25 మార్చి 2010
by srikaaram
in శ్రీ-సరదాలు!


ఈ సర్పం కేరళలోని ఆరణ్ముళ పార్థసారథి ఆలయం,పథనంతిట్ట లో ఉంటుంది
21 మార్చి 2010
by srikaaram
in శ్రీ-చిత్రం
అజయ్ దేవ్ గణ్,కొంకొనా సేన్ శర్మ,పరేశ్ రావల్ నటించిన ఈ చిత్రానికి అశ్విని ధీర్ దర్శకత్వం వహించారు.ధర్మేంద్ర శర్మ గారి అద్భుతమైన ఎడిటింగ్ కీ,పరేశ్ రావల్ నటనకీ ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోగలదు.
పల్లెటూరి వ్యవహారం,పాలిష్డ్ గా కాకుండా నలుగురూ నవ్వుకునే విధంగా ఎవరైనా బంధువు మన దగ్గరకి వచ్చినప్పుడు అందరిలోకి తీసుకెళ్లినప్పుడు సిగ్గు పడుతూ ఈ కార్యక్రమం ఎప్పుడు పూర్తి అవుతుందోనని అంకుంటూ, ఈయన ఏమిమాట్లాడి మనకు ఏ మాట తెచ్చి పెడతాడోనని తెగ ఇబ్బంది పడిపోతాం…నిజానికి సామాన్యుడే మాన్యుడు.అసలు విషయం ఎల్లప్పుడూ వింతగానే కనిపిస్తుంది.మానవ విలువలు ఆత్మవంచన లేని మొండి వాళ్లలో,అన్యాయం సహించకుండా మండి పడే వాళ్లలో,పిచ్చి వాళ్లలో అలా దాక్కొని ఉంటుంది. ఆ ‘అతిథి ‘ మనకు కావాలి,కానీ మరల వద్దు. ఎక్కువ రోజులు మనకు ఆ మనిషి వద్దు.దేవుడినా కొద్ది రోజుల ఉత్సవంలోనే కావాలి.కాకపోతే సమస్య వచ్చినప్పుడు సమాధానం అక్కడి నుంచే వస్తుంది.ఒక హాస్యాస్పదంగా కనిపించే వ్యక్తిని ఎంచుకుని సగటు మానవుని జీవితం ఎంత హాస్యాస్పదంగా సాగుతున్నదో,చక్కని హాస్యరసాన్ని పండిస్తూ ప్రదర్శించాడు దర్శకుడు.
పరేశ్ రావల్ అజయ్ ఇంటికి వచ్చి ఒక చుట్టరికాన్ని తిరగేస్తాడు. సెటిల్ అయిపోతాడు.బాబుకు చక్కని దోహాలను నేర్పుతాడు. ఈయన ఎప్పుడు వెళతాడా అనుకుంటూనే ఉండగా విపరీతమైన చేష్టలు చేస్తూ అజయ్ పని చేస్తున్న ఒక సినీ నిర్మాత దగ్గర జరిగే ఒక ఉదంతంలో (చాలాసేపు నవ్వించే అంశం) ఆ నిర్మాతకు యాభై లక్షల నష్టాన్ని తెచ్చి అతని చేత అవమానింపబడతాడు.అజయ్ ఆ నిర్మాతను తప్పు పట్టి ఆత్మవంచన చేసుకోకుండా పని నుండి బయటకు వస్తాడు…
ఆ తరువాత దర్శకుడు వినాయక చవితికి సంబంధించిన ఒక పాటలోనే చాలా సింపుల్ గా సమస్యలన్నీ పరిష్కారమైనట్లు చూపించటం ఆలోచించటానికి కష్టతరమైనప్పటికీ ఆ విధంగా నాటకీయతను తెర మీద తీసుకుని రాగలగటం మెచ్చుకోదగిన అంశం.వెంటనే గణేశ్ నిమజ్జనం లో అతిథి తప్పిపోవటం,వీళ్లు పడే అవస్థ,ఆవేదన కదిలిస్తుంది.ఆయన మరల మామూలుగా ప్రత్యక్షమయి టికట్ కోసం వెళ్లానని చెబుతాడు.ఇంతలోనే ఊహించని విధంగా అసలు ఎవరి ఇంటికి అయితే ఆయన వెళ్లాలని వచ్చాడో ఆ ఇంటి వ్యక్తి అక్కడికి వచ్చి ఈయనను పలకరిస్తాడు. నిజమైన అతిథి అనిపిస్తాడు.
ఈ చిత్రంలో కూర్పు చాలా బాగుంటుంది. వినాయకుని నిమజ్జనం లో జరిగే కుమ్ములాట వ్యవహారం బాగా చిత్రీకరించారు.దశావతారం చిత్రంలో చివర సునామీ పేరుతో చూపించిన హాస్యాస్పదమైన సన్నివేశానికి ఇటువంటి టెక్నిక్ బదులు చెబుతుంది. దృశ్యానికీ, దృశ్యానికీ ఉన్న అల్లిక ఇటువంటి విషయాలతో నడిచిన కథలకి ఎంతో తోడవుతుంది.
పరేశ్ రావల్ నటించిన తీరులో ఎక్కడా అతి కనిపించదు.ఎన్నో సన్నివేశాలలో కొంత గాంభీర్యం కూడా అవసరం ఉన్నప్పుడు నేను చేసిన దానిలో తప్పేముందనే బేలతనాన్ని తేవటంతో పాత్రలో చక్కగా రాణించాడు.హాస్యరసానికి నటకరంగం మన దేశంలోనే కాదు, ఎన్నో దేశాలలో గట్టి పునాది వేసి వెండి తెర మీదకు అవలీలగా చేరి మెప్పు పొందగలిగింది.ఆ మాటకొస్తే హాస్యానికి క్రాఫ్ట్ అనేది నాటకమే తయారు చేసింది. ఆ పోలిక ఈ చిత్రంలో విరివిగా కనిపిస్తుంది.సరైన పాళ్లు దొరికి మంచి నటీ నటులు ఏకమైతే తెర మీద జరుగుతున్నదంతా మనల్ని నవ్విస్తూనే కొంత కవ్వించి ఎక్కడో కదిలించగలదు కూడా! ఇటువంటి చాలా చిత్రాలు తేలికగా విజయవంతమవుతాయి. ఫ్రాన్స్ లో ఇప్పటికీ విజయవంతమవు సగం సినిమాలు ఈ కోవకు చెందినవే!
~~~***~~~
16 మార్చి 2010
by srikaaram
in శ్రీ-ఫలములు

శ్లో: సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే
మిత్రులందరికీ వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం అందరికీ శుభములు చేకూరాలనీ, మనస్తాపాలు తొలగిపోవాలనీ,’విరోధాలు ‘ పోయి మనస్సుకు కలిగే వికృతపు ఆలోచనలు మాయమవ్వాలనీ,దేశంలోనూ, లోకంలోనూ సుఖ శాంతులు సమృధ్ధిగా ఉండాలనీ ఈశ్వరుని ప్రార్థిస్తూ…గ్రహ సంచారం పరీక్షించి ఎటువంటి ఫలితాలుండగలవో ఒక సారి చెప్పుకుందాం.
ఓం వికృత్యై నమ:!
ఈ సంవత్సరం దేశంలో అనుకోని కాలంలో వర్షాలు,ఉత్తరార్థంలో వ్యాపారంలోనూ, ఆర్థికంగానూ మంచి పరిణామాలూ,సాంకేతిక రంగంలో,వైఙ్ఞానిక రంగంలో మంచి పురోగతి,క్రీడా రంగంలో మంచి ఫలితాలు,భారతీయులకు ప్రపంచ వ్యాప్తిగా గుర్తింపు పొందు పురస్కారాలు,విదేశ వ్యవహారాలలో మంచి పురోగతి కనిపిస్తున్నాయి.
పకృతి వైపరీత్యాలు ఆగస్ట్ తరువాత విరివిగా ఉండవచ్చు.ముఖ్యంగా భూకంపాలు-నేపాల్,ఉత్తరఖండ్,నాగ్ పూర్, హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల వారికి బెడద ఉన్నది.హైదరాబాదులో ముంబయి హైవే కు దగ్గరగా ఉన్న ప్రదేశానికి మరింత సమస్య కనిపిస్తున్నది. వంతెనలు కూలిపోవటం వలన ఉత్తర వాయువ్య ప్రదేశాలలో రైలు, రోడ్డు ప్రమాదాలుండవచ్చు.
గనులు,భూ వివాదాలు,ప్రభుత్వ పథకాల విషయాలలో కొన్ని స్కాం లు ఉండవచ్చు.
సంవత్సరం ఉత్తరార్థంలో రాజకీయ జట్ల కూటమిలో మార్పులుండగలవు.
మేష రాశి: స్త్రీల మధ్య విభేదాలుండవచ్చు.మనస్తాపాలు తొలగిపోతాయి.ఉత్తరార్థంలో మంచి ఫలితాలున్నాయి.పెద్దల మాట గౌరవించటం చాలా అవసరం.ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.ఆదాయం వ్యయం వెనుక పరుగు తీస్తుంది.నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. ఈ వికృతి నామ సంవత్సరంలో మీరు తరచు చేయవలసిన పూజ-మాసానికి ఒక సోమవారం తప్పక శివునికి అభిషేకం జరిపించాలి.దీర్ఘకాలీన సమస్యలు తొలగిపోవటం శుభసూచకం.
వృషభ రాశి: ఇది అదృష్టం కలసి వచ్చే సంవత్సరం. కాకపోతే పెద్దల మధ్య భేదాభిప్రాయాలుండటం వలన కొంత వ్యవధి వృధా కాగలదు.ఆస్త్తి కొనుగోలు సంభవం.మే నెలలో చక్కని అవకాశాలున్నాయి.పిల్లలు మాట వినకపోవటం వలన కొంత చికాకు ఈ సంవత్సరం కనిపిస్తున్నది.ఆదాయం బాగానే ఉన్నది.ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఎక్కువగా దాన ధర్మాలు ఆచరిస్తే మంచి ఫలితాలుండవచ్చు. నవంబర్ మాసంలో చేసే పనులు ఆలోచించి చేయాల్సి ఉంటుంది.
మిథున రాశి: మీ ఓర్పు వలన అనుకోనివి సాధిస్తారు.మీ మీద ఉన్న అభియోగాలు తొలగిపోతాయి.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.నలుగురికీ సహాయం చేస్తారు.సెప్టెంబర్ తరువాత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మొత్తానికి ఇది అద్భుతమైన సంవత్సరం.ఈ రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య కవచం చదవటం మంచిది.ఇంటిలో ఈ రాశివారు ఎవరైనా ఉంటే వారిదే పై చేయి.
కర్కాటక రాశి:ఈ రాశి వారికి పదోన్నతులు కనిపిస్తున్నాయి.కొన్ని అప్పులు చేయగలరు.జూన్ తరువాత స్థానచలనం ఉండగలదు.వివాహయోగం బాగుంది.
ఏప్రిల్ మే నెలలలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ రాశి వారికి జులై నుండి మంచి ఫలితాలుండవచ్చు.ఉద్యోగస్తులు కోరుకున్న చోటుకు బదిలీ పొందగలరు.వ్యాపరస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించగలరు. ఈ రాశి వారు ఈ సంవత్సరం కులదైవాన్ని ప్రతి మాసం కొలవటం చాలా మంచిది.
సింహ రాశి: కొన్ని అపవాదులు ఈ సంవత్సరం మీ మీద మోపబడగలవు. ఎక్కువ భాగం మౌనం పాటించటం ఎంతో శ్రేయస్కరం.ఆలోచనల కంటే ఆలోచనల అమలు విషయంలో ఆసక్తి చూపాలి. ఈ సంవత్సరం ప్రణాలికలకు కాదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.గతంలో ఆచరించిన సత్కార్యాలకు మంచి ఫలితం లభిస్తుంది.వ్యాపారస్తులు డిసెంబర్ తరువాత మార్పులు తలపెట్టగలరు.ఈ రాశి వారు ప్రతి ఆదివారం మహాసౌరం చదవటం చాలా మంచిది.
కన్య రాశి: ఒక నిర్లిప్తత నుండి ఈ సంవత్సరం బయట పడతారు.మీకు తెలియని ధైర్యం మీలోంచి బయట పడగలదు.పలువురికి మీరు అర్థం కాకపోవచ్చు.న్యాయపరమైన విషయాలలో మీదే పై చేయి ఉండగలదు.ఆగస్ట్ లో విదేశీ యానం ఉండగలదు.జీవితం అనుకోని మార్పులకు గురి అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నవి. ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం శ్రీసూక్తం పారాయణ చేయటం చాలా మంచిది.
తుల రాశి: బంధువుల వలన చికాకులు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభాలున్న సంవత్సరం.భాగస్వామ్యానికి కొందరు ముందుకు రాగలరు.స్త్రీలు పలు రంగాలలో రాణించగలరు.ఆధ్యత్మికత వైపు మనసు లగ్నం కాగలదు.రాజకీయ రంగంలోని వారికి సంవత్సరం తొలి దశలో కంటే మలి దశలో మంచి విజయాలున్నాయి.ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి శనివారం అయినా విష్ణు సహస్రనామం చదవాలి.
వృశ్చిక రాశి: ఈ సంవత్సరం మీరు ఇష్ట పడని పై అధికారులే మంచివారని గ్రహిస్తారు.మీరు మీ తెలివితేటలతో, విచక్షణా ఙ్ఞానంతో కార్యాలను సాధించవలసియుంటుంది.జూన్ మాసంలో ఒక చిక్కు సమస్య కలవరపెట్టగలదు.జనవరి 2011 లో దీర్ఘకాల సమస్య ఒకటి పరిష్కారం కాగలదు.బంధు వర్గంలో వివాహాలు జరుగగలవు.ఈ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా సప్తశ్లోకీ నిత్యం పారాయణ చేయవలసి యుంటుంది.
ధను రాశి:మనోవాంఛలు అధికంగా ఉండు సంవత్సరం.నూతన వాహనయోగం ఉన్నది.జులై మాసంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మార్కెట్లో మే వరకు,ఆ తరువాత అక్టోబర్ నుండి పెటుబడులకు మంచిది.నూతన పరిచయాలు ఏర్పడగలవు.కుటుంబాన్ని వదిలి వెళ్లలేకపోవటంతో మంచి ఆదాయం గల మార్గాలను వదులుకుంటారు.సార్వజనిక రంగంలో ఉన్నవారు అధికంగా ప్రయాణాలు చేయాల్సి ఉండవచ్చు.ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం శ్రీదత్తస్తవం చదవటం మంచిది.
మకర రాశి: సంవత్సరం మొదటి భాగంలో శ్రమ పడి పలు కార్యాలను పూర్తి చేయవలసి యుండగలదు.స్పష్ట మైన కార్యప్రణాలిక లేకపోవటం వలన కొన్ని ఎదురుదెబ్బలు ఉత్తరార్థంలో ఉండగలవు.నూనె, గ్యాసు వ్యాపార్స్తులు మంచి లాభాలు పొందగలరు.విద్యార్థులు అధికంగా శ్రమించవలసి యుంటుంది.మార్కెటింగ్ రంగం, ఏజెన్సీలు నడుపువారికి మంచి లాభాలుండగలవు.దూర ప్రయాణాలు,ఖర్చులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మంచి ఫలితాలతోనే ముగియగలదు. ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం లక్ష్మీ అష్టోత్తరం చదవటం మంచిది.
కుంభ రాశి: కొన్ని పనులను వేగంగా పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని బాధ్యతలను ప్రక్కన పెట్టి ప్రవర్తించటం వలన సమస్యలుండగలవు. ఋణ ప్రయత్నం ఫలించగలదు.మీడియా వర్గం వారికి మంచి ఫలితాలున్నవి. రాజకీయ రంగంలోని వారు సమయానుకూలతతో వ్యవహరించి లబ్ధి పొందగలరు.మే మాసంలో సంతకాలు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చదివి చేయవలెను. ఈ రాశి వారు ఈ సంవత్సరం దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదివితే మంచిది.
మీన రాశి: ఈ సంవత్సరం ఈ రాశి వారు అనుకోని రీతిగా ప్రజల మధ్యలోకి రాగలరు.గౌరవం పెరగగలదు.విదేశాల నుండి మంచి అవకాశాలుండగలవు. విద్యార్థులకు జూన్ తరువాత విదేశ యానం ఉండవచ్చు. పరిశోధనా రంగం లోని వారికి తగు గుర్తింపు లభించగలదు. సంతానం అభివృధ్ధి లోకి రాగలదు.ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి శని వారం గోవులకు గ్రాసం వేయాం మంచిది. ఈ సంవత్సరం మీ స్వంత విచక్షణను వాడ వలసిన అవసరం యున్నది.
~~~***~~~
‘వికృతి ‘ లో మన ప్రకృతిని ,పర్యావరణాన్ని సంరక్షించే సంకల్పం చేద్దాం.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
14 మార్చి 2010
by srikaaram
in శ్రీ-చిత్రం
ఇరవై వేల కోట్లు తినేసిన ఒక ముఖ్యమంత్రి బ్లాస్ట్ కు గురయి ఆస్పత్రిలో చివరి శ్వాస విడుస్తూ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెబుతాడు.అమెరికాలో ఒక కంపనీకి ఆధిపత్యం వహిస్తున్న తనయుడు ఆ మాటను ప్రజల కోసం,రాష్ట్రం లోని అవినీతిని నిర్మూలించటం కోసం,కులవ్యవస్థలో కుళ్లిన రాజకీయాలు,అందులోంచి ఒక ‘కుటుంబ రాజ్యాన్ని ‘ ఏర్పరచిన తన పెదనాన్న పధ్ధతిని ఏరి పారేసేందుకు, తన తల్లి రాజకీయవేత్తగా కాక నాయకుడుగా ముందుకు రావాలన్న సందేశం మేరకు ఒక సంకల్పం చేసి ఒక పథకం వేసి ముందుకు వెళతాడు. ఆ వ్యవస్థను అందులోంచే ఎదిరించి రెండవ భాగంలో ఆ వ్యవస్థలోంచి ఇవతలకి వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్లి ఎన్నికలు గెలిచి నిజమైన నాయకునిగా నిలబడతాడు.శేఖర్ కమ్ముల గారు రచించి,దర్శకత్వం వహించిన చిత్రం ఇది.
~~~***~~~
మామూలుగా ఆలోచిస్తే ఇది అతి పెద్ద కాన్వాస్.రెండవ సమస్య ఏమిటంటే రాజకీయపరమైన అంశాలు నిత్య జీవితానికి చాలా దగ్గరగా అల్లుకున్నవి.వార్తా పత్రిక రక రకాల వార్తలను,విశ్లేషణలను పొందు పరచినా సెంటర్ స్ప్రెడ్ మీద సంపాదకీయం,కొన్ని ప్రముఖమైన అంశాలను ఉంచుతుంది.మొదటి పేజీ ఆ రోజు ముఖ్యమైన వార్తలను హెడ్ లైనులతో చూపిస్తుంది.
అది వార్తా పత్రికే కానీ నవల కాదు.రెండు గంటల చలన చిత్రం లోకి ఇటువంటి అంశాన్ని ఒక కథగా అల్లాలంటే అది తేలికైన పని కాదు.ముఖ్యంగా స్త్రీ పాత్రలను జోడించి నాయకుడైనా ఒక కుటుంబం,ఒక జీవితం,ఇల్లు వాకిలి ఉంటాయని మరో దృక్పథం చూపాలన్నా మరి కొంత ఆలోచన అవసరం.
ఇందులో గతంలో ఇలాంటి ప్రక్రియలలోకి వెళ్లి సమర్థవంతంగా చిత్రాలను నిర్మించిన సందర్భాలలో రెండు పధ్ధతులు మనకు కనిపిస్తాయి.ఒకటి-ఒక సంచలనం సృష్టించిన వార్త నుంచి ఆ సంఘటనను ప్రదర్శించి అందులోంచి చెప్పదలచుకున్నవన్నీ చెప్పి చివరకు ఆ సంఘటననే ప్రేక్షకుడికి గుర్తు చేసి ఆ వృత్తాన్ని పూర్తి చేయటం.రెండు-కథ నాయకుని గతం-ఒక ఫ్లాష్ బాక్ ద్వారా ఎట్టి పరిస్థితులలో ఏమి చేయాల్సి వచ్చిందో చూపించి చివరకు రాజకీయ చదరంగం ఎలా కదిలి ఎక్కడ నిలబడిందో చూపించటం. ఈ రెండు పధ్ధతులలో ప్రేక్షకుడికి ఒక కథ కనిపిస్తుంది.లీడర్-చిత్రంలో ప్రారంభం సూటిగా ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన బాంబు పేలుడుతో జరిగి వరుస పెట్టి అలా కథా నాయకుని నిర్ణయాల మీద సాగిపోవటం కనిపిస్తుంది.ఇటువంటి కథాంశాలలో చుట్టూ జరిగేవి ఎక్కువ.ప్రజలు,మీడియా గోల ఎక్కువ.ఆ ఏబియన్స్ సరిగా రాలేదు.
కథా నాయకుడు ముఖ్యమంత్రి అయి మొదటి సమావేశం జరిపిన వెంటనే ప్రత్యర్థి దాడి జరిగిపోవటం ఈ దర్శకుడు చూపించాడా అని అనిపిస్తుంది.అమ్మాయిల వ్యవహారం మీడియాకు పట్టలేదా అనిపిస్తుంది.చిత్రం రెండవ భాగంలో నరేషన్ వీటి వలన దెబ్బ తిన్నది.పతాక స్థాయిలో పోరాటం లేదు.ఫలితం ముందరే కనిపించేసింది.అది దృశ్య మాధ్యమానికి ఎంత శ్రేయస్కరమో ఆలోచించాలి.
హిందీ చిత్రం ‘ఆంధీ ‘ ఈ విషయంలో కళాఖండం.సమానాంతరంగా రాజకీయ సన్నివేశాలు అలా సాగిపోతూ ఉంటాయి.కళాత్మకంగా కథ ఒక హోటల్ యజమాని జీవితంతో పెనవేసుకుని ముందరకు సాగిపోయి తన భార్య ఎన్నికలలో పోరాడటం దగ్గర క్లైమాక్స్ ఏర్పడుతుంది.ఒక చక్కని అవకాశం-కుటుంబం,కులం,అవినీతి,అందరి ఆశయాలు,ప్రజలలోని వ్యావహారిక స్పందన,వారి స్వార్థం…ఇలా ఎన్నో కలబోసుకుని క్లైమాక్స్ ఒక సవాలుగా వచ్చినప్పుడు చివరి ఘట్టంలో నిజమైన పోరాటం ముందుకు వస్తుంది.చిత్రం లోని లైన్ ఆర్డర్ దెబ్బ తినటం వలన అది జరగలేదు.
రానా లో మంచి కంట్రోల్ ఉన్నది.నటనకు ఒక అప్రోచ్ కనిపిస్తున్నది. మంచి భవిష్యత్తు కనిపిస్తోంది.
~~~***~~~
Previous Older Entries
ఇటీవలి అభిప్రాయములు