‘ రెయిన్ కోట్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
29 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం

ఇద్దరు రచయితలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ‘ మీరు దేని మీదనైనా వ్రాయగలరా?’, ఒకాయన అడిగాడు.
‘ అదుగో ఆ మల్లె పూవు మీద వ్రాయమంటారా??’
అతను ఆగిపోయాడు. ఇద్దరూ మల్లెపూవు దగ్గరగా వెళ్లారు.
‘ మీరు ఈ పువ్వు మీద వ్రాస్తారా? అయితే నేను నేను పువ్వు మీద కనిపిస్తున్న సన్నని ఈ వాన చినుకును ఎంచుకుంటాను…’
‘ ఎందుకు?’
‘ ఆ చినుకు ఉన్న లోకం నా కథకు ఇతివృత్తం ‘
షార్ట్ స్టోరీలు చదివే వారికి ఒక చిన్న వస్తువును తీసుకుని ఒక సాంఘిక సమస్యనో లేక మానవ సంబంధాల విశ్లేషణో కథకుడు అంతర్లీనంగా నడుపు కథలు చాలా తారస పడుతూ ఉంటాయి. ఇటువంటి కథలలో కళాత్మకత అనేది ప్రధానంగా జీవం పోసుకుంటుంది. ఎక్కువగా పాత్రలు కనిపించవు. ఒక్కో సారి ఒక పాత్రతోనే సాగిపోతుంది. ఎంచుకున్న వస్తువు (గొడుగో లేక రెయిన్ కోటో) కథలో మాట్లాడకుండానే ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఇలాంటి కథలు నాటక ప్రక్రియకు దగ్గరగా ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకోవటం లేదా ఒకరు ఒక ఉత్తరం చదవటం కనిపిస్తూ ఉంటుంది…కథ అయిపోతుంది. సంవాదాల్ మీద, పాత్రల ప్రవేశం మీద, నటుల ప్రతిభ మీద ఆ కథనం యొక్క అంతిమ విజయం ఆధార పడి ఉంటుంది…
~~~***~~~
ఓ హెన్రీ కథ ద గిఫ్ట్ ఆఫ్ ద మేజయీ ‘ మీద ఆధార పడిన చిత్రం ‘ రెయిన్ కోట్ ‘. అజయ్ దేవ్గణ్, ఐశ్వర్యా రాయ్ ఈ చిత్రం లో నటించారు. 2004 లో నిర్మించిన ఈ చిత్రానికి రితుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించారు.
అజయ్ ఐశ్వర్య ఒకప్పటి ప్రేమికులు. ప్రేమ ఫలిచనందువల్ల ఐశ్వర్యకు మరొకరితో పెళ్లి అయి కోల్కటాలో ఉంటుంది. అజయ్ ఉద్యోగం కోసం కోల్కటా వస్తాడు. ఐశ్వర్య ఇంటిలో ఇద్దరూ కలుసుకుని వాన పడుతున్నందుకు అలా కూర్చుని మాట్లాడుకుంతారు. ఐశ్వర్య కిటికీలను కూడా తెరవదు. కాలింగు బెల్ ఎవరో కొడుతున్నా తలుపు తీయనీయదు. ఏదో సాకు చెబుతూ ఉంటుంది. తానున్న పరిస్థితిని దాచేస్తూ ఏవేవో చెబుతూ ఉంటుంది. అజయ్ కూడా టి.వీ సీరియల్ నిర్మాత అని, స్లాట్ లు కొంటున్నాడనీ ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటాడు. అజయ్ రెయిన్ కోట్ తీసుకుని ఐశ్వర్య ఇప్పుడే బజారుకు వెళ్లి వస్తానని బయటకు వెళుతుంది. ఇల్లు గలాయన అనూ కపూర్ ప్రవేశంతో చిత్రం ఊపు అందుకుంటుంది.
రెయిన్ కోట్ లో ఉన్న ఉత్తరం వలన అజయ్ పరిస్థితి ఆమెకు తెలిసి అందులో బంగారు గాజులు పెడుతుంది. ఇంటి ఆసామి దగ్గర అన్నీ తెలుసుకున్న అజయ్ కొంత డబ్బు (స్నేహితుడు ఇచ్చింది) అతనికి ఇచ్చినా ఆ సంగతి చెప్పడు…
రెయిన్ కోట్ లో ఐశ్వర్య ఒక ఉత్తరం పెడుతుంది. డబ్బు అవ్సరం అని తనకి చెప్పి ఉంటే అతనికి ఇచ్చేది కదా అని వ్రాస్తుంది. అసలు ఆమె భర్త డబ్బు సంపాదించలేక తాగుడుకు గురయి ఉంటిని అస్తవ్యస్త పరిస్థితిలోకి చేర్చాడని అజయ్ కి అప్పటికే తెలిసిపోతుంది…
~~~***~~~
అను కపూర్ ప్రవేశం చేసిన తీరు, అతని నిర్మొహమాట వైఖరి దర్శకుని ప్రతిభను చూపిస్తాయి. ఐశ్వర్య వానలో బయటికి వెళ్లినప్పుడు అజయ్ కిటికీ తెరుస్తాడు. అను కపూర్ బయట నుంచి దారిన పోయే వాడిలా నటించి ఒక్క సారి బాత్ రూం వాడుకోనిస్తారా అని ప్రార్థించి ఒప్పించి ఇంటిలోకి ప్రవేశిస్తాడు!
కావాలనుకున్నవే దొరకటం, అనుకున్నవే జరగటం…ఇవి లేనపుడే జీవితం ఒక అసంతృప్తి అనే బార్డర్ ను కనిపించని రంగులా పూసుకుని నిత్యం ఒక హంగామా చేసుకుంటూ ఉంటుంది. ఒకరు బాగుండాలని ఒకరు, అందరూ బాగుండాలని ఇంకొకరు, ఎవరు బాగుకుంటే ఎవరికి…ఇదో పెద్ద ప్రపంచం, చిన్న జీవిత కాలం!
ముగ్గురూ…ఐశ్వర్య, అజయ్, అను కపూర్ ఎంతో నేర్పుతో నటించిన చిత్రం ఇది.
ఈ చిత్రం క్రిస్టల్ గ్లోబ్ కు ఉత్తమ చిత్రం గా నామినేట్ అయినది. ఐశ్వర్య కు జీ చిని అవార్డ్ ఫర్ క్రిటిక్స్ చాయిస్ వారి ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు కూడా నామినేట్ అయింది.
~~~***~~~
‘ ద రీడర్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
27 సెప్టెం 2009 1 వ్యాఖ్య
in శ్రీ-చిత్రం

బర్నార్డ్ ష్లింక్ జర్మన్ నవల ‘ద రీడర్ ‘ ఆధారంగా 2008 లో నిర్మించబడిన చిత్రం ఇది. కథ కొద్దిగా సంప్రదాయానికి దూరంగా ఉంటుంది. నవలలో చెప్పిన మోతాదు కంటే చిత్రంలో శృంగారం పాళ్లు నిజానికి తక్కువే అని చెప్పాలి.
టీనేజిలో ఉన్న ఒక కుర్రాడికి అతని కంటే చాలా ఎక్కువ వయసు గల ఒక మహిళతో సంబంధం ఏర్పడుతుంది. ఈమె చదువు రాని మహిళ. కుర్రాడి చేత ఆంగ్ల క్లాసిక్ పుస్తకాలు చదివించుకుంటూ అతనితో ఇతర ప్రక్రియలు సాగిస్తూ ఉంటుంది… కుర్రాడు పెద్దయ్యాక లాయరు అవుతాడు. చాలా సంవత్సరాల తరువాత ఈమె ఒక నాజీ వ్యవస్థలో 300 మంది ఒక చర్చ్ లో కాలిపోవునప్పుడు అక్కడ గార్డ్ గా నిలబడి ఏమీ చేయనందుకు కోర్టులో ట్రయల్ లో ఉంటుంది. ఈమె మీద అభియోగం ఏమిటంటే ఈమె ఆ ‘హోలోకాస్ట్ ‘ కి నాయకత్వం వహించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందని మిగతా గార్డులు వాదిస్తారు. ఆమె ప్రేమికుడు ఆమె తను చదువుకోలేదన్న సంగతి ఎందుకు చెప్పదు అని బాధ పడతాడు. అయినా ఆమెకు జీవిత ఖైదీ శిక్ష పడుతుంది. జైలుకి ఇతను కాసెట్లు, టేప్ రికార్డరు పంపి వాటిలో పుస్తకాలలోంచి తను చదివి రికార్డు చేసినవి పంపుతూ ఉంటాడు. ఆమె జైలులోనే చదువు నేర్చుకుంటుంది. విడుదల అయ్యే ముందు ఇతను కలుస్తాడు. కలసి ఆమెకు ఉద్యోగం చూశాడనీ, ఇల్లు కూడా చూసి పెట్టాడనీ చెబుతాడు. కానీ విడుదల అయ్యే రోజుకి ఆమె ఆత్మ హత్య చేసుకుని చనిపోతుంది. కొంత డబ్బు ఇలానా ( కోర్టులో సాక్ష్యం చెప్పిన ఆమె) కు ఇవ్వమని సందేశం వ్రాసి పోతుంది. ఆ డబ్బు న్యూ యార్క్ కు ఇతను తీసుకొని వెళ్లి చదువుకోని జ్యూలకోసం వెచ్చించవచ్చని చెబూఅడు.
ఈ లాయరు తన పాపకు (ఇతని వైవాహిక జీవితం విడాకులతో మధ్యలోనే ఆగిపోతుంది ) ఈ వ్యక్తి సమాధి దగ్గర ఈ కథ చెప్పటం ప్రారంభించటం తో సీమా అయిపోతుంది…
~~~***~~~
ఈ చిత్రం మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చదువు రాకపోవటం మూడు వందల మందిని చంపేయటం ఒక తరాజులో పెడితే ఏది బరువు కాగలదు అని కొందరు ప్రముఖులు అన్నారు. అలాగే ఈ విచ్చలవిడి శృంగార సన్నివేశాలు బాగా లేవనే విమర్శ కూడా వచ్చింది.
కొద్దిగా విషయాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేపథ్యం రెండవ ప్రపంచ యుధ్ధం. నవలా రచయిత రాజనీతి, సాంఘిక స్పందన, పాత్రలు, చదువు, మానవ మేధస్సు, చదువు వలన ఆలోచించ గలిగే సామర్థ్యం…ఇలా కొన్ని క్లిష్టమైన అంశాలను ఒక స్త్రీ పాత్ర ద్వారా ముందుకు తీసుకుని వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి కొద్ది సేపు అసలు వీరిద్దరికీ శృంగారం గొడవ ఎందుకు అనిపిస్తుంది. చివరకు ఆ స్త్రీ పాత్రను తిరిగి పరిశీలిస్తే నిత్య జీవితం, శారీరిక అవసరాం ఇలాంటి విషయాల నుండి ఎదిగి ఈమె చివరికి చదువు ద్వారా పూర్తి సిటిజెన్ గా ఎదిగినట్లు , ఆమెలోని స్పందన ద్వారా అక్కడ 300 మంది జ్యూ (మహిళలను) ఎక్స్టర్మినేట్ చేసిన సంఘటనను జైలులో మరల పరిశీలించుకోగలిగినట్లు కనిపిస్తున్నది. ఆ మాటకొస్తే అసలు ఇలా హోలోకాస్ట్ లో పాలు పంచుకున్న వారందరూ చదువుకున్న వారేనా అని రచయిత ఒక ప్రశ్న వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
~~~***~~~
ఈ చిత్రంలో కేట్ విన్స్ లెట్ నటన తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా వయసు మళ్లిన పాత్రలో ఆమె హావ భావాలు ఆకట్టుకుంటాయి. రాల్ఫ్ ఫియన్నెస్ కూడా దీటుగా నటించాడు.
చిత్రీకరణలో ఒక విశేషం ఉంది. చిత్రం ప్రారంభంలో సన్నివేశాలు వేగంగా సాగిపోయి చివరి దశలో టెంపో తగ్గిపోతుంది. సామాన్యంగా మరోలా కథనాన్ని తలపెట్టటం జరుగుతుంది కానీ ఈ చిత్రంలో కథానుసారం మంచి ప్రక్రియ చేపట్టారు. చివర కనిపించే సన్నివేశాలు పాత్రలతో పాటు అందరినీ ఆలోచింప చేస్తాయి.
చర్చ్ లో జరిగిన సన్నివేశం మన ముందుకు రాదు. ఆమె లో చదువు వలన జరుగుతున్న సంచలనమైన మార్పులు ప్రధానమైన అంశం అని దర్శకుడు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది కానీ నాజీ వ్యవస్థలోనూ, అటువంటి అరాచకాలలోనూ ఈమె పాత్ర సామాన్యమైనదేనని మరో విధంగా చిత్రం చెబుతుంది. మరోలా చెప్పాలంటే ఆ పని ఈమె కాకపోతే ఎవరైనా ఆ సమయంలో, ఆ వ్యవస్థలో చేసి ఉండే వారే! ఆమెకు ‘ వినిపించిన పుస్తకాలు-లేడీ విత్ ద లిటల్ డాగ్, ఒడిస్సీ…’ ఇలాంటివి.
ఈ చిత్రం చాలా బహుమతులు తీసుకుంది. నాలుగు అకాడమీ అవార్డులు ముఖ్యమైనవి. అందులో కేట్ విన్స్ లెట్ ఉత్తమ నటనకు అకాడమీ అవార్డు గెలుచుకుంది.
ఇతివృత్తం కొద్దిగా భారతీయ పరిస్థితులకు భిన్నంగా ఉన్నా, కొద్దిగా మింగుడు పడకపోయినా ఈ చిత్రం పాత్రల సమ్మేళనం, వెనుక నడుస్తున్న చరిత్ర, దాని ప్రభావం, వాటి ఫోకస్ ఒక పాత్ర మీద ఎలా చూపించాలీ, కథానుసారం టెంపోను ఎలా నియంత్రించాలీ అనే విషయాల కోసం చూడవలసిన అవసరం ఉన్నది.
~~~***~~~
‘న మంత్రం నో యంత్రం…’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ
27 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-రచనలు

ఇంటి నిండా నవ దుర్గలు…చిన్ని చిన్ని పిల్లలు వరండాలో ఆడుకుంటున్నారు. లోపల ఒకటే సందడి-హోమాలు, పూజలు, హడావుడి. ఒక చిన్నారి ఒక కాగితం తీసుకుని కూర్చుంది. రెండు కాళ్లూ ముందరకు జాపుకుని తెల్ల కాగితాన్ని ఒక పుస్తకం మీద పెట్టి బొమ్మను ఆడిస్తున్నట్లు వొడిలో పెట్టుకుని ఒక పెన్సిలుతో అదే పనిగా గీస్తున్నది. పక్కగా ఒక కుర్చీలో కూర్చున్నాను. ఒక కన్ను అటు వేశాను. పిల్ల నన్ను చూసి తను గీస్తున్న బొమ్మను చూసి మరల నన్ను చూసింది. ‘ ఇవి కళ్లు ‘, అంది. అమ్మవారి విశాలమైన కళ్లు గీయాలనే ప్రయత్నం చేస్తోంది. ఎదురుగా గోడ మీద బెoగాలీ కాలెండర్ లో ఉన్న బొమ్మను చూసి ప్రయత్నం చేస్తోంది. ‘ ఎవరివమ్మా కళ్లు? ‘
‘ అమ్మవారివి మావయ్యా! ‘
‘ బావున్నాయి. గియ్యి. ‘
‘ మావయ్యా?’
‘ ఏంటమ్మా?’
‘ అమ్మవారి కళ్లు చాలా పెద్దవి కదూ? ‘
‘ అవును.’
‘ ఎందుకు?’
‘…’
ఇదీ సమస్య. చిన్న పిల్లలతో పెద్ద మాట్లాడేస్తామనుకుంటాను! పెద్దవాడినెప్పుడయ్యానో తెలియదు! పెద్దగా మాట్లాడలేను. ఈ పిల్ల నన్ను అలానే చూస్తోంది.
‘ ఎందుకు మావయ్యా?’…నొక్కి వక్కాణిస్తోంది.
‘ అమ్మవారు చాలా పెద్దదమ్మా! మరి కళ్లు కూడా పెద్దవి ఉండాలి కదా?’
‘ మా మేడం కూడా చాలా పెద్దది మావయా! కానీ కళ్లు చాలా చిన్నవి కదా?’
గొంతు సద్దుకున్నాను. ‘ అలా కాదు చిట్టీ…’
‘ నా పేరు కుట్టీ…’
‘ ఓహో! కాదు కుట్టీ, ఇప్పుడూ, అమ్మవారు లోకంలో అందరినీ చూడాలి కదా? మరి ఇంత పెద్ద లోకంలోని అందరినీ చూడలంటే మరి ఎంత పెద్ద కళ్లు ఉండాలీ?’
‘ ఓహో! అలాగా? అందరినీ ఎందుకు చూడాలి మావయ్యా?’
‘ అందరు ఆమె బిడ్డలే కదా?’
‘ ఓ అందుకా?’
ఆపింది. ఆపి మరల బొమ్మ గీస్కుంటోంది. ఊపిరి పీల్చుకున్నాను.
‘ మావయ్యా…’
‘ అమ్మా’
‘ ఇప్పుడూ, అమ్మవారు ఏమి చేస్తోంది?’
‘ మనలందరినీ కనిపెట్టి కాపాడుతోంది’
‘ ఎలాగా’
‘ మన అమ్మ లాగా’
‘ మా అమ్మ జాబుకి వెళుతుంది. నన్ను చూడదు కదా?’
‘ జాబ్ కి వెళ్లినా నీ గురించే ఆలోచిస్తుంది. నిన్ను కనిపెట్టే ఉంటుంది.’
‘ అవునా?’
‘ అవునవును’
అక్కడి నుంచి లేస్తే మంచిదేమో, లోపల అవసర నైవేద్యం-ఇంటరిం రిలీఫ్ ఏదైనా ఉన్నదేమో కనుక్కుంటే బాగుంటుందనిపించింది. ఇంతలో
మరల అడిగింది, ‘మావయ్యా…’
‘ తల్లీ…’
‘ ఇప్పుడూ…మరీ…మరీ…అమ్మవారు ఎవరినైనా ఎత్తుకుంటుందా?’
‘ అందరినీ ఎత్తుకుంటుంది.’
‘ నన్ను?’
‘ ఓ తప్పకుండా…’
ఆ పిల్ల అసాధ్యురాలిలాగా ఉంది. లేచి సద్దుకుని ఆ కేలెండర్ దగ్గరకు వెళ్లింది. బొమ్మనీ నన్నూ రెండు సార్లు చూసి వెనక్కి వచ్చింది. చక్కగా కూర్చుండి పోయింది.
‘ మావయ్యా ‘
‘ అమ్మా ‘
‘ ఎత్తుకోలా! ‘
‘ నువ్వు అడిగావా?’
‘ ఊ…మెల్లగా అడిగాను. నువ్వు చెప్పావని కూడా చెప్పాను. నవ్వుతోంది కానీ నా మాట వినలేదు…’
ఆశ్చర్యం వేసింది.
‘ అమ్మలూ…’
‘ ఏంటి మావయ్యా?’
‘ అమ్మవారు ఆ కేలెండర్ లో బొమ్మలా ఉన్నారు. అసలుకి ఆవిడ మనలందరినీ ఎత్తుకునే ఉన్నది. ‘
పిల్ల లేచి నిలబడింది. ‘ ఎలా మావయ్యా?’
‘ మనకి తెలియదు. అమ్మ వొడిలో ఉన్నప్పుడు నువ్వు ఆడుకుంటావు అంతే! అమ్మ నిన్ను ఎలా ఎత్తుకుందో చూస్తావా?’
పిల్ల ఆలోచిస్తోంది.’ గుర్తు లేదు మావయ్యా, కానీ…’
‘చంటి పిల్లాడిని చూడు…’
‘ అవును మావయ్యా…నిజమే. చక్కగా ఆడుకుంటాడు.’
‘ మనమూ అంతే!’
‘ అందరం పిల్లలమేనా? ‘
‘ కొందరు చిన్న పిల్లలు, కొందరు పెద్ద పిల్లలు. అమ్మకి తెలుసు…’
ఇంతలో మరో ఇద్దరు పిల్లలు చేరారు. ఒక కుర్రాడు, ‘ మావయ్యా, దీనితో ఊరకే మాట్లాడావ్లు జోరుగా వినిపిస్తున్నాయి.
‘ మావయ్యా…’
‘ ఏంటమ్మా? ‘
‘ ఇప్పుడూ…అమ్మవారు కనిపించటం లేదు కదా? ‘
‘ అవును’
‘ మరీ…మరీ ఎలా గుర్తు పట్టటం?’
‘ నువ్వు మీ అమ్మతో ఎప్పుడైనా సినిమాకి వెళ్లావా?’
‘ ఓ! ‘
‘ అందరు బయటకి వచ్చినప్పుడు ఏమి చేస్తావు?’
‘ అమ్మ చేయి పట్టుకుని వదలను ‘
‘ ఎందుకు?’
‘ తప్పిపోతాము మావయ్యా!’
‘ ఒక వేళ ఎవరైనా మిమ్మల్ని తోసేసి వెళ్లిపోతే చేయి జారిపోతుంది. అప్పుడేమి చేస్తావు?’
‘ అవును మావయ్యా…ఒక సారి అలాగే తోసేశారు. అప్పుడూ…అప్పుడు నేను బిగ్గరగా అరచి అమ్మ వచ్చే వరకూ అక్కడే ఉన్నాను’
‘ లోపల అందరూ అరుస్తున్నారు చూడు, ఈ అరుపులన్నీ అందుకే!’
పిల్ల నవ్వింది.’ ఏ కాదు. అవి మంత్రాలు. ‘
‘ వాటి అర్థం అదే!’
‘ అవునా?’
‘ అవునవును!’
మంత్రాలు సద్దు మణిగాయి.
‘ మావయ్యా?’
‘ ఏమ్మా? ఆకలిగా ఉందా?’
‘ కాదూ! ఒక వేళ జనంలో అరచినా అమ్మకు వినిపించకపోతే?’
ఆ కుర్రాడు అందుకున్నాడు, ‘ మావయ్యా, అమ్మ చీరె రంగు గుర్తు పెట్టుకుని అలా వెనకనే వెళ్లి పటుకుంటాను…నేనైతే అంతే!’
‘ అమ్మ మీద ఉన్న నమ్మకం అది. నీ దారి అది, నీ నీడ అక్కడున్నది, నీ తోడు నిన్ను అలా ఇంటి దాకా నడిపిస్తుంది. నీకు దారి తెలియదా అని అడుగుతుందా?’
‘ పెద్ద పిల్లలని అడుగుతుంది’
‘ అదీ! అసలు ఎవరికీ దారి తెలియదు. అందరం చిన్న పిల్లలం అని చెప్పాను. అవునా?’
‘ లేదు. నాకు తెలుసు…’, కుర్రాడు అన్నాడు.
‘ ఇంటి వరకు తెలియవచ్చు. తరువాత?’
‘…’
‘ మావయ్యా…’
‘ చెప్పు కుట్టీ…’
‘ ఒకాయన మంత్రాలు చదివితే అమ్మవారు కనిపిస్తుందన్నాడు మావయ్యా! నీకు తెలుసా మంత్రాలు?’
‘ అమ్మను గుర్తు పట్టేందుకు మంత్రాలెందుకు పిల్లా? ‘
‘ మరీ…సినిమాలో యోగి ఒంటి కాలి మీద నిలబడతాడు…’
‘ అమ్మ ఒడిలో ఉన్నాను అని తెలుసుకునేందుకు అలా సాధన చేస్తారు తల్లీ…’
కుర్రాడు బుర్ర గోక్కున్నాడు. ‘ మోక్షం కోసం కాదా మావయ్యా?’
‘ సమస్త ప్రాణులూ తల్లి గర్భంలో వృధ్ధి చెందుతున్నాయి నాన్నా! ఆమె ప్రసవిత్రి, సావిత్రి. తిరిగి ఆమెలో లీనమైపోవటమే మోక్షం. అన్ని సాధనలు చివరకు తల్లి ఒడినే చేరుస్తాయి. ‘
‘ మనం చాలా చదువుకోవాలి పిల్లా…’
‘ మనం చిన్న పిల్లలం.’
‘ అవును! అదే ఙ్ఞానం! అందుకే తొమ్మిది చిన్న పిల్లలని అలంకరించి బాలా త్రిపురసుందరి పూజ చేస్తారు.’
‘ మాకు మంత్రాలు అవీ అక్కరలేదా మావయ్యా? ‘
‘ ఎవరడిగారు? పెద్ద పెద్ద మాటలు చెప్పిన శంకరాచార్యులే న మంత్రం, నో యంత్రం అన్నాడు…’
వాళ్లందరూ చక్కగా విరగబడి నవ్వారు. ఆ నవ్వులో దైవాన్ని చూశాను…
వాళ్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. కొందరు అనుసరిస్తూ, కొందరు అనుకరిస్తూ…వరండా యావత్తూ మంత్రాలను మరచి ప్రతిధ్వనించింది.
అలసిపోయి ఆగారు. ‘ నో యంత్రం…’ అంటూ మరల నవ్వారు…
శాంతించారు.
‘ మావయ్యా…’
‘ ఏంటి కుట్టీ?’
‘ ఆయనకి ఇంగ్లీష్ వచ్చా?’
‘అంటే?’
‘ నో యంత్రం అంటే…’
‘ అది సంస్కృతమే తల్లీ! ఆయన నా దగ్గర మంత్రం లేదు, యంత్రం లేదు, నిన్ను ఎలా స్తుతించాలో కూడా తెలియదన్నాడు. తల్లిని ఆహ్వానించటం, ధ్యానించటం, ఆవిద కథలు చెప్పటం ఏమీ తెలియవన్నాడు. ఆవిడ ముద్రలు..ఇలాంటివి కూడా తెలియవన్నాడు. చివరకి ఏడవటం కూడా రాదన్నాడు!’
‘ అయ్యో! ‘
‘ అమ్మా, కేవలం ఒక బాలుని లాగా నిన్ను అనుసరుస్తూ నీ వెనుకే నడుస్తాను అన్నాడు ‘
‘ ఎందుకు? ‘
‘ అది కష్టహరణం. అంటే ఏ కష్టం లేకుండా అమ్మ చూసుకోదా?’
‘ అవును.’
‘ ఇంకేమి కావాలి?’
లోపల గంటలు కొట్టారు.
~~~***~~~
27 సెప్టెంబర్ నుంచి 03 అక్టోబర్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ
27 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి శనులు కన్యలో, గురు రాహువులు మకరంలో, కుజుడు మిథునంలో, కేతువు కర్కాటకంలో, బుధ శుక్రులు సింహంలో, చంద్రుడు ధను, మకర, కుంభ మీన రాశులలో సంచరిస్తారు
పరస్పరం విభేదాలున్న వారు ఒక చోట చేరి మాట్లాడుకునే వారం. అలా అని విభేదాలు ఎక్కడికీ పోవు. మరింత గట్టి పడతాయి. వ్యాపారాలు బాగానే ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలలో సరికొత్త మలుపు కనపడగలదు.
మేష రాశి: చిత్రమైన ఆలోచనలు విసిగించగలవు. నిత్య కర్మలలో నిమగ్నమైతే ఏ సమస్యా ఉండదు. తగు విశ్రాంతి తీసుకొనండి. కొత్త పనులకు మరి కొంత కాలం పట్టవచ్చు. శ్రీసూక్తం చదవండి.
వృషభ రాశి: వాద్వివాదాలకు దూరంగా ఉండవలసిన వారం. ఖర్చులు చేస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉద్యోగంలో కొంత మార్పు సంభవం. భూ వివాదాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
మిథున రాశి: ఈ వారం మిత్రుల వలన మంచి ఆదాయం ఉన్నది. అనుకోని సంఘటన ఒకటి ఎదురవుతుంది. చర్చలకు మంచి వారం. వ్యాపారం బాగుంటుంది. కొంత చంచలత్వానికి గురి కాగలరు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కర్కాటక రాశి: దైవోపాసనలో కాలం గడుపు
తారు. విలక్షణంగా ఉండే గుణం వలన మిమల్ని మిత్రులు అపార్థం చేసుకుంటారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. దూర ప్రయాణాలు మానుకొనండి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
సింహ రాశి: ఈ వారం చక్కని ఫలితాలున్నాయి. పాత సమస్యలు మరల ముందుకు వచ్చి పూర్తిగా మాయమవుతాయి. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. ఉద్యోగంలో రాణిస్తారు. కార్యాలయంలో కొంత వివాదం ఉండగలదు. మహాసౌరం చదవండి.
కన్య రాశి: వారం మధ్యలో బదిలీ ఉండవచ్చు. మీ తోటి వారిలో ఒక సంచలనం ఉండవచ్చు. మాటలు తూచి మాట్లాడవలసిన వారం. రావలసిన డబ్బు అందగలదు. శ్రమ, ఖర్చులు అధికంగానే ఉంటాయి. విష్ణు సహస్రనామం చదవండి.
తుల రాశి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన వారం. వాహనంతో జాగ్రత్త వహించాలి. ఇది రెండవ సారి చెప్పదగిన సూచన. మీ మీద ఆరోపణలు ఉండవచ్చు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
వృశ్చిక రాశి: శత్రువుల మీద విజయం సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు కొంత బాధిస్తారు. వారాంతంలో ఒక వివాదం పరిష్కారమవుతుంది. ఇంటి పనుల గురించి యోచిస్తారు. పెళ్లి కాని వారికి మంచి ఫలితాలున్న వారం. హనుమాన్ చాలీసా చదవండి.
ధను రాశి: ఒక పోరాటం మొదలు పెట్టాలని యోచించు వారు ఈ వారం కాస్త నిదానించటం మంచిది. నిరుద్యోగులకు మంచి వారం. కొందరు ఈ మధ్య కొనుగోలు చేసిన వస్తువుల నుంచి అసంతృప్తి చెందగలరు. శ్రీ దత్త స్తవం చదవండి.
మకర రాశి: ఇంటి మీద మరింత శ్రధ్ధ చూపటం అవసరం. కొందరికి ఊరకే అప్పులు ఇవ్వటం మంచిది కాదు. పెద్ద వారి ఆరోగ్యం కలవర పెడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులను మరో వారానికి వాయిదా వెయ్యండి.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.
కుంభ రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. ఓర్పుతో నిర్వహించాలి. మంచి ఆలోచనలు కలిగి సత్కార్యం వైపుకు తీసుకుని వెళతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిచగలవు. కడుపు నొప్పులు బాధించగలవు. వారాంతంలో మంచి యోగాలున్నవి. ఆదిత్య హృదయం చదవండి.
మీన రాశి: సమస్యలను అధిగమిస్తారు. మీ బాట మీరు పయనిస్తారు. ఒక విహార యాత్ర చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలున్నాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు వారి అభిప్రాయాలను సరిదిద్దుకుంటారు. దేవీ సూక్తం చదవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతేర్నిత్యం యథాసురవధాదధునైవ సద్య:
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్
(దుర్గా సప్తశతి)
హే భగవతి! నీవు మా యందు ప్రసన్నురాలవు కమ్ము. మమ్ములను శత్రువుల భయము నుండి రక్షింపుము. నీవు ఇప్పుడే శుంభ, నిశుంభాది దైత్యులను వధించి, వారి నుండి మమ్ములను రక్షించితివి. ఆ రీతి గానే, భవిష్యత్తులో కూడా కలుగునట్టి శత్రు భయము నుండిదేవతలైన మమ్ము శాశ్వతముగా పరిపాలించుము. హే దేవి! నిత్యము సర్వలోకపాపములను వెంటనే ప్రశమింప జేయుము…
మిత్రులందరికీ దసరా శుభాకంక్షలు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version is available at www.sripati.com
‘ ఈనాడు’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
21 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం

ఎ వెడ్నెస్డే అనే హిందీ చిత్రం రిమేక్ ఇది. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. కమల్, వెంకటేష్ నటించారు. సంగీతం శృతి హాసన్ సమకూర్చారు (తెలుగు చిత్రం లో అయితే పాటలేవీ లేవు. నేపథ్య సంగీతం అని సరిపెట్టుకోవాలి).
~~~***~~~
ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులను పట్టుకున్నా వారిని ఏమీ చేయకుండా సంవత్సరాల తరబడి న్యాయ విచారణ
పేరుతో అలా ఊరుకొని చివరకు వదిలేయటం కూడా జరుగుతున్న వ్యవస్థ మీద ఒక సామాన్యుడు-కామన్ మేన్ (కమల్) బాంబులు పెట్టాడని ఎస్. పి (వెంకటేష్ ) ను నమ్మించి తీవ్రవాదులను విడుదల చేయించి ఒక జీపులోకెక్కించి అక్కడ మొబయిల్ ఫోనులో ఉంచిన బాంబుతో హత మారుస్తాడు. ఒకడిని ఇన్స్పెక్టర్ షూట్ చేస్తాడు. ఇది కథ. కథలోని ఇతివృత్తం అందరినీ ఆలోచింపచేసేదే…కాకపోతే ఎక్కడా పోరాటం అనేది కనిపించదు. ఎస్.పి చేస్తున్న ప్రయత్నం యావత్తూ చాలా కంట్రైవ్డ్ గా కనిపిస్తుంది. పోరాటం అనేది కమల్ పాత్రకు చెందవలసినది. దానిని ఇటు తిప్పటం వలన చిత్రంలో ప్రాణం తేలిపోయింది. దర్శకుని తొలి చిత్రం ఎక్కడా ఆగకుండా సాగిపోయింది. సీనులు అలా గిర గిర తిరిగిపోయాయి…సాంకేతికంగా సరిపోవచ్చు. కథనం ఎంచుకున్న లైనుకి సరిపోతుంది. లైనే మార్చి ఉంటే మరోలా ఉండేది. పోలీసు వ్యవస్థను దగ్గరగా చూపించినా కొన్ని లోపాలు తలెత్తాయి. లకడీ కా పుల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్. పి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్లిపోతున్నప్పుడు మామూలు దుస్తులున్నప్పటికీ ఒక నీచమైన సెల్యూట్ కొడతాడు. ఎస్.పి దుస్తులలో ఉన్న నక్షత్రాలను పట్టించుకోలేదు. రాజ్ భవన్ దగ్గర ఒక కొత్త కట్టడం మీద అందరికంటే పైన ఉన్న కమల్ ను వెతకటానికి ఆరిఫ్ వెళతాడు. సామాన్యంగా ఇటువంటప్పుడు స్నిఫ్ఫర్ డాగ్ తో వెళ్లటం పధ్ధతి. ఒక్కడూ అలా కొన్ని మెట్లు ఎక్కి ఇక్కడ ఎవరూ లేరని ఫోనులో చెబుతాడు…
~~~***~~~
రియలిసం కోసం పడే తపనకీ, కథలోని కొత్త కోసం నడుపుతున్న వేటకీ మధ్య సరైన సృజనాత్మకతను ఎక్కడో పారేసుకుంటున్నారు మన చిత్ర సీమలోని వారు. మామూలు మనిషి భావాలను ఎంచుకోవటం మంచిదే. చిత్ర రూపం దాల్చాలన్నప్పుడు వృత్తం, పూర్తి ప్రక్రియ, దృశ్యాల సమాహారం ఇటువంటివి శ్రధ్ధతో పరీక్షించవలసిన అవసరం ఉన్నది. సాంకేతికంగా ఎన్నో మన ముందు ఉన్న కాలం ఇది. భావ వైశాల్యం లోపించిన కాలం కూడా ఇదే!
రియలిసం లోకి వెళ్లిన చాలా చిత్రాలలో డీప్ ఫోకస్ ఎడిటింగ్ కీ ( ఒక సీక్వెన్స్ లో తక్కువ ఎడిటింగ్ ) క్లోస్ అప్ ఎడిటింగుకీ మధ్య సరైన బేలెన్స్ కుదరకపోవటం తెలిసిపోతుంది.
డీప్ ఫోకస్ ఎడిటింగులోనే చాలా చిత్రాలలో కొన్ని ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి ఒక సంవాదం జరిగిన తరువాత నటుడు కొద్ది సేపు వ్యక్తిగతంగా ఆలోచించే సన్నివేశాలు ప్రేక్షకుడిని కూడా ఆలోచింపచేస్తాయి. అంత సమయం కేటాయించకపోవటం వలన ఆ అవకాశం లేకపోయింది.
ద డే ఆఫ్ ద జాకాల్ చిత్రంలో ప్రెసిడెంటుని హత్య చేసేందుకు అతను నియమింప బడతాడు. అతను చేసుకుంటున్న ఏర్పాట్లు ఎంతో ఆకట్టుకుంటాయి. అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయినప్పటికీ చివరకు ప్రయత్నం యావత్తూ విఫలమైనప్పుడు సానుభూతి కలుగుతుంది. కారణం ఏమిటంటే అతని తెలివితేటలతో ప్రేక్షకుడు ఏకీభవిస్తాడు. ఇలా చేయవచ్చు అని అతనూ ఆలోచిస్తాడు. ‘ఈనాడు ‘ చిత్రం లో గొప్ప అవకాశం ఏమిటంటే కామన్ మేన్! ఇతను ఆ వ్యూహం రచించటానికి పడిన కష్టాలు, దానికి అతనికి జరిగిన దుర్ఘటన ఇస్తున్న పుష్, చిన్న ఫ్లేష్ బేక్…ఇలాంటివి చెబుతూ పోలీసు వ్యవస్థ మామూలుగా చేసుకుంటున్న ప్రయత్నాన్ని మధ్యలో ఇంట్రొడ్యూస్ చేస్తే కమల్ మరో చరిత్ర సృష్టించే వాడు!
ఒక లేప్ టాప్ పెట్టుకుని ఏవో వైరులు తగిలించి మాట్లాడుతుంటే చూసే వారికి పాత్రతో ‘ఏకీభవించటం ‘ కష్టం.
~~~***~~~
‘ అనలైస్ దిస్’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు
19 సెప్టెం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-చిత్రం

రాబర్ట్ ద నిరో గురించి అందరికీ తెలిసిందే! ఎందరో నటులు ఆయనను అనుకరించే ప్రయత్నంలోనే గొప్ప నటుల పేరు సంపాదించుకుని వెళ్లిపోయారు!
1999 లో అవినీతిని ‘ కామెడీగా ‘ ఎంచుకుని కెనెత్ లోనెర్గాన్, పీటర్ టోలన్ కలసి రచించిన చిత్రం ఇది.హరోల్డ్ రామిస్ దర్శకత్వం వహించారు. ఒక డాన్ పాత్రలో రాబర్ట్, ఒక మానసిక శాస్త్రవేత్తగా బిలీ క్రిస్టల్ నటించారు.
అమెరికా అండర్ వర్ల్డ్ డాన్ గా ఎవరుండాలి అని ఎంచుకునేందుకు అనే ఒక మీటింగు ఏర్పాటు జరగవలసి ఉన్నది. కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక క్రిమినల్, ఒక సైకిక్-ఇద్దరూ కలసిన పాత్ర నిరో నటించిన పాత్ర. ఒక మాన్సిక వైద్యుడుగా బిలీ క్రిస్టల్ నటన కూడా ఆకటుకుంటుంది.
చిత్రంలోని సన్నివేశాలు క్రౌర్యంతో కూడిన ఒక ప్రపంచంలో ప్రతి మానవునిలోని మానసికపరమైన స్పందనలను పరీక్షించే ప్రక్రియలో భాగంగా కనిపిస్తాయి. ఒక సైకియాట్రిస్ట్ చూసే కోణం సరైన సమయానికి ముందుకు వస్తుంది. మరి కాస్త ముందుకు వెళితే కథలో ఈ సైకియాట్రిస్ట్ కూడా ఒక సమస్యలో ఉంటాడు. సరిగ్గ ఇతను తన రోగులతో మాట్లాడుతున్నప్పుడు ఇతని కొడుకు అన్నీ చక్కగా వింటూ ఉంటాడు. ఈ విలన్ తో రంగంలోకి దిగాక రెండవ పెళ్లి చేసుకుంటున్నప్పుడే ఆ ముఠా సూటిగా చర్చ్ లోకే వస్తుంది. అక్కడ చిత్రీకరించిన కామెడీ నవ్విస్తూనే బాధిస్తుంది!
కథ గురించి చెప్పాలంటే నిరో ఈ సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతాడు. ఎఫ్. బి. ఐ వారు సైకియాట్రిస్ట్ ను వారికి అనుగుణంగా వాడుకుంటారు. మూల స్తంభం, లేదా కథకు గర్భం అని చెప్పదగిన సన్నివేశం చాలా నేర్పుతో చిత్రీకరించారు దర్శకులు. సైకియాట్రిస్ట్ ను చంపే ఆలోచనతో నిరో అతన్ని ఒక మూలకి మెడ మీద గన్ పెట్టి తోసుకుని వెళతాడు. ఇతను విలన్ తండ్రి పాతికేండ్ల క్రితం ఏ విధంగా చనిపోయాడో అనేది గుర్తుకు తెచ్చి అతన్ని పూర్తిగా ఆ క్షణంలో కరిగించేస్తాడు. సైకియాట్రిస్ట్ దగ్గర ఉన్న ఆయుధం అతని అనుభవం, అతని విద్య!
నిరో ప్రాణాలను యాదృఛ్చికంగా రక్షిస్తాడు. ఇతను జారి ముందుకు పడటం వలన బులెట్ నిరోను తగలబోయి ఇతని భుజానికి తగులుతుంది. ఇతను ఆసుపత్రికి చేరుకుంటాడు, ఎఫ్. బి.ఐ వాళ్లు నిరోను జైలుకు తీసుకుని వెళతారు. అక్కడ నిరోను సైకియాట్రిస్ట్ కలసి వెనక్కి రావటంతో చిత్రం ముగుస్తుంది.
~~~***~~~
సామాన్యంగా ఒక కథానాయకుని ఎంచుకున్నప్పుడు అతను ఎన్నో సమస్యలను ఎదుర్కో గలిగిన ధైర్యవంతునిలా చిత్రీకరించటం ఒక పరిపాటి. మానసిక రోగికి ఒక వైద్యుడు సమాధానం అనుకోవచ్చు. ఈ చిత్రంలో ఆ వైద్యుడు కూడా సమస్యలోకి అనుకోకుండా వెల్లిపోయి కథను సుఖాంతం చేయటం విశేషం. ఇందులో చిన్న మర్మం ఏమిటంటే అన్ని వ్యవస్థలూ ఏదో ఒక పిచ్చి వలనే కనిపిస్తున్నాయి! మందులు కనిపెట్టి లాభం లేదు. సమాజంలోకి దూసుకుని పోయి ఒక సజీవమైన, సక్రియమైన పాత్రను పోషించవలసిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన విద్య బయట పడగలదని ఒక అంతర్లీనమైన సందేశం కనిపిస్తోంది!
ఒక డాన్ తన పదవి పట్ల ఉన్న వ్యామోహంలో తనకు కలుగుతున్న మానసికపరమైన ఆందోళన కోసం ఒక వైద్యుని సంప్రదించటం ఎంతో సృజనాత్మకతను సూచిస్తోంది. కారులో విలన్ ఒక శవాన్ని పెట్టుకుని వెళుతున్నప్పుడు ఈ వైద్యుడు ఆ కారుని గుద్ది తానుగా నష్త పరిహారాన్ని ఇవ్వాలని ముందుకు వస్తాడు. విలన్ ఆ కారును ఎలాగో అలాగ ముందుకు తీసుకు పోవాల్నే ఆదుర్దాలో ఉంతాడు. ఇతను ఒప్పుకోడు. చివరకు ఒక విసిటింగు కార్డు ఇచ్చి వస్తాడు. వీరి సాంగత్యం అలా ప్రారంభమవుతుంది…
నిరో నటనలో రెండు వైపులు కనిపిస్తాయి-ఒకటి క్రిమినల్ గా నటించటం. రెండు ఒక సైకిక్ లక్షణాలను కనబరచటం. కొన్ని సన్నివేశాలలో రెండిటినీ మేళవించినప్పుడు ఇతను ఏమి చేయబోతున్నాడో ఊహించటం నిజంగానే కష్టమయింది…
డాక్తర్ గారు ఒక ప్రొఫెషనల్ సైకియాట్రిస్టుగా కనిపిస్తూనే ఒక మామూలు మనిషి పడే బాధలను అంతర్లీనంగానే చూపిస్తాడు. దీనికి ఒక కారణం ఉండవచ్చు. పాత్ర పరంగా ఇతని ముఖ్య ఉద్దేశ్యం నిరోను ఒక సైకియాట్రిస్టుగా ఆకట్టుకుని ముందుకు పోవటం తప్ప మరో మార్గం లేకపోవటం!
ఎంతో క్లిష్టమైన ఇతివృత్తం, అంతే నేర్పుతో తీసిన చిత్రం.
ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చాయి. 2000వ సంవత్సరం లో రాబర్ట్ ద నిరో కు గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చారు.
‘ అనలైస్ దట్ ‘ అనే చిత్రం కూడా దీని సరళిలో తరువాత వచ్చింది.
This movie certainly deserved an analysis.
~~~***~~~
‘నిన్న లేని అందమేదో’(25)-వేదాంతం శ్రీపతి శర్మ
19 సెప్టెం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-రచనలు

బాగా నిద్ర పట్టిన తరువాత ఎందుకో శరత్ కు మెలకువ వచ్చింది. బయట ఏదో నలుగురు మాట్లాడుకుంటున్న చప్పుడు. గదిలో లైటు వేశాడు. కొద్దిలో కాలు తగిలేది…ఎందుకో ఎంత చెప్పినా వినకుండా ఆదుర్దా అని తనని తాని పిలుచుకుంటున్న ఈ మనిషి కిందనే పడుకున్నాడు. బాగా చితికిపోయిన వ్యక్తి లాగా ఉన్నాడు. తలుపు తెరచి బయటకు వచ్చాడు శరత్. బయట ఎవరో నలుగురు కుర్రాళ్లు పిట్ట గోడ మీద ఆనుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శరత్ ను చూసి ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు.
‘సార్…’, ఒకడు ముందుకు వచ్చాడు..’ ఎక్కడా పడుకునేందుకు చోటు దొరకలేదు. ఇలా పడుకుంటా
ము. ఏమీ అనుకోకండీ…’
‘లోయకు పిక్ నిక్కా?’
‘ అవును సార్ ‘
‘ చదువుకుంటున్నారా?’
‘…’
‘అదేంటీ? అలా నిలబడిపోయారే?’
‘ చదువులు అయిపోయాయనుకుంటున్నాము సార్. బేవార్సుగా ఉన్నాము. అదీ సంగతి!’
‘ ఓహో! ఉద్యోగం వేటలో ఉన్నారా?’
‘ ఉంటే వేటాడతాం సార్. ‘
‘ ప్రస్తుతానికి పడుకోండి…గుడ్ నైట్! ‘
‘ థేంక్ యు సార్.గుడ్ నైట్!’
శరత్ లోపలికి వెళ్లిపోయాడు. తలుపు బయట నుంచి వినిపిస్తోంది…’ ఒక్కడే ఉన్నాడంటావా? ‘
‘ ఇక్కడికి ఒక్కడే ఎందుకు వస్తారబ్బా, ఒకరో…ఇద్దరో …తెచ్చుకోకుందా ఎందుకొస్తారు?’
‘ లేదు రా. నాకు అనిపించలేదు.’
‘ అంతే అంటావా?’
‘ అంతే! పడుకోరా…’
‘ ఊ…కడుపు కాళేశ్వర రావు మార్కెట్టూ, ఒళ్లు ఒంగోలు చింతపoడు అయిపోయాయిరా నాన్నా! ఇంక ఒకటే నిద్ర!’
‘ అవునొరే, నువ్వు ఎప్పుడైనా ఒక మనిషిని భుజం మీద మోశావురా?’
‘ లేదు. ‘
‘ ఇప్పుడు మొయ్యాలి. రేపు ఉదయం లేచిన దగ్గర నుండీ నీ డ్యూటీ అదే! ‘
‘ ఎవరిని మొయ్యాలి?’
‘ ఇంకెవరు? నన్నే! ‘
‘ ఈ లోయ ప్రోగ్రాం వేసింది ఎవరు? ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. ‘
‘ ఎందుకు? ‘
‘ ఇంతవరకూ జీవితంలో ఎవరినీ కొట్టలేదు. రేపు ఆడు నా చేతిలో…’
‘ రే…పడుకోండిరా…ఇక్కడినుండి గూడా తరిమేస్తారు…’
~~~***~~~
మరో రెండు గంటలలో తలుపు గట్టిగా చప్పుడయింది. ఈ సారి గాభరాగా ‘ఆదుర్దా ‘ కూడా లేచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. కుర్రాళ్లు కంగారులో ఉన్నారు.
‘ ఏమయింది? ‘
‘ సార్, వీడిని పట్టుకోలేకుండా ఉన్నాము. ‘
ఓ కుర్రాడిని గట్టిగా పట్టుకుని ఉన్నారు.
‘ ఏమంటాడు? ‘
‘ కిందకి దూకుతానంటాడు సార్! ‘
‘ ఎందుకు? ‘
‘ ప్రేమ పిచ్చోడు…’
అతను గింజుకుంటున్న్నాడు. ‘ నన్ను వదలండి ‘
శరత్ దగ్గరగా వెళ్లాడు. ‘ వదలండి. ఏమీ చెయ్యడు. ‘
అతన్ని వదిలారు. అతను ఏడవటం మొదలెట్టాడు.
‘ ఏడుపొద్దు. నీ బాధ చెప్పు…’
‘ …’
‘ ఎందుకు ఏడుపొస్తోంది? ‘
‘ ఏమీ చెప్పలేను సార్. ‘
‘ ఏదో ఒకటి చెప్పు. ఏదైనా…’
‘ తలచుకున్నప్పుడల్లా నిద్ర పట్టదు ‘
‘ దేనిని తలచుకుంటావు? ‘
‘ మా ప్రేమ కథ ముగిసిపోయింది. ‘
‘ మరి నాకెందుకు చెబుతున్నావు? ‘
అతను వింతగా చూశాడు. ‘ అంటే?’
‘ నువ్వే నీ ప్రేమను కథ అంటున్నావు! మరి నిజమేమిటి? ‘
‘ ఆ పొగలా మాయమయింది సార్. నేను ఆ ఆకాశంలోకి వెళ్లిపోతాను. ఈ లోకంతో నాకు పని లేదు. ఆ నక్ల్షత్రాలలో బ్రతికేస్తాను. ఒరే…నన్ను రేపైనా ఆ లోయలోకి తోసెయ్యండి…’
అక్కడ అటు తిరిగి పడుకున్న వాడొకడున్నాడు. అతను అటు తిరిగే ‘ అలాగే ‘ అన్నాడు.
ఇతను ఏడవటం మొదలు పెట్టాడు. ఆదుర్దా సిగరెట్ ముట్టించాడు. దగ్గరగా వెళ్లాడు.
‘ లోయలోకి తోస్తే పైకి వెళ్లిపోతావనుకుంటున్నావా?’
‘ వెళ్లనా?’
‘ నువ్వు లోయదాకా వెళ్లే ముందే పైకి పోతావు. అది వొదిలెయ్యి. నువ్వు ఎవరినీ ప్రేమించినట్లు నాకు అనిపించటం లేదు…’
‘ నాకు ఈ సినిమా కథలొద్దు సార్, అయిపోయింది. నేను…నా వల్ల కాదు…’
‘ సినిమా కథ కాదు నాయనా! నక్షత్రాలలోకి వెళతావా? ‘
‘ అవును సార్. నాకు తెలియదు. నేనైతే వెళతాను. నాకెందుకో గట్టి నమ్మకం ఉంది ‘
‘ ఛా! కాలిపోవా?’
‘ నో! కాలను సార్! ఇక్కడ కాలుతున్నంత ఎక్కడా కాలదు….మీరు ఒకరిని ప్రేమించండి. అర్థమవుతుంది ‘
‘ నువ్వు ప్రేమించలేదు బుల్లోడా…’
అతను సీరియస్ అయ్యాడు. దగ్గరగా వచ్చాడు.
‘ ఎలా చెబుతున్నారు సార్? ‘
‘ ప్రేమించే వాడికి లోకాలతో పని లేదు. స్వర్గ నరకాలు పట్టవు. ప్రేమే ఒక ప్రపంచం! అది అలా స్థూలంగా నిలబడి ఉన్న ప్రపంచం కాదు. ఎప్పటికప్పుడు పొంగి పొరలి మనస్సనే చంద్రునితో ఆడుకుంటూ అంతరాత్మ అనే సూర్యుని చుట్టూ తిరిగిపోయే ప్రపంచం. ఆ బాటలోనే ఆ లోకం ప్రాణం పోసుకుంటుంది, తిరిగి పుడుతుంది…తిరగటం వలన పుడుతంది…పెరుగుతుంది, నిలబడుతుంది, కదులుతుంది. ఆ సంచలనాన్నే ప్రేమ అంటారు బుల్లోడా…నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? నేను ఆ లోకంలో ఉంటాను అందుకే నా ప్రాణానికి ప్రాణం పోసుకుంటాను…నో! నువ్వు మరో లోకం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ప్రేమించలేదు…ప్రస్తుతానికి పడుకో. రేపు మాట్లాడదాం. ‘
సిగరెట్ పారేశాడు ‘ఆదుర్దా. ‘
ఆ కుర్రాడు అతన్ని వింతగా చూశాడు. మిత్రులు కింద పరచిన తువ్వాలు మీద కూర్చుని ఆ కుర్రాడిని కూర్చోపెట్టారు. కొద్ది సేపు అంతా నిశ్శబ్దంగా ఉంది.
కురాడు కొద్దిగా గింజుకుంటున్నాడు.
‘ లేదు…నాకు స్వార్థం తెలియదు. నేను నా సర్వస్వం త్యాగం చేశాను. మోసపోయాను ‘
‘ నిన్నెవరూ మోసం చేయలేదు బిడ్డా! నీ ఆలోచనలు నిన్ను మోసం చేశాయి. ప్రేమ కోసం త్యాగం అంటున్నావు. ఎందుకు? ఇటు తిప్పి ఆలోచించు. ప్రేమ ప్రపంచం లోకి వెళ్లు. అంతా స్వార్థమే! ఈ భూమి కూడా స్వార్థం కోసమే తిరుగుతోంది…’
జాగ్రత్తగా వింటున్న ఒక కుర్రాడు నోరు వెళ్లబెట్టాడు. ‘ ఏమి మాట్లాడుతున్నారు సార్? ‘
‘ అవును. భూమి తిరగకపోతే ఒక పక్కకు ఒరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక వృత్తం మీద ఒక గతిలో తిరుగుతూనే ఉండాలి. అదే విచిత్రం. కదలకుండా నిలబడాలీ అంటే తిరుగుతూ ఉందాలి…అక్కడే ఉంది అసలు మూర్ఖత్వం! నువ్వు కోరుకున్నది పొందాలంటే నీ సర్వస్వం కోలుపోవాలి…’
శరత్ గోడకి ఆనుకుని తల బాదుకున్నాడు. అందరూ చిన్నగా నవ్వారు. ఆ కుర్రాడు కూడా నవ్వాడు.
ఆదుర్దా గంభీరంగానే ఉన్నాడు. ఆకాశంలో దూరంగా ఎక్కడి నుండో ఇంకా పైకి లేస్తున్న పొగను చూస్తూనే ఉన్నాడు…
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
20-26 సెప్టెంబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
19 సెప్టెం 2009 1 వ్యాఖ్య
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి:రవి శనులు కన్య,గురు రాహువులు మకరం,కుజుడు మిథునం,కేతువు కర్కాటకం,శుక్రుడు సింహం,బుధుడు కన్య, సింహ రాశులు, చంద్రుడు కన్య,తుల, వృశ్చిక, ధను రాశులు సంచరిస్తారు.
ఆర్థిక లావాదేవీలు తీవ్రతరం అవుతాయి. కొంత తొందరపాటు వలన పలువురు నష్టపోగలరు. విదేశీ వ్యవహారాలలో మంచి పరిణామాలు ఉండగలవు. వ్యవసాయ రంగం కొత్త సమస్యలలోకి వెళ్లగలదు.ముడి సరుకు వ్యాపారం వారికి బాగుంది. ఆదాయం అందరికీ బాగుంటుంది. మాట పట్టింపులు ఉండవచ్చు. ఈ వారం విద్యార్థులకు మంచి అవకాశాలు ఇవ్వగలదు. నిరుద్యోగులకు, కళాకారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మేష రాశి: ఈ వారం వింతైన సంఘటనలతో ప్రారంభం కాగలదు.ఆరోగ్యం బాగుంటుంది.చాలా పనులు సంకల్పించటం బదులు చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవటం మంచిది. నవరాత్రులలో మంచి ఉపాసన చేపట్టండి.
వృషభ రాశి: పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలరు. గుండె జబ్బులతో బాధ పడు వారు తగు జాగ్రత్తలు వహించాలి.మిత్రులు వారు చేసిన తప్పులకు ఇబ్బందులు పడటం వలన మీ సహాయం కోరవచ్చు. తగు హితబోధ చేయటం అవసరం. విష్ణు సహస్రనామం చదవండి.
మిథున రాశి: అన్నింటా మంచి వారం. మీ సహనం వలన మంచి పేరు తెచ్చుకుంటారు. రక్తపు పోటు వలన కొంత ఇబ్బంది కలుగవచ్చు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది. వారాంతంలో ఆదాయం బాగుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి: మీరు విశ్రాంతిని విస్మరిస్తున్నారు. తరచుగా ఇలా చేయటం మంచిది కాదు.స్త్రీలతో విభేదాలుండవచ్చు.ఒకరి ఆతిథ్యం స్వీకరిస్తారు.ఆదాయం బాగుంది. లలితా సహస్రనామం చదవండి.
సింహ రాశి: అన్నింటా మంచి వారం. మీకు కలిగిన ఆలోచనను అనాలోచితంగా పెద్దల ముందు అనేయటం వలన మీ మీద దురభిప్రాయం కలుగ గలదు.ఈ నైజాన్ని ఈ వారం కనిపెట్టి మరీ నియంత్రించాలి.శ్రమ అధికంగా ఉన్న వారం ఇది.ఒకరి విషయంలో తీవ్రంగా ఘర్షణ పడగలరు. ఆదిత్య హృదయం చదవండి.
కన్య రాశి: శాశ్వతమైనవి శాశ్వతంగానే ఉంటాయని తెలుసుకుంటారు.మీ పట్టుదలకు ఇతరులు తల వంచుతారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఒక పనిని పూర్తి చేస్తారు. కొత్త పనిలోకి దూకుతారు.ఆరోగ్యం కాపాడుకోవలసిన వారం. శ్రీసూక్తం చదవండి.
తుల రాశి: గతంలో చేసిన కొన్ని పనులకు భయాందోళనలు కలుగవచ్చును. మీ వైఖరిని చాలా మంది గమనిస్తున్నారు. మీకు తెలియని విషయాలలో జోక్యం చేసుకుని ఒకరికి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. తరువాత బాధ పడగలరు. శివునికి అభిషేకం జరిపించండి.
వృశ్చిక రాశి: ఈ వారం చాలా సమస్యలు దూరం కాగలవు. భవిష్యత్తులో కొత్త పనులకు ఈ వారం నాంది పలుకగలరు.కొంత గోప్యం అవసరం. అధికంగా ఆలోచన తగదు. బంధు మిత్రుల సమాగమం ఉండవచ్చు. ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు మంచి వారం. మహాసౌరం చదవండి.
ధను రాశి: నూతన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి వారం. విదేశీ యానం ఉండవచ్చు. ఆదాయాన్ని పెట్టుబడులుగా మార్చగలరు. వాహనం కొద్దిగా సమస్య సృష్టించగలదు. కొందరి ఒరవడి మీకు అర్థం కాకపోవచ్చు. హనుమాన్ చాలీసా చదవండి.
మకర రాశి: కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారం. కొంత విలాసానికి వెచ్చిస్తారు. ఇష్టం లేకపోయినా కొందరి మాటలు వినవలసి వస్తుంది.ఇతరుల ఈర్ష్య నుంచి జాగ్రత్త వహించాలి.కొత్త పనులు చేపట్టటానికి మంచి వారం. దేవీ సూక్తం చదవండి.
కుంభ రాశి: మనసు ప్రతిక్రియలలో మునిగి ఉన్నట్లు తెలుస్తున్నది. కాలం ఆ సంగతులలో వృధా చేయకండి. మౌనాన్ని మించిన ప్రతిక్రియ, ప్రక్రియ లేదు! కళాకారులకు, విద్యార్థులకు మంచి వారం. స్త్రీలకు అవకాశాలు బాగుoటాయి.ఉద్యోగంలో మార్పులు సంభవం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
మీన రాశి: ప్రయాణాలు మానుకోవటం మంచిది. ఇంటి పనిలు పూర్తి చేస్తారు.పిల్లలు మంచి వార్తలు చెబుతారు. వారం మధ్యలో ఆదాయం పెరుగుదలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. లాభిస్తాయి కూడా…దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
(తంత్రోక్తం దేవీ సూక్తం)
సమస్త ప్రాణులలో ఏ దేవి అయితే మాతృ రూపంలో యున్నదో, ఆ తల్లికి పలుమార్లు నమస్సులు.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~~***~~~
The English version is available at www.sripati.com
‘ఇమ్మొబయిల్’ -వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ
13 సెప్టెం 2009 1 వ్యాఖ్య

వేచి ఉండటం అంటే నాకు ఏ రోజూ ఇష్టం లేదు. ఒకరి కోసం ఒక చోట నిలబడాలన్నా, ఒక రైలు లో ఎవరో వస్తున్నారని ఎదురు చూస్తూ కుర్చోవాలన్నా, లైను కదలాలన్నా జీవితం మీద విరక్తి పుడుతూ ఉండేది. కొద్ది రోజుల నుంచీ అలా లేదు. నా మొబయిల్ తడిసిపోయి కోరని వరాన్నిచ్చింది. నాకూ, నా సమయానికీ గల సంబంధం మరింత గట్టిదయ్యింది. అదలా ఉంచి ఎక్కడైనా అలా వేచి ఉండాలంటే ఆ సమయం నాకు ఏ రోజూ వృధా పోదు. బండీ పాడయి ఒక మూల నిలబడ్డాను. వాన దంచుకుంటోంది. ఆగే వరకూ అలా ఆ మూసేసిన షాపు షటర్ కు ఆనుకుని నిలబడ్డాను.
అన్ని వైపులా ద్వారాలు మూసుకున్నప్పుడు నాకు నేను ఎందుకో మరింత స్వతంత్రంగా ఎగురుతాను! ఎక్కడి నుంచో ఆలోచనలు అద్భుతంగా ఆ గొడవ చేస్తున్న ఆకాశంలోకి రాకెట్లలా ఎగిరిపోతాయి. ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తోంది. కటకటాల మాటున ఒక కుర్రాడు వచ్చి మొబయిల్ ఫోనులో మాట్లాడుతున్నాడు. ఎవరో వచ్చి వెనక్కి తీసుకుని పోతున్నారు. అతను మరల వస్తున్నాడు, వాళ్లు మళ్లీ తీసుకుని వెళ్లిపోతున్నారు. తమాషాగా ఉంది. ఎంత వానలో తడిస్తే నేను కింద పడిపోతాను? పోనీ తడిసి చూద్దామా? ఏమో! కొత్త రోగాలు నాట్యం చేస్తున్న నేల ఇది! ఆ కుర్రాడు మరల వచ్చాడు. చిన్నగా అంటున్నాడు, ‘హలో, ఆ, నేనే! ఏమీ లేదు…ఏం చేస్తున్నావు? వానా? లేదు ఎండగా ఉంది. వాడికి చెప్పు, వాడికి మొత్తం మెంటాలిటీయే మెంటల్…’ ఈ సారి తనే వెళ్లిపోయాడు.
ఆ కటకటాలు అతనికి అడ్డంగా ఉన్నట్లున్నాయి. నాకు ఏ అడ్డమూ లేదు. ఈ జైలు అనంతం. ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు తాళం వేయగలదు. మరో ఆలోచన అన్ని ఆలోచనలకూ తాళం వేసి మూయగలదు… ఒక చిరునవ్వు చిన్నగా తాళం తెరవగలదు. ఈ మనన్సులోకి నన్ను తోసి జైల్లోకి పంపినట్లు ఎవరో అనుకుంటున్నారు. కుదరదు. నేను నిలబడ్డ చోటే వేయి తలలు, వేయి వెర్రి ఆలోచనలు. నాకు మనుషులతో పని లేదు, నేను బంధువును కాను. నాలో ఏదో నిదుర లేచినప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు. నేను స్వతంత్ర జీవిని…
కుర్రాడు మరల వచ్చాడు. ‘హలో…రావద్దు. ఎందుకు? ఆ పిచ్చోడు రాడు. వద్దు. నేను మిస్డ్ కాల్ ఇస్తాను…’
మరల లోపలికి తీసుకుని వెళ్లిపోయారు.
ఏమిటి నాలో ఈ ఆలోచనలు? శరీరం అలసిపోయిందనా? వాన అడ్డుగా వచ్చిందనా? అనుకున్న సమయం దాటిపోయిందనా? ఏమో! ఆలోచనలకు ఒక గ్రూప్ లీడర్ గా మరో ఆలోచన. ఈ ఆలోచన మిగతా ఆలోచనలను పరిశీలిస్తోంది. పనికి మాలింది!
ఎవడు స్వతంత్రుడు? ఎవరూ లేరు. ఎవరు బంధువు? ఎవరూ లేరు. అన్నీ ఇచ్చి పుచ్చుకునేవే! పై వాడు కూడా నోరు తెరిస్తే కిందటి జన్మలో…అంటూ మొదలు పెడతాడు. లెక్కలు అంటాడు. ఏదో బ్రహ్మాండమైన లెక్క తప్పి పోతున్నట్లు కబుర్లు చెబుతాడు. నేను వాడు కనపడితే నాయనా, నీ సృష్టి మాడర్న్ ఆర్ట్ లాగా చాలా బాగుంది. నీ వెర్రి తనం ఘోరంగా, ఎంతో అందంగా ఉందని చెబుతాను.
కటకటాల దగ్గర లైటు వేసారు. అంటే చీకటి పడింది. చుట్టూతా చూశాను. ఎలా, ఈ వాన ఆగటం లేదు. ఇంటిలో ఒక్క సరుకు లేదు. బండీ మూసుకుంది…ఇలా చెప్పినా నమ్మరు. అదో సమస్య. అక్కడ ఆ కుర్రాడిలాగా నిలబడి చూస్తున్న వారికి ఆలోచనలు కారు మబ్బులలాగా కమ్ముకుంటాయి…ఈ ఊళ్లో ఒక చోట పడే వాన మరో చోట పడదు. అన్నీ అబధ్ధాలే! సిగ్గనేది ఉంటే కదా? ఎవరో మరి స్వతంత్రుడు?
కాలు దగ్గర చిన్న రాళ్లు ఉన్నాయి. ఊరకే ఒక దానిని తీసి తుడిచాను. నీలా బ్రతకలేను. పోనీ నిన్ను ఆయుధం చేసుకుని ఒకరి మీద విసరలేను. అసలు మొబయిల్ పాడైపోయిందన్నా నమ్మటం లేదు ఎవరూ! ఒకరిని ఎందుకు నమ్మించాలి? రాయను నీటిలోకి విసిరాను. అక్కడ పడుకుని ఉన్న ఊరకుక్క ఊరకే లేదు. లేచి మొరిగింది!
‘ కొత్త మొబయిల్ కొని ఇస్తాను ‘, పై వాడు ఆఫీసులో కర్ణుడి తరువాత నేనే అన్నట్లు చెప్పాడు. ‘ కొనలేక కాదు సార్. ఇది చాలా ఖరీదైనది. రిపెయిరు అవుతుందని చెప్పారు. అందుకని ఆగాను…’
బయటికి వచ్చాక వెనుకనుండి మాట్లాడుకుంటున్నారు ఎవరో..’ ఈ మధ్య ఇది ఒక మంచి వంక. తన పనులకు వాడుకోడా మొబయిల్? ‘
ఒక రోజు ఆఫీసుకు వెళ్లి కూర్చున్నాను. ఎదురుగా ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. ‘ మొబయిల్ ఎత్తటం లేదేమిటి? ‘, అడిగాడు. రిపెయిరుకు వచ్చిందని చెప్పాలనిపించలేదు. ‘ అది నా మొబయిల్ ‘ అని కూర్చున్నాను. ఏదో అన బోయి నోరు మూశాడు. తన మొబయిల్ లో చాలా సేపు ఏ
దో కెలికాడు. లేచి ‘ వస్తాను ‘, అన్నాడు. చిరునవ్వు నవ్వాను. ఇది నా టయిం అంటానేమోనని అనుకున్నట్లున్నాడు! వెళ్లిపోయాడు.
కుర్రాడు మరల వచ్చాడు. ‘ఛార్జ్ అయిపోతోంది. త్వరగా చెప్పు. కరెంటు పోతుంది. త్వరగా చెప్పు. ఊ…అవునా…’
మరల ఎవరో వెనుక నుంచి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లారు.
వాన తగ్గింది. బండీ తోసుకుంటూ అటు వెళ్లాను. ఈ సారి కుర్రాడు గింజుకుంటున్నాడు. కటకటాల దగ్గరకు వచ్చాడు. నన్ను చూడలేదు.
‘ ఓ హలో, చెప్పు, వినిపించటం లేదు. ఏమిటీ?…మొబయిల్ పాడయిందా? మరి ఎలా మాట్లాడుతున్నావు? కొయ్యకుర రే…’
వెనుక నుంచి మరల వీపు ఎవరో తట్టి ఈ సారి ఒకటి వాయించారు. నేను అదోలా చూశాను. ఆయన నన్ను చూసి లోపలికి వెళ్లిపోయాడు. కుర్రాడు మొహం ఎర్రగా పెట్టుకుని మరల అక్కడికి వచ్చాడు.
‘ హలో…నేను …చెప్పు. బాగానే ఉందా? ఏమి బాగుంది? మొబయిలా…నీ బుర్రా? ఎందుకు మాట్లాడవు? ‘
మరల పెద్దాయన వచ్చి అతన్ని తీసుకుని వెళుతున్నాడు. ఎందుకో అడిగాను, ‘ సార్, మాట్లాడనీయండి…’
ఆయన కొద్దిగా కోపంగానే చూశాడు. కుర్రాడి చేయి విప్పి చూపించాడు. అసలు చేతిలో మొబయిల్ లేనే లేదు!.
నేను ఇమ్మొబయిల్ అయ్యాను!
~~~***~~~
13-19 సెప్టెంబర్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
12 సెప్టెం 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి సింహ కన్య రాశులు (17 న కన్య సంక్రమణం), కుజుడు మిథునం, శుక్రుడు కర్కాటక సింహ రాశులు, కేతువు కర్కాటకం, శని బుధులు కన్య, రాహువు గురువు మకరం, చంద్రుడు మిథున, కర్కాటక, సింహ, కన్య రాశులు సంచరిస్తారు.
ఇది విజయవంతమైన వారం. ఆటగాళ్లకీ, వ్యాపారులకు, యాంత్రిక రంగంలో ఉన్న వారికీ మంచి ఫలితాలు ఇవ్వగల వారం. మానసిక ఆందోళనలలో ఉన్న వారికి కొంత ఉపశమనం ఉండవచ్చు. సంబంధ బాంధవ్యాలు ఘర్షణలకు గురి కాగలవు. ఓర్పు, ధర్మనిబధ్ధత అవసరం. గ్రహాల ప్రభావం అందరి మీద ఎక్కువగా ఉండు కాలం ఇది. స్వాధ్యాయం, తత్వ చింతన పెంచుకుని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో దిన చర్యలను జరుపుకోవలసినదిగా మనవి. సత్కార్యములను ఆచరించే హృదయాన్ని ప్రసాదించమని ఈశ్వరుని కోరుకోవాలి.
శని కన్య రాశిలోకి ప్రవేశించినందుకు ఏ రాశి వారు ఎలా మసలుకోవాలో ఈ వార ఫలాల క్రింద సూచించుట జరిగినది.
మేష రాశి: మనసు లోని విపరీతమైన ఆలోచనలు ఒక దారికి రాగలవు. వారం మధ్యలో ప్రశాంతత చేకురుతుంది. కొత్త ఉద్యోగం లో చేరగలరు. ధ్యాన మార్గం అవలంబించండి.
వృషభ రాశి: చాలా పనులు ఒకే సారి చేపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒక పనిని ఒక వేళలో చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం బాగుంది. వ్యయం కూడా అలానే ఉంది. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
మిథున రాశి: కుటుంబంలో ఒక అస్థిరత, కొంత చికాకు ఉండగలదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు చేతికి అందుతుంది. ఒకే ఒరవడి అలవాటు చేసుకున్న వారు ఇబ్బందులకు గురి కాగలరు. వీలైనంత మౌనం పాటించండి. శ్రీసూక్తం చదవండి.
కర్కాటక రాశి: ఇది అన్ని విధాలా కలసి వచ్చే వారం. సంఘంలో మంచి గౌరవం పొందుతారు. పరస్పరం విరుధ్ధమైన మాటలు మాట్లాడటం వలన కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఆదిత్య హృదయం చదవండి.
సింహ రాశి: మంచి ఫలితాలనిచ్చే వారం కాకపోతే గతంలో మీరు మంచి పనులు చేసారని అనుకున్నవి ఆ విధంగా జరగలేదని తెలుసుకుంటారు. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపరం అభివృధ్ధిలోకి వస్తుంది. విష్ణు సహస్రనామం చదవండి.
కన్య రాశి: ఆరోగ్యం మెరుగు పడుతుంది. మిత్రులు కలుసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. మీ విధి నిర్వహణకు మంచి పేరు పొందుతారు. ఇతరుల ఈర్ష్య వలన కొంత బాధ పడతారు. చాలా మటుకు ఇది మంచి వారం. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
తుల రాశి: ఈ వారాంతంలో కొంత ప్రమాదం పొంచి ఉన్నది. నిర్లక్ష్యం వలన, బంధువుల మాటలు వినటం వలన నష్టపోయే సూచనలున్నాయి. మిమ్మల్ని కలవర పెట్టు విషయాలలో మంచి వారి సలహాలు తీసుకోండి. ప్రస్తుతం మీరు నమ్మే వ్యక్తులు మీ హితైషులు కారు. సంధ్య వేళల పడుకోవటం మానేయండి.
వృశ్చిక రాశి: మంచి ఆలోచనలు వచ్చినా ఎందుకో తిరిగి దూరం వెళ్లిపోతున్నాయి. దీనికి కారణం మీ ఆలోచనల మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకోవటం. ఇతరులతో చర్చించటానికి మంచి సమయం. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి.
ధను రాశి: ఈ వారం కార్యాలయంలోనూ, ఇతరత్రా మంచి ఫలితాలు, మార్పులు కనిపిస్తున్నాయి. కొంత విలాసానికి వెచ్చిస్తారు. వారం మధ్యలో కొంత దూకుడుగా వ్యవహరిస్తారు. పెట్టుబడులు పెంచవలసిన అవసరం లేదు. అధ్యయనానికి మంచి వారం. శ్రీసూక్తం చదవండి.
మకర రాశి: ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యం కాపాడుకోవలసిన వారం. చర్మ వ్యాధుల
నుంచి బాధ పడుతున్న వారు మరింత జాగ్రత్త వహించాలి. మంచి అవకాశాలు రానున్నాయి. ఆదాయం బాగుంది. పాత పరిచయాలను దృఢ పరచుకునేందుకు మంచి వారం. సూర్య నమస్కారాలు చేయండి.
కుంభ రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. జీవితంలో కాలం కాని కాలంలో వైరాగ్య ధోరణి మంచిది కాదు. మీ నిర్ణయాల కోసం చాలా మంది వేచి యున్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి ఒక కాల పరిమితిని చేకూర్చుకొనటం అవసరం. నూతన వాహన యోగం ఉన్నది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
మీన రాశి: జీవిత భాగస్వామితో భిన్నాభిప్రాయాలు
కలగ గలవు. మౌనం వలన సమసిపోతాయి. విదేశీ యానానికి పిలుపు రాగలదు. మీ కళను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. విద్యార్థులకు మంచి వారం. శివునికి అభిషేకం చేయించండి.
శని కన్య రాశిలోకి ప్రవేశించుట వలన ప్రత్యేకంగా పరీక్షించ వలసిన రాశులు సింహం, కన్య, తుల. పాటుగా మిథున కుంభ రాశులు కూడా పరిగణనలొకి వస్తాయి.
మిథున రాశి వారికి అర్థాష్టమ శని వలన ఇంటిలోని విషయాలపై శ్రధ్ధ వహించవలసి ఉంటుంది. నూతన విద్యను అభ్యసించ కోరే వారికి మంచి అవకాశాలు ఉండగలవు. విద్యార్థులకు విదేశీ అవకాశాలు, సాంకేతిక, రసాయన విద్యలలో ఉన్నత విద్యలు ఉంటాయి. తల్లి దండ్రులలో తల్లి ఆరోగ్యం బాగుండనప్పుడు విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి ఖర్చులు పెరిగినా దీర్ఘకాలపు పనులకే జరుగగలవు.ఒక్క సారి మందపల్లిలో అభిషేకం జరిపించటం మంచిది.
సింహ రాశి వారికి శని రెండవ రాశిలోకి ప్రవేశించి యున్నాడు. ఇది ఏలినాటి శని జరుగుతున్న కాలంలో చివరి ఘట్టం. సామాన్యంగా ఈ రెండున్నర సంవత్సరాలూ విశేషమైన మార్పులు, ఆదాయం. దీర్ఘకాల సమస్యల పరిష్కారాలు జరుగుతాయనేది పండితుల అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు! కాకపోతే వ్యవస్థలో మార్పులు సంభవం. కొన్ని భాగస్వామ్యంతో కూడిన పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి యుండవచ్చు. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మాటలు ఈ సమయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఇతరులు అపార్థాలు చేసుకోవటం తరచూ జరుగగలదు. శనికి ఒక సారి మందపల్లిలో అభిషేకం మనీ ఆర్డర్ ద్వారా చేయించుకొనటం మంచిది. తదుపరి శివునికి అభిషేకం జరిపించుకోవాలి. ఈ ప్రక్రియ జన్మ నక్షత్రం రోజున గానీ బహుళ త్రయోదశి రోజున గానీ లేదా ఒక శని వారం గానీ చేయించవచ్చు.
కన్య రాశి వారికి శని మరి ఇంటి మధ్యలో (మీ రాశిలో) ఉన్నాడు. నా మిత్రుడు ఒకాయన మీకు ఏ దేవుడంటే ఇష్టం అంటే తడుముకోకుండా శని గ్రహం అనే వాడు. అదేమిటి సార్ అంటే ఏ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు ఆగ్రహిస్తాడో చెప్పలేము. కానీ శని తెలిసిన తేట. ఇది చెయ్యను ఇది చేస్తాను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు! పైగా దేవుళ్లు వెంట ఉంటారో లేదో చెప్పలేము. నా శని మటుకు నాకు ఏదో విధంగా తోడుగా ఉంటాడు అని కూడా చమత్కరించాడు.
ఇందులోనూ నిజం లేకపోలేదు. శనిది మొండి బండ పధ్ధతి. అందులోకి వస్తే అన్నీ ఆశీర్వాదాలే! మరో పధ్ధతిలోకి వెళతానంటే కుదరదు. బండలాగా అడ్డం వస్తాడు. శ్రమించే వారికి మంచి ఫలితాలిస్తాడు. న్యాయ మార్గం, ధర్మమార్గం మీద నడిచే వారిని నెత్తిన పెట్టుకుంటాడు. కాకపోతే ఆయన అలవాటు ఏమిటంటే రైల్లోకి ఎక్క గానే ఏమీ ఆలోచించకుందా చెయిన్ లాగేస్తాడు. అంతా ఎక్కడికక్కడ ఆగిపోయినట్లుంటుంది. జీవితం మీద వెగటు పుడుతుంది. కానీ రైలు కదిలిన తరువాత అర్థమవుతుంది. బండీ అక్కడ ఆపకపోతే ఎక్కడో అక్కడ పడిపోయేదని!
కన్య రాశి వారికి అనుకున్నవి ఆగిపోయి, అనుకోనివి సాగిపోయే కాలం. ఇంత కాలంగా మీరు కోరుకున్న జరగనివి ఈ రెండున్నర సంవత్సరాలలో జరుగుతాయి! కానీ ఒక షరతు. మీరు ఒక స్వాధ్యాయ పరమైన నియమం లేదా ఒక ఉపదేశం పొందిన మంత్రం లేదా మీ కులదైవానికి సంబంధించిన ఉపాసన అయినా, పుణ్య తీర్థ సందర్శనం అయినా తప్పక చేయాలి. అన్న దానం, గోవులకు గ్రాసం వేయటం లాంటివి తరచూ చేయాలి. వాక్చాతుర్యం, కళలలో నైపుణ్యం, ఎవరూ తలపెట్టని విషయాలను బయట పెట్టటం ఇలాంటివి సంభవం. ఒక్క రోజు కూడా విశ్రాంతి మీకు దొరకకపోవచ్చు. దీనికి ఇప్పుడు బాధ పడినా తరువాత సంతోషిస్తారు. ఒక్క సారి మందపల్లికి మనీ ఆర్డర్ పంపి అభిషేకం జరిపించుకోండి.
కర్కాక రాశి వారికి ఏలినాటి శని వెళ్లిపోయిందండీ…అయినప్పటికీ ఒక్క సారి మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం జరిపించుకోవటం మంచిది.
తుల రాశి వారికి ఇప్పుడే మబ్బులు కమ్ముకున్నాయి. చిన్నప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి రక్తం యావత్తూ మార్పు పొందినట్లు ఈ ఏలినాటి శని వ్యక్తిలోకి దూరి పూర్తి జీవితచక్రాన్ని ఓవరాయిలింగ్ చేస్తుంది. శని అంటేనే ఆయిల్! ఈ ప్రక్రియకు వీరు సిధ్ధం కావాలి. ధన వ్యయం, అనుకోని వారితో తగాదాలు, బంధువులు దూరం కావటం ఇవి సామాన్యం. కానీ ఈ రశి వారికి శని విశేషమైన తాత్విక చింతన ఇవ్వగలడు. అలాగే రాజకీయాలలోని వారికి ఒక్క సారి ఉప్పెనలా అనుకోని అవకాశాన్ని ఇవ్వగలడు. కోర్టు తగాదాలలో ఇరుక్కున్న వారికి వారి పక్షం గెలుపు చూపించగలడు. భార్యతో విభేదం ఇవ్వగలడు! కొన్ని మంచి పనులు చేసినా ఎక్కువ తెలివి తేటలు చూపించే వారికి శని విరుధ్ధం! తస్మాత్ జాగ్రత్త! ఈ రాశి వారు మనీ ఆర్డర్ పధ్ధతి కాకుండా మందపల్లి స్వయంగా వెళ్లి అభిషేకం చేయించుకుని ఇంటికి (ఇంటికే) వెళ్లి వారం లేదా పక్షం లోపల శివాలయంలో అభిషేకం జరిపించుకుంటే ఏడున్నర సంవత్సరాలూ ఏ సమస్య వచ్చినా దాటుకుని చివరికి విజయం పొంది హాయిగా నవ్వుకోగలరు.
కుంభ రాశి వరికి శని అష్టమంలోకి వచ్చాడు. దీనినే అష్టమ శని అంటారు. సామాన్యంగా ఈ రాశికి శని రాశ్యధిపతి కాబట్టి సమస్య అంతగా ఉండదు. కానీ బంధువులతో చికాకులు, అదనపు బాధ్యతలు, మిమ్మల్ని చాలా మంది అర్థం చేసుకోకపోవటం ఇలాంటివి జరుగుతాయి. గత జన్మ లోని మంచి పనులకు ఈ జన్మలో సత్ఫలితాలు కలగటం కూడా ఇప్పుడే! మీ జాతకంలో శని బలవంతుడయి ఉంటే శత్రువుల మీద విజయం సాధిస్తారు! ఒక్క సారి మందపల్లిలో అభిషేకం జరిపించండి. స్వయంగా వెళ్లనవసరం లేదు. చిరాకులు, ఇరిటేషన్లు తగ్గగలవు.
పైన పేర్కొనబడిన రాశుల వారందరూ కనీసం నెలకొక సారి శివునికి అభిషేకం జరిపించుకున్న యెడల ఫలితాలు మీరే గమనించగలరు!
(మిత్రుల కోరిక పైన ఈ వివరాలను మీ ముందు ఉంచాను…)
~~~***~~~
ఈ వారం మంచి మాట
శ్లో: అన్నదా: ప్రథమం యాంతి సత్యవాక్ తదనంతరం
అయాచితప్రదాతా చ సమం యాంతి త్రయోజనా:
(మహాభారతం వనపర్వం)
(అన్నదానం చేయువారు ముందు స్వర్గంలోకి అడుగు పెడతారు, తరువాత సత్యవాదినులు, ఆ తరువాత అయాచితంగా దానమిచ్చువారు అక్కడ ప్రవేశిస్తారు)
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
The English version is available at www.sripati.com
ఇటీవలి అభిప్రాయములు