‘ అనలైస్ దిస్’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

రాబర్ట్ ద నిరో గురించి అందరికీ తెలిసిందే! ఎందరో నటులు ఆయనను అనుకరించే ప్రయత్నంలోనే గొప్ప నటుల పేరు సంపాదించుకుని వెళ్లిపోయారు!
1999 లో అవినీతిని ‘ కామెడీగా ‘ ఎంచుకుని కెనెత్ లోనెర్గాన్, పీటర్ టోలన్ కలసి రచించిన చిత్రం ఇది.హరోల్డ్ రామిస్ దర్శకత్వం వహించారు. ఒక డాన్ పాత్రలో రాబర్ట్, ఒక మానసిక శాస్త్రవేత్తగా బిలీ క్రిస్టల్ నటించారు.
అమెరికా అండర్ వర్ల్డ్ డాన్ గా ఎవరుండాలి అని ఎంచుకునేందుకు అనే ఒక మీటింగు ఏర్పాటు జరగవలసి ఉన్నది. కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక క్రిమినల్, ఒక సైకిక్-ఇద్దరూ కలసిన పాత్ర నిరో నటించిన పాత్ర. ఒక మాన్సిక వైద్యుడుగా బిలీ క్రిస్టల్ నటన కూడా ఆకటుకుంటుంది.
చిత్రంలోని సన్నివేశాలు క్రౌర్యంతో కూడిన ఒక ప్రపంచంలో ప్రతి మానవునిలోని మానసికపరమైన స్పందనలను పరీక్షించే ప్రక్రియలో భాగంగా కనిపిస్తాయి. ఒక సైకియాట్రిస్ట్ చూసే కోణం సరైన సమయానికి ముందుకు వస్తుంది. మరి కాస్త ముందుకు వెళితే కథలో ఈ సైకియాట్రిస్ట్ కూడా ఒక సమస్యలో ఉంటాడు. సరిగ్గ ఇతను తన రోగులతో మాట్లాడుతున్నప్పుడు ఇతని కొడుకు అన్నీ చక్కగా వింటూ ఉంటాడు. ఈ విలన్ తో రంగంలోకి దిగాక రెండవ పెళ్లి చేసుకుంటున్నప్పుడే ఆ ముఠా సూటిగా చర్చ్ లోకే వస్తుంది. అక్కడ చిత్రీకరించిన కామెడీ నవ్విస్తూనే బాధిస్తుంది!
కథ గురించి చెప్పాలంటే నిరో ఈ సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతాడు. ఎఫ్. బి. ఐ వారు సైకియాట్రిస్ట్ ను వారికి అనుగుణంగా వాడుకుంటారు. మూల స్తంభం, లేదా కథకు గర్భం అని చెప్పదగిన సన్నివేశం చాలా నేర్పుతో చిత్రీకరించారు దర్శకులు. సైకియాట్రిస్ట్ ను చంపే ఆలోచనతో నిరో అతన్ని ఒక మూలకి మెడ మీద గన్ పెట్టి తోసుకుని వెళతాడు. ఇతను విలన్ తండ్రి పాతికేండ్ల క్రితం ఏ విధంగా చనిపోయాడో అనేది గుర్తుకు తెచ్చి అతన్ని పూర్తిగా ఆ క్షణంలో కరిగించేస్తాడు. సైకియాట్రిస్ట్ దగ్గర ఉన్న ఆయుధం అతని అనుభవం, అతని విద్య!
నిరో ప్రాణాలను యాదృఛ్చికంగా రక్షిస్తాడు. ఇతను జారి ముందుకు పడటం వలన బులెట్ నిరోను తగలబోయి ఇతని భుజానికి తగులుతుంది. ఇతను ఆసుపత్రికి చేరుకుంటాడు, ఎఫ్. బి.ఐ వాళ్లు నిరోను జైలుకు తీసుకుని వెళతారు. అక్కడ నిరోను సైకియాట్రిస్ట్ కలసి వెనక్కి రావటంతో చిత్రం ముగుస్తుంది.
~~~***~~~
సామాన్యంగా ఒక కథానాయకుని ఎంచుకున్నప్పుడు అతను ఎన్నో సమస్యలను ఎదుర్కో గలిగిన ధైర్యవంతునిలా చిత్రీకరించటం ఒక పరిపాటి. మానసిక రోగికి ఒక వైద్యుడు సమాధానం అనుకోవచ్చు. ఈ చిత్రంలో ఆ వైద్యుడు కూడా సమస్యలోకి అనుకోకుండా వెల్లిపోయి కథను సుఖాంతం చేయటం విశేషం. ఇందులో చిన్న మర్మం ఏమిటంటే అన్ని వ్యవస్థలూ ఏదో ఒక పిచ్చి వలనే కనిపిస్తున్నాయి! మందులు కనిపెట్టి లాభం లేదు. సమాజంలోకి దూసుకుని పోయి ఒక సజీవమైన, సక్రియమైన పాత్రను పోషించవలసిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన విద్య బయట పడగలదని ఒక అంతర్లీనమైన సందేశం కనిపిస్తోంది!
ఒక డాన్ తన పదవి పట్ల ఉన్న వ్యామోహంలో తనకు కలుగుతున్న మానసికపరమైన ఆందోళన కోసం ఒక వైద్యుని సంప్రదించటం ఎంతో సృజనాత్మకతను సూచిస్తోంది. కారులో విలన్ ఒక శవాన్ని పెట్టుకుని వెళుతున్నప్పుడు ఈ వైద్యుడు ఆ కారుని గుద్ది తానుగా నష్త పరిహారాన్ని ఇవ్వాలని ముందుకు వస్తాడు. విలన్ ఆ కారును ఎలాగో అలాగ ముందుకు తీసుకు పోవాల్నే ఆదుర్దాలో ఉంతాడు. ఇతను ఒప్పుకోడు. చివరకు ఒక విసిటింగు కార్డు ఇచ్చి వస్తాడు. వీరి సాంగత్యం అలా ప్రారంభమవుతుంది…

నిరో నటనలో రెండు వైపులు కనిపిస్తాయి-ఒకటి క్రిమినల్ గా నటించటం. రెండు ఒక సైకిక్ లక్షణాలను కనబరచటం. కొన్ని సన్నివేశాలలో రెండిటినీ మేళవించినప్పుడు ఇతను ఏమి చేయబోతున్నాడో ఊహించటం నిజంగానే కష్టమయింది…
డాక్తర్ గారు ఒక ప్రొఫెషనల్ సైకియాట్రిస్టుగా కనిపిస్తూనే ఒక మామూలు మనిషి పడే బాధలను అంతర్లీనంగానే చూపిస్తాడు. దీనికి ఒక కారణం ఉండవచ్చు. పాత్ర పరంగా ఇతని ముఖ్య ఉద్దేశ్యం నిరోను ఒక సైకియాట్రిస్టుగా ఆకట్టుకుని ముందుకు పోవటం తప్ప మరో మార్గం లేకపోవటం!
ఎంతో క్లిష్టమైన ఇతివృత్తం, అంతే నేర్పుతో తీసిన చిత్రం.
ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చాయి. 2000వ సంవత్సరం లో రాబర్ట్ ద నిరో కు గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చారు.
‘ అనలైస్ దట్ ‘ అనే చిత్రం కూడా దీని సరళిలో తరువాత వచ్చింది.

This movie certainly deserved an analysis.

~~~***~~~

‘నిన్న లేని అందమేదో’(25)-వేదాంతం శ్రీపతి శర్మ

బాగా నిద్ర పట్టిన తరువాత ఎందుకో శరత్ కు మెలకువ వచ్చింది. బయట ఏదో నలుగురు మాట్లాడుకుంటున్న చప్పుడు. గదిలో లైటు వేశాడు. కొద్దిలో కాలు తగిలేది…ఎందుకో ఎంత చెప్పినా వినకుండా ఆదుర్దా అని తనని తాని పిలుచుకుంటున్న ఈ మనిషి కిందనే పడుకున్నాడు. బాగా చితికిపోయిన వ్యక్తి లాగా ఉన్నాడు. తలుపు తెరచి బయటకు వచ్చాడు శరత్. బయట ఎవరో నలుగురు కుర్రాళ్లు పిట్ట గోడ మీద ఆనుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శరత్ ను చూసి ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు.
‘సార్…’, ఒకడు ముందుకు వచ్చాడు..’ ఎక్కడా పడుకునేందుకు చోటు దొరకలేదు. ఇలా పడుకుంటా
ము. ఏమీ అనుకోకండీ…’
‘లోయకు పిక్ నిక్కా?’
‘ అవును సార్ ‘
‘ చదువుకుంటున్నారా?’
‘…’
‘అదేంటీ? అలా నిలబడిపోయారే?’
‘ చదువులు అయిపోయాయనుకుంటున్నాము సార్. బేవార్సుగా ఉన్నాము. అదీ సంగతి!’
‘ ఓహో! ఉద్యోగం వేటలో ఉన్నారా?’
‘ ఉంటే వేటాడతాం సార్. ‘
‘ ప్రస్తుతానికి పడుకోండి…గుడ్ నైట్! ‘
‘ థేంక్ యు సార్.గుడ్ నైట్!’
శరత్ లోపలికి వెళ్లిపోయాడు. తలుపు బయట నుంచి వినిపిస్తోంది…’ ఒక్కడే ఉన్నాడంటావా? ‘
‘ ఇక్కడికి ఒక్కడే ఎందుకు వస్తారబ్బా, ఒకరో…ఇద్దరో …తెచ్చుకోకుందా ఎందుకొస్తారు?’
‘ లేదు రా. నాకు అనిపించలేదు.’
‘ అంతే అంటావా?’
‘ అంతే! పడుకోరా…’
‘ ఊ…కడుపు కాళేశ్వర రావు మార్కెట్టూ, ఒళ్లు ఒంగోలు చింతపoడు అయిపోయాయిరా నాన్నా! ఇంక ఒకటే నిద్ర!’
‘ అవునొరే, నువ్వు ఎప్పుడైనా ఒక మనిషిని భుజం మీద మోశావురా?’
‘ లేదు. ‘
‘ ఇప్పుడు మొయ్యాలి. రేపు ఉదయం లేచిన దగ్గర నుండీ నీ డ్యూటీ అదే! ‘
‘ ఎవరిని మొయ్యాలి?’
‘ ఇంకెవరు? నన్నే! ‘
‘ ఈ లోయ ప్రోగ్రాం వేసింది ఎవరు? ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. ‘
‘ ఎందుకు? ‘
‘ ఇంతవరకూ జీవితంలో ఎవరినీ కొట్టలేదు. రేపు ఆడు నా చేతిలో…’
‘ రే…పడుకోండిరా…ఇక్కడినుండి గూడా తరిమేస్తారు…’

~~~***~~~

మరో రెండు గంటలలో తలుపు గట్టిగా చప్పుడయింది. ఈ సారి గాభరాగా ‘ఆదుర్దా ‘ కూడా లేచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. కుర్రాళ్లు కంగారులో ఉన్నారు.
‘ ఏమయింది? ‘
‘ సార్, వీడిని పట్టుకోలేకుండా ఉన్నాము. ‘
ఓ కుర్రాడిని గట్టిగా పట్టుకుని ఉన్నారు.
‘ ఏమంటాడు? ‘
‘ కిందకి దూకుతానంటాడు సార్! ‘
‘ ఎందుకు? ‘
‘ ప్రేమ పిచ్చోడు…’
అతను గింజుకుంటున్న్నాడు. ‘ నన్ను వదలండి ‘
శరత్ దగ్గరగా వెళ్లాడు. ‘ వదలండి. ఏమీ చెయ్యడు. ‘
అతన్ని వదిలారు. అతను ఏడవటం మొదలెట్టాడు.
‘ ఏడుపొద్దు. నీ బాధ చెప్పు…’
‘ …’
‘ ఎందుకు ఏడుపొస్తోంది? ‘
‘ ఏమీ చెప్పలేను సార్. ‘
‘ ఏదో ఒకటి చెప్పు. ఏదైనా…’
‘ తలచుకున్నప్పుడల్లా నిద్ర పట్టదు ‘
‘ దేనిని తలచుకుంటావు? ‘
‘ మా ప్రేమ కథ ముగిసిపోయింది. ‘
‘ మరి నాకెందుకు చెబుతున్నావు? ‘
అతను వింతగా చూశాడు. ‘ అంటే?’
‘ నువ్వే నీ ప్రేమను కథ అంటున్నావు! మరి నిజమేమిటి? ‘
‘ ఆ పొగలా మాయమయింది సార్. నేను ఆ ఆకాశంలోకి వెళ్లిపోతాను. ఈ లోకంతో నాకు పని లేదు. ఆ నక్ల్షత్రాలలో బ్రతికేస్తాను. ఒరే…నన్ను రేపైనా ఆ లోయలోకి తోసెయ్యండి…’
అక్కడ అటు తిరిగి పడుకున్న వాడొకడున్నాడు. అతను అటు తిరిగే ‘ అలాగే ‘ అన్నాడు.
ఇతను ఏడవటం మొదలు పెట్టాడు. ఆదుర్దా సిగరెట్ ముట్టించాడు. దగ్గరగా వెళ్లాడు.
‘ లోయలోకి తోస్తే పైకి వెళ్లిపోతావనుకుంటున్నావా?’
‘ వెళ్లనా?’
‘ నువ్వు లోయదాకా వెళ్లే ముందే పైకి పోతావు. అది వొదిలెయ్యి. నువ్వు ఎవరినీ ప్రేమించినట్లు నాకు అనిపించటం లేదు…’
‘ నాకు ఈ సినిమా కథలొద్దు సార్, అయిపోయింది. నేను…నా వల్ల కాదు…’
‘ సినిమా కథ కాదు నాయనా! నక్షత్రాలలోకి వెళతావా? ‘
‘ అవును సార్. నాకు తెలియదు. నేనైతే వెళతాను. నాకెందుకో గట్టి నమ్మకం ఉంది ‘
‘ ఛా! కాలిపోవా?’
‘ నో! కాలను సార్! ఇక్కడ కాలుతున్నంత ఎక్కడా కాలదు….మీరు ఒకరిని ప్రేమించండి. అర్థమవుతుంది ‘
‘ నువ్వు ప్రేమించలేదు బుల్లోడా…’
అతను సీరియస్ అయ్యాడు. దగ్గరగా వచ్చాడు.
‘ ఎలా చెబుతున్నారు సార్? ‘
‘ ప్రేమించే వాడికి లోకాలతో పని లేదు. స్వర్గ నరకాలు పట్టవు. ప్రేమే ఒక ప్రపంచం! అది అలా స్థూలంగా నిలబడి ఉన్న ప్రపంచం కాదు. ఎప్పటికప్పుడు పొంగి పొరలి మనస్సనే చంద్రునితో ఆడుకుంటూ అంతరాత్మ అనే సూర్యుని చుట్టూ తిరిగిపోయే ప్రపంచం. ఆ బాటలోనే ఆ లోకం ప్రాణం పోసుకుంటుంది, తిరిగి పుడుతుంది…తిరగటం వలన పుడుతంది…పెరుగుతుంది, నిలబడుతుంది, కదులుతుంది. ఆ సంచలనాన్నే ప్రేమ అంటారు బుల్లోడా…నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? నేను ఆ లోకంలో ఉంటాను అందుకే నా ప్రాణానికి ప్రాణం పోసుకుంటాను…నో! నువ్వు మరో లోకం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ప్రేమించలేదు…ప్రస్తుతానికి పడుకో. రేపు మాట్లాడదాం. ‘
సిగరెట్ పారేశాడు ‘ఆదుర్దా. ‘
ఆ కుర్రాడు అతన్ని వింతగా చూశాడు. మిత్రులు కింద పరచిన తువ్వాలు మీద కూర్చుని ఆ కుర్రాడిని కూర్చోపెట్టారు. కొద్ది సేపు అంతా నిశ్శబ్దంగా ఉంది.
కురాడు కొద్దిగా గింజుకుంటున్నాడు.
‘ లేదు…నాకు స్వార్థం తెలియదు. నేను నా సర్వస్వం త్యాగం చేశాను. మోసపోయాను ‘
‘ నిన్నెవరూ మోసం చేయలేదు బిడ్డా! నీ ఆలోచనలు నిన్ను మోసం చేశాయి. ప్రేమ కోసం త్యాగం అంటున్నావు. ఎందుకు? ఇటు తిప్పి ఆలోచించు. ప్రేమ ప్రపంచం లోకి వెళ్లు. అంతా స్వార్థమే! ఈ భూమి కూడా స్వార్థం కోసమే తిరుగుతోంది…’
జాగ్రత్తగా వింటున్న ఒక కుర్రాడు నోరు వెళ్లబెట్టాడు. ‘ ఏమి మాట్లాడుతున్నారు సార్? ‘
‘ అవును. భూమి తిరగకపోతే ఒక పక్కకు ఒరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక వృత్తం మీద ఒక గతిలో తిరుగుతూనే ఉండాలి. అదే విచిత్రం. కదలకుండా నిలబడాలీ అంటే తిరుగుతూ ఉందాలి…అక్కడే ఉంది అసలు మూర్ఖత్వం! నువ్వు కోరుకున్నది పొందాలంటే నీ సర్వస్వం కోలుపోవాలి…’
శరత్ గోడకి ఆనుకుని తల బాదుకున్నాడు. అందరూ చిన్నగా నవ్వారు. ఆ కుర్రాడు కూడా నవ్వాడు.
ఆదుర్దా గంభీరంగానే ఉన్నాడు. ఆకాశంలో దూరంగా ఎక్కడి నుండో ఇంకా పైకి లేస్తున్న పొగను చూస్తూనే ఉన్నాడు…
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)

20-26 సెప్టెంబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:రవి శనులు కన్య,గురు రాహువులు మకరం,కుజుడు మిథునం,కేతువు కర్కాటకం,శుక్రుడు సింహం,బుధుడు కన్య, సింహ రాశులు, చంద్రుడు కన్య,తుల, వృశ్చిక, ధను రాశులు సంచరిస్తారు.

ఆర్థిక లావాదేవీలు తీవ్రతరం అవుతాయి. కొంత తొందరపాటు వలన పలువురు నష్టపోగలరు. విదేశీ వ్యవహారాలలో మంచి పరిణామాలు ఉండగలవు. వ్యవసాయ రంగం కొత్త సమస్యలలోకి వెళ్లగలదు.ముడి సరుకు వ్యాపారం వారికి బాగుంది. ఆదాయం అందరికీ బాగుంటుంది. మాట పట్టింపులు ఉండవచ్చు. ఈ వారం విద్యార్థులకు మంచి అవకాశాలు ఇవ్వగలదు. నిరుద్యోగులకు, కళాకారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మేష రాశి: ఈ వారం వింతైన సంఘటనలతో ప్రారంభం కాగలదు.ఆరోగ్యం బాగుంటుంది.చాలా పనులు సంకల్పించటం బదులు చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవటం మంచిది. నవరాత్రులలో మంచి ఉపాసన చేపట్టండి.

వృషభ రాశి: పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలరు. గుండె జబ్బులతో బాధ పడు వారు తగు జాగ్రత్తలు వహించాలి.మిత్రులు వారు చేసిన తప్పులకు ఇబ్బందులు పడటం వలన మీ సహాయం కోరవచ్చు. తగు హితబోధ చేయటం అవసరం. విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: అన్నింటా మంచి వారం. మీ సహనం వలన మంచి పేరు తెచ్చుకుంటారు. రక్తపు పోటు వలన కొంత ఇబ్బంది కలుగవచ్చు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది. వారాంతంలో ఆదాయం బాగుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: మీరు విశ్రాంతిని విస్మరిస్తున్నారు. తరచుగా ఇలా చేయటం మంచిది కాదు.స్త్రీలతో విభేదాలుండవచ్చు.ఒకరి ఆతిథ్యం స్వీకరిస్తారు.ఆదాయం బాగుంది. లలితా సహస్రనామం చదవండి.

సింహ రాశి: అన్నింటా మంచి వారం. మీకు కలిగిన ఆలోచనను అనాలోచితంగా పెద్దల ముందు అనేయటం వలన మీ మీద దురభిప్రాయం కలుగ గలదు.ఈ నైజాన్ని ఈ వారం కనిపెట్టి మరీ నియంత్రించాలి.శ్రమ అధికంగా ఉన్న వారం ఇది.ఒకరి విషయంలో తీవ్రంగా ఘర్షణ పడగలరు. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: శాశ్వతమైనవి శాశ్వతంగానే ఉంటాయని తెలుసుకుంటారు.మీ పట్టుదలకు ఇతరులు తల వంచుతారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఒక పనిని పూర్తి చేస్తారు. కొత్త పనిలోకి దూకుతారు.ఆరోగ్యం కాపాడుకోవలసిన వారం. శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: గతంలో చేసిన కొన్ని పనులకు భయాందోళనలు కలుగవచ్చును. మీ వైఖరిని చాలా మంది గమనిస్తున్నారు. మీకు తెలియని విషయాలలో జోక్యం చేసుకుని ఒకరికి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. తరువాత బాధ పడగలరు. శివునికి అభిషేకం జరిపించండి.

వృశ్చిక రాశి: ఈ వారం చాలా సమస్యలు దూరం కాగలవు. భవిష్యత్తులో కొత్త పనులకు ఈ వారం నాంది పలుకగలరు.కొంత గోప్యం అవసరం. అధికంగా ఆలోచన తగదు. బంధు మిత్రుల సమాగమం ఉండవచ్చు. ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు మంచి వారం. మహాసౌరం చదవండి.

ధను రాశి: నూతన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి వారం. విదేశీ యానం ఉండవచ్చు. ఆదాయాన్ని పెట్టుబడులుగా మార్చగలరు. వాహనం కొద్దిగా సమస్య సృష్టించగలదు. కొందరి ఒరవడి మీకు అర్థం కాకపోవచ్చు. హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి: కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారం. కొంత విలాసానికి వెచ్చిస్తారు. ఇష్టం లేకపోయినా కొందరి మాటలు వినవలసి వస్తుంది.ఇతరుల ఈర్ష్య నుంచి జాగ్రత్త వహించాలి.కొత్త పనులు చేపట్టటానికి మంచి వారం. దేవీ సూక్తం చదవండి.

కుంభ రాశి: మనసు ప్రతిక్రియలలో మునిగి ఉన్నట్లు తెలుస్తున్నది. కాలం ఆ సంగతులలో వృధా చేయకండి. మౌనాన్ని మించిన ప్రతిక్రియ, ప్రక్రియ లేదు! కళాకారులకు, విద్యార్థులకు మంచి వారం. స్త్రీలకు అవకాశాలు బాగుoటాయి.ఉద్యోగంలో మార్పులు సంభవం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

మీన రాశి: ప్రయాణాలు మానుకోవటం మంచిది. ఇంటి పనిలు పూర్తి చేస్తారు.పిల్లలు మంచి వార్తలు చెబుతారు. వారం మధ్యలో ఆదాయం పెరుగుదలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. లాభిస్తాయి కూడా…దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

(తంత్రోక్తం దేవీ సూక్తం)

సమస్త ప్రాణులలో ఏ దేవి అయితే మాతృ రూపంలో యున్నదో, ఆ తల్లికి పలుమార్లు నమస్సులు.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~~***~~~

The English version is available at www.sripati.com

Follow

Get every new post delivered to your Inbox.