలో…’
‘ రే…పడుకోండిరా…ఇక్కడినుండి గూడా తరిమేస్తారు…’

~~~***~~~

మరో రెండు గంటలలో తలుపు గట్టిగా చప్పుడయింది. ఈ సారి గాభరాగా ‘ఆదుర్దా ‘ కూడా లేచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. కుర్రాళ్లు కంగారులో ఉన్నారు.
‘ ఏమయింది? ‘
‘ సార్, వీడిని పట్టుకోలేకుండా ఉన్నాము. ‘
ఓ కుర్రాడిని గట్టిగా పట్టుకుని ఉన్నారు.
‘ ఏమంటాడు? ‘
‘ కిందకి దూకుతానంటాడు సార్! ‘
‘ ఎందుకు? ‘
‘ ప్రేమ పిచ్చోడు…’
అతను గింజుకుంటున్న్నాడు. ‘ నన్ను వదలండి ‘
శరత్ దగ్గరగా వెళ్లాడు. ‘ వదలండి. ఏమీ చెయ్యడు. ‘
అతన్ని వదిలారు. అతను ఏడవటం మొదలెట్టాడు.
‘ ఏడుపొద్దు. నీ బాధ చెప్పు…’
‘ …’
‘ ఎందుకు ఏడుపొస్తోంది? ‘
‘ ఏమీ చెప్పలేను సార్. ‘
‘ ఏదో ఒకటి చెప్పు. ఏదైనా…’
‘ తలచుకున్నప్పుడల్లా నిద్ర పట్టదు ‘
‘ దేనిని తలచుకుంటావు? ‘
‘ మా ప్రేమ కథ ముగిసిపోయింది. ‘
‘ మరి నాకెందుకు చెబుతున్నావు? ‘
అతను వింతగా చూశాడు. ‘ అంటే?’
‘ నువ్వే నీ ప్రేమను కథ అంటున్నావు! మరి నిజమేమిటి? ‘
‘ ఆ పొగలా మాయమయింది సార్. నేను ఆ ఆకాశంలోకి వెళ్లిపోతాను. ఈ లోకంతో నాకు పని లేదు. ఆ నక్ల్షత్రాలలో బ్రతికేస్తాను. ఒరే…నన్ను రేపైనా ఆ లోయలోకి తోసెయ్యండి…’
అక్కడ అటు తిరిగి పడుకున్న వాడొకడున్నాడు. అతను అటు తిరిగే ‘ అలాగే ‘ అన్నాడు.
ఇతను ఏడవటం మొదలు పెట్టాడు. ఆదుర్దా సిగరెట్ ముట్టించాడు. దగ్గరగా వెళ్లాడు.
‘ లోయలోకి తోస్తే పైకి వెళ్లిపోతావనుకుంటున్నావా?’
‘ వెళ్లనా?’
‘ నువ్వు లోయదాకా వెళ్లే ముందే పైకి పోతావు. అది వొదిలెయ్యి. నువ్వు ఎవరినీ ప్రేమించినట్లు నాకు అనిపించటం లేదు…’
‘ నాకు ఈ సినిమా కథలొద్దు సార్, అయిపోయింది. నేను…నా వల్ల కాదు…’
‘ సినిమా కథ కాదు నాయనా! నక్షత్రాలలోకి వెళతావా? ‘
‘ అవును సార్. నాకు తెలియదు. నేనైతే వెళతాను. నాకెందుకో గట్టి నమ్మకం ఉంది ‘
‘ ఛా! కాలిపోవా?’
‘ నో! కాలను సార్! ఇక్కడ కాలుతున్నంత ఎక్కడా కాలదు….మీరు ఒకరిని ప్రేమించండి. అర్థమవుతుంది ‘
‘ నువ్వు ప్రేమించలేదు బుల్లోడా…’
అతను సీరియస్ అయ్యాడు. దగ్గరగా వచ్చాడు.
‘ ఎలా చెబుతున్నారు సార్? ‘
‘ ప్రేమించే వాడికి లోకాలతో పని లేదు. స్వర్గ నరకాలు పట్టవు. ప్రేమే ఒక ప్రపంచం! అది అలా స్థూలంగా నిలబడి ఉన్న ప్రపంచం కాదు. ఎప్పటికప్పుడు పొంగి పొరలి మనస్సనే చంద్రునితో ఆడుకుంటూ అంతరాత్మ అనే సూర్యుని చుట్టూ తిరిగిపోయే ప్రపంచం. ఆ బాటలోనే ఆ లోకం ప్రాణం పోసుకుంటుంది, తిరిగి పుడుతుంది…తిరగటం వలన పుడుతంది…పెరుగుతుంది, నిలబడుతుంది, కదులుతుంది. ఆ సంచలనాన్నే ప్రేమ అంటారు బుల్లోడా…నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? నేను ఆ లోకంలో ఉంటాను అందుకే నా ప్రాణానికి ప్రాణం పోసుకుంటాను…నో! నువ్వు మరో లోకం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ప్రేమించలేదు…ప్రస్తుతానికి పడుకో. రేపు మాట్లాడదాం. ‘
సిగరెట్ పారేశాడు ‘ఆదుర్దా. ‘
ఆ కుర్రాడు అతన్ని వింతగా చూశాడు. మిత్రులు కింద పరచిన తువ్వాలు మీద కూర్చుని ఆ కుర్రాడిని కూర్చోపెట్టారు. కొద్ది సేపు అంతా నిశ్శబ్దంగా ఉంది.
కురాడు కొద్దిగా గింజుకుంటున్నాడు.
‘ లేదు…నాకు స్వార్థం తెలియదు. నేను నా సర్వస్వం త్యాగం చేశాను. మోసపోయాను ‘
‘ నిన్నెవరూ మోసం చేయలేదు బిడ్డా! నీ ఆలోచనలు నిన్ను మోసం చేశాయి. ప్రేమ కోసం త్యాగం అంటున్నావు. ఎందుకు? ఇటు తిప్పి ఆలోచించు. ప్రేమ ప్రపంచం లోకి వెళ్లు. అంతా స్వార్థమే! ఈ భూమి కూడా స్వార్థం కోసమే తిరుగుతోంది…’
జాగ్రత్తగా వింటున్న ఒక కుర్రాడు నోరు వెళ్లబెట్టాడు. ‘ ఏమి మాట్లాడుతున్నారు సార్? ‘
‘ అవును. భూమి తిరగకపోతే ఒక పక్కకు ఒరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక వృత్తం మీద ఒక గతిలో తిరుగుతూనే ఉండాలి. అదే విచిత్రం. కదలకుండా నిలబడాలీ అంటే తిరుగుతూ ఉందాలి…అక్కడే ఉంది అసలు మూర్ఖత్వం! నువ్వు కోరుకున్నది పొందాలంటే నీ సర్వస్వం కోలుపోవాలి…’
శరత్ గోడకి ఆనుకుని తల బాదుకున్నాడు. అందరూ చిన్నగా నవ్వారు. ఆ కుర్రాడు కూడా నవ్వాడు.
ఆదుర్దా గంభీరంగానే ఉన్నాడు. ఆకాశంలో దూరంగా ఎక్కడి నుండో ఇంకా పైకి లేస్తున్న పొగను చూస్తూనే ఉన్నాడు…
~~~***~~~

25

దూరంగా కొండల చాటు నుండి సూర్యోదయం అవుతూ ఉంది. లోయ ప్రాంతంలో మరో రోజు ప్రారంభం అవుతూ ఉంది.
శరత్ లేచి గది లోంచి బయటకు వచ్చి చూశాడు. పిట్ట గోడ దగ్గర ‘ ఆదుర్దా ‘ నిలబడి చూస్తున్నాడు. క్రిందటి రాత్రి అక్కడ పడుకున్న కుర్రాళ్లు వెళ్లిపోతినట్లునారు. అక్కడ రెండు కుర్చీలు, ఒక టీ పాయి ఉన్నాయి.
‘ ఇవెవరు వేశారు?’, అడిగాడు. అతను వెనక్కి చూశాడు.
‘ ఈ గెస్ట్ హవుస్ కుర్రాడనుకుంటాను. వచ్చి పెట్టి వెళ్లిపోయాడు. అన్నట్లు కాఫీ అడిగాడు. మీరు ఇంకా లేవలేదు, ఆగమన్నాను ‘
‘ మళ్లీ వస్తే కాఫీ తెమ్మనండి. నేను తయారయి వస్తాను. ‘
శరత్ లోపలికి వెళ్లిపోయాడు. పనులు ముగించుకుని మరల వచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. కాఫీ పెట్టి కుర్రాడు నిలబడ్డాడు.
‘ ఏంటి? ఇంకా ఒక రోజు ఉంటాను ‘
‘ కాదు సార్. మీకు టిఫినీ ఏమి కావాలో కనుక్కోమన్నారు ‘
శరత్ అతని వైపు చూశాడు. అతను నవ్వాడు.
‘ నన్ను చాయిస్ అడుగుతున్నారా? సిగ్గుగా ఉంది ‘
‘ సిగ్గెందుకని? భలే వారే?’
‘ ఏదైనా అడగచ్చా?’
కుర్రాడు ఏమీ మాట్లాడలేదు.
‘ ఏవయ్యా?’
‘ అన్నీ దొరుకుతాయి సార్!’
‘ అల్లం గట్టిగా వెయ్యి. అలాగే పచ్చి మెరపకాయలు దంచుకో…’
‘ పెసరట్టా సార్?’
‘ దటీస్ తెలుగు టాలెంట్!’
శరత్ నవ్వాడు. ‘ నాకూ అదే! వెళ్లు. ‘
కుర్రాడు వెళ్లిపోయాడు. ‘ నిన్న రాత్రి కుర్రాళ్లతో మీరు చాలా చిత్రంగా మాట్లాడారు. మీ ఆలోచనలు మామూలు ఆలోచనలకు విరుధ్ధంగా ఉన్నాయి. అన్నట్లు మీరు రాత్రి సరిగ్గా పడుకున్నారా?’
అతను కాఫీ మెల్లగా తాగుతున్నాడు. ‘ నిద్రకేమి లెండి. బాగానే పడుకున్నాను. ‘
‘ నాటకాలు వగైరాలు అన్నారు. ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?’
‘ కొందరితో నిజమే చెప్పాలనిపిస్తంది. నా అసలు పేరు సుందరం. ఒక పేరు మోసిన సినీ రచయితకి డమ్మీగా వ్రాస్తూ ఉంటాను. నేను చనిపోయి చాలా కాలమయింది…’
శరత్ ఆ మాటకు కుర్చీలో వెనక్కి వాలాడు.
సుందరం కాఫీకి తోడ పెళ్లికొడుకులాగా సిగరెట్ తీశాడు.
‘ అదోలా చూడకండి. నా పాదాలు సరిగ్గానే ఉన్నాయి. నా ఏజి స్టేజి మీదనే అయిపోయింది. దానినే నమ్ముకుని కాలం గడిపేశాను…’
‘ పెళ్లి లాంటిది…’
‘ హ…అలాంటిదాని దగ్గరకే వస్తున్నాను. జీవితం చిత్రమైనది శరత్ గారూ…మేరు పర్వతం దగ్గర అన్ని ఋతువులూ ఒక్క సారి కనిపించే ద్వీపం ఉన్నదని చెబుతారు. అలా కూడా అక్కరలేదు. నాకు శరత్ కాలమో వసంతకాలమో నిత్యం ఉండే జీవితం కనిపించదు!’
‘ ఏమయింది సుందరం గారూ?’
‘ ఏమిటో శరత్ గారూ…గతం లోకి వెళ్లిపోయి బూజులు దులిపి ఇదే ఒక కావ్యం, నా స్వగతం అని ఊరుకున్నంత మాత్రాన నా వర్తమానం తెల్లవారదు. నాకు బూజుతో పని లేదు, మరో రోజుతోనే పని అనుకుని భవిష్యత్తు వైపు చూస్తూ కూర్చున్నా ఈ గతం లోకి ఇలాగే ఈ రోజు జారిపోకుందా ఉండదు. ఈ తెరలు తెరలుగా తిరిగిపోయే ఈ కాల మహిమను ఎవరు కనిపెట్టారో కానీ నా కథ మీద నుంచి తెర తీయాలని నాకెందుకో అనిపించదు. అసలు తెర వెనుక, దాని ముందు ఉన్నదంతా అబ్ధ్ధమే! రెండిటి మధ్య ఉన్న ఈ తెర ఒక్కటే నిజమనిపిస్తుంది. ‘
‘ అసలు తెర అనేది ఎవరు కనిపెట్టారు?’
సుందరం నవ్వాడు.
‘ దేర్ యు ఆర్! మనిద్దరం ఏ జన్మలోనో కవలపిల్లలం అయి ఉంటాము! అద్దాన్ని కనిపెట్టిన వాడే మన గొడవలకు అద్దం పట్టాలని ఒక్క అడ్డు తెర కూడా కనిపెట్టి ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఒక ఆలోచనని కని దాచి పెట్టి పొదగనిచ్చి వికసింపచేసే నాటక ప్రక్రియకు తెర అనేది మాతృక! అది మౌనం గానే మసలుకుంటుంది. మాసిపోతుంది…ఏమిటి సార్, ఆలోచిస్తున్నారు?’
‘ ఏమీ లేదు. మీ మాటలే ఒక ఆలోచింపచేసే గతానికి

ఒక వినూత్నమైన అడ్డు తెరలాగా ఉన్నాయి. ఈ తెరను ఎప్పుడు తీస్తారా అని ఆలోచిస్తున్నాను…’
సుందరం విరగబడి నవ్వాడు.
‘ నన్ను పిచ్చి వాగుడు ఆపి పనికొచ్చేది చెప్పమని ఎంత చక్కగా చెప్పారు సార్!’
~~~***~~~

ఆ హాల్లోని అందరి ముందూ లైట్స్ ఆఫ్ అయ్యాయి. తెర తెరుచుకుంది. స్టేజి మీద కూడా కొద్ది సేపు చీకటిగానే ఉంది. మెల్లగా కొంత కాంతి పెరిగి సుందరం మధ్యలోకి వచ్చాడు. ఆ కాంతి వస్తున్న వైపు చేయి అడ్డం పెట్టాడు.
‘ వద్దు…వద్దు. ఎవర్రా నా మీద ఫోకస్ చేస్తున్నారు? ఉన్నోలకి పనీ పాటా లేదు. పొద్దూకులా గరిబోడి మీద ఫోకస్…స్టాప్ ఇట్ ఐ సే! ‘
లైటు ఆగిపోయింది. మరల మెల్లగా పెరిగింది.
పడుకున్న సుందరం లేచాడు.
‘ ఓ…సూర్యుడు మన మీదకి వచ్చాడా? రైట్! ఓ కొత్త రోజు, ఓ కొత్త నాటకం, అద్దీ…కళాకారుడికి అన్ని రోజులూ కొత్తే! ఒక్క జీవిత కాలంలో కొన్ని వేల జీవితాలను జీవించి చూప గలిగింది ఈ సృష్టిలో ఒక్క కళాకారుడే! ఇదిగో ఈ చొక్కా చించి మరీ చెబుతాను…హ హ హ…దీనిని చింపక్కరలేదు! ఇది చిరిగే ఉంది…’
అక్కడక్కడ హాల్లో చిన్నగా నవ్వులు వినిపించాయి…
~~~***~~~

26

సుందరం కొద్దిగా అటూ ఇటూ తిరిగి అప్పుడే పరుగెట్టుకుంటూ వచ్చిన రాజారావును గుద్దాడు.

‘ వార్ని. ఓ గోచీ లాంటిది మెడకి సుట్టుకుని  ఓ  పెద్ద సేల్స్ మన్ అని ఓ పోజు. ఇంత పొద్దున్నే గుద్దటానికి నేనే దొరికానా?’

‘నేను గుద్దలేదు. పైగా తెల్లారి చాలా కాలం అయింది. అదేమి ఖర్మమో నేను ఎక్కడికెళ్లినా వంద కోట్ల జనాభా నా ముందరే ఎదురవుతుంది…’

‘ అబ్బో! అదేవన్నమాట! ఆ పెట్టెలోనిది అమ్మాలంటే మరి జనాభాతోనే కదా పని?’

‘సర్లే! రోజంతా అరిచినా ఒక్కటీ కొనలేది జనం…’

‘ కొత్త బిచ్చగాడిలా ఉన్నావు.ఇంకా రోజు ఎక్కడ మొదలయింది?’

‘ నువ్వు బలే ఉన్నావు! నా టయిం అలా ఉంది.’

‘ బాధ పడకు…నీ పేరేమిటంకోమన్నావు?’

‘ కమలాకరరావు. ఏమి చేస్తాం?’

‘ ఓహో! అలా కూర్చో. ఈ పార్కులోని ఈ బెంచీ మనదే! ఇది మామూలు బెంచీ కాదు. సుప్రీం కోర్టు ఇస్పెసల్ బెంచీ! పెద్ద పెద్ద పేదరికం కేసులన్నీ ఇక్కడే తీరుస్తారు!’

కమలాకరరావు కూర్చున్నాడు. ‘ నువ్వు చదువుకున్నట్లున్నావు? ఎందుకు అడుక్కుంటున్నావు?’

‘ వార్ని! నువ్వు ఇది కొను,అది కొను, అంటూ అడుక్కోవటంలేదేంటి?’

‘ఇది మార్కెటింగు!’

‘ఛా! నా బొచ్చెలో ఎండిపోయిన ముక్కలా ఉంది నీ మార్కెట్! చూడూ, నీ మార్కెట్ యావత్తూ నా మీద, అంటే నా మార్కెట్ మీద ఆధారపడి ఉంది!’ ‘ ఊర్కోవయ్యా బాబూ, నా మూడు పాడయి నేనుంటే!’

‘ ఓహో! మన మొహానికి మూడ?, సరే! జాగ్రత్తగా ఇను.గరీబోడి మార్కెట్ యాభై శాతం. నేను లేనిదే నువ్వు లేవు! అసలు గరిబీయే ఒక మార్కెట్!ఆలోచించు! నేను కూడా రాఉనే!’

‘ నా టయిం అస్సలు బాలేదు!’

‘ టయిం బాగున్న ప్రతి ఓడికీ అటనే ఉంటుంది. మంచిగ ఉండే ప్రతి భార్యా అందంగా కనిపించదు! అప్పుడే అదృష్టం పరీక్షిస్తోంది అనుకోవాల మరి!’

‘ నీ బాధేంటి?’ ‘ ఏమీ లేదు. నేను గరీబోడిని. నాది అర్థాజ్యం.నేను కింగుని.’

సుందరం సిగరెట్టు ముట్టించాడు. ‘ అంతా సగమే! నీకు సగం కాల్చి ఇస్తాను. ఇది కూడా టపాకాయ లాగా సగం కాలిందే!’

‘ నేను తాగను!’

‘ పెళ్లయిందిలాగుంది ‘

‘ నువ్వే చెప్పు. నన్ను మాట్లాడనిస్తేనా?’

‘ అసలుకి నీ మార్కెట్ అంతా చెత్త అని నేనంటాను. ఏమంటావు?’

‘ కాదు. చేతకానివాడలా అంటాడు. నువ్వు బధ్ధకస్తుడివి. ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇలా వాగుతున్నావు!’

‘ ఓస్! యమ దర్జాగ సెప్పావులే కమలా…ఈ బెంచీ మీద ప్రమాణం. నిరూపించి సూపిత్తా…’

‘ బాబూ, నేను వస్తాను. ప్రతి దానికీ ఈ బెంచీ ఒకటి…’ కమలాకర రావు లేచాడు. సుందరం ఆపాడు.

‘ అరే! ఆగవో!. బలేటోడివే! చాలా రోజులకి నీలాటోడు దొరికాడు. ఉండు. అలా కూకో! ఈ బెంచీని ఏమీ అనకు!’

‘ ఏమిటీ? ఈ బెంచీలో ఏముందనీ?’

‘ అలా అడుగు బాగుంది. సినిమాలలో ఛాన్సులు రానప్పుడు ఇదిగో ఎన్.టి.ఆర్ ఈ మూల పడుకునే వాడు. ఎ.ఎన్.ఆర్ ఆ మూల అటు తిరిగి పడుకునే వాడు. సావిత్రి అక్కడ ఆవులించేది, తమాషాయా ఏమిటి? షావుకారు జానకి నిద్ర పట్టక అటూ ఇటూ రాత్రంతా ఇలా తిరిగేది. అందుకేనేమో ఆవిడ కళ్లు ఎప్పుడూ నిద్ర పోనట్టుగా ఉండేవి…’

~~~***~~~

(తరువాయి భాగం త్వరలోనే!)

శ్రీ ఖరనామసంవత్సర ఫలితాలుశ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:

సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

 

 

మిత్రులకు,బ్లాగ్ బంధువులకు,ఆప్తులకు శ్రీ ఖరనామసంవత్సర శుభాకాంక్షలు!
ఈ సంవత్సరం తొలి రోజు సూర్యుని తొలి కిరణాలు భరతభూమి మీదకు చేరినప్పుడు గల లగ్నాన్ని, గ్రహస్థితులను పరీక్షించి చూస్తే కొన్ని అద్భుత యోగాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వాక్చాతుర్యం గలవారికి,నిజమైన నాయకులకు,స్వావలంబనతో, స్వయంకృషితో ముందుకు సాగిపోవువారికి,సేనాపతులకు,ధైర్యం గలవారికి,ఉపాసనలోనున్నవారికి,సూక్ష్మబుధ్ధి గలవారికి,డబ్బు సంపాదించాలనుకునే వారికి,సంతానం పొందాలనుకునేవారికి విశేషమైన ఫలితాలనివ్వగలదు.
ప్రజలు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేసే దిశగా పయనించగలరు.రాజకీయాలలో కొన్ని తీవ్రమైన అలజడులు పుష్కర ప్రారంభం నుండి (7.5.11 రాత్రి 3.47 నుండి గంగా పుష్కరాలు) కనిపించగలవు.దక్షిణ భారతంలో రాజకీయ వేడి ఉధృతం కాగలదు. ఒక పెద్ద సైజు స్కాం భారత దేశపు వాయువ్య ప్రాంతంలో తలెత్తగలదు.

ఈ సంవత్సరం వ్యవసాయానికి,వ్యాపారానికీ పెద్ద సమస్యలుండకపోవచ్చు.వర్షపాతం బాగానే ఉండగలదు.పశు సంపదకీ ఇబ్బందులేమీ లేవు.
నవంబర్ మాసంలో కొంత పంట నష్టం ఉండగలదు.జూన్ మాసంలో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించగలవు.
పన్నెండు రాశులకు సంవత్సరంలోని ఫలితాలను మూడుగా విభజించి చూపటం జరిగింది. మొదటిది విశేషమైన మంచి ఫలితం, రెండవది గోచార రీత్యా కనిపిస్తున్న ఇబ్బందికరమైన విషయం,మూడవది తీసుకోవలసిన జాగ్రత్తలు.
మేష రాశి: 1. వివాహం,ఆరోగ్యం,సంతానం,ధనం విషయం లో విశేషమైన ఫలితాలు ఉండగలవు.2. అనవసరమైన ఆలోచనల వలన ఇబ్బందులుండగలవు.3. సదాచారాన్ని, సత్ప్రవర్తనని అవలంబించటం వలన మనసును అదుపులో పెట్టుకోవటం మంచిది.
వృషభ రాశి: 1. సంఘంలో గౌరవం,మిత్రుల వలన లాభాలు,మంచి పనులకు మంచి ఫలితాలు ఉండగలవు.2. ఒత్తిడి ఎక్కువ కావటం వలన ఆరోగ్య సమస్యలుండగలవు.3. మంచి మిత్రులతో కలసి ఆలోచనలను పంచుకోవటం మంచిది.
మిథున రాశి: 1. నిరుద్యోగులకు ఉద్యోగాలు,ఉద్యోగస్తులకు పురోగతి,ఆలోచనలు కలసి వచ్చే సంవత్సరం.2. ఉబ్బసం ఉన్నవారికి అనారోగ్యం,గర్భిణీ స్త్రీలకు సంవత్సరాంతంలో సమస్యలు ఉండగలవు.3. మాసానికి ఒక సారి శివునికి అభిషేకం జరిపించటం మంచిది.
కర్కాటక రాశి: 1. పెట్టుబడులు లాభిస్తాయి.కొత్త పరిచయాలు వ్యాపారాన్ని విస్తీర్ణపరుస్తాయి.అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు.2. ఇతరులు మీ ప్రవర్తనను అర్థం చేసుకోవటం కష్టం కాగలదు. మీ మాటలకు పెడార్థాలు తీసుకుంటారు.గర్భవతులైన స్త్రీలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.3. సామాన్యంగా అందరూ పాటించే ఆచారాలను,సంప్రదాయాలను కలసి పాటించండి. విలక్షణమైన వ్యవహారాన్ని మానుకోవటం మంచిది.
సింహ రాశి:1. ఉద్యోగంలో మార్పు,పదోన్నతి,ఇంటి మరమ్మత్తులు,సర్వత్ర మంచి లాభాలుండగలవు.2. కుటుంబంలో కొన్ని కలతలు,గుండె సమస్యలున్న వారికి చింతలు,దంపతుల మధ్య విభేదాలు ఉండగలవు.3. దుర్గా సప్తశ్లొకీ నిత్యం చదవండి.ఉదయం, సాయంత్రం తప్పక దీపారాధన చేయండి.
కన్య రాశి: 1. విభిన్నమైన పనులలో రాణించగలరు.అనుకున్న చోటుకి బదిలీ ఉండగలదు.కళలలో రాణిస్తారు.2. మీ అవసరాలను ఇతరులు పట్టించుకోకపోవటం వలన తీవ్రమైన ఆందోళనకు గురి కాగలరు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.3. లక్ష్మీ దేవి ఉపాసన మంచిది.వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది.
తుల రాశి: 1.విదేశీ వ్యవహారాలు, అవకాశాలు బాగుంటాయి.ఏది సమస్య అని తెలియని చోట అసలు విషయాలన్నీ బయటకి రాగలవు.న్యాయ సంబంధమైన విషయాలు పరిష్కారమవగలవు.2. కీళ్ల నొప్పులు,కొత్త ఆరోగ్య సమస్యలు,బంధువర్గంతో విభేదాలు తలెత్తగలవు.3. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.నవంబర్ మాసానికి ఒక సారి మందపల్లిలో శనికి అభిషేకం చేయించటం మంచిది. తరువాత శివాలయంలో అభిషేకం చేయించటం మంచిది.
వృశ్చిక రాశి: 1. జీవితం నూతన అధ్యాయంలోకి ప్రవేశించగలదు.నూతన విద్యాభ్యాసం,అనుకోని చోటు నుండి ఆదాయం ఉండగలదు.2. అనవసరమైన ప్రయాణాలు,అర్థం లేని వివాదాలు,నీరసం వంటివి ఉండగలవు.3. నవంబర్ మాసానికి ఒక సారి మందపల్లిలో శనికి అభిషేకం చేయించటం మంచిది. తరువాత శివాలయంలో అభిషేకం చేయించటం మంచిది.
ధను రాశి: 1.ఈ సంవత్సరం మంచి యోగాలుండగలవు.రాజకీయ లబ్ధి,విజయం,అన్ని రంగాలలో అభివృధ్ధి కనిపించగలదు.2. అనుకోని ఆరోపణలు,వ్యయం ఉండగలవు.3. పుష్కర స్నానం చేయటం మంచిది.సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళ వారం అర్చన చేయించండి.అనవసరమైన అభిప్రాయాలు చెప్పటం మంచిది కాదు.
మకర రాశి: 1. మీ ప్రతిభకు గుర్తింపుగా కొత్త బాధ్యతలు, హోదాలు మీకు దక్కగలవు.2. చర్మ సమస్యలు,అధికమైన బంధువుల తాకిడి వలన దైనందిన జీవితానికి ఇబ్బందులు ఉండగలవు.3. మహాసౌరం చదవండి.
కుంభ రాశి: 1. ఆస్తులు కలసి రాగలవు.నూతన వస్తువుల కొనుగోలు ఉండగలదు.ప్రేమ వ్యవహారాలు సుఖాంతం కాగలవు.2. తెలిసిన వారి వెన్నుపోటు చర్యలు,స్త్రీల వలన ఇబ్బందులు ఉండగలవు.3. హనుమాన్ చాలీసా నిత్యం పారాయణ చేయండి.
మీన రాశి: 1. ఈ సంవత్సరం దీర్ఘకాలీన పెట్టుబడులు లాభించగలవు.పిల్లలు అభివృధ్ధిలొకి వస్తారు.దీర్ఘకాలీన సమస్యలు తొలగిపోగలవు.2. అనవసరమైన బాధ్యతలు తల మీద వేసుకుని ఇబ్బందులకు గురి కాగలరు.కొందరికి విషయాలను వివరంగా చెప్పకపోవటం వలన కూడా సమస్యలుండగలవు.3.  నవంబర్ మాసానికి ఒక సారి మందపల్లిలో శనికి అభిషేకం చేయించటం మంచిది. తరువాత శివాలయంలో అభిషేకం చేయించటం మంచిది.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

 

మనసునిలవదోయి మధువసంతమోయి…


‘సత్యమప్రియం’-నాటిక


‘కాకి బంగారం’-నాటకం మొదటి భాగం


విలన్…


 

 

ఒక సారి ఒక లోకల్ స్టేషన్ లో బండీ కోసం కూర్చున్నాను.ఆ రోజుల్లో ఎన్.ట్.ఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం ఆడిన వార్త చర్చల్లో ఉంది. బెంచీ మీద కూర్చున్న ఒకాయన తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.’ఏంటండీ ఈయన? ఈ వయసులో ఈ పనేమిటి? నాన్ సెన్స్!’,అన్నాడు.అక్కడ కూర్చున్న మరో వ్యక్తి నవ్వాడు.’సార్, అన్నీ సినిమా కథలే!సినిమా చూస్తూ ఉండటమే మన పని!ఊరకే బుర్ర పాడు చేసుకోనక్కరలేదు!’బాగుంది. సినిమాలలో హీరో విలన్ లా చివరి వరకూ కనిపించి చివర మరో విలన్ ను తన్ని అప్పటివరకూ తనతో గంతులేసిన చిన్న దానిని పెళ్లి చేసుకుని అందరికీ చేతులు చూపించటం మామూలే కాబట్టి అది అలా సాగుతూనే ఉంటుంది,మనం అలా చూస్తూనే ఉంటాం…తొలుత విలన్ పాత్రలు ధరించి తరువాత హీరోగా సెటిల్ అయిపోయిన వారి జాబితాలో శతృఘ్న సింహా, రజనీకాంత్, చిరంజీవి కనిపిస్తారు.చివర చెప్పిన ఆయన పాత్రలు అసలు స్క్రిప్ట్ లేకుండా మార్చేస్తున్నాడా అనిపిస్తుంది…
అసలు ‘విలన్ ‘ అన్న పదం నిజానికి ఆంగ్లంలో అంత చెడ్డది కాదు.ఫ్రెంచ్ వ్యవహారంలో ‘విలెయిన్ ‘ అనే మాట ఒక ‘జమీందారు ‘ కు కట్టుబడ్డ ఒక రైతును వర్ణించేందుకు ఉపయోగించే వారు.(విల్లా…ఒక ఫార్మ్ లేదా ఒక ఇంటికి వాడే మాట).ఈ వ్యక్తి బలంగా ఉండి, సగం స్వామి సేవకు ఉపయోగపడుతూ, సగం స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండే మనిషి.కాకపోతే ఈ పదం ఏమి చేసినా ఒకరి కుటుంబం ప్రయోజనాలకు పని చేసే పల్లెటూరి మనిషి గురించి చెప్పేందుకు ఉపయోగించే వారు. ఆ మాటకొస్తే కాలక్రమంలో ఆ కుటుంబం కోసం అనైతికమైన పనులు చేసేందుకు కూడా సిధ్ధపడే మనిషిగా ఈ పదం వాడబడటం విశేషం.షేక్స్పియర్ ఈ పదాన్ని మంచి చెడుకు రెండిటికీ ఉపయోగించినట్లు మనకు తెలుస్తోంది.అటువంటి పాత్రలలోని వైపరీత్యం ఈ ఒక్క పదంలోనే దాగి యుండటం ఆలోచించవలసిన అంశం…
కాలం మారిపోయి చాలా కాలమయింది.జనం నాయకులు, ప్రతినాయకుల పధ్ధతిలో ఎవరినీ చూడటం లేదు.కాకపోతే ప్రజలు ఎవరికి ఏది చేతయింది, ఏది చేతకాలేదు అనే ఆలోచన చేయలేని వారయితే కాదు.
2030 వ సంవత్సరానికి మన దేశంలో 90 కోట్ల మంది మధ్యతరగతి జనాభా ఉండగలదని అంచనా. అప్పటికైనా చదువుకున్న వారి ప్రతిభకు,ప్రజాస్వామ్యానికి ఒక వారధి ఏర్పడగలదా అనేది మరో ఆలోచించల్సిన అంశం…

Previous Older Entries

%d bloggers like this: