‘ కొడుకు ‘


మామూలుగా ఈ పదానికి అర్థం మనకి తెలిసిందే!…ఆగండి. ఏ అర్థం?
అదీ సమస్య! తిరిగి చూస్తే కాలం అలా మారింది…చాలా కాలం క్రితం రీడర్స్ డైజెస్ట్ వాళ్లు ఒక జోకు చెప్పారు.

ఒక తండ్రి పేపరు చదువుకుంటున్నాడు. ఆయన పిల్లవాడు పక్కనే కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాడు. త్రీ ఇంటు ఫోర్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ట్వెల్వ్, త్రీ ఇంటు ఫైవ్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ఫిఫ్టీన్…ఇలా. ఈయనకు చిత్రంగా అనిపించి ఒరే, ఏంటిరా అది, ఎవరు నేర్పారురా అన్నాడుట. ఆ కుర్రాడు మా మేడం చెప్పింది అన్నాడుట. ఇలా కుదరదని ఆయన నేరుగా స్కూలుకే వెళ్లాడు. ప్రిన్సిపాల్ గారు మేడం ని పిలిపించారు. ఆవిడ అంతా విని కాదండీ, నేను చెప్పింది త్రీ ఇంటు ఫోర్ ద సం ఆఫ్ విచ్ ఈస్ ట్వెల్వ్…ఇలా అని!

కొడుకు మరొకటి విన్నందుకు నాలుక కరుచుకున్నాడు ఆ తండ్రి!
~~~***~~~

ద రేపిస్ట్!


ఒక నర్సింగ్ హోం లో కొద్ది సేపు ఆ మఘ్య నిలబడి ఉన్నాను. నాకు కుడి పక్క ఒక నోటీస్ తగిలించి ఉంది. ఏమిటా అని చదివాను…

‘the rapist will visit the hospital

every thursday between 06.00 and 08.00 hours ‘

చుట్టు ప్రక్కల అటూ ఇటూ చూశాను. ఇదేమిటి? ఎవరు అనుమతిస్తారు వీడిని? అసలు ఎవడు వీడు? సుప్రీం కోర్టు వారు కొత్తగా కొందరిని అనుమతించినట్లు ఇలా ఈ ‘వృత్తిని ‘ కూడా చట్టబధ్ధం చేశారా? ఆశ్చర్యం వేసింది.
ఇది తప్పు అయి ఉంటుంది అనుకుని ఇంకా జాగ్రత్తగా చూశాను.

ఆ నోటీసు ఎవరో రెండు భాగాలుగా చింపి అతికించారు!

(చించేశాడన్నమాట)

The Physio…

the rapist will visit the hospital

every thursday between 06.00 and 08.00 hours ‘

అయితే ‘ద ‘ కీ ‘థెరేపిస్ట్ ‘ పదానికీ కూడా చిన్న గాప్ ఇవ్వటంతో బలేగా మారింది!
ఇంతలో నా వెనుక ఒక ముసలాయన వీల్ చెయిర్ లో వచ్చాడు.
‘ అల్లా చూడక్కరలేదు ‘, అన్నాడు ( గోదావరి వారు అలా..ని అల్లా అంటారు లెండి, అల్లా అన్నమాటండీ! )
ఆయన చెప్పాడు, ‘ వాళ్లు వ్రాసింది కరెక్టే! ఈ తెరేపీ చేయించుకునే వాడికి తెలుస్తుంది ఆ బాధ. శరీరం యావత్తూ అల్లా రేప్ అయిపోతుంది. పైగా ఈ ఎరేపిస్టు ఫిసియో…ద రేపిస్ట్! ఇతను రేపిస్టు ముందు, ఫిసియో తరువాతన్నూ! ‘
నిజమే అనుకున్నాను. స్టివెన్ పూల్ అనే ఆయన భాష యొక్క ‘అనర్థపు ‘ ప్రయోగం మీద ‘ అన్స్పీక్ ‘ అనే పుస్తకం వ్రాశాడు. చాలా మంచి పుస్తకం. ఆయన భాష యొక్క ప్రభావం ఎన్ని విధాలుగా ఉంటుందో సూక్ష్మంగా వివరించాడు. చివరకు తీవ్రవాదం మీద కూడా ఎలా ఉంటుందో చెప్పాడు.
‘స్వ ‘ తంత్రం లో అన్నీ ‘రేపు ‘ లే! ఏమిటంటే భాష ఎవరికి కావాలీ, భావం వ్యక్త పరచటం చాలు అంటూ ముందుకు వెళ్లిపోతారు.
మన రిపబ్లిక్ లో పబ్లిక్ ‘బూతులు ‘ జన సామాన్య భాష అయిపోయాక ఈ తరంలో ఉన్న కుర్రాళ్ల భాష గురించి ఏమి మాట్లాడుతాం?
ఆ మధ్య ఒక ఎడిటర్ గారు ‘ సార్, మీరు ఏదైనా నీతి చెప్పాలనుకున్నా ఒక చిన్న సైజు బూతులో సద్దేయండి సరిపోతుంది ‘ అని చిన్నగా చెప్పాడు.
మాతృభాష ఘోషిస్తోంది సోదరా!
ఈ రోజు ఈ ‘ రేపు ‘ గురించి కొద్దిగా ఆలోచిద్దాం…
~~~***~~~

I shall restrict henceforth


It appears as though placing several posts from a single blogger is not in the interests of various bloggers. I may please be excused since I was quite unaware of this. I have decided to restrict to a couple of posts in a week.

Sripati

‘ వైల్డ్ స్ట్రా బెరీస్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


విలువ తెలియని ఒక గొప్ప స్థలాన్ని స్వీడిష్ భాషలో ‘ స్ముల్త్రోన్స్తాలె ‘ అని అంటారు. కాకపోతే మామూలుగా దాని అర్థం వైల్డ్ స్ట్రా బెరీ. నిజానికి సంసారం అనే అడవిలో పడి నలిగి రక రకాల బాధలు పడి ఆవలి తీరానికి వెళ్లిపోయే ఒక అమూల్యమైన వస్తువు ఈ ప్రాణి.వాడి విలువ వాడికే తెలుసు…లోకానికి ఎందుకు?

ఇంగ్ మార్ బర్గ్మాన్ ఆలోచనలు రేకెత్తించే చిత్రం ఇది. 1957 లో రచించి నిర్మించిన చిత్రం.

ఒక డాక్టర్ (ప్రొఫెసర్) ఒక యూనివర్సిటీలో ఒక గౌరవ డిగ్రీని పుచ్చుకునేందుకు బయలుదేరుతాడు. దారిలో రకరకాల అనుభవాలు, ఆత్మ పరిశోధన,విచిత్రమైన కలలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. ఇందులో ఒక బుధ్ధిజీవి యొక్క యాత్ర గణనీయమైనది. సినిమా ఎత్తుగడ గొప్పది. ఒక గౌరవ డిగ్రీ తిసుకునేందుకు వెళుతూ తన గతాన్నీ, తన అలోచనలనీ ఆ ప్రయాణంలో కూడా వచ్చిన పాత్రలను మేళవించుకుని తన చివరి రోజులలో రాబోయే మృత్యువు అనే పతాక సన్నివేశాన్ని ఆవిష్కరిస్తాడు ఆ ప్రొఫెసర్, పాటుగా దర్శకుడు.

నిజమే! ఆలోచనలతో పాటుగా జీవించే ప్రతి వ్యక్తీ జీవితంతో సంతృప్తి చెందడు. వడ్డించిన విస్తరి జీవితం కాదు. జీవితం నుంచి నిర్ధారించుకున్న సత్యాలను సంచీలోకి చేర్చుకుని సంచరించే వారు గొప్ప వారు. వీరు సంచీ తెరచి చూపించేసరికి అది మాసిపోయి ఉంటుంది.అందులో మణి ఉంది అని తెలిసే సరికి అది జారిపోతుంది…

ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఒక అద్భుతమైన ప్రశ్నను బర్గ్మాన్ మనకు చివరికి మిగులుస్తాడు.

ఆ పాత్రలో నటించిన విక్టర్ జోస్త్రోం తన భావ ప్రదర్శనతో చెరగని ముద్ర వేశారు. ఇది కష్టమైన పాత్ర. ముందుగా ఒక బుధ్ధిజీవిని నిలబెట్టాలి. తరువాత ఒక మామూలు జీవితానికి కావలసిన మామూలు మనిషి వ్యక్తి రావాలి. సరైన చోట ఇద్దరూ కలవాలి. నటనలో ఒక కామెంటరీ కనపడాలి…

~~~***~~~

ఈ చిత్రం 1958 లో గోల్డెన్ బేర్ అవార్డు తీసుకుంది. అయితే బర్గ్మాన్ చిత్రాలలో ‘ ద సెవెంత్ సీల్ ‘ తో పాటు ఎంతో చర్చలోకి వచ్చిన చిత్రం.

~~~***~~~

కొన్ని విషయాలలో అసలు అనుభవానికీ, ఆలోచనకు, సృజనకు ఉన్న వంతెనను చూపే వారికి చిత్రమైన పరిస్థితులు ఎదురవ్వటం జరుగుతుంది.ఈ సినిమా స్క్రిప్ట్ ను బర్గ్ మాన్ ఆసుపత్రిలో బెడ్ మీద నుండి వ్రాయటం విశేషం.
ఒక కళాకారుడో లేక ఒక ఇంటలెక్చువలో తన జీవితంతో పట్టిన కుశ్తీ నుంచి పాలు విరిగి ‘కళాఖండం ‘తయారు కావటం అనే ఇతివృత్తం గురించి ఆలోచించినప్పుడు బర్గ్ మాన్ గుర్తుకొస్తాడు. కళాఖండాన్ని మనం రుచి చూస్తాం. విరిగిన పాలకు మరో అనుభవం…

~~~***~~~

‘ బందిని ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


1963 లో బిమల్ రాయి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది.
ఎస్. డి. బర్మన్ అందరినీ తన సంగీతం తో కదిలించిన చిత్రం.

కథలోని వ్యూహం సామాన్యమైనది కాదు. (కథ జరాసంధ, మాటలు పాల్ మహేంద్ర, స్క్రీన్ ప్లే నబేందు ఘోష్ అందించారు).

స్వాతంత్ర్య సమరం రోజుల నేపథ్యం ఆ కాలం లోని జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఒక్స్ స్త్రీలోని భావ జాలాన్ని ముందుకు కవిత్వ ధోరణిలో తీసుకుని వస్తుంది. ఒక్స్ హత్య చేయటం వలన కళ్యాణి (నూతన్) జైలులోకి వస్తుంది. ఇది మొదటి ‘బందిని ‘. అయితే తను వివాహం చేసుకుందామనుకున్న వ్యక్తి మరొకరిని చేసుకోవటం వలన ఆ పరిస్థితిలోంచి ఇవతలికి రాలేని స్త్రీ మరో ‘ బందిని ‘.

ఈ జైలు లో ఒక డాక్టర్ (ధర్మేంద్ర ) పరిచయమయ్యి ఇష్ట పడి వివాహానికి కూడా సిధ్ధ పడతాడు. ఈమె ఒప్పుకోలేని పరిస్థితి.
ఈమెను వివాహం ఆడతానని మాట ఇచ్చి వెళ్లిపోయిన వికాస్ (అశోక్ కుమార్) భార్య హత్యకు చిత్రమైన పరిస్థితిలో ఈమె పని చేస్తున్న ఆసుపత్రిలో హత్య చేయబడింది. అందరూ దూరం. తండ్రి అదే ఆస్పత్రిలో ఈమెను వెతుక్కుంటూ వచ్చి దుర్ఘటనపాలయ్యి చనిపోతాడు. కాలం యొక్క జాలం లో చిక్కుకున్నది ఇంకొక ‘బందిని ‘.

అశోక్ కుమార్ సమరయోధుడు కావటం చేత ఒక తప్పని పరిస్థితిలో ఒక అధికారి దగ్గర రహస్యాలను తెలుసుకోవటం కోసం ఇష్టం లేకపోయినా నాయకుని ఆఙ్ఞ మేరకు దేశం కోసం ఆ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇది చివరికి అతను స్టీమర్ ఎక్కేముందు నూతన్ కి తెలియటం, ఆమె అప్పటికే ధర్మేంద్ర ఇంటికి రైలులో రవాణా కావటం, ఇప్పుడు కొత్త పరిస్థితిలో మరో సారి చిక్కుకొని ఊగిసలాడటం ఇంకొక ‘బందిని ‘.
దేశభక్తికి, ప్రేమ, వివాహం, సమాజం, పరిస్థితుల మధ్య నలిగిన స్త్రీ యొక్క అద్భుతమైన పాత్రపోషణ నూతన్ కనబరుస్తుంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం వెనుక ఉన్న క్లిష్టమైన విషయాన్ని చక్కగా ముందుకు తెచ్చింది.

~~~***~~~

సినిమాలో ఫ్లాష్ బాక్ చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. దీనికి ఒక కారణం ఉంది. పతాక సన్నివేశం వైపరీత్యానికి సంబంధించినది. ఇది అక్కడికి చేరుకునే కారణాలను దర్శకుడు ఒక పధ్ధతిలో తీసుకుని వెళతాడు. మెరే సాజన్…పాటలోనే కథ నూతన్ అశోక్ కుమార్ ని చేరుకోవటంతో కథ ముగిసిపోతుంది. ఇందులో పాటలోని ఒక మాట సమస్తం చెబుతుంది- ‘ మై బందినీ పియాకీ, మై సంగినీ హూన్ సాజన్ కీ…’! పియాకీ అన్న మాట బర్మన్ గారు పలికిన తీరు చాలు. కథ చెప్పేస్తుంది. ఇన్ని బందినీలు ఉన్నప్పటికీ అవన్నీ ఒక ఎత్తు, నేను నా ప్రియుని వద్ద బందీని అని చెప్పటం విశేషం. అది క్లైమేక్స్ కావటం అద్భుతం!

~~~***~~~

ఓయె మాఝీ…ఈ పాట నర నరాలలోకి ఎక్కేస్తుంది. కారణం ఏమిటంటే నదిలో పడవ, అలలు కదిలే తీరు పాటలోని సంగీతానికి ప్రాణం కావటం. మన్ కీ కితాబ్ సే తుం, మెర నాం హీ మిటాదేనా…ఈ వాక్యం లోని అన్ని పదాలూ అలల లాగా ముందుఈ వెనక్కీ కదులుతాయి. తెరచాప గాలికి ఊగినట్లు తరువాత ముఝె ఆజ్ హీ…అన్నది ఆకాశం లోకి లాకుని వెళ్లటం, లే చల్ పార్-లే అన్నది నన్ను తీసి అవతలకు లాగు అన్నట్లు పలకటం భావాన్ని లయతో కలిపి పాడటం…

మరో పాట-మొర గోర రంగ్ లైలె, తొహె శాం రంగ్ దైదె! నా ఎర్ర రంగు తీసుకో, నీ నల్లని రంగును ఇచ్చేయి (దైదే). రాత్రిలో దాక్కుంటాను…ఇలా ఉండగా మబ్బుల చాటునుండి చంద్రుడు ఇవతలకి వస్తాడు. ఆ సమయంలో భావ ప్రదర్శన సాహిత్యానికి అనుగుణంగా ఉంటుంది.

సినిమాలో అశోక్ కుమార్ ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందో అతనితో వచ్చిన వ్యక్తి సంవాద రూపంలో చెప్పటం వలన అంత ప్రధానమైన విషయం దృశ్యంలోకి ఎందుకు రాలేదా అనిపించింది. చూస్తే సినిమా 15 రీళ్లే! అందు చేత ఆ నాటకీయమైన విషయాన్ని తెర మీదకి దృశ్యరూపంలో చూపిస్తే బాగుండేదనిపించింది.

అశోక్ కుమార్ నటన కూడా పాత్రకు ఎంత సముచితంగా ఉన్నా ఈ విషయం సినిమాలో లేకపోవటం వలన ఆయన నటన మరుగున పడ్డట్లున్నది…

~~~***~~~

ఈ సినిమాకు ఎన్ని అవార్డులొచ్చాయి ఇవన్నీ అందరికీ తెలిసినదే.
చెప్పుకోదగ్గది ఏమిటంటే మహానుభావులందరూ వెళ్లిపోయారు. వారి కళాఖండాలు అలా ఉండిపోయాయి. అందుకే వీరెక్కడికీ పోరు. జీవితమంతా సృజనకు, దృశ్యానికీ, సంగీతానికీ, సాహిత్యానికీ మధ్య రససిధ్ధి కోసం సాధన చేస్తూ ఆ మార్గం లోనే అదృశ్యమైపోయారు. ఆ రస సిధ్ధి కోసం వారికి ‘ మర్ కే భి రహతా ఇంతజార్…’-ఆవలి గట్టు మీద కూడా ఆ తన్మయత్వం కోసం వేచి ఉంటారు!

~~~***~~~

(The English version of this review can be seen by clicking http://www.films.sripati.com)

‘శ్రీకృష్ణ పాండవీయం ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


1966 లో నటించి దర్శకత్వం వహించి ఎన్. టి. రామారావు గారు ప్రజల ముందుకు తీసుకుని వచ్చిన ఈ చిత్రానికి చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

పౌరాణిక పాత్రలు ఎలా ఉంటాయి అనేది రవి వర్మ గారి పెయింటింగుల నుంచి ఊహించగలిగితే బాపు గారి బొమ్మలలో గొప్పగా రూపు దిద్దుకున్నాయి. ఈ రెండిటినీ కలబోసి సజీవంగా తెర మీద చూడాలనుకున్నప్పుడు ఎన్.టి.ఆర్ గారు తప్ప మరొకరు కనిపించరు.
‘ ఆర్యన్ ‘ నాసిక, విశాల వక్షస్థలం, అందమైన కళ్లు,చక్కని గాత్రం, హుందా తనం ఆయనకే చెల్లింది.
పౌరాణిక కథలకు అద్దం పట్టిన తెలుగు పద్య నాటక ప్రక్రియ నుంచి, ఆ మేటి కళాకారుల నడక, భావ విన్యాసం నుంచి తెలుగు చిత్రం అలవోకగా తెర మీదకు దూకిన విన్యాసం చెప్పుకోదగ్గది.

ఈ చిత్రం కొన్ని స్టేండర్డ్స్ సెట్ చేసిన చిత్రం.
రెండు పాత్రలు-శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు-ఇవి రెండూ ఎన్.టి.ఆర్ గారు పోషించి వైవిధ్యం చూపించి పాత్రలకు ఉన్న నేపథ్యం, నటనా చాతుర్యం చక్కగా తీసుకుని వచ్చారు.

కథ తెలిసినదే. భారతంలో ఏమున్నదీ లేనిదీ అనేది ప్రక్కన పెట్టి కాన్సెప్చువల్ గా కథను చూడాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా నాటక ప్రక్రియ ప్రభావం అని అందరికీ తెలిసినదే.

శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలచి అడుగడుగునా ఆదుకొనటం, ఆయన గాంధర్వ వివాహం, మయ సభలో సుయోధనుని పరాభవం, దంతవక్త్ర, జరాసంధ వధ, బకాసుర వధ, హిడింబ తో భీముని వివాహం,ఇలా సాగి చివరకు ధర్మజుడు తలపెట్టిన రాజసూయం లో శిశుపాల వధతో కథ ముగుస్తుంది.

మామూలుగా ఆలోచిస్తే శ్రీకృష్ణునికీ, పాండవులకీ మధ్య గూఢమైన సంబంధం కృష్ణార్జునుల నరనారాయణ స్వరూపం.అది కృష్ణావతారం లోని ఒక భాగం.కాకపోతే తాత్వికంగా కాకుండా కథా స్వరూపంగా తలపెట్టి అటు ప్రతినాయకులను వారి అంతరంగం ద్వారా చూపించి పాందవులలో భీముని ముందుకు తేవటం జరిగింది…అందు చేత శకుని వృత్తాంతం, సుయోధనుని మయ సభ ఘట్టం ప్రధానంగా కనిపిస్తాయి.

శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తున్నప్పుడు కనుల విషయంలో ఎన్.టి.ఆర్ గారిని జాగ్రత్తగా పరిశీలించాలి. దీనిని ‘లుకింగ్ బియాండ్ ‘ అని గుర్తించాలి. ఎదురుగా నిలబడిన పాత్ర వైపే కాకుండా కొద్దిగా దూరంగా చూస్తున్నట్లు కళ్లను నిలపటం ఒక ప్రక్రియ. కళ్లు పెద్దవి చేసి చిరునవ్వు నవ్వటం శ్రీకృష్ణుని రూపంలో ఆయనకే చెల్లింది. అదే దుర్యోధనుని దగ్గరకు వచ్చినప్పుడు కళ్లు పెద్దవి చేస్తారు. కానీ కనుబొమ్మలను కొద్దిగా సంకుచితం చేసి
తల కొద్దిగా వంచటం జరుగుతుంది.ఇది చిత్రమైన విషయం. జాగ్రత్తగా చూస్తే ఇలా చేసినప్పుడు వ్యక్తిలోని క్రౌర్యం ,కపటం ప్రతిబింబిస్తాయి. ఇది నటునిలోని ప్రతిభా పాటవం.
నడక దగ్గరకు వస్తే దుర్యోధనుని నడక ఇలా తప్ప మరోలా ఉండదు అనిపిస్తుంది. ఎడమ చేయి కొద్దిగా ముందుకు వచ్చి అర క్షణం ఆగి ఒక అర్థ చంద్రాకారంలో మరల వెనక్కి వెళుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో పాటలు గొప్పగా ఉంటాయి. ‘స్వాగతం ‘ పాట వెంపటి చిన్న సత్యం గారి నాట్య కళకు ఒక తార్కాణం.సంగీతం అందించిన టి.వి.ఎస్. రాజు ఇలా ఎన్ని సినిమాలు చేశారో తెలియదు. సంగీతం పాత్రలకు, సన్నివేశాలకు అలా అద్దం పట్టినట్లుంటుంది. ‘ప్రియురాల సిగ్గేలనే ‘ పాట ఘంటసాల గారి గళంలో భగవంతుడు పాడితే ఇలా ఉంటుందేమో మరి అని ఒక క్షణం అనుకుంటామేమో!
వీటికి భిన్నంగా హిడింబకు పాడిన జిక్కీ గారు మాధుర్యానికి మరో పేరు అనిపించారు. ‘అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా…’
ఇందులో ‘ అయ్యారే ‘, ‘ ఇయ్యాలని…’-ఈ రెండు పదాలను పలికిన తీరు అద్భుతం! ఒక్క సారి ఝాంగురే బంగారు జిక్కీ రాణీ అనిపించింది!

ఈ సినిమాలో చివరి సన్నివేశం తో పాటు మయ సభ, హిడింబ పాట ఇలాంటివి తలచుకున్నప్పుడు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్, ఆర్ట్ దర్శకుడు కె.వి.రాజు గార్లను మెచ్చుకోకుండా ఉండలేము.ముఖ్యంగా రాజసూయం చివరిలో పురుషసూక్తం వినిపిస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు దైవం ఒక ఘటనలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో అనిపించేలా చిత్రీకరించారు.

ఈ చిత్రం కూడా కొన్ని పాత చిత్రాల లాగా రంగులు పూసుకుంటే మరో సారి చరిత్ర సృష్టించగలదని అనిపిస్తోంది!

సినిమాలో ఒక చోట కొద్దిగా నవ్వొచ్చింది. ‘ మత్తు వదలరా ‘ పాట దగ్గర భీముడు కళ్లు మూసుకుని పడుకుని ఉంటే శ్రీకృష్ణుడు రెండు వేషాలలో చెట్టుకు అటూ ఇటూ ఎవరు చూసేందుకు వేషాలు మారాడో అనుకున్నాను.అవసరం లేదనిపించింది.

మన నాటక ప్రక్రియలోని ప్రతిభను తెర మీదకి తెచ్చి, మన పురాణాల లోని అద్భుతమైన సన్నివేశాలను చిరకాలంగా నిలచిపోయేటట్లుగా, పౌరాణిక పాత్ర పోషణ ఇలా ఉండాలీ అనుకునేటట్లుగా, తెలుగు వారికే ఉన్న ఈ విలక్షణమైన ప్రతిభను ప్రపంచానికి చాటిన నందమూరి వారు ధన్యులు!

అందుకే ఆయన ‘సకల మహీపాల మకుట శోభా నీరాజితుడైన రారాజుగా ‘ అందరి గుండెల్లో అలా నిలచిపోయి ఉన్నారు!

‘ మధుమతి ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


నాలుగు మంచి సినిమాల గురించి చర్చించుకుంటున్నప్పుడు మధుమతి ‘తెలియకుండానే ‘ ప్రవేశిస్తుంది. పాటలు వినాలని అనిపించినప్పుడు ఒక సారి సినిమా పెట్టుకుని చూద్దామనిపిస్తుంది. సినిమా చూశాక ఒక సారి మరల పాటలు చూద్దామనిపిస్తుంది. మధ్యలో కొన్ని దృశ్యాలను మళ్లీ చూద్దామనిపిస్తుంది…దీని గురించి మాట్లాడాలనిపిస్తుంది. అంటే చాలా సింపుల్! చరిత్ర సృష్టించిన విషయంలోని చమక్కు అలాంటిది. సగటు భారతీయ కళాకారునిలోకీ, ప్రేక్షకులలోకీ అలా దిగిపోయి ఎక్కడో ‘ ఆజారే..మై తో కబ్ సే ఖడీ…’ అంటూనే ఉంటుంది మధుమతి!

~~~***~~~

1958 లో బిమల్ రాయి దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఇది.దీనికి కథ రిత్విక్ ఘటక్,మాటలు రాజేందర్ సింగ్ బేడి,సంగీతం సలిల్ చౌధరీ, కూర్పు హృ షీ కేశ్ ముఖర్జీ అందించారు.
దిలీప్ కుమార్, వైజయంతీ మాలా బాలీ, ప్రాణ్, జానీ వాకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

 ~~~***~~~

ఒక సారి అనిపిస్తుంది-ఈ చిత్రం సంగీత ప్రధానం కాకపోతే ఎలా ఉండేదీ అని.నిజమే! సలిల్ చౌధరీ అందరినీ మరో ప్రపంచం లోకి తీసుకుని వెళ్లిపోయాడు. పాటలే కాదు. నేపథ్య సంగీతం-నిశ్శబ్దం కూడా మనలను నిలబెడుతుంది!

ఎంచుకున్న విషయం మనసుకు చాలా హత్తుకునేది. జనపదం లోని బేలతనం, రాజా జమీందారుల ఘోరాలు, పసిడి ప్రేమ, ఒక యువకుని తాపత్రయం. కాకపోతే ఇక్కడ కవిత్వం ప్రధాన మైనది. ప్రకృతితో పాటు కథ సాగిపోవాలి. తొలి పాటలో ప్రధానమైన మాట- మెరీ దునియా, మేరే సప్నే మిలేంగే షాయద్ యహీన్…అక్కడ వంగిన ఆకాశం, భూమిని కలుసుకున్న తీరును ఈ విషయం తొ ముడి పెట్టారు. అలాగే చివరి పాటలో అతను  పొందినది అనుకున్నది, పోగొటుకున్నందుకు బాధ పడటం అనేది ఒక భావుకుని వ్యవహారం-రూఠే హైన్ జానే క్యోన్ మెహ్ మాన్ వొ మెరే దిల్ కె!టూటే హువె  ఖ్వాబోన్ నే…

సినిమాలో పాత్రల ప్రవేశం ఆ రోజులకే ఎంతో ఆలోచనతో చేసినట్లు కనిపిస్తుంది. దిలీప్ కుమార్ ఒక నాణేం పైకి విసిరినప్పుడు చెట్టు మీద నుంచి దానిని పట్టుకుని జానీ వాకర్ దిగుతాడు. అలాగే సంతలో చిన్న పిల్లవాడి మీదుగా గుర్రాన్ని దాదాపు నడుపబోయిన ప్రాణ్ విలన్ గా ప్రవేశిస్తాడు. జానీ వాకర్ పాత్రపోషణ తెలియకుండా ఆకట్టుకుంటుంది.
‘ అమ్మాయిలు ఎటు వెళుతున్నారు? ‘, అని దిలీప్ కుమార్ అడిగితే ‘ ఇటు రానప్పుడు ఎటు వెళితే ఏమిటి? ‘ అంటాడు జానీ వాకర్!

సినిమాలో  డి సా ల్వ్ పధ్ధతినీ, ఒక దృశ్యానికీ, మరో దృశ్యానికీ గల లింకును జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవటాన్నీ చూడవచ్చు.

వైజయంతీ మాలా బాలీ పేరు మధుమతిగా మరి మార్చుకున్నదేమో! ఆ నాట్యం లేకపోతే పాత్ర ఎక్కడికి వెళ్లేదోననిపిస్తుంది. జానపదం నృత్యానికి అణువుగా సలిల్ అల్లిన సంగీతం చెరగని ముద్ర వేసింది. సినిమా యావత్తూ ఒక జలపాతం ధారగా ఆ కొందలలో లోయలలోంచి అలా జారిపోతున్నట్లు సంగీతం వినిపిస్తూ ఉంటుంది.
‘ జుల్మీ సంగ్ ఆంఖ్ లడీ…’ పాట సలిల్ చౌధరీ హృదయం లోని చిన్న పిల్లవాడి కేరింత ఏమో అనిపిస్తుంది. జాన బెత్తెడు కాదు జానపదం, సాహిత్య సంగీత ఙ్ఞాన పథం మన జానపదం!

‘బిఛువా ‘ పాటలో వైజయంతీ మాలా ఒక చిత్రమైన మిశ్రమం చూపించింది. ఒక సారి తిన్నగా నిలబడి పాదాలు ఏ మాత్రం కదపకుండా ఒక విన్యాసం చూపిన తీరు నటనకీ, నాట్యానికీ ఎన్ని పాళ్లు సరిపోవాలో అని ఆలోచించగలిగే వారికి ఒక  చక్కటి పాఠం!
గ్రేస్-నీ పేరు వైజయంతి!

 ~~~***~~~

కిత్నీ భయానక్ రాత్ హై-ఈ చివరి సన్నివేశం లోని మాట, కెమెరా వర్క్, వెనుక పిడుగుల శబ్దం వినిపిం చడం  మీద చాలా వ్యాఖ్యలు వచ్చాయి. శబ్దం ఆ మాట ముందు వినిపిస్తున్నప్పుడు బిమల్ రా య్ ఎన్నో సార్లు కట్ చేశాడుట. అన్నీ ఒక సారే జరగాలి అన్నాడు దర్శకుడు.ఇదే ఘటనకు, ఘటనను ప్రదర్శించే దర్శకుని ఆలోచనకూ ఉన్న బంధుత్వం. తెర మీద జరుగుతున్నదానిని నేను చూపించటం లేదు. తెర మీద జరుగుతున్నదానిని మీతో పాటు నేనూ చూస్తున్నాను! నేను ఇది చూస్తున్నాను అని మీకు చెప్పటంతో నా సినిమా ప్రారంభమవుతుంది.అది జరిగి పోతుంది…

~~~***~~~

లతా మంగేశ్కర్ స్వరం ఆ గాలులలో ఎక్కడో ఖచ్చితంగా అతుక్కుని పోయి ఉంటుంది. ‘సలిలంగా ‘ సాగిపోయింది మరి. ఆయన సమకూర్చిన పాటలు సాహిత్యంలోంచి దూకిన తరంగాలు-ఉదాహరణకి దిల్ తడప్ తడప్…నిజంగా ఆ సన్నివేశంలో ఉన్న ప్రేమికుని గుండె లోని శబ్దాన్ని శబ్దం లోకి దింపాడా అనిపిస్తుంది.దర్శకుని హృదయంతొనూ, కథాంశంలోని మర్మంతోనూ, కెమెరా వర్క్ తోనూ,ప్రకృతితోనూ,భావ విన్యాసంతోనూ సంగీతం కలసి నాట్యం చేసిన తీరు-ఇక్కడ మేజిక్ ఉంది. ఇక్కడే ఉంది.

~~~***~~~

ఈ చిత్రం ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను తీసుకుంది. వాటికంటే ఈ చిత్రం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలోని చిత్ర దర్శకులను కూడా ఆలోచింపచేసింది. ఈ కథను ఆధారంగా చేసుకుని అలా సినిమాలు వివిధ భాషలలో వస్తూనే ఉన్నాయి, వస్తాయి కూడా.
సుధేందు రా య్ గారికి ఈ చిత్రానికి అందించిన ఆర్ట్ డైరెక్షన్ కు అవార్డు లభించటం గణనీయం.

ఒక చిత్రకారుడు, ఒక కవి, ఒక గాయకుడు, ఒక రచయిత అలా నా ప్రపంచం, నా కలలు అనుకుంటూ కూర్చుని ఉన్న ప్రతి చోటా, ప్రతి సారీ అక్కడ ఒక బాబూజీకి ఒక మధుమతి దొరకాలనిపిస్తుంది…ప్రకృతి కూడా ఆ మువ్వల సవ్వడికి స్పందిస్తుందనిపిస్తుంది…

 ~~~***~~~

‘ హాఫ్ మూన్ ‘, చిత్రం పై వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


 

ఒక కుర్డిష్ పాటగాడు తన కొడుకులతో కలసి ఒక ప్రొగ్రాం ఇవ్వటం కోసం ఇరాక్ కు బస్సులో బయలుదేరుతాడు…

నిజానికి కథ ఇంతే!

సినిమా చూసే వారికి చూపిస్తున్న వారి బాధ ఆ ప్రయాణంలో ఎక్కడో అక్కడ వెంట తగులుకుంటుంది. దర్శకుని ఆలోచన కూడా దాదాపు అదే! ఎంచుకున్న విషయం-సంగీతం. చూపిస్తున్నవన్నీ అద్భుతమైన కొండలు,లోయలు, టర్కీ, అజెర్బైజాన్, ఇరాన్, ఇరాక్ ప్రాంతం. భూమి, ఆకాశం…ఇది తెర మీద సాగిపోతు ఉంటాయి. ఈ గాయకుడు ఆ ప్రాంతంలో ఎంతో పేరు ఉన్నవాడు. చివరి సారి పడేందుకు వెళుతున్నాడు. అతను ఒక అమ్మాయిని ఆ బస్సులో దాచి పెట్టి కార్యక్రమంలో పాల్గొనేందుకు తీసుకుని వెళుతున్నాడు. (ఇరాన్ లో అమ్మాయిలు పాడేందుకు లేదు!). ప్రయాణం పూర్తి కాదు. ఆ గాయకుడు మిగలడు!

ఇది ఒక ఆబ్స్ట్రాక్ట్ విషయాన్ని ఎంతో నేర్పుతో కనుల ముందు నిలబడి ఉన్న పరస్పర వైరాల నేపథ్యంలో తెర మీద ప్రతిబింబించే ప్రక్రియ.
సంగీతం, ఆకాశం, ప్రకృతి…ఇవన్నీ అనంతాలు.నువ్వెవరు?, నేను ఫలానా, లైసెన్స్ ఏదీ? అమ్మాయి బయటకి ఎలా వస్తుంది? ఈ దేశం, ఆ దేశం…ఇవి మన చుట్టూ ఉన్న చెత్త! ఇవి వదిలించుకుని విదిలించుకుని ఆకాశం వైపుకి పయనించాలీ అనుకున్న వాడికి మిగిలేది చివరికి ఆ ఆకాశమే…ఆ గాయకుడు అలా ఆకాశం వైపు చూస్తూనే మంచులో ఒక పేటికలో పడుకుని ప్రాణాలు విడుస్తాడు.

ఇక్కడ తత్వ చింతన ఉన్నది. అందరికీ ఏదో రకమైన పరిస్థితి తప్పదు. అయినా గమ్యాన్ని ఎంచుకుని ప్రయాణం చేయటమే సాధన మార్గం. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ప్రకృతితో కలసిపోవటమే మోక్షం! ఎంచుకున్న ప్రయాణమే గమ్యం!

చిత్రంలో కొన్ని కదిలించే సన్నివేశాలుంటాయి. వేయికి పైగా సంఖ్యలో పాటలు పాడే స్త్రీలను బహిష్కరించి ఒక చోట ఉంచుతారు. దారిలో వారంతా ఈ గాయకుని బృందానికి స్వాగతం పలికి పాట పాడతారు.

ఒక పల్లెటూరులో మరొ పేరు గల గాయకుడు ఇతను వస్తున్నాడు అనే వార్త విని తట్టుకోలేక చనిపోతాడు. శవపేటికలో బృందంలో ఒక గాయని పాడినందుకు అతను కదలినట్లు ఈ గాయకునికి కనిపిస్తుంది. మరల పైకి తీయించి డాక్టర్ చేత పరీక్ష చేయిస్తాడు. ఒక స్త్రీ గళం లో పాట అనేది ఆ ప్రాంతం వారు నోచుకోకపోవటాన్ని ఇటువంటి ఘటనలో చూపించటం ఆశ్చర్యమే కాదు దర్శకుడు ఎంత లోతుకు వెళ్లాడా అనే ఆలోచన కూడా కలిగింది.

బస్సులో సైనికులకు దొరికి పోయిన అమ్మాయి ప్రయాణం చివరి దశలో చిత్రంగా బస్సు పై నుంచి దిగి వచ్చి ఆశ్చర్య పరుస్తుంది. ఈమె ఎలా వచ్చిందీ. నేను అందరినీ ఇరాక్ తీసుకుని వెళతాను అని చెప్పి లాక్కెళుతుంది. ఎవరూ ఎకడికీ వెళ్లరు. గాయకుడిని ఒక చోట నిలబెట్టి మరో వైపు వెళుతుంది. నిరీక్షించి, నిరీక్షించి అతను ఛలికి కాపాడుకునేందుకు అక్కడ ఉన్న పేటికలో పడుకుని ప్రాణాలు విడుస్తాడు. ఆమె వచ్చి ఆ పేటికను లాక్కుంటూ ఆ కొండల వైపు వెళ్లిపోతుంది…

కల్పనలోనే బ్రతుకు, కల్పనతోనే చావు అని కళాకారుడికి ఈ కథ చెబుతున్నట్లు ఉంది!

ప్రారంభంలో సగం చంద్రుడు ఉన్న రోజున కీడు జరుగవచ్చును అని ఇతనికి చెబుతారు.
ఇంకో విధంగా ఆలోచిస్తే హాఫ్ మూన్ సింబాలిసం అటువంటిదే. ఒక చీకటి గదిలోంచి ఎక్కడో గోడలో ఉన్న చిన్ని కన్నం లోంచి సూర్య రశ్మిని చూసి దాని వైపు చూస్తూనే అనంతమైన ఆకాశాన్ని ఊహించుకుని నేను స్వతంత్రుడను అనుకున్న ప్రతి వాడికీ మిగిలేది సగమే…ఊహ ఒకటే!

~~~***~~~

2007 లో వచ్చిన ఈ కుర్డిష్ చిత్రం దర్శకుడు బహ్మన్ ఘోబాది. ముఖ్య పాత్రలో నటించిన ఇస్మైల్ ఘఫారీ పాత్ర పోషణ చాలా బాగుంటుంది.మొజార్ట్ 250వ వర్ధంతిని పురస్కరించుకుని నాలుగు దేశాలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది.
ఇస్తాన్ బుల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2007,2006 లోని సెన్ సబాస్టియన్ చిత్రోత్సవం లోనూ పలు అవార్డులు తీసుకున్న చిత్రం ఇది.

~~~***~~~

‘పాకీజా’-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


ఎండలో తిరుగుతూ ఒక చెట్టు క్రింద చల్లని నీడలో కొద్ది సేపు నిలబడితే ‘ సరె రాహ్ చల్తే చల్తే…’ అనిపించి ప్రాణం కుదుట పడుతుంది. ఎన్నో గొడవల మధ్యలో ఒక సారి పాకీజా చిత్రం పూర్తిగా చూసినప్పుడూ అలాగే అనిపించింది. అది వరకు చాలా సార్లు చూసిందే. అయినా లతా మంగేశ్కర్ మేజిక్, ఆ కథనం, దృశ్యాలు, ఆ రైలు, కూత, నటీ నటుల విన్యాసాలు …ఇవన్నీ కలిపి సంపూర్ణమైన భోజనం చేసినట్లు తృప్తిగా ఉంటుంది. 

~~~***~~~

కమల్ అమ్రోహి, మీనా కుమారి తొలుత ఈ చిత్రం గురించి 1958 లో ఆలోచించారు.14 సంవత్సరాల తరువాత తెరకెక్కిన ఈ చిత్రం ఒక విచిత్రం. తెరకెక్కిన 

కొద్ది రోజులకే మీనా కుమారీ జీవితం మీద తెర పడిపోవటం కూడా బాధగా ఉంటుంది.

 ఉత్తర్ ప్రదేశ్ జమీందారీ, అక్కడి కళాపోషణ మధ్యలో ఒక ప్రేమ వ్యవహారం,సంప్రదాయానికీ సరసమైన సహజమైన ప్రేమకీ ఉండే వివాదానికీ,  ఆ భారీ సెట్టింగులు, అతి సూక్ష్మమైన వస్తువునీ చిత్రీకరించటం,సాహిత్యం, సంగీతం, నేపథ్య సంగీతం అన్నీ తోడవుతాయి ఈ చిత్రం లో.
  

శాహాబుద్దీన్ నర్గిస్ అనే ఒక తవాయఫ్ ని ప్రేమించి ఆ నరకం నుంచి విడిపిస్తానని చెప్పి వివాహం చేసుకునేందుకు ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటిలోని హకీం గారు ఒప్పుకోరు. నర్గిస్ అవమానం భరించలేక కబ్రిస్తాన్ కి వెళ్లిపోయి శహాబుద్దీన్ కూతురుని కని ఒక లేఖ వ్రాసి చనిపోతుంది. ఈ అమ్మాయిని ఆమె ‘ఖాలా ‘ తీసుకుని వెళ్లి పెంచుతుంది. ఆమె పేరు సాహిబ్ జాన్ (తరువాత పాకీజా). తన కూతురును వెతుక్కుంటూ శాహాబుద్దీన్ ‘ కోఠీ’ కి వస్తాడు. ముజ్రా లో కూర్చుంది, మర్నాడు రండి అని కిందకి వచ్చి చెబుతుంది సాహెబ్ జాన్ ఖాలా. అతను బండీ ఎక్కి వెళ్లిపోతాడు. మనకి తన కుడు చేయి అటు చూపించి అటు తిరిగి కూర్చున్న సాహెబ్ జాన్ (మీనా కుమారీ) కనిపిస్తుంది. వీళ్లే కదా…ఇన్ హీ లోగో నే…పాట ప్రారంభమవుతుంది. ఇంత వరకూ సినిమాకు ఒక ఉపోద్ఘాతం.కానీ తరువాతది మనకి ఒక చరిత్ర-ఒక లిజెండ్!

~~~***~~~

సినిమాలంటే ఇష్టపడే వారు, ఆలోచించే వారు ‘పాకీజా ‘ చూడకుండా ఉండరు. ఇందులో ఒక భావ విన్యాసం ఉంటుంది. క్రిస్టలైసేషన్ కనిపిస్తుంది. ఎక్కడ శబ్దం, ఎక్కడ నిశ్శబ్దం, ఎక్కడ మాట, ఎక్కడ పాట, ఎక్కడ కేవలం భావ ప్రదర్శన ఉండాలీ, ఇవి ఏ పాళ్లలో ఉండాలీ అని తెలుసుకోవాలంటే రి వైండ్ చేసుకుని చూసుకోవచ్చు. చాలా చోట్ల కెమెరా మాట్లాడుతుంది…

ఘులాం మొహమ్మద్ ఇచ్చిన పాటలు అలా గాలిలో ఇప్పటికీ ఎప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. పాటలు నలుగురు కలసి వ్రాశారు-మజ్రూహ్ సుల్తాన్ పురి, కైఫీ ఆజ్మీ, కైఫ్ భోపాలీ, కమల్ అమ్రోహీ. సాహిత్య సంగీతాలు లత లాగా పెనవేసుకుంటాయని అనకూడదు. ఎక్కడో చక్కని మల్లె పూల సుగంధం వచ్చినప్పుడు అటు వైపు ఎలా వెళ్లి కూర్చోవాలనిపిస్తుందో సంగీఅతం సాహిత్యం వైపు అలా లాక్కెళుతుంది.

చల్ తే చల్ తే… ఘజల్ అద్భుతమైన సమయం లో ముందుకు వస్తుంది. సరోద్ లోని మేజిక్, ఆ చిన్న పంక్తులలోని భావాలు ఆలోచింప చేస్తాయి. యె చిరాగ్ బుఝ్ రహే హైన్…మెరే సాథ్ జల్తె జల్తే…ఈ పటలో మీనా కుమారీ ముందు రెండు -గడచిన జీవితం, రైలులో తారసపడ్డ వ్యక్తి వ్రాసిన లేఖ వలన ఏవో ఆశలు…ముందు ముజ్రాలో కూర్చున్న అభిమాని-ఇన్ని కలసి అక్కడ ‘ ప్రదర్శన ‘ ఇవ్వాలి. ఆమెకే చేతయింది. ఒక సారి ఆలోచిస్తే అక్కడ అటువంటి ఘజల్ పడకపోతే ఎలా ఉండేదో అనిపిస్తుంది. కథనానికి, ట్రీట్మెంటుకీ వస్తే పటలలోని తేడా గమనించాలి.’ఇన్ హీ లోగో నే ‘ పాటలో , అలాగే థాడే రహియో పాటలో ఆమె నాట్యగత్తెగా చలాకీతనం, అందులోనే హుందా తనం చూపిస్తుంది. నాణేల మూట పెట్టిన వాడి దగ్గర చిలిపిగా నవ్వుతుంది. ఈ ఘజల్ దగ్గర అవి ఉండవు. ఒక విరహిణి చూపే భవ ప్రదర్శబ్నలోకి సున్నితంగా జారి పోతుంది. ఒక పరిస్థితిలో ఒక భావ ప్రదర్శనను ఎంచుకో గలిగితే మరొక పరిస్థితిలో సూక్ష్మమైన మార్పును చూపించవచ్చు. నటనలోని ఒక చిన్న మాట ఇది!
 
 

సీనుకీ సీనుకీ మధ్య దృశ్య పరిచయం దర్శకుని ప్రతిభకు అద్దం పడుతుంది. ‘నేను తవాయఫ్ ను ‘ అన్నప్పుడు ఫ్రీజ్ షాట్. దాని తరువాత రాజ్ కుమార్ ఆమెను కింద నుంచి లేపుతాడు. ఈ లోపల ఆకాశం కనిపిస్తుంది. ‘ చలో దిల్ దార్ చలో…’ ఇది పాట చిత్రీకరణలో ఒక సిలబస్!
మొత్తం సినిమాలో మగ గొంతు కూడా పాడే పాట ఇది ఒక్కటే.
 మొహమ్మద్ రఫీ గారు లతా గారితో గళం కలిపి కొద్ది సేపు పడారు. అది చాలు. పాట మధ్యలో ఒహోహో…అని పై స్థాయిలో ఆయన రాగం తీసినప్పుడు నిజం గానే ఈ కట్టు దిట్టాల నుండి అందరం అక్కడ చూపించిన చంద్రుడు, మేఘాల లోకి సునాయాసంగా వెళ్లిపోతాం…

~~~***~~~

తన ఇంటిలో రాజ్ కుమార్ చెబుతాడు-యెహ్ ఏక్ దల్ దల్ హై, యెహ్ బడీ ఖతర్ నాక్ జగహ్ హై!
అఫ్ సోస్ కి కుఛ్ లోగ్ దూధ్ సే భీ జల్ జాతే హైన్!
…ఒక నవ తరం ఆలోచించ వలసిన విషయాల మీద కొన్ని ప్రతి బింబాలు కనిపిస్తాయి.

ఒక రైలు అలా రాత్రి వేళ వెళ్లినప్పుదల్లా ఎక్కడో ఒక సంగీతం, ఒక పాట, మరేదో ఆలోచన…ఆ కూత మరోలా కూస్తూనే ఉంటుంది!

~~~***~~~
 

1992 లో సినీ విమర్శకుడు పీటర్ వోలెన్ ‘ పాకీZఆ ‘ను 10 అత్యద్భుత చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇది ‘ సైట్ అండ్ సౌండ్ ‘ పోల్ లో (అభిప్రాయ సేకరణ)తేలిన విషయం.

కమల్ అమ్రోహీ ఒక లెన్సులోని తత్వాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పగలడు. ఆయన దగ్గర ఉన్న ఒక లెన్సును పట్టుకుని దీని ఫిల్మ్ ఫోకస్ లో లేదు అని అన్నాడుట. దానిని లండన్ లేబ్ వారు పరీక్షించి ఫోకస్ లోనే ఉందని చెప్పారుట. అయినా ఆయన వినలేదు. అప్పుడు అమెరికా వాళ్లు పరీక్షించి ఇది 1/100 పరిమాణం లో ఫోకస్ లో లేదు అన్నారుట. ఆ తరువాత 35 ఎం. ఎం కెమెరాలో పెట్టగలిగిన ఆ లెన్సుని 20 సెంచురీ వారు కమల్ అమ్రోహీకి బహుమతిగా ఇచ్చారుట…

దృష్టి కలిగిన వాడే దర్శకుడు…తీర్ ఎ నజర్ దేఖేంగే, జఖ్మ్ ఎ జిగర్ దేఖేంగే…

~~~***~~~

…చాలా చెప్పవచ్చు. ఒక కవిత హృదయంలో పాడుతూ ఉంటుంది. ఒకటి కాగితం మీద కదులుతూ ఉంటుంది. ఒకటి మౌనంగా పెయింటింగులోంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఒకటి తెర మీద అలా సాగిపోతుంది. అలా మెరిసి అలా మన లోపలికి మాయమవుతుంది.

కమ్మనైన ఆలోచనతో ఏ బొమ్మ కలసిపోయినా ఒక జీవనదిలా సాగిపోతుంది…

న కభీ ఖత్మ్ హో ఉల్ఫత్ కా సఫర్…!
~~~***~~~

‘ ద టర్మినల్ ‘-చిత్రం పై వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


‘ ద టర్మినల్ ‘ అనే చిత్రం 2004 లో తయారయినది. స్టివెన్ స్పీల్బర్గ్ నిర్మించిన చిత్రాలలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందిన చిత్రం.టాం హేంక్స్ విక్టర్ నవ్రోస్కి అనే పాత్ర పోషించారు. కర్కోసియా అనే ఒక దేశం (కల్పించబడినది) నుంచి న్యూ యార్క్ వచ్చి ఆ కార్కోసియా అనబడే దేశంలో విద్రోహం జరుగుతున్నందుకు దౌత్య సంబంధాలు నిలచిపోయి ఈయన పాస్ పోర్ట్, వీసా చెల్లక న్యూయార్క్ నగరం లోకి ప్రవేశం ఇవ్వకుండా ఆపెస్తారు. గేట్ నంబర్ 67 అడ్రసు అయి కూర్చుంటుంది. విక్టర్ ఆ టర్మినల్ లో గడిపిన రోజులు, చివరకి నగరం లోకి వెళ్లగలగటం, అలాగే ఒక మ్యుసిషియన్  సంతకం అతని తండ్రి కోరిక మెరకు పొందటం ఇవన్నీ చిత్రంలో హృద్యంగా   చూపించటం  జరిగింది.

నిజ జీవితంలో ఇది జరుగవచ్చు అనిపించే ఒక పరిస్థితి-ఇది మొదటి అంశం.
రెండు-కథనం పూర్తి హాస్య రసంతో సాగే చక్కని కథనం-ఇది రెండు.
మూడవది ఒక టర్మినల్ లో అన్ని రకాల ఉద్యోగస్తులూ, అన్ని రకాల ప్రయాణీకులూ ఉంటారు. ఎవరి పనిలో వాళ్లున్నప్పటికీ ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య నుంచి అందరి స్పందనలు దర్శకుడు ముందుకు తీసుకుని వస్తాడు. అలాగే జీవితం సాగిపోతూ ఉంటుంది. టర్మినల్ లో రోజులు  గడుస్తూనే ఉంటాయి, కథ సాగిపోతూ ఉంటుంది. అది దర్శకుని ప్రతిభ.
ప్రేక్షకుడు  విక్టర్   తో పాటు పూర్తి సహవాసం చేస్తాడు. చివరకి అతను ‘ నేను ఇంటికి వెళుతున్నాను ‘ అని అంటాడు-(టేక్సీలో కూర్చుని). అతనితో పాటు ప్రేక్షకుడూ ఇంటికి వెళతాడు. అంత మంచి ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది.ద టర్మినల్ నిత్య జీవితంలోని ఎన్నో అంశాలను సున్నితమైన హాస్యంతో స్పృశిస్తుంది. ఆఫీసరు ‘ నువ్వు నీ దేశానికి వెళ్లాలంటే భయపడుతున్నావని చెప్పు, ఎసిలం ఇస్తాం ‘ అంటాడు. దానికి ముందు ‘ దేనికి భయపడతావు? ‘ అంటాడు.
‘ దయ్యాలంటే భయపడతాను ‘ అంటాడు విక్టర్!
ఒక విదేశీయుడు తండ్రి కోసం మందులు తీసుకువెళ్లటాన్ని టర్మినల్ అధికారులు ఆపుతారు. అతనితో మాట్లాడటానికి విక్టర్ సహాయం కోరుతారు. విక్టర్ చివరకు ఆ మందులు మేకలకోసమని చెప్పించి సహాయ పడిన తీరు అద్భుతంగా ఉంటుంది.
అలాగే ఒక ప్రేమ జంటను ఆ టర్మినల్ లోనే కలుపుతాడు.
కృత్రిమం కాకుండా అవి అలా జరిగిపోతాయి!టాం హేంక్స్ సామాన్యుడు కాడు! కథ నాటకీయతకు సంబంధించినది అయినప్పటికీ, తన పాత్ర పోషణలో నాటకీయతకు ఎంతో ఆస్కారం ఉన్నప్పటికీ ఎక్కడా టాం హేంక్స్ కనపడడు. విక్టర్ నవోర్స్కీయే కనిపిస్తాడు. ప్రత్యేకంగా నటుడు తన నడక మీద చూపించిన శ్రధ్ధ నటులు చాలా మంది ఒక్క సారి పరిశీలించి చూడాలి. మూడు కోణాలు ఈ విషయంలో జాగ్రత్తగా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి మాట్లాడే తీరు-స్లోవేనియన్ స్లేంగ్ ఒక్కటే కాకుండా ఆఫీసరు ముందు ఏదైనా చెప్పే ముందు మాటను లాగి ఒక చిన్న పిల్లవాడు ఎదో కక్కినట్లు పూర్తి చేయటం పాత్ర పోషణకు కలసి వచ్చిన ఒక అంశం. రెండు, నడక-నా అభిప్రాయంలో ఈ పాత్ర అటూ ఇటూ పరుగులు తీసే పాత్ర కాబట్టి ఈ ప్రక్రియ మీద నటన చాలా మటుకు ఆధారపడి ఉన్నది. సగం పని ఇక్కడే పూర్తి అయిపోయింది!
మూడు- స్టిములస్. ప్రతిక్రియలను ప్రదర్శించిన తీరు పాత్రపోషణలో ఒక పాఠ్యపుస్తకం లా కనిపించింది…బెల్లోవర్ ఒక సారి చెప్పినట్లు ఒక మంచి ఘటన, ఒక చక్కని చోటు కలసినప్పుడు రెండు సమానాంతర ప్రక్రియలు అలా సాగిపోతాయి-ఒకటి ప్రేక్షకుని కల్పనా శక్తి, ఆ క్రమం, రెండు-సినిమా చూపిస్తున్న ఘటనా క్రమం. ఈ రెండూ నటుని మీదుగా సాగిపోతున్నప్పుడు ఎంతగానో ఆకట్టుకుంటాయి!ఎన్నో ఆలోచనలను కూడా రేకెత్తిస్తాయి. ఇదే సృజనాత్మకతలో ఉన్న జీవాధారం. నిజమైన కళాకారుడు లేదా రచయిత లేదా దర్శకుడు ఇది పండనంతవరకూ తృప్తి చెందడు!

సీనుకీ సీనుకీ మధ్య కటింగు వ్యవహారంలో పోషిస్తున్న రసానికి అణువుగా దర్శకుడు ఒక హార్ష్ రియాలిటీ-అంతా బాగుంది అనుకున్నప్పుడు ఆ టర్మినల్ లోని ఒక వైపరీత్యం ఎదురవుతూ ఉంటుంది. ఈ చమత్కారం లేకుండా చాలా మంది ఇటువంటి ప్రక్రియలను ప్రయత్నించి బాధ పడి బాధ పెట్టినవారున్నారు. కామెడీ ఈస్ సీరియస్ బిసినెస్! ఒక రాగాన్ని రవళించి ఎక్కడెక్కడికో వెళ్లిపోయినా మరల శృతి పోకుండా గమనించుకుంటూ ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, స్వరాలేమీ మార్చలేదు అని చెప్పేటట్లుగా గాయకుడు పాడితే ఆ రుచి వేరు!లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో నియమాలు, విధానాలు, పోటీలు, పోట్లాటలు అలా ముందుకు వస్తూనే ఉంటాయి. ఏది ఎలా ఉన్నా మానవ విలువలు, మామూలు మనిషి దేనికి నిలబడతాడు, దేని కోసం బ్రతుకుతాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడికి వెళ్లినా చివరికి ఎక్కడికి చేరుకోవాలని చూస్తాడు…ఇవన్నీ జీవిత సత్యాలు. వీటిని ఒక సందేశం లాగా చెప్పరు. విక్టర్ వృత్తి చేత ఒక కాంట్రేక్టర్! అతను పని ముట్లతో అద్భుతమైన పని చేయగలడు. ఆ పనే అతన్ని నిలబెడుతుంది. ఎవరు ఏ పాత్రలో ఉన్నప్పటికీ ప్రజల సంపర్కంతో ఉన్న సిబ్బంది కూడా చివరికి మనుషులేనని దర్శకుడు చెప్పాడు. టర్మినల్ ఒక కుటుంబంలా కనిపిస్తుంది. అందుచేత విక్టర్ విక్టర్ లాగానే ప్రవర్తించి అన్ని రోజులూ అక్కడ ఎదుర్కొని చివరికి గెలవటం అనేదే పైన ఉదహరించిన విషయాలన్నిటికీ ఒక అంతర్లీనమైన సందేశం!

నీ వ్యవస్థా రైటే! నా అవస్థా రైటే! మధ్యలో…

~~~***~~~

మెహ్రాన్ కరీమీ నస్సేరీ అనే ఒక ఇరానీ శరణార్థి పారిస్ లోని విమానాశ్రయం లో చాలా సంవత్సరాలు ఈ విధంగా ఉన్న తరువాత అతను వ్రాసిన ఒక పుస్తకాన్ని  ఆధ్హరంగా చేసి స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని తీశాడని చెబుతున్నారు. దానికి అతనికి డబ్బు కూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది. జానుజ్ కానిన్స్కీ సినిమాటోగ్రఫీ, జాన్ విలియంస్ మ్యూసిక్ కూడా మంచి స్థాయిలో మనకు కనిపిస్తాయి. చిత్రంలో ఎక్కడైనా విక్టర్ తన కుటుంబం గురించి తలచుకున్న సన్నివేశం ఒక సారి చూపిస్తే బాగుండేదనిపించింది…

~~~***~~~

Previous Older Entries Next Newer Entries

అనుసరించు

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: