‘ నిన్న లేని అందమేదో’ (21)-వేదాంతం శ్రీపతి శర్మ
31 జూలై 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

ఆ ఊరుకు బస్ స్టాప్ చిత్రం గా ఉంటుంది. ఒక కొండకు అటు పక్క బస్ స్టాప్. బస్సు వచ్చేది రెండు సార్లే. ఉదయం ఎనిమిదికి ఊరు దాటి లోయ వైపు వెళ్లేది, మరల సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుండి ఇటు వెళ్లిపోయేది.
‘ ఇంకా రాలేదు బస్సు? ‘, శరత్ అక్కడ హాయిగా కింద కూర్చుని బీడీ తాగుతున్న ఒకరిని అడిగాడు. అతను పైకి చూశాడు.
‘ లోయకా సార్?’
‘ అవును. ఇంకెక్కడికి వెళ్లగలను?’
‘ ఒత్తది లేండి. దారిలో సరుకు పడాల మరి ‘
‘ ఏమి సరుకు?’
‘లోయ దాక ఎల్లాల గదండి మరి. పడాలి లెండి ‘
‘ ఏంటి బస్సే?’
‘ చ చా కాదండీ. ఆ డ్రైవరు మనూరే. లారీల యాపారం ఉండేది ఆడికి. ఓ బాగ బతికేశాడండీ. మనోడే.’
‘ ఇంతకీ ఏంటి నింపుకుంటాడు? ‘
అతను నవ్వాడు. ‘ ఏటి సార్ మీరు మరీనూ! సరుకంటే తెల్దా? మడిసికి మసాలా ఉండాలి గదండీ.’
‘ నింపుకోమనూ. మరి దానికి ఆలస్యం ఎందుకు?’
‘ మంచోరే! పనికొచ్చేదీ తొందరగా రెడీ గాదు లెండి. కొద్దిగా నానుడు ఉంటేనే గదండీ ఏదైనా దొరికేదీ? మన పక్కూరే లెండి. ఈ పాటికి ఇచ్చేసి ఉంటాడు.’
‘ నువ్వేమి చేస్తూ ఉంతావు?’
‘ మనకి ఓ పనేటండీ? పాత సామాను కొంటానండీ.’
‘ ఎక్కడికెళుతున్నావు?’
‘ఆ లోయకేనండీ ‘
‘ పాత సామాను లోయలో పడేస్తావా?’
‘ మంచోరే! అదుగో ఒచ్చేసాడండీ. ఓ…ఆ టర్నింగు సూడండి. ఉషారంటే ఉషారండి. రండి. కూకుందాం. బండి మందే!’
ఇద్దరూ లోపలికి వెళ్లారు గాలి చల్లగా వీస్తోంది. డ్రైవరి టి కోసం దిగలేదు. అయినా సరుకు పడిపోయిందిగా. పది నిముషాలలో బయలు దేరింది.
‘ లోయకెందుకండీ?’
‘ బాగా కిందకి వెళ్లి కాసేపు పడుకుంటాను! ‘
‘ సా! ఓ మాటనుకుందామండీ! అంత కిందకెళితే పండుకోనక్కరలేదండీ. ఎల్లే లోపలే మన స్టోరీ మూస్కుంటుందండీ!’
‘ కాకపోతే లోయకెందుకెళతానయ్యా? చూడటానికే కదా?’
‘ ఏమో లెండి. దొరబాబులకు ఏమి పని ఉంటుందో ఏమో! ‘
‘ నువ్వెందుకెళుతున్నావు?’
‘లోయకు ఇంకా దాటి పోటెనండీ, ఓ సిన్న గుడండీ. ఓ సాములోరుంటారండీ. నన్ను రమ్మన్నారండీ.’
‘ ఎందుకు? నిన్ను చేర్చుకుంటాడా?’
‘ సా లేదండీ.’
‘ ఆయన దగ్గర సామానుందా?’
‘ సా కాదండీ. కిందటి సారి ఎల్లానండీ. నన్ను సూసి ఎందుకో వచ్చే మాసం కనపడమన్నాడండీ.’
‘ అప్పుడెందుకెళ్లావు?’
‘ మీరు పేపరోల్లా? కొంప దీసి? ఓ అడుగుతూనే ఉన్నారు?’
‘ కాదులే. చెప్పు ‘
‘ అలాక్కాదండి. మనసులో ఎట్టుకోండీ, నా సెయ్యి సూసిన్ అపెతి ఓడూ మూడు పెల్లిల్లన్నాడండి.’
‘ ఖర్మ ‘
‘ సా కాదండీ. మూడో పెల్లి ఊరి ప్రెసిడెంటునయ్యాక సేసుకుంటానని మూడో ఓడు నా కాలు నలిపి మరీ సెప్పాడండి.’
‘ చెబితే చెప్పాడు. కాలు నలపటం ఎందుకు?’
‘ మంచోరే. కాలు నలపకుండా ఎలాగండీ? మా దగ్గర అది పధ్ధతి. ఏమైనా అడిగితే మన కాలు మీద కాలు ఏట్టేస్తరండీ ముందర ‘
‘ ఛా! ‘
‘ అద్దీ. ఆ తరాత ఒక్కొక్క పస్నకీ ఇపరీతంగా నలిపి జవాబు సెపుతారు.’
‘ కాలు సంగతి ఏమిటి?’
‘ ఎక్కువ అడిగినోడికి కాలు మూస్కుంటుందండీ మరి. ఆడు ఆచారి దగ్గరికెల్లి మందు పూసుకుంటాడు.’
‘ అదీ! ఆచారికీ, ఈనకీ అగ్రిమెంటు మరి ‘
‘ అలాక్కాదండి. నేనూ మగాడినేనండి.’
‘ ఛా!’
‘ సా అవునండి! నేను మీ లాగే తెగ పస్నలడుగుతానండి.’
శరత్ వంగి అతని కాలు వైపు చూశాడు.
‘ కాలు బానే ఉందండి. మీరు మరీనూ! ఇలా ఎందుకు నలిపేత్తావయ్యా అని అడిగేసానండి.’
‘ ఏవన్నాడు?’
‘ సుస్టిలో ఒకటుంటే ఒకటి ఉండదన్నాడండి.’
‘ అంటే?’
‘ సుస్టండి. అంటే తెలవదా? ఇదిగో ఈ సుట్టూతా ఉన్నది సూడండి, ఇదే సార్, సుస్టి అంటే!’
‘ ఛా!. సృస్టి. బాగుంది. అంటే చెయ్యి ఉంటే కాలు ఉండగూడదా?’
‘ అలాక్కాదండి. మీది మరీ ఎటకారమండీ. సెయ్యి సూడాలా అంటే కాలు ఎంబడి అదేదో సెయ్యి దాకా పాకాలటండీ.’
‘ సర్లే వాడి గోల నాకెందుకు. ఇంతకీ ప్రెసిడెంటువవుతావన్నాడు ‘
‘ అలాగండి. అయితే ఆ పని అవ్వాలంటే ఒకటి ఊడాలన్నాడండి!’
‘ ఏంటది? కాలా?’
‘ సా కాదండీ! నా ఉద్దోగం ఊడి రెండో పెల్లి అయ్యాక ఇక ప్రెసిడెంటేనండీ!’
‘ నువ్వు ఉద్యోగం వదిలేశావా?’
‘ లేదండి. నన్ను తీసేసారండి.’
‘ ఛా! ఎందుకు?’
‘ ఆపీసులో పాత సామాను అమ్మేసానండీ!’
‘ ఓ! కొత్తవి వదిలేశావు!’
‘ ఎంత మాటండీ.ఆపీసు బాగు పడుతుందని అట్ట సేసానండీ. ఆపీసు నిండా సెత్తే! ‘
‘ మంచి పనేగా?’
‘ లేదండీ. నేనే సెత్త పని సేసానని పొమ్మన్నారండీ ‘
‘ ఇంతకీ ప్రెసిడెంటు అయిపోతావన్నమాట ‘
‘ ఆ సాములోరు సెప్పాలండీ. అంతమంది ఉన్నా నన్నే ఎందుకు రమ్మన్నాడో తెల్దు సార్. అందుకే ఎలుతున్నాను మరి ‘
ఊరు అవతల ఆ చెరువు దాటిన తరువాత చెట్ల చాటున ఆడుకుంటున్న సూర్యకాంతి రమణీయంగా ఉంది. అక్కడ పనులు చేసుకునే వాళ్లు ఒక వరుసలో దూరంగా ఒక గట్టు దిగి వెళ్లిపోతుంటే అందరూ ఎటో మాయమైపోతున్నట్లున్నారు. ఆకాశం అంచున పర్వత శ్రేణి ప్రకృతికాంతకు పెద్ద పీట వేసింది.
‘ అవును నీ పేరేమిటి…’
‘ సత్తిబాబు సార్. సెత్త కొని అమ్మేత్తాను. ‘
‘ సత్తిబాబూ, లోయ వెళ్లటానికి ఎంత టైం పడుతుంది?’
‘ మూడు గంటలు. మద్దెలో ఆపుతాడు మనోడు. కాపీ టీలు తాగి మల్లీ ఎల్లిపోతాం.’
‘ నువ్వు ప్రెసిడెంటువవుతావు సత్తిబాబూ!’
అతని మొహం వెలిగిపోయింది.
‘ ఎలా సెప్పేసారండీ?’
‘ నీ దగ్గర చాలా సమాచారం ఉంది. చూస్తున్నాను కదా?’
అతను తల వంచుకుని కాలుతోనే కాలు గోక్కున్నాడు.
‘ అదెందుకు?’
‘ ఇలా ఎవవరైనా అన్నప్పుడు కాలు నొప్పి గుర్తుకొచ్చి అలా గోకేస్తానండీ. అది నిజమవ్వాలని సెంటిమెంటు సార్!’
శరత్ కెమెరా సద్దుకుని పనిలోకి దిగిపోయాడు. అతను కళ్లు విప్పార్చి చూస్తున్నాడు. ‘ అనుకున్నాను సార్ ‘
‘ ఏమిటి?’
‘ మీరు ఇలాటిదేదో సేత్తారని!’
‘ ప్రెసిడెంటు అయ్యాక నన్ను పనిలో పెట్టుకుంటావా?’
‘ సత్. ఓ మాటనుకందామండీ.’
‘ ఏమిటది?’
‘ అయితే గంక పేపరోల్లకి ఏదైనా సెప్పాలంటే మీరే ఉండాల …అవునూ, మీరు ఈ ఊల్లో ఏమి సేత్తారు సార్?’
కెమెరా పక్కన పెట్టాడు శరత్. ‘ మేము ఒక ఫేక్టరీ పెడుతున్నాం…’
‘ సా అద్దా సంగతీ! ఆ ఇంద్రబొవనం లాంటి ఇల్లు మీదేనా? గుట్ట మీద? ఎక్కడా సూసా అనుకున్నా లెండి. పేక్టరియా? మీదేనండీ?’
‘ మా నాన్నదిలే! ఇంకా చాలా టైం ఉంది.’
‘ లోయ సూడ్డానికి ఎల్తున్నారా? బాగుంటుందిలెండి ‘
‘ లోయలో ఇంకా ఏముంటుంది?’
‘ జారత్తగా ఎల్లగలిగితే జలపాతం తగుల్తుంది సార్! నాలుగు గుహలున్నాయి. ఒకటి సాలా కస్టం. ఒకటి ఎల్లగూడదు.’
‘ ఎందుకు?’
‘ ఎందుకేటి? అంతే! బాబో…ఎల్తారా?’
‘ ప్రెసిదెంటువి భయపడతావా?’
‘ బయ్యం కాదు సార్! ఎందుకు?’
‘ వదిలేయి. తరువాత చూద్దాం. జలపాతం బాగుంటుందా?”
‘ ఓ నీరు ఎక్కడి నుంచి ఒత్తుందో తెల్దు గానీ గమ్మత్తుగుంటుంది…’
‘ జారి పడుతున్న నీటిలోకి జాగ్రత్తగా చూశావా?’
‘ నాకు తెల్దండి. ఏముంటుంది సార్?’
‘ రాతి శిల్పానికి మెరుపు చీరె సింగారించినట్లు ఉంటుంది.’
‘…’
‘ ఆ పరవశంలో నీరు కూడా కొద్ది సేపు ఒక శిల్పంలా మారాలని అనుకుంటున్నట్లు ఉంటుంది. కానీ ఎందుకో కుదరదు. పాపం ప్రతి అందమైన వస్తువుకు ఒక పారిపోయే గుణం, ఒక జారిపోయే గుణం…కదలిపోయే తత్వం. నీతిలోకి వెళ్లావా సత్తిబాబూ?’
‘ లేదండి. మీ మాటలు ఇంటుంటే ఎంత బయ్యంగా ఉందో ఆ నీటిలోకి ఎల్లాలంటే అంతే బయ్యం!’
‘ ఈత రాదా?’
‘ వచ్చు ‘
‘ మరి?’
‘ జలపాతం అట్టుందదండీ! రాల్ల మీద జారిపోతే మడిసికి ఈత ఒచ్చి ఏమిటి ఉపోగం?’
‘ అదే తమాషా! ఈత రాకుండానే జారిపోవాలి ఎక్కడికో! అందాన్ని వెతకద్దు. అది మన మీదుగా జలపాతంలా జాలువారాలి…ఒక ఆలోచన ఉప్పెనలా ఎగిసి పడాలి, ఒక క్షణంలో ఒక అనంతం దిగిపోవాలి. అనంతకాలగమనంలో అటువంటి ఒక ఖణం కోసం చూడాలి. ఈ కెమెరా ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి…’
‘…’
‘ ఏమీ మాట్లాడవు సత్తిబాబూ?’
‘ తెలీని దాని గురించి మాట్టాడను సార్!’
‘ ఆకాశాన్ని చూస్తున్నావా?’
‘ ఆ…’
ఇద్దరూ కిటికీ వైపుకు చూస్తున్నారు.
‘ ఆకాశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. జీవితకాలం వృధా అయిపోతుంది. అలా ఆనందించి చూడు. మరో జీవితకాలం నీ ముందుంటుంది…’
‘ అద్దం కాలేదు!’
శరత్ నవ్వాడు. ‘ కొద్ది సేపట్లో జలపాతం దగ్గరకు వెళతాము కదా?’
‘ ఆ…’
‘ జలపాతం పక్కగా నిలబడి అలా చూద్దాం.’
‘అప్పుడప్పుడు అమ్మాయిలు స్నానాలు…’
‘ వార్ని! ‘
‘ కాదండీ. ఆల్లు అవతల పక్క దూరంగా ఉంటారండీ. మనకి ఈ జలపాతం అడ్డొత్తుంది…’
‘ జలపాతం మనకి అడ్డు కాదు సత్తిబాబూ…’
‘ అంటే మీ కెమెరాలో…’
‘ కాదు. ఆ ఆలోచన మానేయి! అందులో ఏమీ లేదు! జలపాతంలోకి జాగ్రతాగా చూడు. నీరు ఎందరో అందమైన వనితలలాగా ముస్తాబయి అలా మారిపోయి మాయమైపోతూ ఉంటుంది. నువ్వు తొంగి చూడాల్సింది అక్కడ! అందానికి అందం కలుపు. ఆలోచనని నుదుటి బొట్టులాగా అలంకరించు. కల్పనను చీరెలా సింగారించు. నీలో మరో ప్రపంచం నిన్ను మరో సృష్టి వైపు నడిపిస్తుంది…’
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
ఇటీవలి అభిప్రాయములు