సుబ్బారావు మరల అరుగు మీదకి వచ్చాడు!
29 జూన్ 2010 వ్యాఖ్యానించండి
in శ్రీ-రచనలు
సుబ్బారావు చాలా రోజుల తరువాత అరుగు మీదకొచ్చి చెయ్యి పైకెత్తి నాయకుడిలాగా అటూ ఇటూ ఊపాడు.
‘ఎవరూ లేరు ‘,ప్రక్కనున్న శ్రీమతి చిన్నగా,చక్కగా చెప్పింది.
ఎప్పటిలాగే గోడకి ఆనుకుని కూర్చున్నాడు సుబ్బారావు.
‘నీకు కనబడరు.ఈ చెయ్యి నేను జనం కోసం చూపించలేదు.ఈఅరుగు ప్రపంచానికి ఒక కిటికీ!
ఇక్కడ ఆలోచనామృతం అలా జాలు వారుతుంది.’
ఎదురింటిలోని చిన్న కుర్రాడు గేటు తీసి ఇవతలకొచ్చి చక్కగా గోడ తడిపేశాడు…
ఇటు తిరిగి ‘గుడ్ మార్నింగ్!’ అన్నాడు.
‘జాలువారింది!’
‘కరెక్ట్!’
‘ఇంతకీ చేతులు ఎవరికి చూపించారు?’
‘నా లాగ ఎందరో!’
‘ఎవరో?’
‘ఈ ఇళ్లల్లో కాఫీ కోసం కలవరించి గొంతు మూగబోయి తిరిగి మంచం మీదకి వెళ్లి కాళ్లు జాపేసిన వారు!’
‘అయ్యో నిజమే!’ అంటూ ఆవిడ లోపలికి పరుగు తీసింది.
కాఫీ కప్పు తో వచ్చింది. ఈ సారి ప్రక్కనే కూర్చుంది.
‘పొద్దున్నే ఇలా దిష్టి బొమ్మల్లా ఇద్దరం అరుగు మీద కూర్చుంటే బాగుండదేమో చిట్టీ…’
‘బాగుంటుంది అని నా అభిప్రాయం!’
‘ఛా…’
‘అవును. నా లాగ మరెందరో!’
అటూ ఇటూ చూశాడు.’ఎవరు?’
‘పార్లమెంటులో స్త్రీలకు బిల్లు కోసం గొడవ చేస్తూ కూడా భర్తల చేతికి కాఫీ అందించే వారు!’ అంటూనే ఎవరికో చెయ్యి చూపించింది.
‘ఈ చెయ్యి ఎవరికి?’
‘ప్రాక్టీస్…రేపు కాఫీ గుర్తుకే వోటు వెయ్యండి అని అడగాలి కదా?’
‘అంటే? పార్టీ పెడతావా?’
‘మీకు అస్సలు లోకఙ్ఞానం లేదు.మహిళా బిల్లు ఎందుకు అనుకుంటున్నారు?’
‘మగవాళ్లు కాఫీ పెట్టాలని!’
‘దానికి బిల్లు అక్కరలేదు.అటు చూడండి.’
అటు తిరిగాడు. పక్కింటాయన అప్పుడే ఒక బాల్టీలోంచి ఓ గుడ్డ తీసి పిండి ఇటు వైపు విసిరేసినట్లు విసిరేసి ఆరేశాడు!
‘అది చీరె కాదనుకుంటాను చిట్టీ…’
‘కాకపోవచ్చు.లుంగీ అయితే మటుకూ,మీరు తువ్వాలయినా అలా పిండారా?’
‘ఇంతకీ బిల్లెందుకో చెప్పలేదు!’
‘భార్యల చేత పోటీ చేయించి తిరిగి వాళ్లే రాజ్యం ఏలటం కోసం.’
‘బిల్లు రూపు రేఖలు మార్చాలి.’
‘ఎలా?’
‘పెళ్లి కాని వారే పోటీ చేయాలి!’
‘గెలిచాక పెళ్లి చేసుకుంటారు.’
‘అయిదేండ్ల వరకూ కుదరదని చెప్పాలి.’
‘కలసి ఉంటే?’
‘కలదు సుఖము!’
‘కాఫీ మీద పోస్తాను.దిక్కుమాలిన ఆలోచనలు!కాఫీ పార్టీకి రంగం సిధ్ధం చేయండి.’
‘భార్యాభర్తల మధ్య రాజ్యాన్ని పంచుకోవటమే మహిళా బిల్లన్నమాట!’
కాఫీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది చిట్టి.
~~~***~~~

ఇటీవలి అభిప్రాయములు