31.01.2010-06.02.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:

సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి శుక్రులు మకరం,గురువు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు ధను మకర రాశులు, చంద్రుడు కర్కాటక,సింహ,కన్య,తుల రాశులు సంచరిస్తున్నారు.

వ్యాపారస్తులకు,కళాకారులకు,నూతనావకాశాలు విరివిగా ఉన్న వారం.స్త్రీలకు కొన్ని మానసిక సమస్యలు,బదిలీలు ఉండవచ్చు. భార్య భర్తల మధ్య అపార్థాలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రయాణాల వలన మంచి పరిణామాలు ఉండవచ్చు. పశ్చిమ ప్రాంతంలోని ఒక రాష్ట్రంలో ఒక సంచలనం ఉండగలదు.

మేష రాశి: కాల్పనికమైన బాధలు మనస్సును ఇబ్బంది పెట్టగలవు. వారాంతానికి ఆరోగ్యం బాగుంటుంది.పెట్టుబడులకు ఈ వారం అంత మంచిది కాదు.ఒక నూతన అధ్యయనం విషయంలో నిర్ణయం తీసుకుంటారు.ఈ వారం శ్రీసూక్తం పారాయణ చేయండి.

వృషభ రాశి: ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవటం జరుగుతుంది.మీకంటే చిన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం వలన ఒక చికాకు ఉన్నది.ఉద్యోగంలో రాణిస్తారు.విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: వారాంతానికి మంచి వార్త వింటారు.రక్తపు పోటు ఉన్న వారు జాగ్రత్త వహించాలి.ఉపాసన మార్గం మంచిది.బంధువుల రాక ఉన్నది.కొత్త పనులకు సమయం ఇంకా రాలేదు!

కర్కాటక రాశి: ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది.మీ మాటలు సందర్భరహితంగా ఉండటం వలన ఒక అవకాశం జారిపోయే అవకాశం ఉన్నది.స్త్రీల పట్ల జాగ్రత్త వహించాలి.

సింహ రాశి:పిల్లలు తప్పు దారి పట్టే అవకాశం ఉంది.ఆదాయం బాగుంది.ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.ఒక శుభకార్యం తలపెడతారు.ఒక విందుభోజనం వలన ఆరోగ్యం ఇబ్బందికి గురి కాగలదు.

కన్య రాశి: మిత్రులు మీ సహనాన్ని పరీక్షిస్తారు.మీలో రగులుతున్న కొత్త ఆలోచనలు చిన్న చిన్న సమస్యలను దూరం చేస్తాయి.గతంలో చేపట్టిన మంచి పనిని పూర్తి చేస్తారు.సకాలానికి డబ్బు అందుతుంది.లక్ష్మీ అషోత్తరం చదవండి.

తుల రాశి: తలపెట్టిన విధానం రాజకీయ రంగును తెచ్చుకోగలదు.మీకు ఇతరులు ఇచ్చే సలహాలు వారి స్వార్థం కోసం అని గ్రహించాలి.జరిగిపోయిన దాని గురించి ఆలోచన పెరుగుతుంది.ఈ శుక్రవారం ఒక మంచి పరిణామం ఉన్నది.శ్రీదత్తస్తవం చదవండి.

వృశ్చిక రాశి: స్థాన చలనం ఉన్నది.ఋణ ప్రయత్నం కొద్దిగా ఆలస్యంగా ఫలించగలదు.మీరు ఎవరికైనా అప్పు ఉంటే సోమవారం కొద్దిగా ఇవ్వండి.త్వరగా తీరిపోగలదు.ఏడు సంఖ్యలో పెట్టుబడులు లాభిస్తాయి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: మీ వ్యవహారం పరీక్షకు రాగలదు.మిత్రులు సహకరిస్తారు.బంధువులు అపవాదులు సృస్టిస్తారు.మీ ఆత్మవిశ్వాసం మీకు శ్రీరామరక్ష.ఈ గురువారం ఒక మంచి పరిణామం ఉన్నది. బిల్వాష్టకం చదవండి.

మకర రాశి: పెద్దల ఆరోగ్యం కలవర పెట్టగలదు.మీడియా వారికి మంచి అవకాశాలున్నాయి. రాజకీయ లబ్ధి పొందాలనే కోరిక ప్రబలంగా ఉండగలదు.జాగ్రత్త వహించాలి.

కుంభ రాశి: నూతన ఉద్యోగంలోకి అడుగు పెట్టగలరు.మీ ప్రతిభ నలుగురికీ తెలుస్తుంది.కొత్త పరిచయాలు ఏర్పడగలవు.వ్యవహార గతిని పెంచవలసిన అవసరం ఉన్నది.

మీన రాశి: జీవిత భాగస్వామి ప్రవర్తన వింతగా ఉండవచ్చు.ఇది తాత్కాలికమే!కలవర పడకండి.బంధువర్గం నుండి సహాయాన్ని కోరే వారు ముందుకు రావచ్చు.ఒకరి మంచి సలహాను పాటిస్తారు.దగ్గు ఉన్న వారు జాగ్రత వహంచాలి.

~~~***~~~

సర్వే జనా: సుఖినో భవంతు

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

Predictions in English can be viewed at www.sripati.com (according to Sun Signs)

సినీ క్విజ్ (2)-వేదాంతం శ్రీపతిశర్మ

ఇది ఏ చిత్రం? నటుడు ఎవరు?

www.filmreviewsonline.org

‘ద టాక్ ఆఫ్ ద టవున్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

1942 లో వచ్చిన ఈ చిత్రం కొద్దిగా చిత్రమైనదేనని చెప్పాలి. సామాన్యంగా ఒక సంఘటన చుట్టూ పలు అంశాలను పరీక్షించటం చాలా మంది చేస్తూ ఉంటారు.సంఘటనలతోనే కథను ముందుకు సాగించటం, కథ చివరికి ఇలా జరిగింది అని సుఖాంతం చేయటం జరుగుతూ ఉంటుంది.ఇలా ఎందుకు జరగాలి,అలా ఎందుకు జరగకూడదు అనే కొన్ని ప్రశ్నలు చూసే వారికి కలుగుతూ ఉంటాయి.అలా కాకుండా ఒక చర్చను రెండు పాత్రల మధ్యలో యాదృఛ్చికంగా నిలిపి చాలా సాధారణంగా నడిపిన ‘కథ ‘ ఈ టాక్ ఆఫ్ ద టవున్.

వాకాటి పాండురంగారావు గారికీ, నాకు ఈ అంశం మీద ఒక సారి దీర్ఘమైన చర్చ జరిగింది.ఇలాంటి కథనం ఎదురయినప్పుడల్లా మేష్టారు గుర్తుకు వస్తూ ఉంటారు!

ఒక మిల్లులో నిప్పు అంటుకుంటుంది.ఒక ఫోర్ మాన్ అందులో మరణించాడని చెప్పి హీరోను జైలులో పెడతారు. (అతని మీద హత్య కేసు ).విచారణ జరుగుతుండగా అతను పారిపోతాడు.క్లాసు మేటు అయిన హీరోయిను (ప్రస్తుతం టీచరు) ఇంటిలోకి దూరి తల దాచుకుంటాడు.న్యాయశాస్త్రంలో ప్రొఫెసర్ ఒకాయన ఒక కొత్త పుస్తకం రచించటం కోసం ఇదే ఇంటిని అద్దెకు తీసుకుని అదే సమయంలో ఇక్కడికి చేరతాడు.ఈ కాన్విక్ట్ తోటమాలిగా కొద్ది సేపు చెప్పుకుని కాలం గడుపుతూ ఈ ప్రొఫెసర్ ని న్యాయ వ్యవస్థ మీద ఒక చర్చలోకి దింపుతాడు.కేవలం సాక్ష్యాధారాలు నడిపే వ్యవస్థలో ఎంత న్యాయం ఉన్నది అనే అంశం ఆలోచింప చేస్తుంది.ఇతని గురించి తెలుసుకున్న ప్రొఫెసర్ పోలీసులకి ఫో చేద్దామనుకున్నప్పుడు ఇతను పారిపోతాడు.ప్రొఫెసర్ అతన్ని కాపాడటం కోసం అగ్ని ప్రమాదంలో మరణించాడన్న ఫోర్ మాన్ బ్రతికే ఉన్నాడని నిరూపించి కథను ముగింపుకు తెస్తాడు. ఇలా జరిగే ముందే ఈ ప్రొఫెసర్ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికవుతాడు.

దర్శకుడు చిత్రంలోని అంశం గంభీరమైనది అయినప్పటికీ మొత్తం సున్నితమైన హాస్యంతో చూపించాడు.ఇది ఒక విశేషం.ఒక దొంగ తొడుక్కున్న చెప్పులు ఒక న్యాయమూర్తి పొరపాటుగా తొడుక్కున్నా కుక్కలు ఆయన్నే పట్టుకుని పీకుతాయి.ఈ దృశ్యం సహజమైన కామెడీతో చిత్రీకరించినా వ్యవస్థలోని సమస్యకు అద్దం పడుతుంది.

ఈ చిత్రం ఉత్తమ చిత్రానికి,రచన (కథ,స్క్రీన్ ప్లే),ఆర్ట్ డైరెక్షన్,ఎడిటింగ్,సినెమాటోగ్రఫీ,సంగీతానికి అకాడమీ అవార్డు తీసుకుంది. రచన ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పటానికి ఇదే నిదర్శనం.విషయం పూర్తిగా అవగాహనలోకి వచ్చినప్పుడు రచయితలు పలు మార్లు హాస్యం వైపుకు వెళ్లటం సహజం.ఒక వ్యక్తి హావభావాలను పూర్తిగా పరిశీలించగలిగిన తరువాతే ఒక మిమిక్రీ కళాకారుడు అలా చేయగలుగుతాడు! ఆ విషయాన్ని ప్రదర్శించే మాధ్యమాన్ని స్క్రిప్టులో తేలికగా అందించటం జరిగింది.దర్శకుడు సమన్వయంతో నడపటం కూడా అదృష్టం.హాస్య  రసం  నిజాన్ని చెప్పినప్పుడు దేనినీ నొక్కి వక్కాణించదు.మనలోంచి ఊడిపడ్డ నవ్వులోనే అది దాగి ఉన్నదని గమ్మత్తుగా చూపిస్తుంది…

ఈ చిత్రంలో కేరీ గ్రాంట్,రొనాల్డ్ కోల్ మాన్,జీన్ ఆర్థర్ నటించారు.డేల్ వాన్ ఎవెరీ,ఇర్విన్ షా,సిడ్నీ బుచ్ మాన్ రచించారు. జార్జ్ స్టెవెన్స్,ఫ్రెడ్ గియోల్ నిర్మించిన ఈ చిత్రానికి జార్జ్ స్టివెన్స్ దర్శకత్వం వహించారు.

~~~***~~~


24-30.01.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:

సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి శుక్రులు మకరం,గురువు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,బుధ రాహువులు ధను,చంద్రుడు మేష,వృషభ,మిథున,కర్కాటక రాశులు సంచరిస్తారు.

ఈ వారం అన్నింటా లాభదాయకమైన వారం.భార్యా భర్తలు మంచి అన్యోన్యత తో గడపగలరు.వ్యాపారం లాభిస్తుంది.మార్కెట్ మంచి పురోగతి చూపిస్తుంది.బాంకింగు రంగం లో కొన్ని మార్పులు కనిపిస్తాయి.యాంత్రిక రంగంలోని స్టాకులు మంచి పురోగతిని చూపించగలవు.ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి.

మేష రాశి: మంచి వార్తలు వింటారు.ఉద్యోగావకాశాలు బాగున్నాయి. పెద్దల ఆశీర్వాదం పొందగలరు.ఈ శుక్రవారం తలచిన పనులు పూర్తి కాగలవు.సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది.ఒక అత్యాశ కొద్దిగా బాధించగలదు.

వృషభ రాశి: మీ ఆలోచనా విధానం చర్చలోకి రాగలదు.మంగళవారం మీ మనసులోని మాట గట్టిగా అందరికీ చెప్పవలసిన అవసరం ఉన్నది.చెప్పకపోతే ఇబ్బందే! నూతన వస్త్రాలను కొంటారు.ఒక భాగస్వామ్యం ఆలోచన కలసి రాగలదు.

మిథున రాశి: పుత్రుల అభివృధ్ధి సంతోషాన్ని ఇస్తుంది.కార్యాలు నెరవేరగలవు.దృష్టిదోషం ఉండగలదు.సాయం సంధ్యలో దీపారాధన తరువాత ఇంటి గడపకు సాంబ్రాణీ పొగ చూపండి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: కుటుంబంతో సుఖంగా గడుపుతారు.ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారు అ ఆలోచన మానుకోవాలి.ఇతరుల సమస్యలలోకి తొంగి చూసే పని మానుకోండి.గురువారం కొత్త వారు పరిచయం కాగలరు.

సింహ రాశి: కొంత మానసిక అస్థిరత ఉన్న వారం.దూరదృష్టితో మసలుకోగలరు.ఆటలలో రాణిస్తారు.రాజకీయరంగంలోని వారు పురోగమిస్తారు.వివాహం కాని వరికి మంచి అవకాశాలున్నవి.ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: సూక్ష్మాలు గ్రహిస్తారు.ఒక దీర్ఘకాలీన సమస్య సమాధానం వైపు అడుగు వేయగలదు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆదాయం బాగున్నది.కొంత శ్రమకు గురికాగలరు.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: ఉద్యోగంలో మార్పులు,బదిలీలు ఉండవచ్చు.మీ పైన స్త్రీ అధికారి ఉంటే జాగ్రత్తగా మాట్లాడవలసిన వారం.బంధువులు సహాయం చేయగలరు.గట్టి నిర్ణయాలు తీసుకోదలచిన వారు ఈ వారం ఆగవలసిన అవసరం ఉన్నది.

వృశ్చిక రాశి: ఇంటిలో సౌఖ్యం బాగుంది.హోం వర్కు ఎక్కువ చేసుకోవలసిన వారం.ప్రభుత్వం వారికి కట్టవలసిన లెక్కలలో సమస్య ఉండగలదు.సరి చూసుకొనండి.మిత్రుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం ఈ వారం అంత మంచిది కాదు.హనుమాన్ చాలీసా చదవండి.

ధను రాశి: ఈ వారం మీరు ఒక బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితి రావచ్చు. ఋణాల ప్రయత్నం కొద్దిగా మెల్లగా సాగుతుంది.ఈ బుధవారం మంచి లాభం ఉండవచ్చు.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

మకర రాశి: బంధువుల మెప్పు పొందుతారు.మీ ఆలోచనలు సరైనవేనని తెలుసుకుంటారు.భాగస్వామ్యం వలన లాభాలున్నాయి. స్త్రీల పట్ల ఆకర్షణ పెరగగలదు.కళాకరులకు మంచి వారం.

కుంభ రాశి: ఈ వారం ఎన్నడో తలచిన పనులను సాధిస్తారు.మీ శ్రమకు తగిన గుర్తింపు లభించి నూతన అధ్యాయం ప్రారంభించేందుకు దోహద పడుతుంది.దైవానుగ్రహం లభించగలదు.లక్ష్మీ అష్టోత్తరం చదవగలరు.

మీన రాశి: ఒక అవకాశాన్ని జారవిడిచి మరొకదానిని పట్టుకుంటారు. కలవరం అనవసరం.మంచి ప్రబుధ్ధుల సలహా పొందండి.భూ వివాదాలు పరిష్కారమవుతాయి.విష్ణు సహస్రనామం చదవండి.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

Please visit www.sripati.com for predictions from Sun Signs in English

వీడియో క్విజ్ 1-వేదాంతం శ్రీపతిశర్మ

ఈ అకాడమీ అవార్డులు తీసుకున్న చిత్రాన్ని గుర్తు పట్టండి

సమాధానికి www.filmreviewsonline.org క్లిక్ చేయండి

చైనాలో తొమ్మిది రోజులలో ఒక పవర్ ప్లాంట్-వేదాంతం శ్రీపతిశర్మ

గత సంవత్సరం సర్వీసెస్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత,ఆర్థిక మాంద్యం,ఇదే సమయంలో ఈ రంగమ్నుండి లివరేజ్ తీసుకుని మనం ముందుకు వెళ్లవచ్చేమోనని పలువురు వ్రాసి యున్నారు.కొద్ది రోజుల తరువాత ఎకనమిక్ టైంస్ లో ఇటువంటి వ్యాఖ్య ఒకటి వచ్చింది.ప్రధానంగా గ్రామీణ వ్యవస్థను సర్వీసెస్ రంగం తనలో కలుపుకుని జి.డి.పీ కి మంచి కాంట్రిబ్యూషన్ చేయగలదని ఆ పేపరు చెప్పటం కూడా జరిగింది.ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చాము కానీ అటువంటి నూతన ప్రయోగం పెద్దగా ఏమీ కనిపించలేదు.

ఆశ్చర్యం ఏమిటంటే సరిగ్గా ఇదే పధ్ధతిని అవలంబించి చైనా ఒక విజయాన్ని సాధించి చూపించింది. ఆ దేశంలో నిర్మాణ రంగానికి రెండింతల వేగంగా సర్వీసెస్ రంగం అభివృధ్ధి చెందుతున్నది.వాళ్ల స్టిములస్ పాకేజీలోని పెద్ద భాగాన్ని ఈ రంగానికి కేటాయించి 30% ఉద్యోగావకాశాలు కల్పించి చూపించారు.దీని వలన డొమెస్టిక్ డిమాండ్ ను పెంచి ఆర్థిక వ్యవస్థను క్రియాశీలమైన వ్యవస్థగా నిలిపారు. భారత దేశంలో ఎంత సేపూ టాక్సుల వసూళ్లతో డిమాండును పెంచుతామంటారే తప్ప జనాభాను ఒక అభివృధ్ధి పనిలో పెట్టే వ్యవస్థ వైపు ఆలోచన ఉండదు! దాదాపు కోటి కొత్త ఉద్యోగాలను చైనా ఇచ్చి చూపింది. ఇందులో 80% పరిశ్రమల రంగంలో ప్రైవేటు వాళ్ల సంస్థలు! కన్సూమరిసం కు వదాం. యూరోప్, జపాన్, అమెరికా-ముగ్గురినీ కలిపిన రిటయిల్ ఖర్చును దాటి దాదాపు 15% అభివృధ్ధి చైనా సాధించింది. చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద కార్ మార్కెట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే!చైనాలో తక్కువ ఎమిషన్ ఉన్న బండ్లకు టాక్సులలో రిబేటు ఉంటుంది.

చైనా పవర్ సెక్టర్ లో 20% అభివృధ్ధిని తెచ్చింది. ప్రతి తొమ్మిది రోజులకు ఒక మహానగరానికి సరిపోవు విద్యుత్తు ప్లాంటును చైనా ఈ రోజు తయారు చేస్తున్నదంటే ఆశ్చర్యం కలుగక మానదు!ఎలా? ఇక్కడే ఉన్నది కిటుకు.సర్వీసెస్ రంగం అతి వేగంగా, అతి తక్కువ వ్యవధిలో ముందుకు దూకే రంగం.ఇందులో 30% జనాభా ఉండటం విశేషం.ఈ రంగాన్ని అటు వ్యవసాయానికీ, ఇటు పరిశ్రమలకీ అనుసంధానం చేసి అతి క్రియాశిలకంగా ఏర్పరచటం వలన,అతి తక్కువ కాలంలో ప్రభుత్వ వ్యవహరాలు, అవుట్ సోర్సింగు పనులు పూర్తి చేసుకోవటంచైనా ముందుగానే అలవాటు చేసుకుంది. (ఇండియా బదులు ప్రపంచం చైనా పరుగులు తీయటం ఇందుకే!ఇక్కడ దొరబాబులు ఏదీ పడనీయరు మరి!)

చైనా కేవలం ఎగుమతుల మీద ఆధారపడియునదనే మాట పలు చోట్ల వినిపిస్తూ ఉంటుంది.ఇది నిజం కాదు. చైనా ఎగుమతులు జి.డి.పీలోని 20% మాత్రమే.భవిష్యత్తులో చైనా కన్స్యుమరిసం గణనీయంగా పెరిగిన తరువాత యు.ఎస్ లాంటి దేశాలకు, ఇతర ఐరోపా దేశాలకు చైనా లేకపోతే ఇబ్బంది కావచ్చు కానీ చైనాకు మెల్లగా వాటి అవసరం తీరిపోవచ్చు! (ఉదాహరణకి కొన్ని నెలల క్రితం నేను వ్రాసి యున్నాను-చైనా నుండి ఎరువులు ఎగుమతి అవ్వటం ఆగిపోయినప్పుడు చాలా దేశాలలో కూరగాయలు, పండ్లు మాయమయినాయి.ఇంకా పరిస్థితి అలానే ఉంది)

మరి చైనాకు సమస్యలు లేవా? చాలా పెద్ద సమస్య ఉన్నది. ఇది చైనాలో దిగుమతుల సమస్య. ఒక డాలర్ ధర ఉన్న వస్తువును ఎగుమతి చేయటానికి 90 సెంట్లు దిగుమతి చేయాల్సి ఉన్నది. 9% జి.డి.పి అభివృధ్ధిని సాధిస్తూనే (మనం కూడా ఆశించాం కానీ ఇది ఈ ఆర్థిక సంవత్సరానికి 7% కంటే కొద్దిగానే ఉందగలదు).స్పెండింగు విషయంలో ఒక గణనీయమైన మార్పును చైనా చూపింది.ఇది ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఖర్చు విషయం.మొన్నటి వరకూ ఈ ఖర్చు ప్రైవేటు రంగం కంటే చాలా అధికంగానే ఉండేది. ఈ రోజు కథ మారింది.ప్రైవేటు రంగం చేస్తున్న ఖర్చు,పెట్టుబడులు చైనా ప్రభుత్చ రంగాన్ని దాటేశాయి!ఇది మన దేశానికి అతి పెద్ద గుణపాఠం! మన దొరబాబులు ఎం.పీ లకీ,అందరికీ తగు జీతాలు పెంచి పీకల దాకా ఫెసిలిటీస్ ఇచ్చి ఆర్థిక మాంద్యం కోసం స్టిములస్ అని కబుర్లు!ఆసియా ఖండంలోని పలు దేశాలలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి పబ్లిక్ టాన్స్ పోర్ట్ లో వెళతాడు…ఇక్కడ చేతకాని దద్దమ్మను సామాన్య మానవుడు పల్లకీలలో మొయ్యాలి.ఒక్కొకడికీ స్విస్ బాంకులో మురిగిపోతున్న ఖాతాలు… చైనా ఈ రోజు ఏమీ దాచుకోకుండానే ఉందనుకోవటం పొరపాటు. చైనా రిస్ర్వులు (కాపితల్ రిసర్వు)2.3 ట్రిలియన్ డాలర్లు. యు.ఎస్ డెఫిసిట్ ఒక ట్రిలియన్ డాలర్లు! 40 ఏండ్లలో చైనా వ్యవస్థ నాశనమయిపోతుందని పలువురు ఆ రోజు అభిప్రాయపడ్డారు. అదేమీ జరగలేదు.ప్రపంచంలోనే ఏ కోణంలోంచి చూసినా తన జనాభాని ఒక శక్తిగా మార్చిన దేశంగా చైనా ఈ రోజు ముందుకు వచ్చింది. నిజమే! ఈ జనాభా వలన కరప్షన్ ఉంది, ఎయిడ్స్ విపరీతంగ వ్యాపించి ఉంది…ఇలా కొన్ని దారుణమైన సమస్యలున్నప్పటికీ ఆర్థికాభివృధ్ధియే అన్నిటికీ మందు అని నమ్మి పనిలోకి అందరినీ దింపేసింది ఈ దేశం.బహ్మతం యొక్క ఫోకస్ అభివృధ్ధి వైపు ఉన్నప్పుడు ఈ నిత్యారిష్టాలు అల్పమతంలోకి వెళ్లక మానవు.ఇంత జనాభాకీ, ఇంత వ్యవస్థకీ సర్వీసెస్ అనే కీలకమైన రంగాన్ని ఒక పల్స్ గా చైనా సరైన సమయానికి గుర్తించింది.మీకేమి కావాలి? మేము తయారు చేస్తాం.అందరి కంటే తక్కువ సమయంలోనే తయారు చేస్తాం…ఒక విద్యుత్తు ప్లాంటు కూడా!

భూమి అటువంటి కర్మభూమిగా మారినప్పుడు ప్రకృతి చేయగలిగినది పెద్దగా ఏమీ ఉండదు. చేతిలో పని ఉన్నవాడు తన చేతిలో ఒక ప్రపంచాన్నే పెట్టుకుంటాడు.కర్మయే ప్రపంచం.కర్మయే ఫలం.ఆ లోకంలోనే ముణిగి తేలాలి.ప్రపంచంలో దేనికీ వెతుక్కోనక్కరలేదు.ప్రపంచం మనలను వెతుక్కుంటుంది!

~~~***~~~




17-23 జనవరి 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

శ్లో:శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:

సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి శుక్రులు మకరం,గురువు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య, రాహు బుధులు ధను,చంద్రుడు మకర,కుంభ,మీన,మేష రాశులు సంచరిస్తున్నారు. ఈ వారం శుభఫలితాలు ఉన్నాయి.దృఢ సంకల్పంతో తలచిన కార్యాలు నెరవేరగలవు.మాటలు నేర్పుతో మాట్లాడవలసిన వారం.ఒక రాజకీయ సంచలనం ఉండగలదు.పూర్వోత్తర ప్రాంతం లో అలజడులు,మీ తప్పుల వలన ఇతరులు లాభాలు పొందటం,కొన్ని వివాదాలు పరిష్కారం అవటం ఈ వారం కనిపిస్తున్నాయి.బాంకింగు రంగంలో పెట్టుబడులు అంత మంచివి కావు.

మేష రాశి: ఈ గురువారం మంచి వార్త వినగలరు.వదలివేసిన పని ఒకటి పూర్తి చేస్తారు.దైవ చింతన మనసుకు మంచిది.మీ మనస్సును కష్ట పెట్టటం మంచిది కాదు. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: మిత్రులు లాభం పొందనున్నారు. ఒప్పందాలు జరుగగలవు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చెప్పదలచుకున్న నిర్ణయం కొద్ది రోజులు ఆపగలరు.విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: తొందరపాటును గ్రహిస్తారు.సహచరులు కొత్త పరిచయాలను చేయిస్తారు.వ్యాపారంలో లాభాలున్నాయి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: మీ సహాయంతో కొందరి సమస్యకు సమాధానం దొరకగలదు.సకాలానికి డబ్బు అందుతుంది.మహ్యవర్తులను నియమిస్తే కొన్ని సమస్యలకు సమాధానం పొందగలరు.

సింహ రాశి: ఆరోగ్యం బాగుంటుంది.బంధువుల సమావేశం ఉండగలదు.ప్రేమ వ్యవహారం ఒకటి ముందుకు సాగగలదు.గతంలో చేసిన పెట్టుబడులు ఫలించగలవు.

కన్య రాశి: పట్టుదలతో పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకోగలరు.ఇంటిలో ఉన్న రుగ్మతలు తొలగిపోగలవు.కొత్త విషయం తెలుసుకుంటారు. వారాంతంలో ప్రయాణం ఉండగలదు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

తుల రాశి: ఇంటిలోని వస్తువులు భద్రంగా చూసుకోగలరు.ఉద్యోగంలో మార్పులు ఉండగలవు.కొత్త పనులు చేపడతారు.మీరు చేపట్టిన విద్య నిరాటంకంగా సాగాలంటే మరి కాస్త పట్టుదల అవసరం.

వృశ్చిక రాశి: సోదరుల నుంచి మంచి వార్తలు వినగలరు.పెట్టుబడుల నుండి దూరంగా ఉండటం మంచిది.కళ్ల సమస్యలు బాధించగలవు.ఉద్యోగ ప్రయత్నాలు లాభించ గలవు.

ధను రాశి: వారాంతానికి మంచి పరిణామాలున్నాయి.జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగ చూసుకోవాలి.కొన్ని అప్పులు తీరగలవు.వాహనం నడుపునపుడు జాగ్రత్త వహించాలి.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవగలరు.

మకర రాశి: మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు.కొన్ని మరమ్మత్తులు తప్పవు.శ్రమ అధికంగా ఉండవచ్చు. అనుకోని చోటు నుండి ఒక ఆహ్వానం అందుతుంది.

కుంభ రాశి: వ్యసనాలకు దూరంగా ఉండాలి.చెప్పదలచినది సూటిగా చెప్పలేకపోవటం వలన ఇబ్బందులుండవచ్చు.వ్యాపారాలు లాభిస్తాయి.నూనె వస్తువుల వ్యాపారం బాగుంటుంది.

మీన రాశి: ఖర్చులు చేస్తారు. వస్తువుల కొనుగోలు చేసే టప్పుడు జాగ్రత్త వహించాలి.మోసపోగలరు.మీ కంటే చిన్నవారితో చర్చలు చేస్తారు.సమూహికమైన పనులకు మంచి వారం.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

సుబ్బారావుకు అరుగు మీదే సాహిత్య అకాడమీ!-వేదాంతం శ్రీపతిశర్మ

సంక్రాంతి రోజున పొద్దున్నే సుబ్బారావు మరల అరుగు మీదకు వచ్చాడు. ఈ రోజు వాకిళ్లు కళ కళ లాడిపోతున్నాయి.అమ్మాయిలు రథం ముగ్గులేసేస్తున్నారు.గొబ్బెమ్మలు పెడుతున్నారు. సుబ్బారావు ఛలికి వెనకాడలేదు!

‘ఈ రోజు కాఫీ కూడా అక్కరలేదన్నమాట!’ ప్రక్కనే వాళ్లావిడ కప్పుతో నిలబడి ఉంది!

‘అంటే? అదేవన్నమాట?’

‘ఇంత చక్కని దృశ్యాలు కనిపిస్తున్నాయి కద? అసలు సమయం తెలుస్తోందా?’

‘అన్యాయం.అరుగు మీదకి నేను రోజూ వస్తాను. వాళ్లు ఇవాళ వచ్చారు.ఆలోచించు!’ ఆవిడ కూర్చుంది.

‘ముగ్గులు బాగున్నాయి…’

‘చూశావా?అదీ సంగతి!అసలు ముగ్గు అనే సంప్రదాయం ఎందుకొచ్చిందో తెలుసా?’

‘అస్సలు తెలియదు. ఈ అరుగు మీద ఏమైనా తెలిసినా చెప్పదలచుకోలేదు.’

‘అదేమిటి?’

‘ఈ అరుగు మీద ఎప్పుడు ఏమన్నా ఎలా ఉంటుందో తెలియదు.’

‘ఇంతకీ నీ బాధ ఏమిటి?’

‘ద్రౌపదికి సాహిత్య అకాడమీ ఇచ్చారు.’

‘అయితే?’

‘రేపు ఇంకొకడు అసలు సీత కూడా పర్ణశాలనుండి లక్ష్మణుడిని వేరే కారణాల వలన పంపించింది అంటే ఈ అవార్డు ఇచ్చేస్తారా?’

‘ఇవ్వరు!’

‘ఎందుకు?’

‘ఈ అవార్డు ఇవ్వరు.భారతరత్న ఇస్తారు.’

‘ఓహో! ఎందు వలన?’

‘అద్భుతమైన విషయాన్ని బయటికి లాగి విశేషమైన సృజనాత్మకతను చూపించినందుకు!స్త్రీల స్వాతంత్ర్యం గురించి కూడా పోట్లాడినందుకు!’

‘ బాగుంది. నవ్వుతరు ఎవరైనా!’

‘ఎవరూ నవ్వరు! కాముకత్వం నేరమా? అని పోట్లాడుతారు!’

‘ఛా!’

‘అవును మరి.ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతుంటే అమ్మాయిలను చూడటానికని సరదాగా అంటే క మాట!అదే అసలు ముగ్గులు అమ్మాయిలు ఎందుకు వేస్తారు? అబ్బాయిలు చూసేందుకే అంటే అమ్మాయిలందరూ ఒప్పుకుంటారా?’

‘అలా ఎలా ఒప్పుకుంటారు?’

‘కరెక్ట్!అక్కడ ఆ అమ్మాయిని చూడు.క్రిందటి సంవత్సరం ముగ్గు వేస్తే ఎవరూ చూడలేదట!అందుచేత ఏకంగా అయిదు ముగ్గులు వేస్తోంది!’

‘ఛా! అంటే అయిదుగురు అబ్బాయిలైనా చూడాలనా?’

‘అదుగో అయిదుగురు కాదు.పదికి పైనే పై నుంచి మరీ చూస్తున్నారు!’

‘ ముగ్గు   లోకీ  లాగటం అంటే ఇదేనా?’

‘ముగ్గు,గొబ్బెమ్మ,పేడ లోకీ లాగటం అంటే ఇదే!’

‘మన అదృష్టం బాగుంది!’

‘ఎందుకు?’

‘యార్లగడ్డ ఈ వీథిలో ఉండడు!’

‘ఆయన సృజనాత్మకతను అంతగా ఆడిపోసుకు చిట్టీ!ఆయన అమ్మాయిల ఔన్నత్యాన్ని వారి కాముకతతో చెబుతున్నారు!’

‘ఇది మరీ బాగుంది.’

‘అవును మరి!అక్కడ ఆ అమ్మాయి అలా కష్ట పడి చక్కగా ముగ్గు వేస్తోంది చూడు,ఎందుకనుకున్నావు?

‘ఎందుకండీ?’

‘ఇంత మంది చూస్తున్నా,ఇంత చెమట పడుతున్నా ఎందుకు ముగ్గు వేస్తున్నదంటే అసలు ఆమెకు ఇంతవరకూ వివాహం కాకపోవటం వలన, ఆమెను ఇంటిలో బంధించివేయటం వలన ఆ ముగ్గనే ప్రక్రియ ద్వారా ఒక నిరసనను వ్యక్తపరుస్తున్నది!’

‘ఏమిటి? ముగ్గు ద్వారానా?’

‘అవును మరి!అది రథం ముగ్గు.అందులో గొబ్బెమ్మలను బంధించి మమ్మలను గొబ్బెమ్మలను చేసి ఇంటిలో ఉంచారని చక్కగా చాటింది!మా మనోరథం సాగటంలేదని అందంగా చెప్పింది.’ ‘ఈ ముగ్గు భాష్యం ఎక్కడా వినలేదు!’

‘మరి? అదే సృజనాత్మకత అంటే!

‘ ‘ఎవరో వస్తున్నారండీ…’

ఇద్దరూ అటు తిరిగారు.ఇద్దరు ప్రభృతులు, ఒక మహిళ దగ్గరగా వచ్చారు. ‘నమస్కారం.’

‘నమస్కారం.’

‘మీ పేరండీ?’ ‘సుబ్బారావు.ఇది నా అరుగు!’

‘కరెక్టే!ఇంత అద్భుతమైన వ్యాఖ్యానం ఇంతవరకూ ఎక్కడా చూడలేదు.ఇది భారతీయ మహిళ, ప్రత్యేకంగా తెలుగు వనితల పట్ల ఒక వినూత్నమైన వ్యాఖ్య.మిమ్మల్ని సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంచుకున్నాం.మీరు సంక్రాంతి ముగ్గు అనే పుస్తకాన్ని వ్రాసి వచ్చే సంవత్సరం సంక్రమణం…కాదు సంచలనం సృషించాలి!’

సుబ్బారావు ఇంటిలోకి పరుగు తీశాడు.వాళ్లావిద కూడా లోపలికి వచ్చి తలుపులు వేసేసింది.వాళ్లు తలుపు రెండు మూడు సార్లు కొట్టి వెళ్లిపోయారు. కిటికీలోంచి తొంగి చూసి ఆవిడ అప్పుడు తలుపు తెరచింది.

‘అంత గాభరా ఎందుకు? మనకు అవార్డే కదా ఇస్తానన్నారు?’

‘ఇంకా నయ్యం!కాసేపుంటే నన్ను పట్టుకుని కాముకురాలని చెప్పి మీరు అణగదొక్కరని చెప్పి నా చేత ఆత్మకథను వ్రాయమనే వారు! వీళ్ల మొహాలు తగలెయ్య!’

‘ఎంత మాట! మంచి పని చేశావులే!అరుగు పెద్ద డేంజరు!’

~~~***~~~

కొద్ది సేపు అయిన తరువాత తలుపు దగ్గర చప్పుడయింది.బంధువులేమోనని తలుపు తీశారు.అక్కడ కాళికాదేవి రెండు చేతులలో రెండు పాత్రలు పట్టుకున్నట్లు ఎదురింటి అమ్మాయి రెండు చేతులలో చెరో గొబ్బెమ్మను పట్టుకుని ఉంది.

‘నేను మీకు గొబ్బెమ్మ లాగా కనపడుతున్నానా?’

సుబ్బారావు వాళ్ల ఆవిడ వైపు చూశాడు. ఆవిడ తగులుకుంది,’ఏంటి ఆ చూపు? నేనలా కనిపిస్తున్నానా?.అమ్మాయికి సమాధానం చెప్పండి!’

‘తల్లీ! నేనేమీ అనలేదు!’

‘ఏంటి? అనలేదా?వాళ్లు…’

‘ఎవరు?’

‘అకాడమీ వారుట. చెప్పారు!’

‘ఏమి చెప్పారు తల్లీ?’

‘అసలు సంక్రాంతి ముగ్గు అనే సంప్రదాయం అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షించేందుకే అని చెప్పారుట?’

‘అయ్యో…’

‘అమ్మాయిల కాముకత్వం ఈ విధంగా బహిర్గతం చేస్తారుట?’

‘తల్లీ…’

‘మీ ఇంటికి అటూ ఇటూ రెండు గొబ్బెమ్మలను ఇప్పటికే కొట్టి యున్నాను…’ అటూ ఇటూ చూశారు. ఎలక్ట్రిక్ మీటరు వాడు వ్రాసి పోయినట్లు రెండు సంక్రాంతి గుర్తులు కనిపిస్తున్నాయి. ‘నేనేమీ అనలేదు తల్లీ…ఆ అకాడమీ వారికి ఏదో దయ్యం పట్టింది. ముగ్గు బాగుందీ అని మేము మాట్లాడుకుంటుంటే ఇలా వచ్చి మా ప్రాణాలు తీశారు.లోనకి పరుగు తీశాం. చెప్పవే చిట్టీ…’

‘అవునమ్మా, మీ అంకుల్ అలాంటివి ఏమీ మాట్లాడలేదు!’

‘సరే! ఆంటీ మాట విని వదిలేసున్నాను.’ అమ్మాయి వెళ్లి పోయింది.వెళ్లింది కదా అనుకునే లోపల వాళ్ల నాన్న వచ్చాడు. సుబ్బారావు వెర్రి నవ్వు నవ్వాడు.

‘సంక్రాంతి శుభాకాంక్షలు సార్!’

‘అది ఓకే గానీ నేను మా అమ్మాయిని ఇంటిలో పెట్టి తలుపులు తాళం వేస్తానా?’

‘అని ఎవరన్నారు సార్?’

‘ఆ ముగ్గురు!’

‘ఛా! ఖర్మ! నేనలా అనలేదు.మా ఆవిడని అడగండి.’

‘బాగుంది.అన్నిటికీ ఆవిడ దొరికింది!’

‘ఏమిటండీ వాగుతున్నారు?’,సుబ్బారావు భార్య ఈ సారి గట్టిగా అడిగింది.

‘అద్దీ! అలా అడుగు.ఇలా అడక్కపోయే సరికే అందరికీ మన ఆడవాళ్లు, స్త్రీ పాత్రలతో సహా అలుసు అయి కూర్చున్నారు!’

‘ఏమీ లేదండీ.ఊరకే నిర్ధారణ చేసుకున్నాను.డాబా మీదకి ఎక్కి ముగ్గురు మీదావీపుకు తగిలేటట్లుగా మా అమ్మాయి అందించిన చెరో గొబ్బెమ్మా విసిరి కొట్టాను!’

‘తగిలాయా?’

‘తగలక? సూటిగా తగిలాయి. మన క్రికెట్ ఆటగాళ్లు మన దగ్గర నేర్చుకోవాలి!’

~~~***~~~

ఆదిపర్వం,ద్రౌపది-వేదాంతం శ్రీపతిశర్మ

‘సాక్షి ‘ టి.వీ లో యార్లగడ్డ లక్ష్మీప్రసాదు గారు వారి పుస్తకం మీద వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ లో చేసిన ప్రసంగాన్ని నేను చూశాను.ఆయన చాలా విచిత్రమైన మాట చెప్పారు. ఆదిపర్వంలో ద్రౌపది గత జన్మ చరిత్ర చెబుతూ ఆవిడ కామవాంఛ తీరనందువలన ఈ జన్మలో అయిదు భర్తలకు భార్యగా వచ్చినట్లు వ్యాసులవారు తెలిపినట్లు మాట్లాడారు. ఆదిపర్వంలో ఈ ఘట్టం భారతంలోని ఆదిపర్వంలోని చైత్రరథపర్వంలో ఉంటుంది. వ్యాసులవారు వచ్చి ఇలా చెబుతారు:

ఆసీత్ తపోవనే కాచిదృషే: కన్యా మహాత్మన:

విలగ్నమధ్యా సుశ్రోణీ సుభ్రూ: సర్వగుణాన్వితా

(పూర్వం తపోవనంలో ఒక మహర్షికి జన్మించిన ఒక కన్య ఉండేది.ఆమె ఎంతో సుందరంగా ఉండేది.సమస్త సద్గుణసంపన్నురాలు)

కర్మభి: స్వకృతై: సా తు దుర్భగా సమపద్యత

నాధ్యగఛ్చత్ పతిం సా తు కన్యా రూపవతీ సతీ

(తన స్వకర్మ చేత దౌర్భాగ్యముతో రూపవతీ, సదాచారిణి అయినప్పటికీ ఎవరినీ పతిగా పొందలేదు)

తతస్తప్తుమథారేభే పత్యర్థమసుఖా తత:

తోషయామాస తపసా సా కిలోగ్రేణ శంకరం

(అప్పుడామె దు:ఖించి తపస్సు ప్రారంభించి తపస్సు ద్వారా శివుని ప్రసన్నుని చేసుకొంది)

తస్యా: స భగవాన్స్తుష్టస్తామువాచ యశస్వినీం

వరం వరయ భద్రం తే వరదోస్మీతి శంకర:

(సంతుష్టుడైన శంకరుడు వచ్చి వరము కోరమని చెప్పెను)

అథేశ్వరమువాచేదమాత్మన: సా వచో హితం పతిం

సర్వగుణోపేతమిఛ్చామీతి పున: పున:

(అప్పుడామె తన కోసం హితమైన వచనములు పలికెను-  ప్రభూ! నేను సర్వగుణసంపన్నుడైన పతిని కోరుకుంటున్నాను…ఈ మాటను ఆమె మరల మరల పలికింది)

తామథ ప్రత్యువాచేదమీశానో వదతాం వర:

పంచ తే పతయో భద్రే భవిష్యంతీతి భారతా:

(శివుడు అప్పుడు ‘భద్రే! నీకు అయిదు భరతవంశీయులైన పతులు లభించగలరూ అని పలికెను)

ఏవముక్తా తత: కన్యా దేవం వరదమబ్రవీత్

ఏకమిఛ్చామ్యహం దేవ త్వత్ప్రసాదాత్ పతిం ప్రభో

(ఆమె శివునితో ఇట్లు పలికెను-దేవా! ప్రభో! నేను నీ కృప చేత కేవలం ఒక పతినే కోరుకుంటున్నాను)

పునరేవాబ్రవీత్ దేవ ఇదం వచనముత్తమం

పంచకృత్వస్త్వయా హ్యుక్త: పతిం దేహీత్యహం పున:

(అప్పుడు శివుడు ఇలా చెప్పెను-భద్రే! నీవు నాతో అయిదు పర్యాయములు పతిని ప్రసాదించమని అడిగావు)

దేహమన్యం గతాయాస్తే యథోక్తం తద్ భవిష్యతి

ద్రుపదస్య కులే జఙ్ఞే సా కన్యా దేవరూపిణీ

(అందుచేత మరో శరీరమును ధరించినప్పుడు నీకు నేను చెప్పినట్లు వరము ప్రాప్తించును… అదే దేవరూపిణి అయిన కన్య ద్రుపదుని కులములో ఉత్పన్నమయ్యెను)

ఇలా చెప్పి వ్యాసులవారు పాండవులను పాంచాలనగరానికి వెళ్లి సతీ సాధ్వి అయిన కృష్ణా (ద్రౌపది)ని వివాహమాడమని నిర్దేశించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ వృత్తాంతంలో కేవలం ద్రౌపదికి అయిదుగురు పతులు ఎలా నియమింపబడ్డారో అను విషయాన్ని చెప్పటం జరిగింది కానీ ఎక్కడా ‘కామవాంఛ తీరని ద్రౌపదీ గురించి ప్రస్తావన లేదు! ఆవిడకే అంత కోరిక ఉండి ఉంటే శివుడు అయిదుగురు పతులు అని చెప్పినప్పుడు ‘అయ్యో ఒక్కరే కదా నేను కోరుకుంటున్నది ‘ అని అనే బదులు సంతోషించి ఉండేది! ఆవిడను   సతీ   సాధ్వి అని ఈ సందర్భంలోనే వర్ణించటం మరో విశేషం! ద్రౌపది పాత్రకు కామవాంఛ అనే రంగు భారతంలో ఎక్కడా, ఏ సందర్భంలోనూ లేదు. ఈ ‘ఆచార్య ‘ అని పిలిపించుకునే ఉత్తమ మైన మహామనీషికి బహుశ: జన్మతో ఉన్న కామవాంఛ చేత ఆ మహాకావ్యంలో ఏకంగా దుర్యోధనుని లాగా ద్రౌపదినే పట్టుకున్నాడు!కావ్యలక్షణం,రసం,ఇలాంటివి ముందు పెట్టి పరిశీలించమన్నప్పుడు అక్కడ ఏమున్నా లేకపోయినా   ఇలాంటి     వారికి    కనిపించేది ఒకటే! మరో దేశంలోనైతే సంస్కృతికి మూలస్తంభాలైన పాత్రల, పుస్తకాల మీద ఇలా మదంతో మాట్లాడినా,వ్రాసినా పబ్లిక్ గా నిలబెట్టి మరో మనిషి ఇటువంటి పని చేయకుండా చర్య తీసుకుంటారు. ఈ దేశంలో (పర)ప్రభుత్వం వారు ఆదరించి అవార్డులు ఇస్తారు. ఈ రచయిత సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లు లేదు, పోనీ కొంత సంస్కారమైనా అబ్బుకున్నట్లు లేదు. వీరిని అవార్డు కోసం ఎంపిక చేసిన కమిటీ వారు మరి కొన్ని ఆకులు ఎక్కువ చదివినట్లున్నారు!

Mark Twain writes in one of his books regarding a character in the book-You have struck the loftiest peak of tsupidity which human effort ever conquerred!

Yes. The awardee and those who have awarded have done precisely this.

The Sahitya Academy Award shall henceforth be a serious insult to a writer.

‘మంచివాడు’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ

మోహనరావు గారు ఏదో పాడుతూనే ఉండే వారు.ఆయన ఏమి పాడే వారో నాకు అంతగా అర్థం అయ్యేది కాదు కానీ ఎందుకో ఆయన తోటలో పూల మొక్కలకు నీళ్లు పోస్తూనో లేక వాకిట్లో అటూ ఇటూ తిరుగుతూనో అలా పాడుతుంటే వినాలనే అనిపించేది. కూరగాయల వాడు బండీ తోసుకుంటూ వచ్చినప్పుడు కూడా అక్కడ నిలబడి కూరలను ఏరుతూ కూడా ఒక రాగం అలా వినిపిస్తూ ఉండే వారు. ఆఫీసులో కూడా ఆయన కొద్ది సేపు సీరియస్ గా పని చేసి అందరూ పనిలో ముణిగి ఉన్నప్పుడు చక్కగా లేచి ఎటో పరుగు తిస్తున్న వాడిని పట్టుకుని

‘ఎందుకే నీకింత తొందర?’ అంటూ ఆడుకునే వారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న పెద్దావిడను పట్టుకుని ‘మాఘ మాస వేళలో…’, అనే వారు. ఆవిడ సిగు పడి ఈ లోకంలోకి వచ్చేది. ఆయనలో అదొక్కటే విశేషం కాదు.ఎప్పుడైనా ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు వింతగా ఉండేది.

‘సార్…’

‘ యస్ సార్, చెప్పండి.’

‘ ఏమీటి సార్ ఇది?’

‘ ఏమీ సేతురా లింగా…’

‘ అబ్బా అది కాదండీ…రాజారావు లేడూ?’

‘ మంచివాడు!’

అంతే!ఆ వచ్చిన వాడు ఏదో చెప్పబోయి వెనక్కి వాలే వాడు.

‘ ఏంటేంటో మాట్లాడుతున్నాడండీ…’

‘ మంచివాడు.’

‘ అది కాదండీ…’

‘ హ…మంచివాడు.’ అతను వెళ్లిపోయేవాడు.

ఒక్కో సారి పై వాడు కూడా పిలిచేవాడు.

‘ అలా కాదండీ మోహనరావు గారూ! అసలు ఈ సుబ్బారావు ఏమిటి? ఒక రోజు ఒక లా ఉంటాడు, ఇంకో రోజు ఇంకోలా ఉంటాడు. వాటీస్ హిస్ ప్రాబ్లం?’

‘ మంచివాడు సార్!’ ఆయన ఒకలా మొహం పెట్టే వాడు. ‘ ఏం చేద్దామంటారు?’ ‘ అలాక్కాదండీ, మంచివాడండీ!’

‘ సర్లేండి. చూద్దాం…’ ఈయన బయటకు వచ్చేవాడు.ఏదో పాడుకుంటూ ఉండే వాడు. ఒక రోజు కాలనీలో ఉండే కాయన గేటు దగ్గర వచ్చి ఆగాడు. ఈయన చెట్లతో మాట్లాడుకుంటున్నాడు.

‘ సార్!’

‘ యస్?’

‘ ఆ చివరింటాయన అదేమిటండీ…’

‘ మంచివాడు.’

‘ అది కాదండీ.బోరు తవ్విస్తే తవ్వించాడు. అదేమిటండీ ఆ దుమ్ము…ముందు చెప్పక్కరలేదా?’

‘ ఆ…మంచివాడండీ పాపం.’

‘ ఒకటే దుమ్ము. అదేమిటండీ?’

‘ ఊ…మంచివాడండీ!’

ఆయన దయ్యం పట్టిన వాడిలా మొహం పెట్టి

‘వస్తాను సార్’, అని వెళ్లేవాడు.

~~~***~~~

మోహనరావు గారికి సమస్యలు లేవని కాదు.ఆయన వెనుకా చాలా చెప్పుకునే వారు.ఆయన అలా ప్రవర్తించటం ఏదో ఎన్నికలలో పోటీ చేయాలని కాబోలని అనుకునే వారు.

‘ మీ గురించి అలా అనుకుంటున్నారందరూ’,అన్నాను.

‘ మంచివాళ్లయ్యా మన కాలనీ వారు!’ అది ఆయన జవాబు. ఆయన ఇంటిలో ఎలా ఉండేదో ఏమో ఎవరికీ తెలిసేది కాదు. గులాబీ మొక్క దగ్గర కూర్చుని ఏదో తవ్వుతూ ఉండే వారు,’కన్నులా కరవు తీరాలూ…’, అంటూ పాడేవారు,’…కనినంత నీ రూపు, మిన్నుల విహరించేనా, మదన మోహనుడూ…’. అలా పాడుతుండగా గేటు చప్పుడయింది. ఎవరో ఒక అమ్మాయి, ఒక పెద్దాయన లోపలికి వెళ్లారు.ఈయన పాడుతూనే కూర్చున్నాడు. ఏవో మాటలు వినిపించాయి. పెద్దాయన గబగబా వచ్చి చెప్పులు తొడుక్కుని గేటు దాకా వెళ్లి వెనక్కి వచ్చి మోహనరావు గారి వైపు చూశాడు.

‘ఇదిగోండి. మీ మొహం చూసి అమ్మాయి మరల మీ ఇంటికి వచ్చింది. అంతే! వస్తాను!’ ఆయన వెనక్కి చూడకుండా గేటు తీసి వెళ్లిపోయాడు. నేను గోడ దగ్గరే ఉన్నాను. ఆయన లేచి చేతులు కడుక్కున్నాడు. నన్ను చూసి నవ్వాడు.

‘మంచివాడు…’,అన్నారు.ఎందుకో వెనక్కి తిరిగారు . ‘అవునూ? నా మొహం అంత బాగుంటుందా?’,అంటూ లోనకి వెళ్లిపోయారు!

~~~***~~~

ఆ లోకల్ స్టేషన్ ప్లాట్ఫారం ఆ రైలు వచ్చిపోయే వరకూ కొద్దిగా నిర్మానుష్యంగానే ఉంటుంది.ఆ చెట్టు క్రింద ముగ్గురు రిటైరయినవారు కూర్చునే వారు. నేను ఆ కాలనీ మారిపోయి చాలా కాలం అయింది.ఎందుకో అప్పుడప్పుడు ఆ స్టేషన్ కు వచ్చి కూర్చుంటూ ఉంతాను. అలా ఆ పాత రోజులు తలచుకుంటూ అక్కడ ప్రక్కనున్న గట్టు మీద కూర్చునాను. ఒక వయసు అయిపోయిన తరువాత గతమే ఒక గట్టు. ఆలోచనల మబ్బులే మహావృక్షం లాంటి నీడ!.మనసే ఇల్లు.వినపడని చప్పుళ్లే ముచ్చట్లు.కదలని కాళ్లే నిగ్రహం.చేతకానితనమే రాజయోగం,చేతికర్రే అరచేతి వైకుంఠం! కర్ర జారింది. దానిని తిట్టుకుని కష్టంగా వంగి తీసి తిరిగి పట్టుకున్నాను. మోహనరావుగరైతే ‘మంచి కర్ర ‘,అనే వారేమో!

ఇంతోటి స్టేషన్ కి ఒక అనౌన్స్మెంటు. ఆ లోకల్ వస్తోందన్నారు.ఒకడు ఈల వేశాడు. అక్కడున్న ఇద్దరు ముగ్గురు ప్రయణీకులు లేచి ముందుకు వచ్చారు. రైలు వచ్చింది.ఆ గార్డు గొప్పగా ఈల వేశాడు. అది కదిలింది. వెళ్లిపోయింది కూడా! ఏదో గొప్ప పని చెసినట్లు నేనూ లేచాను. అలా సాగిపోయాను. ఆ చెట్టు క్రింద ఆ ఇద్దరూ ఇంకా లేవలేదు. వారిని దాటుకుంటూ వెళ్లాను.

వెనుక వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి… ‘మోహనరావు…’

‘పాపం మంచివాడండీ!’

~~~***~~~



Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.