‘ ద రీడర్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
27 సెప్టెం 2009 1 వ్యాఖ్య
in శ్రీ-చిత్రం

బర్నార్డ్ ష్లింక్ జర్మన్ నవల ‘ద రీడర్ ‘ ఆధారంగా 2008 లో నిర్మించబడిన చిత్రం ఇది. కథ కొద్దిగా సంప్రదాయానికి దూరంగా ఉంటుంది. నవలలో చెప్పిన మోతాదు కంటే చిత్రంలో శృంగారం పాళ్లు నిజానికి తక్కువే అని చెప్పాలి.
టీనేజిలో ఉన్న ఒక కుర్రాడికి అతని కంటే చాలా ఎక్కువ వయసు గల ఒక మహిళతో సంబంధం ఏర్పడుతుంది. ఈమె చదువు రాని మహిళ. కుర్రాడి చేత ఆంగ్ల క్లాసిక్ పుస్తకాలు చదివించుకుంటూ అతనితో ఇతర ప్రక్రియలు సాగిస్తూ ఉంటుంది… కుర్రాడు పెద్దయ్యాక లాయరు అవుతాడు. చాలా సంవత్సరాల తరువాత ఈమె ఒక నాజీ వ్యవస్థలో 300 మంది ఒక చర్చ్ లో కాలిపోవునప్పుడు అక్కడ గార్డ్ గా నిలబడి ఏమీ చేయనందుకు కోర్టులో ట్రయల్ లో ఉంటుంది. ఈమె మీద అభియోగం ఏమిటంటే ఈమె ఆ ‘హోలోకాస్ట్ ‘ కి నాయకత్వం వహించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందని మిగతా గార్డులు వాదిస్తారు. ఆమె ప్రేమికుడు ఆమె తను చదువుకోలేదన్న సంగతి ఎందుకు చెప్పదు అని బాధ పడతాడు. అయినా ఆమెకు జీవిత ఖైదీ శిక్ష పడుతుంది. జైలుకి ఇతను కాసెట్లు, టేప్ రికార్డరు పంపి వాటిలో పుస్తకాలలోంచి తను చదివి రికార్డు చేసినవి పంపుతూ ఉంటాడు. ఆమె జైలులోనే చదువు నేర్చుకుంటుంది. విడుదల అయ్యే ముందు ఇతను కలుస్తాడు. కలసి ఆమెకు ఉద్యోగం చూశాడనీ, ఇల్లు కూడా చూసి పెట్టాడనీ చెబుతాడు. కానీ విడుదల అయ్యే రోజుకి ఆమె ఆత్మ హత్య చేసుకుని చనిపోతుంది. కొంత డబ్బు ఇలానా ( కోర్టులో సాక్ష్యం చెప్పిన ఆమె) కు ఇవ్వమని సందేశం వ్రాసి పోతుంది. ఆ డబ్బు న్యూ యార్క్ కు ఇతను తీసుకొని వెళ్లి చదువుకోని జ్యూలకోసం వెచ్చించవచ్చని చెబూఅడు.
ఈ లాయరు తన పాపకు (ఇతని వైవాహిక జీవితం విడాకులతో మధ్యలోనే ఆగిపోతుంది ) ఈ వ్యక్తి సమాధి దగ్గర ఈ కథ చెప్పటం ప్రారంభించటం తో సీమా అయిపోతుంది…
~~~***~~~
ఈ చిత్రం మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చదువు రాకపోవటం మూడు వందల మందిని చంపేయటం ఒక తరాజులో పెడితే ఏది బరువు కాగలదు అని కొందరు ప్రముఖులు అన్నారు. అలాగే ఈ విచ్చలవిడి శృంగార సన్నివేశాలు బాగా లేవనే విమర్శ కూడా వచ్చింది.
కొద్దిగా విషయాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేపథ్యం రెండవ ప్రపంచ యుధ్ధం. నవలా రచయిత రాజనీతి, సాంఘిక స్పందన, పాత్రలు, చదువు, మానవ మేధస్సు, చదువు వలన ఆలోచించ గలిగే సామర్థ్యం…ఇలా కొన్ని క్లిష్టమైన అంశాలను ఒక స్త్రీ పాత్ర ద్వారా ముందుకు తీసుకుని వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి కొద్ది సేపు అసలు వీరిద్దరికీ శృంగారం గొడవ ఎందుకు అనిపిస్తుంది. చివరకు ఆ స్త్రీ పాత్రను తిరిగి పరిశీలిస్తే నిత్య జీవితం, శారీరిక అవసరాం ఇలాంటి విషయాల నుండి ఎదిగి ఈమె చివరికి చదువు ద్వారా పూర్తి సిటిజెన్ గా ఎదిగినట్లు , ఆమెలోని స్పందన ద్వారా అక్కడ 300 మంది జ్యూ (మహిళలను) ఎక్స్టర్మినేట్ చేసిన సంఘటనను జైలులో మరల పరిశీలించుకోగలిగినట్లు కనిపిస్తున్నది. ఆ మాటకొస్తే అసలు ఇలా హోలోకాస్ట్ లో పాలు పంచుకున్న వారందరూ చదువుకున్న వారేనా అని రచయిత ఒక ప్రశ్న వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
~~~***~~~
ఈ చిత్రంలో కేట్ విన్స్ లెట్ నటన తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా వయసు మళ్లిన పాత్రలో ఆమె హావ భావాలు ఆకట్టుకుంటాయి. రాల్ఫ్ ఫియన్నెస్ కూడా దీటుగా నటించాడు.
చిత్రీకరణలో ఒక విశేషం ఉంది. చిత్రం ప్రారంభంలో సన్నివేశాలు వేగంగా సాగిపోయి చివరి దశలో టెంపో తగ్గిపోతుంది. సామాన్యంగా మరోలా కథనాన్ని తలపెట్టటం జరుగుతుంది కానీ ఈ చిత్రంలో కథానుసారం మంచి ప్రక్రియ చేపట్టారు. చివర కనిపించే సన్నివేశాలు పాత్రలతో పాటు అందరినీ ఆలోచింప చేస్తాయి.
చర్చ్ లో జరిగిన సన్నివేశం మన ముందుకు రాదు. ఆమె లో చదువు వలన జరుగుతున్న సంచలనమైన మార్పులు ప్రధానమైన అంశం అని దర్శకుడు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది కానీ నాజీ వ్యవస్థలోనూ, అటువంటి అరాచకాలలోనూ ఈమె పాత్ర సామాన్యమైనదేనని మరో విధంగా చిత్రం చెబుతుంది. మరోలా చెప్పాలంటే ఆ పని ఈమె కాకపోతే ఎవరైనా ఆ సమయంలో, ఆ వ్యవస్థలో చేసి ఉండే వారే! ఆమెకు ‘ వినిపించిన పుస్తకాలు-లేడీ విత్ ద లిటల్ డాగ్, ఒడిస్సీ…’ ఇలాంటివి.
ఈ చిత్రం చాలా బహుమతులు తీసుకుంది. నాలుగు అకాడమీ అవార్డులు ముఖ్యమైనవి. అందులో కేట్ విన్స్ లెట్ ఉత్తమ నటనకు అకాడమీ అవార్డు గెలుచుకుంది.
ఇతివృత్తం కొద్దిగా భారతీయ పరిస్థితులకు భిన్నంగా ఉన్నా, కొద్దిగా మింగుడు పడకపోయినా ఈ చిత్రం పాత్రల సమ్మేళనం, వెనుక నడుస్తున్న చరిత్ర, దాని ప్రభావం, వాటి ఫోకస్ ఒక పాత్ర మీద ఎలా చూపించాలీ, కథానుసారం టెంపోను ఎలా నియంత్రించాలీ అనే విషయాల కోసం చూడవలసిన అవసరం ఉన్నది.
~~~***~~~
‘న మంత్రం నో యంత్రం…’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ
27 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-రచనలు

ఇంటి నిండా నవ దుర్గలు…చిన్ని చిన్ని పిల్లలు వరండాలో ఆడుకుంటున్నారు. లోపల ఒకటే సందడి-హోమాలు, పూజలు, హడావుడి. ఒక చిన్నారి ఒక కాగితం తీసుకుని కూర్చుంది. రెండు కాళ్లూ ముందరకు జాపుకుని తెల్ల కాగితాన్ని ఒక పుస్తకం మీద పెట్టి బొమ్మను ఆడిస్తున్నట్లు వొడిలో పెట్టుకుని ఒక పెన్సిలుతో అదే పనిగా గీస్తున్నది. పక్కగా ఒక కుర్చీలో కూర్చున్నాను. ఒక కన్ను అటు వేశాను. పిల్ల నన్ను చూసి తను గీస్తున్న బొమ్మను చూసి మరల నన్ను చూసింది. ‘ ఇవి కళ్లు ‘, అంది. అమ్మవారి విశాలమైన కళ్లు గీయాలనే ప్రయత్నం చేస్తోంది. ఎదురుగా గోడ మీద బెoగాలీ కాలెండర్ లో ఉన్న బొమ్మను చూసి ప్రయత్నం చేస్తోంది. ‘ ఎవరివమ్మా కళ్లు? ‘
‘ అమ్మవారివి మావయ్యా! ‘
‘ బావున్నాయి. గియ్యి. ‘
‘ మావయ్యా?’
‘ ఏంటమ్మా?’
‘ అమ్మవారి కళ్లు చాలా పెద్దవి కదూ? ‘
‘ అవును.’
‘ ఎందుకు?’
‘…’
ఇదీ సమస్య. చిన్న పిల్లలతో పెద్ద మాట్లాడేస్తామనుకుంటాను! పెద్దవాడినెప్పుడయ్యానో తెలియదు! పెద్దగా మాట్లాడలేను. ఈ పిల్ల నన్ను అలానే చూస్తోంది.
‘ ఎందుకు మావయ్యా?’…నొక్కి వక్కాణిస్తోంది.
‘ అమ్మవారు చాలా పెద్దదమ్మా! మరి కళ్లు కూడా పెద్దవి ఉండాలి కదా?’
‘ మా మేడం కూడా చాలా పెద్దది మావయా! కానీ కళ్లు చాలా చిన్నవి కదా?’
గొంతు సద్దుకున్నాను. ‘ అలా కాదు చిట్టీ…’
‘ నా పేరు కుట్టీ…’
‘ ఓహో! కాదు కుట్టీ, ఇప్పుడూ, అమ్మవారు లోకంలో అందరినీ చూడాలి కదా? మరి ఇంత పెద్ద లోకంలోని అందరినీ చూడలంటే మరి ఎంత పెద్ద కళ్లు ఉండాలీ?’
‘ ఓహో! అలాగా? అందరినీ ఎందుకు చూడాలి మావయ్యా?’
‘ అందరు ఆమె బిడ్డలే కదా?’
‘ ఓ అందుకా?’
ఆపింది. ఆపి మరల బొమ్మ గీస్కుంటోంది. ఊపిరి పీల్చుకున్నాను.
‘ మావయ్యా…’
‘ అమ్మా’
‘ ఇప్పుడూ, అమ్మవారు ఏమి చేస్తోంది?’
‘ మనలందరినీ కనిపెట్టి కాపాడుతోంది’
‘ ఎలాగా’
‘ మన అమ్మ లాగా’
‘ మా అమ్మ జాబుకి వెళుతుంది. నన్ను చూడదు కదా?’
‘ జాబ్ కి వెళ్లినా నీ గురించే ఆలోచిస్తుంది. నిన్ను కనిపెట్టే ఉంటుంది.’
‘ అవునా?’
‘ అవునవును’
అక్కడి నుంచి లేస్తే మంచిదేమో, లోపల అవసర నైవేద్యం-ఇంటరిం రిలీఫ్ ఏదైనా ఉన్నదేమో కనుక్కుంటే బాగుంటుందనిపించింది. ఇంతలో
మరల అడిగింది, ‘మావయ్యా…’
‘ తల్లీ…’
‘ ఇప్పుడూ…మరీ…మరీ…అమ్మవారు ఎవరినైనా ఎత్తుకుంటుందా?’
‘ అందరినీ ఎత్తుకుంటుంది.’
‘ నన్ను?’
‘ ఓ తప్పకుండా…’
ఆ పిల్ల అసాధ్యురాలిలాగా ఉంది. లేచి సద్దుకుని ఆ కేలెండర్ దగ్గరకు వెళ్లింది. బొమ్మనీ నన్నూ రెండు సార్లు చూసి వెనక్కి వచ్చింది. చక్కగా కూర్చుండి పోయింది.
‘ మావయ్యా ‘
‘ అమ్మా ‘
‘ ఎత్తుకోలా! ‘
‘ నువ్వు అడిగావా?’
‘ ఊ…మెల్లగా అడిగాను. నువ్వు చెప్పావని కూడా చెప్పాను. నవ్వుతోంది కానీ నా మాట వినలేదు…’
ఆశ్చర్యం వేసింది.
‘ అమ్మలూ…’
‘ ఏంటి మావయ్యా?’
‘ అమ్మవారు ఆ కేలెండర్ లో బొమ్మలా ఉన్నారు. అసలుకి ఆవిడ మనలందరినీ ఎత్తుకునే ఉన్నది. ‘
పిల్ల లేచి నిలబడింది. ‘ ఎలా మావయ్యా?’
‘ మనకి తెలియదు. అమ్మ వొడిలో ఉన్నప్పుడు నువ్వు ఆడుకుంటావు అంతే! అమ్మ నిన్ను ఎలా ఎత్తుకుందో చూస్తావా?’
పిల్ల ఆలోచిస్తోంది.’ గుర్తు లేదు మావయ్యా, కానీ…’
‘చంటి పిల్లాడిని చూడు…’
‘ అవును మావయ్యా…నిజమే. చక్కగా ఆడుకుంటాడు.’
‘ మనమూ అంతే!’
‘ అందరం పిల్లలమేనా? ‘
‘ కొందరు చిన్న పిల్లలు, కొందరు పెద్ద పిల్లలు. అమ్మకి తెలుసు…’
ఇంతలో మరో ఇద్దరు పిల్లలు చేరారు. ఒక కుర్రాడు, ‘ మావయ్యా, దీనితో ఊరకే మాట్లాడావ్లు జోరుగా వినిపిస్తున్నాయి.
‘ మావయ్యా…’
‘ ఏంటమ్మా? ‘
‘ ఇప్పుడూ…అమ్మవారు కనిపించటం లేదు కదా? ‘
‘ అవును’
‘ మరీ…మరీ ఎలా గుర్తు పట్టటం?’
‘ నువ్వు మీ అమ్మతో ఎప్పుడైనా సినిమాకి వెళ్లావా?’
‘ ఓ! ‘
‘ అందరు బయటకి వచ్చినప్పుడు ఏమి చేస్తావు?’
‘ అమ్మ చేయి పట్టుకుని వదలను ‘
‘ ఎందుకు?’
‘ తప్పిపోతాము మావయ్యా!’
‘ ఒక వేళ ఎవరైనా మిమ్మల్ని తోసేసి వెళ్లిపోతే చేయి జారిపోతుంది. అప్పుడేమి చేస్తావు?’
‘ అవును మావయ్యా…ఒక సారి అలాగే తోసేశారు. అప్పుడూ…అప్పుడు నేను బిగ్గరగా అరచి అమ్మ వచ్చే వరకూ అక్కడే ఉన్నాను’
‘ లోపల అందరూ అరుస్తున్నారు చూడు, ఈ అరుపులన్నీ అందుకే!’
పిల్ల నవ్వింది.’ ఏ కాదు. అవి మంత్రాలు. ‘
‘ వాటి అర్థం అదే!’
‘ అవునా?’
‘ అవునవును!’
మంత్రాలు సద్దు మణిగాయి.
‘ మావయ్యా?’
‘ ఏమ్మా? ఆకలిగా ఉందా?’
‘ కాదూ! ఒక వేళ జనంలో అరచినా అమ్మకు వినిపించకపోతే?’
ఆ కుర్రాడు అందుకున్నాడు, ‘ మావయ్యా, అమ్మ చీరె రంగు గుర్తు పెట్టుకుని అలా వెనకనే వెళ్లి పటుకుంటాను…నేనైతే అంతే!’
‘ అమ్మ మీద ఉన్న నమ్మకం అది. నీ దారి అది, నీ నీడ అక్కడున్నది, నీ తోడు నిన్ను అలా ఇంటి దాకా నడిపిస్తుంది. నీకు దారి తెలియదా అని అడుగుతుందా?’
‘ పెద్ద పిల్లలని అడుగుతుంది’
‘ అదీ! అసలు ఎవరికీ దారి తెలియదు. అందరం చిన్న పిల్లలం అని చెప్పాను. అవునా?’
‘ లేదు. నాకు తెలుసు…’, కుర్రాడు అన్నాడు.
‘ ఇంటి వరకు తెలియవచ్చు. తరువాత?’
‘…’
‘ మావయ్యా…’
‘ చెప్పు కుట్టీ…’
‘ ఒకాయన మంత్రాలు చదివితే అమ్మవారు కనిపిస్తుందన్నాడు మావయ్యా! నీకు తెలుసా మంత్రాలు?’
‘ అమ్మను గుర్తు పట్టేందుకు మంత్రాలెందుకు పిల్లా? ‘
‘ మరీ…సినిమాలో యోగి ఒంటి కాలి మీద నిలబడతాడు…’
‘ అమ్మ ఒడిలో ఉన్నాను అని తెలుసుకునేందుకు అలా సాధన చేస్తారు తల్లీ…’
కుర్రాడు బుర్ర గోక్కున్నాడు. ‘ మోక్షం కోసం కాదా మావయ్యా?’
‘ సమస్త ప్రాణులూ తల్లి గర్భంలో వృధ్ధి చెందుతున్నాయి నాన్నా! ఆమె ప్రసవిత్రి, సావిత్రి. తిరిగి ఆమెలో లీనమైపోవటమే మోక్షం. అన్ని సాధనలు చివరకు తల్లి ఒడినే చేరుస్తాయి. ‘
‘ మనం చాలా చదువుకోవాలి పిల్లా…’
‘ మనం చిన్న పిల్లలం.’
‘ అవును! అదే ఙ్ఞానం! అందుకే తొమ్మిది చిన్న పిల్లలని అలంకరించి బాలా త్రిపురసుందరి పూజ చేస్తారు.’
‘ మాకు మంత్రాలు అవీ అక్కరలేదా మావయ్యా? ‘
‘ ఎవరడిగారు? పెద్ద పెద్ద మాటలు చెప్పిన శంకరాచార్యులే న మంత్రం, నో యంత్రం అన్నాడు…’
వాళ్లందరూ చక్కగా విరగబడి నవ్వారు. ఆ నవ్వులో దైవాన్ని చూశాను…
వాళ్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. కొందరు అనుసరిస్తూ, కొందరు అనుకరిస్తూ…వరండా యావత్తూ మంత్రాలను మరచి ప్రతిధ్వనించింది.
అలసిపోయి ఆగారు. ‘ నో యంత్రం…’ అంటూ మరల నవ్వారు…
శాంతించారు.
‘ మావయ్యా…’
‘ ఏంటి కుట్టీ?’
‘ ఆయనకి ఇంగ్లీష్ వచ్చా?’
‘అంటే?’
‘ నో యంత్రం అంటే…’
‘ అది సంస్కృతమే తల్లీ! ఆయన నా దగ్గర మంత్రం లేదు, యంత్రం లేదు, నిన్ను ఎలా స్తుతించాలో కూడా తెలియదన్నాడు. తల్లిని ఆహ్వానించటం, ధ్యానించటం, ఆవిద కథలు చెప్పటం ఏమీ తెలియవన్నాడు. ఆవిడ ముద్రలు..ఇలాంటివి కూడా తెలియవన్నాడు. చివరకి ఏడవటం కూడా రాదన్నాడు!’
‘ అయ్యో! ‘
‘ అమ్మా, కేవలం ఒక బాలుని లాగా నిన్ను అనుసరుస్తూ నీ వెనుకే నడుస్తాను అన్నాడు ‘
‘ ఎందుకు? ‘
‘ అది కష్టహరణం. అంటే ఏ కష్టం లేకుండా అమ్మ చూసుకోదా?’
‘ అవును.’
‘ ఇంకేమి కావాలి?’
లోపల గంటలు కొట్టారు.
~~~***~~~
27 సెప్టెంబర్ నుంచి 03 అక్టోబర్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ
27 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి శనులు కన్యలో, గురు రాహువులు మకరంలో, కుజుడు మిథునంలో, కేతువు కర్కాటకంలో, బుధ శుక్రులు సింహంలో, చంద్రుడు ధను, మకర, కుంభ మీన రాశులలో సంచరిస్తారు
పరస్పరం విభేదాలున్న వారు ఒక చోట చేరి మాట్లాడుకునే వారం. అలా అని విభేదాలు ఎక్కడికీ పోవు. మరింత గట్టి పడతాయి. వ్యాపారాలు బాగానే ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలలో సరికొత్త మలుపు కనపడగలదు.
మేష రాశి: చిత్రమైన ఆలోచనలు విసిగించగలవు. నిత్య కర్మలలో నిమగ్నమైతే ఏ సమస్యా ఉండదు. తగు విశ్రాంతి తీసుకొనండి. కొత్త పనులకు మరి కొంత కాలం పట్టవచ్చు. శ్రీసూక్తం చదవండి.
వృషభ రాశి: వాద్వివాదాలకు దూరంగా ఉండవలసిన వారం. ఖర్చులు చేస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉద్యోగంలో కొంత మార్పు సంభవం. భూ వివాదాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
మిథున రాశి: ఈ వారం మిత్రుల వలన మంచి ఆదాయం ఉన్నది. అనుకోని సంఘటన ఒకటి ఎదురవుతుంది. చర్చలకు మంచి వారం. వ్యాపారం బాగుంటుంది. కొంత చంచలత్వానికి గురి కాగలరు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కర్కాటక రాశి: దైవోపాసనలో కాలం గడుపు
తారు. విలక్షణంగా ఉండే గుణం వలన మిమల్ని మిత్రులు అపార్థం చేసుకుంటారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. దూర ప్రయాణాలు మానుకొనండి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
సింహ రాశి: ఈ వారం చక్కని ఫలితాలున్నాయి. పాత సమస్యలు మరల ముందుకు వచ్చి పూర్తిగా మాయమవుతాయి. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. ఉద్యోగంలో రాణిస్తారు. కార్యాలయంలో కొంత వివాదం ఉండగలదు. మహాసౌరం చదవండి.
కన్య రాశి: వారం మధ్యలో బదిలీ ఉండవచ్చు. మీ తోటి వారిలో ఒక సంచలనం ఉండవచ్చు. మాటలు తూచి మాట్లాడవలసిన వారం. రావలసిన డబ్బు అందగలదు. శ్రమ, ఖర్చులు అధికంగానే ఉంటాయి. విష్ణు సహస్రనామం చదవండి.
తుల రాశి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన వారం. వాహనంతో జాగ్రత్త వహించాలి. ఇది రెండవ సారి చెప్పదగిన సూచన. మీ మీద ఆరోపణలు ఉండవచ్చు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
వృశ్చిక రాశి: శత్రువుల మీద విజయం సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు కొంత బాధిస్తారు. వారాంతంలో ఒక వివాదం పరిష్కారమవుతుంది. ఇంటి పనుల గురించి యోచిస్తారు. పెళ్లి కాని వారికి మంచి ఫలితాలున్న వారం. హనుమాన్ చాలీసా చదవండి.
ధను రాశి: ఒక పోరాటం మొదలు పెట్టాలని యోచించు వారు ఈ వారం కాస్త నిదానించటం మంచిది. నిరుద్యోగులకు మంచి వారం. కొందరు ఈ మధ్య కొనుగోలు చేసిన వస్తువుల నుంచి అసంతృప్తి చెందగలరు. శ్రీ దత్త స్తవం చదవండి.
మకర రాశి: ఇంటి మీద మరింత శ్రధ్ధ చూపటం అవసరం. కొందరికి ఊరకే అప్పులు ఇవ్వటం మంచిది కాదు. పెద్ద వారి ఆరోగ్యం కలవర పెడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులను మరో వారానికి వాయిదా వెయ్యండి.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.
కుంభ రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. ఓర్పుతో నిర్వహించాలి. మంచి ఆలోచనలు కలిగి సత్కార్యం వైపుకు తీసుకుని వెళతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిచగలవు. కడుపు నొప్పులు బాధించగలవు. వారాంతంలో మంచి యోగాలున్నవి. ఆదిత్య హృదయం చదవండి.
మీన రాశి: సమస్యలను అధిగమిస్తారు. మీ బాట మీరు పయనిస్తారు. ఒక విహార యాత్ర చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలున్నాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు వారి అభిప్రాయాలను సరిదిద్దుకుంటారు. దేవీ సూక్తం చదవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతేర్నిత్యం యథాసురవధాదధునైవ సద్య:
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్
(దుర్గా సప్తశతి)
హే భగవతి! నీవు మా యందు ప్రసన్నురాలవు కమ్ము. మమ్ములను శత్రువుల భయము నుండి రక్షింపుము. నీవు ఇప్పుడే శుంభ, నిశుంభాది దైత్యులను వధించి, వారి నుండి మమ్ములను రక్షించితివి. ఆ రీతి గానే, భవిష్యత్తులో కూడా కలుగునట్టి శత్రు భయము నుండిదేవతలైన మమ్ము శాశ్వతముగా పరిపాలించుము. హే దేవి! నిత్యము సర్వలోకపాపములను వెంటనే ప్రశమింప జేయుము…
మిత్రులందరికీ దసరా శుభాకంక్షలు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version is available at www.sripati.com
ఇటీవలి అభిప్రాయములు