‘ నిన్న లేని అందమేదో’ (21)-వేదాంతం శ్రీపతి శర్మ
31 జూలై 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

ఆ ఊరుకు బస్ స్టాప్ చిత్రం గా ఉంటుంది. ఒక కొండకు అటు పక్క బస్ స్టాప్. బస్సు వచ్చేది రెండు సార్లే. ఉదయం ఎనిమిదికి ఊరు దాటి లోయ వైపు వెళ్లేది, మరల సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుండి ఇటు వెళ్లిపోయేది.
‘ ఇంకా రాలేదు బస్సు? ‘, శరత్ అక్కడ హాయిగా కింద కూర్చుని బీడీ తాగుతున్న ఒకరిని అడిగాడు. అతను పైకి చూశాడు.
‘ లోయకా సార్?’
‘ అవును. ఇంకెక్కడికి వెళ్లగలను?’
‘ ఒత్తది లేండి. దారిలో సరుకు పడాల మరి ‘
‘ ఏమి సరుకు?’
‘లోయ దాక ఎల్లాల గదండి మరి. పడాలి లెండి ‘
‘ ఏంటి బస్సే?’
‘ చ చా కాదండీ. ఆ డ్రైవరు మనూరే. లారీల యాపారం ఉండేది ఆడికి. ఓ బాగ బతికేశాడండీ. మనోడే.’
‘ ఇంతకీ ఏంటి నింపుకుంటాడు? ‘
అతను నవ్వాడు. ‘ ఏటి సార్ మీరు మరీనూ! సరుకంటే తెల్దా? మడిసికి మసాలా ఉండాలి గదండీ.’
‘ నింపుకోమనూ. మరి దానికి ఆలస్యం ఎందుకు?’
‘ మంచోరే! పనికొచ్చేదీ తొందరగా రెడీ గాదు లెండి. కొద్దిగా నానుడు ఉంటేనే గదండీ ఏదైనా దొరికేదీ? మన పక్కూరే లెండి. ఈ పాటికి ఇచ్చేసి ఉంటాడు.’
‘ నువ్వేమి చేస్తూ ఉంతావు?’
‘ మనకి ఓ పనేటండీ? పాత సామాను కొంటానండీ.’
‘ ఎక్కడికెళుతున్నావు?’
‘ఆ లోయకేనండీ ‘
‘ పాత సామాను లోయలో పడేస్తావా?’
‘ మంచోరే! అదుగో ఒచ్చేసాడండీ. ఓ…ఆ టర్నింగు సూడండి. ఉషారంటే ఉషారండి. రండి. కూకుందాం. బండి మందే!’
ఇద్దరూ లోపలికి వెళ్లారు గాలి చల్లగా వీస్తోంది. డ్రైవరి టి కోసం దిగలేదు. అయినా సరుకు పడిపోయిందిగా. పది నిముషాలలో బయలు దేరింది.
‘ లోయకెందుకండీ?’
‘ బాగా కిందకి వెళ్లి కాసేపు పడుకుంటాను! ‘
‘ సా! ఓ మాటనుకుందామండీ! అంత కిందకెళితే పండుకోనక్కరలేదండీ. ఎల్లే లోపలే మన స్టోరీ మూస్కుంటుందండీ!’
‘ కాకపోతే లోయకెందుకెళతానయ్యా? చూడటానికే కదా?’
‘ ఏమో లెండి. దొరబాబులకు ఏమి పని ఉంటుందో ఏమో! ‘
‘ నువ్వెందుకెళుతున్నావు?’
‘లోయకు ఇంకా దాటి పోటెనండీ, ఓ సిన్న గుడండీ. ఓ సాములోరుంటారండీ. నన్ను రమ్మన్నారండీ.’
‘ ఎందుకు? నిన్ను చేర్చుకుంటాడా?’
‘ సా లేదండీ.’
‘ ఆయన దగ్గర సామానుందా?’
‘ సా కాదండీ. కిందటి సారి ఎల్లానండీ. నన్ను సూసి ఎందుకో వచ్చే మాసం కనపడమన్నాడండీ.’
‘ అప్పుడెందుకెళ్లావు?’
‘ మీరు పేపరోల్లా? కొంప దీసి? ఓ అడుగుతూనే ఉన్నారు?’
‘ కాదులే. చెప్పు ‘
‘ అలాక్కాదండి. మనసులో ఎట్టుకోండీ, నా సెయ్యి సూసిన్ అపెతి ఓడూ మూడు పెల్లిల్లన్నాడండి.’
‘ ఖర్మ ‘
‘ సా కాదండీ. మూడో పెల్లి ఊరి ప్రెసిడెంటునయ్యాక సేసుకుంటానని మూడో ఓడు నా కాలు నలిపి మరీ సెప్పాడండి.’
‘ చెబితే చెప్పాడు. కాలు నలపటం ఎందుకు?’
‘ మంచోరే. కాలు నలపకుండా ఎలాగండీ? మా దగ్గర అది పధ్ధతి. ఏమైనా అడిగితే మన కాలు మీద కాలు ఏట్టేస్తరండీ ముందర ‘
‘ ఛా! ‘
‘ అద్దీ. ఆ తరాత ఒక్కొక్క పస్నకీ ఇపరీతంగా నలిపి జవాబు సెపుతారు.’
‘ కాలు సంగతి ఏమిటి?’
‘ ఎక్కువ అడిగినోడికి కాలు మూస్కుంటుందండీ మరి. ఆడు ఆచారి దగ్గరికెల్లి మందు పూసుకుంటాడు.’
‘ అదీ! ఆచారికీ, ఈనకీ అగ్రిమెంటు మరి ‘
‘ అలాక్కాదండి. నేనూ మగాడినేనండి.’
‘ ఛా!’
‘ సా అవునండి! నేను మీ లాగే తెగ పస్నలడుగుతానండి.’
శరత్ వంగి అతని కాలు వైపు చూశాడు.
‘ కాలు బానే ఉందండి. మీరు మరీనూ! ఇలా ఎందుకు నలిపేత్తావయ్యా అని అడిగేసానండి.’
‘ ఏవన్నాడు?’
‘ సుస్టిలో ఒకటుంటే ఒకటి ఉండదన్నాడండి.’
‘ అంటే?’
‘ సుస్టండి. అంటే తెలవదా? ఇదిగో ఈ సుట్టూతా ఉన్నది సూడండి, ఇదే సార్, సుస్టి అంటే!’
‘ ఛా!. సృస్టి. బాగుంది. అంటే చెయ్యి ఉంటే కాలు ఉండగూడదా?’
‘ అలాక్కాదండి. మీది మరీ ఎటకారమండీ. సెయ్యి సూడాలా అంటే కాలు ఎంబడి అదేదో సెయ్యి దాకా పాకాలటండీ.’
‘ సర్లే వాడి గోల నాకెందుకు. ఇంతకీ ప్రెసిడెంటువవుతావన్నాడు ‘
‘ అలాగండి. అయితే ఆ పని అవ్వాలంటే ఒకటి ఊడాలన్నాడండి!’
‘ ఏంటది? కాలా?’
‘ సా కాదండీ! నా ఉద్దోగం ఊడి రెండో పెల్లి అయ్యాక ఇక ప్రెసిడెంటేనండీ!’
‘ నువ్వు ఉద్యోగం వదిలేశావా?’
‘ లేదండి. నన్ను తీసేసారండి.’
‘ ఛా! ఎందుకు?’
‘ ఆపీసులో పాత సామాను అమ్మేసానండీ!’
‘ ఓ! కొత్తవి వదిలేశావు!’
‘ ఎంత మాటండీ.ఆపీసు బాగు పడుతుందని అట్ట సేసానండీ. ఆపీసు నిండా సెత్తే! ‘
‘ మంచి పనేగా?’
‘ లేదండీ. నేనే సెత్త పని సేసానని పొమ్మన్నారండీ ‘
‘ ఇంతకీ ప్రెసిడెంటు అయిపోతావన్నమాట ‘
‘ ఆ సాములోరు సెప్పాలండీ. అంతమంది ఉన్నా నన్నే ఎందుకు రమ్మన్నాడో తెల్దు సార్. అందుకే ఎలుతున్నాను మరి ‘
ఊరు అవతల ఆ చెరువు దాటిన తరువాత చెట్ల చాటున ఆడుకుంటున్న సూర్యకాంతి రమణీయంగా ఉంది. అక్కడ పనులు చేసుకునే వాళ్లు ఒక వరుసలో దూరంగా ఒక గట్టు దిగి వెళ్లిపోతుంటే అందరూ ఎటో మాయమైపోతున్నట్లున్నారు. ఆకాశం అంచున పర్వత శ్రేణి ప్రకృతికాంతకు పెద్ద పీట వేసింది.
‘ అవును నీ పేరేమిటి…’
‘ సత్తిబాబు సార్. సెత్త కొని అమ్మేత్తాను. ‘
‘ సత్తిబాబూ, లోయ వెళ్లటానికి ఎంత టైం పడుతుంది?’
‘ మూడు గంటలు. మద్దెలో ఆపుతాడు మనోడు. కాపీ టీలు తాగి మల్లీ ఎల్లిపోతాం.’
‘ నువ్వు ప్రెసిడెంటువవుతావు సత్తిబాబూ!’
అతని మొహం వెలిగిపోయింది.
‘ ఎలా సెప్పేసారండీ?’
‘ నీ దగ్గర చాలా సమాచారం ఉంది. చూస్తున్నాను కదా?’
అతను తల వంచుకుని కాలుతోనే కాలు గోక్కున్నాడు.
‘ అదెందుకు?’
‘ ఇలా ఎవవరైనా అన్నప్పుడు కాలు నొప్పి గుర్తుకొచ్చి అలా గోకేస్తానండీ. అది నిజమవ్వాలని సెంటిమెంటు సార్!’
శరత్ కెమెరా సద్దుకుని పనిలోకి దిగిపోయాడు. అతను కళ్లు విప్పార్చి చూస్తున్నాడు. ‘ అనుకున్నాను సార్ ‘
‘ ఏమిటి?’
‘ మీరు ఇలాటిదేదో సేత్తారని!’
‘ ప్రెసిడెంటు అయ్యాక నన్ను పనిలో పెట్టుకుంటావా?’
‘ సత్. ఓ మాటనుకందామండీ.’
‘ ఏమిటది?’
‘ అయితే గంక పేపరోల్లకి ఏదైనా సెప్పాలంటే మీరే ఉండాల …అవునూ, మీరు ఈ ఊల్లో ఏమి సేత్తారు సార్?’
కెమెరా పక్కన పెట్టాడు శరత్. ‘ మేము ఒక ఫేక్టరీ పెడుతున్నాం…’
‘ సా అద్దా సంగతీ! ఆ ఇంద్రబొవనం లాంటి ఇల్లు మీదేనా? గుట్ట మీద? ఎక్కడా సూసా అనుకున్నా లెండి. పేక్టరియా? మీదేనండీ?’
‘ మా నాన్నదిలే! ఇంకా చాలా టైం ఉంది.’
‘ లోయ సూడ్డానికి ఎల్తున్నారా? బాగుంటుందిలెండి ‘
‘ లోయలో ఇంకా ఏముంటుంది?’
‘ జారత్తగా ఎల్లగలిగితే జలపాతం తగుల్తుంది సార్! నాలుగు గుహలున్నాయి. ఒకటి సాలా కస్టం. ఒకటి ఎల్లగూడదు.’
‘ ఎందుకు?’
‘ ఎందుకేటి? అంతే! బాబో…ఎల్తారా?’
‘ ప్రెసిదెంటువి భయపడతావా?’
‘ బయ్యం కాదు సార్! ఎందుకు?’
‘ వదిలేయి. తరువాత చూద్దాం. జలపాతం బాగుంటుందా?”
‘ ఓ నీరు ఎక్కడి నుంచి ఒత్తుందో తెల్దు గానీ గమ్మత్తుగుంటుంది…’
‘ జారి పడుతున్న నీటిలోకి జాగ్రత్తగా చూశావా?’
‘ నాకు తెల్దండి. ఏముంటుంది సార్?’
‘ రాతి శిల్పానికి మెరుపు చీరె సింగారించినట్లు ఉంటుంది.’
‘…’
‘ ఆ పరవశంలో నీరు కూడా కొద్ది సేపు ఒక శిల్పంలా మారాలని అనుకుంటున్నట్లు ఉంటుంది. కానీ ఎందుకో కుదరదు. పాపం ప్రతి అందమైన వస్తువుకు ఒక పారిపోయే గుణం, ఒక జారిపోయే గుణం…కదలిపోయే తత్వం. నీతిలోకి వెళ్లావా సత్తిబాబూ?’
‘ లేదండి. మీ మాటలు ఇంటుంటే ఎంత బయ్యంగా ఉందో ఆ నీటిలోకి ఎల్లాలంటే అంతే బయ్యం!’
‘ ఈత రాదా?’
‘ వచ్చు ‘
‘ మరి?’
‘ జలపాతం అట్టుందదండీ! రాల్ల మీద జారిపోతే మడిసికి ఈత ఒచ్చి ఏమిటి ఉపోగం?’
‘ అదే తమాషా! ఈత రాకుండానే జారిపోవాలి ఎక్కడికో! అందాన్ని వెతకద్దు. అది మన మీదుగా జలపాతంలా జాలువారాలి…ఒక ఆలోచన ఉప్పెనలా ఎగిసి పడాలి, ఒక క్షణంలో ఒక అనంతం దిగిపోవాలి. అనంతకాలగమనంలో అటువంటి ఒక ఖణం కోసం చూడాలి. ఈ కెమెరా ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి…’
‘…’
‘ ఏమీ మాట్లాడవు సత్తిబాబూ?’
‘ తెలీని దాని గురించి మాట్టాడను సార్!’
‘ ఆకాశాన్ని చూస్తున్నావా?’
‘ ఆ…’
ఇద్దరూ కిటికీ వైపుకు చూస్తున్నారు.
‘ ఆకాశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. జీవితకాలం వృధా అయిపోతుంది. అలా ఆనందించి చూడు. మరో జీవితకాలం నీ ముందుంటుంది…’
‘ అద్దం కాలేదు!’
శరత్ నవ్వాడు. ‘ కొద్ది సేపట్లో జలపాతం దగ్గరకు వెళతాము కదా?’
‘ ఆ…’
‘ జలపాతం పక్కగా నిలబడి అలా చూద్దాం.’
‘అప్పుడప్పుడు అమ్మాయిలు స్నానాలు…’
‘ వార్ని! ‘
‘ కాదండీ. ఆల్లు అవతల పక్క దూరంగా ఉంటారండీ. మనకి ఈ జలపాతం అడ్డొత్తుంది…’
‘ జలపాతం మనకి అడ్డు కాదు సత్తిబాబూ…’
‘ అంటే మీ కెమెరాలో…’
‘ కాదు. ఆ ఆలోచన మానేయి! అందులో ఏమీ లేదు! జలపాతంలోకి జాగ్రతాగా చూడు. నీరు ఎందరో అందమైన వనితలలాగా ముస్తాబయి అలా మారిపోయి మాయమైపోతూ ఉంటుంది. నువ్వు తొంగి చూడాల్సింది అక్కడ! అందానికి అందం కలుపు. ఆలోచనని నుదుటి బొట్టులాగా అలంకరించు. కల్పనను చీరెలా సింగారించు. నీలో మరో ప్రపంచం నిన్ను మరో సృష్టి వైపు నడిపిస్తుంది…’
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
‘ఆంధీ’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు
30 జూలై 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం

1975 లో గుల్జార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని కమలేశ్వర్ రచించారు.
ఈ చిత్రం గురించి చెప్పుకోవలసినది చాలా ఉంది. తొలుత దీనిని విడుదల కానీయకుండా ఆపటం కూడా జరిగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం మీద తీసిన చిత్రం అని కొంత దుమ్ము కూడా ఈ చిత్రం లేపింది. అయితే మనకి ఎక్కడా ఆవిడ పట్ల విమర్శ లాంటిది కనపడదు. రాజకీయ రంగం నుంచి ఒక విషయాన్ని ఎంచుకుని ఒక జర్నలిస్టిక్ పధ్దతిలో ముందుకు వచ్చిన చిత్రాలలో అరుదైన కళాత్మకత ఇందులో మనకు దొరుకుతుంది.
ఈ ప్రయోగాలలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే ప్రజలు ఆ పోలికను ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు కానీ మిగతా విషయాలను పక్కన పెడతారు…
రాజకీయం అనేది కుర్చీలు ఎక్కడం, దిగటమే కాకపోవచ్చు! ఒకరి నరనరాలలో ఆ తత్వం, ఆ ఒరవడి, నాయకత్వపు లక్షణాలు జన్మత: దాగి ఉండి వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రతిబింబించి అనుకున్నది సాధించుకుని ‘ఆ మలుపులోంచి ‘ వెళ్లిపోవటం కూడా కనిపిస్తుంది! ఇస్ మోడ్ సే జాతే హైన్!
ఒక శ్రీమంతుని కుమార్తె అయిన ఆరతి అనే అమ్మాయి ఒక హోటల్ యజమానిని ప్రేమించి తండ్రి ఆశలలకు విరుధ్ధంగా వివాహం చేసుకుంటుంది. విడాకుల ముందు ఒక పాప కూడా పుడుతుంది. ఎన్నికల సమయంలో ఆ హోటల్ కు వచ్చి బస చేయటంతో చిత్రం ప్రారంభమవుతుంది. ఎన్నికల విన్యాసాల మధ్య వీరిరువురి ఙ్ఞాపకాలు, భావాలు మనకు సంవాదాలుగా, చక్కని పాటల చిత్రీకరణతో పాటుగా కనిపిస్తాయి.
దృశ్య కావ్యానికి రెండు భాషలు: ఒకటి ఘటనల క్రమంలో ఉన్న మాలిక చెప్పకుండా చేస్తున్న వ్యాఖ్యానం, రెండు ఆ ఘటనల వెనుక కనిపిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న వ్యాఖ్య. ఈ రెండూ కథనంలో సమన్వయంతో అల్లుకున్నప్పుడు కథ ముందుకు నడుస్తుంది. ఒక్కో సారి ఘటనయే భాషగా మిగిలిపోతుంది. మరో ఘటనయే జరిగిన ఘటనకి వ్యాఖ్య చెబుతుంది…
వైవాహిక జీవితానికి కట్టు బడని మహిళ తన పనిలో తానున్న భర్త దగ్గరకు తను వెళుతున్న దారిలోనే కలుసుకుంటుంది. కాకపోతే రాజకీయాలు ఎలాంటివి అంటే వ్యక్తిగతం లేదు, గతం లేదు, అన్నీ అందులో పనికి వచ్చేవే! ఆఖరుకి జరిగేదీ అదే! వీరి కలవటాన్ని ఎత్తి పొడిచిన మరో నాయకుడు అదే స్టేజ్ మీద ఆరతీ దేవి వచ్చి ఆయన ఎవరో కారు నా భర్త-ఒక భారతీయ స్త్రీకి ఆ మాత్రం తన భర్తను కలిసే అధికారం లేదా అని ప్రశ్నించి అప్పటికి తగ్గిన ప్రాచుర్యాన్ని ఒక్క దెబ్బతో తిరిగి పొంది ఎన్నికలు గెలిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వింత వైపరీత్యం!
దర్శకుడు భార్యా భర్తల సంబంధాన్ని పరిశీలిస్తున్నాడా లేక రాజకీయ ప్రవృత్తిని ఇవతలకి లాగుతున్నాడా అని కొద్ది సేపు ఆలోచించాల్సి ఉంటుంది. చిత్రంలో ఒకరు తప్పు ఒకరు రైటు అనే మీమాంస అంతగా కనిపించదు. ఎవరి దారి వారిది. కానీ ఆ హోటల్ లో ఆవిడ దిగటం ఒక దుమారం లేపి అలా వెళ్లిపోతుంది. అందుకు ‘ఆంధీ ‘ ఆకట్టుకుంటుంది.
సంజీవ్ కుమార్ పాత్ర ఆలోచింప జేసే పాత్ర. ఆయన నటించిన చిత్రాలలో ఇది చెప్పుకోదగ్గది. హోటల్ లో ఆహ్వానింపబడ్డ ఒక వ్యాపారి ఆరతీ దేవిని చూసి ఈ వయసులో కూడా ఆమె పడుకోమన్నా పడుకుంటాను, ఎన్నికలలో నిలబడటం ఏమి ఖర్మ అన్నప్పుడు సంజీవ్ కుమార్ విని అతన్ని చాచి కొట్టటం, ఆమె వచ్చి చూసి తమాయించుకోవటం, సంజీవ్ పూర్తిగా రాజకీయపు చెత్తనే చీదరించుకుని అక్కడి నుండి అందరినీ పొమ్మనటం చిత్రం లోని ఘటనలన్నిటికీ ఒక గర్భంలా ముందుకు వస్తుంది. అది దర్శకుని మాస్టర్ స్ట్రోక్. సామాన్యంగా ఒక వనిత ఆ సందర్భాలలో స్పందించే తీరు మరోలా ఉండవచ్చు. కానీ సుచిత్రా సేన్ (ఆరతి ) ఏమీ మాట్లాడదు. అది పాత్రలో ఉన్న బరువు.
సంజీవ్ కుమార్ ఏ పాత్రనైనా అర్థం చేసుకున్నట్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఆయన నటనలో ఉన్న పరిఙ్ఞానం గొప్పది.
సంఘటనల క్రమానికి వద్దాం. ప్రత్యర్థి ఆమె మీద అభియోగాలు వేస్తూ తెగ వాగుతున్నప్పుడు ఆమె అక్కడికి వెళ్లిపోయి అతని పక్కనే నిలబడి ఆ హోటల్ యజమాని నా భర్త అని చెప్పేటప్పుడు ఆరతీ దేవి తన భర్త అక్కడికి వచ్చి తన పక్కన నిలబడతాడని ఊహించి ఉండకపోవచ్చు. అసలు ఆ సభలో అతను ఉండాలని ఏముంది?. అందుచేత ఒక భావావేశంలో అక్కడ ఒక సామాన్య స్త్రీ స్పందించినట్లు చెప్పిందా లేక ఒక రాజకీయ లబ్ధి పొందాలనా?
ఏది ఎలా ఉన్నా భర్త వచ్చి కేవలం అక్కడ రెండు క్షణాలు నిలబడి రాజకీయాలనీ, సమాజాన్నీ సవాలు చేశాడు…
దర్శకుడు ఈ వ్యూహాన్ని పెట్టి సార్వజనికమైన జీవన విధానాలనీ, భారతీయ సంప్రదాయాన్నీ కలిపి ఒక ప్రశ్న వేశాడు!
కానీ గెలిచింది రాజకీయమే! తన కూతురు కూడా అప్పుడప్పుడు తన దగ్గరకు వచ్చేలా చేసుకుని నాయకురాలు వెళ్లిపోతుంది.
అయినా గుల్జార్ చెప్పదలచుకుంది ఆయన కవిత్వం లోనే చెప్పేశాడు- తింకోన్ కె నశే మన్ తక్ ఇస్ మోడ్ సె జాతే హైన్! ఇది అసలు సిసలు వైపరీత్యం.
ఆర్. డి బర్మన్ ఇచ్చిన పాటలు, లత, కిశోర్ గళాలలో ఇప్పటికీ ఎక్కడైనా వింటుంటే మంచి రసపట్టులోంచి జారిపోతున్న భావాలు అలా మరల కొత్తగానే జాలువారుతూ ఉంటాయి. ‘ మోడ్ సె జాతే…’ అన్నప్పుడు లత ఒక మలుపులోంచి ఏదో ఒక బండీ వేగంగా తిప్పి వెంటనే మరో మలుపులోకి వెళ్లినట్లు పాదుతుంది…
ప్రారంభంలో ఆరతీ దేవి ఆ హోటల్ ను గుర్తు పట్టలేదా లేక ఆమె భర్త మరేదైనా హోటల్ ను కొన్నాడా అనే సందేహం కలిగింది.
రాజకీయ ఇతివృత్తంతో చాలా చిత్రాలు వచ్చాయి, పోయాయి. ఇంత గాఢమైన కళాత్మకతను ఎవరూ అటువంటి ఇతివృత్తంలో చూపించలేకపోయారనే చెప్పాలి.
~~~***~~~
26జులై-నుండి 1 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
25 జూలై 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి కేతువులు కర్కాటకం, బుధుడు కర్కాటక సింహ రాశులు, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం, కుజుడు వృషభం, శుక్రుడు వృషభ మిథున రాశులు, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశులు సంచరిస్తారు.
ఈ వారం పలుకుబడి ఉన్నవారికీ, వాక్చాతుర్యం గల వారికీ, నేర్పుతో వ్యాపారం చేసే వారికీ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాయగూరల ధరలు ఓ మోస్తరు తగ్గవచ్చు. కమాడిటీ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నవారు బుధవారం దాటిన తరువాత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్ లో బాంకింగు రంగంలోని షేర్లు కొనే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. రసాయనాలకు సంబంధించిన షేర్లు లాభసాటిగా ఉండగలవు.
స్త్రీలు డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. శ్రావణ మాసం కాబట్టి ముఖ్యంగా సూచించవలసినది ఒకటి ఉన్నది. ఈ వారం బంగారం కొనుగోలు విషయంలో పలువురు మోసపోయే సూచనలు ఉన్నాయి. ఇంటి దగ్గర లేక షాప్ లోనైనా ఆభరణాల పాలిష్ చేయించాలనుకున్న వారు ఆ కార్యక్రమం మానుకోవటం మంచిది…
మేష రాశి: మీ మాట తీరు చర్చలోకి వస్తుంది. ఆదాయం బాగుంది. వారాంతం సుఖదాయకంగా ఉన్నది. ఒక అతిథి రాగలరు. కొత్త ఆలోచనలు లాభిస్తాయి. కొంత శ్రమ తప్పదు. శ్రీసూక్తం చదవండి.
వృషభ రాశి: మీ మనసు నూతనత్వాన్ని కోరుకుంటున్నా బుధ్ధి వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తున్నది.ఏది ఎలా ఉన్నా ప్రయోగాలకు ఇది మంచి వారం. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఏదైనా దస్తావేజు తయారు చేయాలనుకున్న వారికి మంచి సమయం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు మీ పురోగతిని గమనిస్తున్నారు. విష్ణు సహస్రనామం చదవండి.
మిథున రాశి:కొంత డబ్బు ఖర్చు అయినప్పటికీ వారాంతానికి శమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. బంధువర్గంలో ఒకరికి అనారోగ్యం ఉండవచ్చు. ఇంటి పనులు పూర్తి కాగలవు. మీరు ఆలోచించినది ఇతరులకు చెప్పటంలో తేడా ఉండటం వలన ఇబ్బందులు రావచ్చు. బి.పి ఉన్న వారు జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.
కర్కాటక రాశి: మీ కల్పనా శక్తి వలన కొన్ని అవరోధాలను అధిగమిస్తారు. ఒక నూతన యోగం సంభవించనున్నది. ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వారం మధ్యలో ఒక వింత లేఖ చేతికి అందగలదు. హనుమాన్ చాలీసా చదవండి.

సింహ రాశి: ఆవేశాలకు గురి కాగలరు. కొంత భావుకత్వం వలన సమాలోచనకు దూరం కాగలరు. మౌనం పాటించండి. స్త్రీలతో కార్యాలయంలో విభేదాలు ఏర్పడగలవు. వారాంతంలో అనుకోని చోటు నుండి డబ్బు అందగలదు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కన్య రాశి: అనుకున్న పనులు పూర్తి కాగలవు. పై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. కార్యాలయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆదాయం బాగుంటుంది. వారాంతంలో ఒక కొత్త కార్యక్రమం చేపడతారు. మీ మాటల గారడీ కొందరిని ఆకట్టుకుంటుంది. మహాసౌరం చదవండి.
తుల రాశి: ప్రారంభించిన పనులను ఈ వారం పూర్తి చేసే గట్టి ప్రయత్నం చేయండి. రాబోయే రోజులలో గ్రహ సంచారం మీ కార్యక్రమాల వేగాన్ని తగ్గించవచ్చు. అయినా మీ ఉత్సాహం మీ వెంటే ఉండగలదు. వాహనం మరమ్మత్తుకు రాగలదు. లలితా సహస్రనామం చదవండి.
వృశ్చిక రాశి: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీ ఈ వారం జరుగవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు బాగున్నాయి. వ్యవసాయం చేస్తున్న వారికి ప్రయోగాల వలన ఉపయోగం ఉండగలదు. స్త్రీలకు అధిక లాభాలున్నాయి. నరాల బలహీనత కల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
ధను రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీల వలన లాభాలు ఉండవచ్చును. విదేశీ వ్యవహారాలు రాణిస్తాయి. సకాలంలో డబ్బు అందగలదు. విద్యార్థులు మరో సారి ఆలోచించవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆదిత్య హృదయం చదవండి.
మకర రాశి: అన్ని విధాలా మంచి వారం. స్థాన చలనం ఉన్నది. మార్పులన్నీ మంచికే! నిర్ణయాలు సకాలంలో తీసుకోవలసిన అవసరం కూడా ఉంది. మీరు చాలా కాలంగా విస్మరిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ప్రక్కన పెట్టే అవకాశం ఈ వారం ఉన్నది. చేతి ఉంగరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
కుంభ రాశి: పనులు పూర్తి కాగలవు. తాత్విక చింతన నుండి కొంత సేపు బయట పడతారు. డబ్బులు ఖర్చు చేయాలని యోచిస్తారు. ఆ సమయం దాటిపోయిందని గ్రహిస్తారు. లోక వ్యవహారం నుండి దూరంగా ఉన్నందుకు బాధ పడతారు. మిత్రులతో మాట్లాడటం వలన ఉపయోగం ఉండగలదు. విష్ణు సహస్రనామం చదవండి.
మీన రాశి: బంధువులు కొద్ది సేపు శతృవులుగా కనిపిస్తారు. అపార్థం చేసుకోకండి. నిజం చెప్పే వారు కఠినంగా కనిపిస్తారు. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కలుషిత నీటి వలన ఇబ్బందులు ఉండవచ్చు. వారాంతంలో కొంత శ్రమ అధికం కాగలదు. ఓర్పు అవసరం. ఒక ఇబ్బంది లోంచి బయట పడతారు. దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: న సఖ్యమజరం లోకే హృది తిష్ఠతి కస్యచిత్
కాలో హ్యేనం విహరతి క్రోధో వైనం హరత్యుత
(మహాభారతం సంభవ పర్వం)
లోకంలో ఎవరి హృదయంలోనూ మైత్రి అనునది శాశ్వతంగా ఉండదు. సమయం మిత్రులను దూరం చేస్తుంది. లేదా క్రోధం మనుష్యులను మైత్రి నుండి దూరం చేస్తుంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version is available at www.sripati.com
‘నిన్న లేని అందమేదో’ (20)-వేదాంతం శ్రీపతి శర్మ
24 జూలై 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

రాత్రి పెద్దగా నిద్రపోలేదని వాసంతికి తెలుసు. ఏదో అలవోకగా ఉదయం పనులన్నీ చేసుకుని పోతోంది. జారుతున్న తీగెను గట్టిగా కట్టి బాల్టీలోని బట్టలు తెచ్చి ఆరేస్తోంది. ఎవరో లోపలి నుంచి అంటున్నారు,’ ఈ పిల్లవి అన్నీ వెర్రి చేష్టలే! ఒక వైపు వాన వస్తుంటే ఈ బట్టలు ఆరేయటం ఏమిటీ?’
ఈలోకం లోకి వచ్చింది వాసంతి. నవ్వొచ్చింది. నిజమే! తడుస్తున్నా తనకి తెలియలేదు. గబ గబా అన్నీ తీసేసి లోపలికి వెళ్లిపోయింది. కిటికీ దగ్గర చూస్తూ నిలబడింది. తోటలోని మట్టిలోకి నీరు జారుకుంటూ వస్తోంది. ఏవరో ఆహ్వానిస్తున్నట్లు ఆ ధార మీద ఒక్కొక్క చినుకు అలా పడి ఆడుకుంటోంది…పెళ్లి వారు లోపలికి వస్తుంటే అక్కడ నిలబడి ఎవరో చక్కగా పన్నీరు చల్లినట్లు ఉంది.
‘ కాఫీ కూడా తాగవా?’
వెనక్కి తిరిగింది. కిటికీలోనే పెట్టి ఉంది కాఫీ! గబుక్కున గ్లాసు తీసుకుంది.
‘ దయ్యాన్ని చూసినట్లు చూడకు వాసంతీ! నిద్రలో చూసినట్లున్నావు. వాటిని అక్కడే వదిలేయి! ‘, పిన్ని తలుపు దగ్గర నిలబడి అంటోంది…
‘ నీ దుంప తెగ! నీ పిన్నినే! ఏమయింది నీకు?’
గొంతు సద్దుకుంది. ఇంక మాట్లాడకపోతే ఇంకో అరగంటలో డాక్టరు ఇంటి ముందు ఉండగలడు!
‘ ఏమీ లేదు పిన్నీ…వాన…’
‘ ఓహో! వాన కదూ? కరెక్టే! ఈ మధ్య మనం వాన చూడటం మరచిపోయాం. కొన్నాళ్లకి ఇదో పెద్ద వింత అయిపోతుంది. నిజమే! ఏమిటీ నీ సమస్య? స్నానం చేసి శృతి చేసుకోవా?’
‘ ఓ! చేస్తాను పిన్నీ! కొద్దిగా నీరసంగా…’
‘ కానీ…ఆడ పిల్లలకు అంత బధ్ధకం పనికి రాదు!’
పిన్ని వెళ్లిపోయింది. నిజమే. ఈ పిన్ని అసలు మాట వెతుక్కోదు. ఏ రోజూ సంగీతం అభ్యాసం మాన నీయదు. మంచిదే! కిటికీ బయట సంగీతం వింతగా ఉంది. వాన కూడా ఒక విచిత్రమైన ఒరవడి అలవరచుకున్నట్లు ఉంది. అక్కడో చినుకు తుళ్లు మంటోంది, ఇక్కడో చినుకు ఇదిగో అంటోంది. దీపావళి రాత్రి అన్ని టపాకాయలు అయిపోయాక అక్కడక్కడ ఒకటో రెండో పేలుతూ ఉంటాయి…అలా ఉంది వరస!
ఇంక పడదు ఈ వాన అనుకుని మరల కిటికీలోంచి చూసింది. ఇంతలో గబ గబా స్కూలు పిల్లలు ఒక్క సారి బయటకు వచ్చినట్లు జోరుగా అందుకుంది. భార్యా భర్తలిద్దరూ మాటకు మాటా అనుకుంటున్నట్లు, కొత్త దంపతుల సరాగంలా, వంటింటిలోంచి వినిపిస్తున్న ఏదో కొత్త ఆగంలా, బాలమురళీ గారి సరిక్రొత్త రాగంలా, టి.వీ సీరియల్ లోని తరువాయి భాగంలా…చినుకుల చప్పుడు పోటీ పడుతోంది…
~~~***~~~
వీణను జాగ్రత్తగా పట్టుకుంది వాసంతి. వాకిట్లో వాన వెలిసింది. ఏదో పసివాడి ఏడుపు ఆగిపోయి నిద్రలోకి జారిన నిశ్శబ్దం…తోటలోని నీరు నేను కావాలనే జారిపోతాను అంటున్నట్లుంది. వీణను పట్టుకుని కూడా వాసంతి వినపడనివి వింటోంది. ఏమిటో ఆ ఆలోచన. అలా ఆ పిల్లని ఎవరైనా గుమ్మం దగ్గర నుంచి చూస్తే ఒక బొమ్మ గీస్తున్న కళాకారుడికి మాడల్ లా కూర్చుందా? అనిపిస్తుంది. ఆ ప్రశాంతతలోకి ఈ నాదం ఎలా పంపాలి? ఎందుకు పంపాలీ? నీరు ఎక్కడికో జారిపోతున్న చప్పుడు ఎందుకో తనని కదిలిస్తోంది. రోజూ శృతి చేసుకోవాలి…ఈ వీణను పలికించాలి…అసలు ఈ తీగెలు ఇలా ఎందుకు? తీగెలను ఇలా అటూ ఇటూ లాగి, బంధించి, అక్కడ తాకీ, ఇక్కడ కదిలించి సరిగమలనీ, సంగీతమనీ, సామవెదమని ఒక పాట పాడేస్తాడు మనిషి! ఈ మనిషి అసలు ఎంత దుర్మార్గుడు?…ఏమిటీ ఈ ఆలోచన? వీణ మీద ఉన్న తీగెలను ప్రేమతో నిమిరింది. అలవాటుగా వేలి కొసలతో కదిలించింది. అవును మేమే అన్నట్లు ఏదో వినిపించింది. మేమె! అంటున్నాయి ఆ తీగెలు. వీణ మీద నుంచి తల పకి ఎత్తింది వాసంతి. ఎదురుగా కిటికీ! ఆ తరువాత తోట, జారుతున్న నీరు, దూరంగా మరేదో… మరో కిటికీ…ఎక్కడో ఒక మెరుపు, ఒక ఉరుము…
ఎంతో కాలంగా వీణ వాయిస్తోంది వాసంతి. ఎందుకో మొదటి సారి ఆ తీగెలలోంచి మరేదో నాదం, తెంచుకు పోవాలనే నినాదం వినిపిస్తోంది. మరల వీణ వైపు చూసింది. ఇందులో వినిపించని పాటలు దాక్కున్నాయా? ఆలోచించింది.
‘ శృతి…శృతి చేయి వాసంతీ, ఏమిటి ఆ పరధ్యానం?’
పిన్ని చెబుతోంది.
కట్టు బాటులే విద్యలకు ఆయువు పట్టులా? సరిగ్గా బంధింపబడటమే నిజమైన శృతా?
ఏమిటి ఈ ఆలోచన? ఈ లోకం లోకి వచ్చింది. మరల తీగెలను మీటింది.
కొద్దిగా ఈ సారి బాధగా ఉంది. ఎవరైనా శృతి చేసి ఇయ్యమంటే క్షణంలో శృతి చేసి ఇచ్చే వాసంతి చిత్రంగా తీగెలను కదిలిస్తోంది. ఇవన్నీ భిన్నంగా మ్రోగాలనే అనిపిస్తోంది ఆ పిల్లకి…
శృతి తప్పాలని ఉన్నది. పాలు విరగాలని అనిపిస్తోంది. పొంగాలని ఆశ లేదు. ఏమో! విరిగిన పాలే కదా కళాఖండాలను తయారు చేసేది? ఆపి నవ్వుకుంది. కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది. నీరు జారిపోయినట్లుంది. మోత ఇక లేదు. మట్టి సువాసనలు వెదజల్లుతోంది. పెళ్లి మేళాలు ఆయిపోయినట్లున్నాయి.
పన్నీరు కంటే గంధమే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది.
‘ నీరు లేన్ని గంధం ఎలా ఉంటుంది? నీరు జారిపోయినా తనలో దాచుకుని నేను ఇదిగో అంటోంది ఈ నేలగంధం! చూశావా పిన్నీ?’
పిన్ని తలుపు దగ్గర నిలబడింది. నడుము మీద చేయి పెట్టింది.
‘ ఏమయింది నీకు? పిచ్చి పట్టిందా?’
జవాబు చెప్పలేదు వాసంతి. చిరునవ్వు నవ్వింది. కళ్లు పెద్దవి చేసింది. పిన్నికి పిచ్చి పిచ్చిగా ఉంది.
అవునన్నట్లు తల ఆడించింది వాసంతి…
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
‘ ఆగంతుక్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు
21 జూలై 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-చిత్రం

సత్యజిత్ రే 1991లో తీసిన చిత్రమైన చిత్రం ఇది. ఒక డ్రాఇంగు రూం లోనే చాలా మటుకు సినిమా అయిపోతుంది. రెండు గంటలు ఈ చిత్రం ప్రతి సంవాదానికీ, హావ భావాలకీ చూసే వాళ్లని ఆలోచింపచేస్తూ సాగిపోతుంది.
ఆగంతకుని పాత్రలో ఉత్పల్ దత్త్ ఆకట్టుకునే నేర్పుతో నటిస్తాడు. ఒక ఇంటికి ఆ ఇంటిలోని స్త్రీకి మేనమామను అని చెబుతూ ప్రవేశిస్తాడు. అతని మీద సందేహం ఎలా తీర్చుకోవాలి, ఏమి చేయాలి అనే సందిగ్ధంతో ఆ జంట రక రకాలుగా స్పందిస్తుంది. ఒక మిత్రుడు, ఒక లాయరు కూడా ముఖ్య పాత్రలు నిర్వహిస్తారు. వీళ్ల మధ్య మాటలు రకరకాల అంశాలను స్పృశిస్తాయి. చివరకు ఏ సంగతీ తేల్చమని అడిగినప్పుడు మర్నాడు ఆయన ఇక కనిపించడు. ఒక పల్లెటూరులో దొరుకుతాడు. నిజంగా మామ అని తేల్చి ఆ అమ్మాయికి ఆస్తి తాలూకు కాగితాలు అందిస్తాడు…
మనిషి యొక్క స్పందన,చదువు పేరుతో ఎన్ని విధాలుగా మనిషి ఏవేవో అన్వయించుకుని ఇంకేదో ఎలా మాట్లాడుతున్నాడో, మౌలికమైనవి మరచిపోతున్నాడో…ఈ అంశాలతో పాటు మధ్యలో విఙ్ఞానం, ఆచార వ్యవహారం, మతం, మూఢ నమ్మకాలు…ఇలాంటివి ఎన్నో మాటలలో సాగిపోతాయి. మామూలుగా ఆలోచిస్తే సత్యజిత్ రే సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అందులోనే మరల కేవలం ఒక సమకాలీన పరిస్థితులలో ఎవరైనా అలా ఎందుకు ఉంటారో చెబుతున్నాడా అని కూడా అనిపిస్తుంది. కాకపోతే ఉత్పల్ దత్త్ ఒక ఏంథ్రొపోలోజిస్ట్! ఆయన పాత్ర మనిషి ఆవిర్భావం, వికాసం, రక రకాల తెగల ఏర్పాటు- ఈ విషయాలకు సంబంధించిన వ్యవహారం. చివరకు ఒక పల్లెటూర్లో ఆయనకు అనుబంధం ఉన్న వారితో ఉండాలని ఆయన ముందరే నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఈయన నిజంగా ఆగంతకుడా?
కాదు. కానీ ఆయన పరిస్థితులు అటువంటివి. ఈ అమ్మాయికి ఊహ తెలియనప్పుడే అమెరికా వెళ్లిపోయి స్థిరపడిపోయిన మేన మామ, మధ్యలో ఎటువంటి సంపర్కం లేని వాడు ఉన్న పళంగా ఇదిగో వస్తున్నాను అని జాబు వ్రాయటం వలన ఆగంతకుడా? అనే ప్రశ్న సినిమాకు మూల స్తంభం అవుతుంది. బంధువు కావచ్చు కానీ బంధుత్వం కాలక్రమంలో మాయమైనందుకు చివరకు గట్టిగానే ప్రశ్నింపబడతాడు. ‘మనిషి ‘ అనే మాటకు సత్యజిత్ రే ఒక గట్టి సవాలు ఈ చిత్రంలో విసిరారు…
అన్నీ ప్రక్కన పెట్టి ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తీ ఒక ఆగంతకుడే అనే తత్వం కూడా కనిపించకపోదు.
సినిమాలో గమనించవలసినది ఏమిటంటే దాదాపు ఒక స్టేజ్ నాటకంలా ఉన్న ఇతివృత్తం తెర మీద నిరాటంకంగా సాగిపోతుంది. దర్శకత్వంలో ఉన్న మహిమ అది. పలు చోట్ల కట్ అయినట్లు కూడా తెలియదు.
~~~***~~~
రియలిసం కోసం సినిమాలోని అన్ని అంగాలూ పని చేయటం ఎలా అనేది ఒక కోణంలోంచి చూస్తే అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి. ఇందులో నరేటివ్ కి పెద్ద పీట వేసి స్టైల్ ను కొద్దిగా ప్రక్కకు లాగటం గమనించవచ్చు! ప్రేక్షకుడికి చూపిస్తున్న సమయంలోకి నిరభ్యంతరంగా అడుగు పెట్టమనే ఆహ్వానం జరుగుతున్న కథలోని ఘట్టాల పంక్తి లో దాగి ఉండటం విశేషం. చాలా మంది దర్శకులకు ఇది చేతకాదనే చెప్పాలి. సహజత్వం ఒక సూత్రంలోకి చేరిపోతుంది. ఇక్కడే కూర్పు అనేది ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కూర్పు కథలోని సరళిని మరింత బాగా చేయటానికి ఒకప్పుడు ఒక మాస్టర్ షాట్ తీసి అందులోని కొన్ని భాగాలను మరల టేక్ చేయటం జరిగేది. ఈ చిత్రంలో ఆ ప్రక్రియ చేసి ఉండవచ్చు అని నాకెందుకో అనిపించింది. మేచ్ కట్స్, ఐ లైన్ కట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి…
ఏది ఎలా ఉన్నప్పటికీ ఫేమిలీ డ్రామాలు తీసే దర్శకులు ఒక సారి ఈ చిత్రాన్నీ, ఆ రకమైన టేకింగునీ సమీక్షిస్తే మంచి లాభం పొందగలరని నా అభిప్రాయం!
~~~***~~~
ఈ చిత్రం 1991లో వనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, 1992 లో రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం) తీసుకుంది. ఒక ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా తీసుకుంది.
~~~***~~
‘ కొడుకు ‘
19 జూలై 2009 వ్యాఖ్యానించండి
మామూలుగా ఈ పదానికి అర్థం మనకి తెలిసిందే!…ఆగండి. ఏ అర్థం?
అదీ సమస్య! తిరిగి చూస్తే కాలం అలా మారింది…చాలా కాలం క్రితం రీడర్స్ డైజెస్ట్ వాళ్లు ఒక జోకు చెప్పారు.
ఒక తండ్రి పేపరు చదువుకుంటున్నాడు. ఆయన పిల్లవాడు పక్కనే కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాడు. త్రీ ఇంటు ఫోర్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ట్వెల్వ్, త్రీ ఇంటు ఫైవ్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ఫిఫ్టీన్…ఇలా. ఈయనకు చిత్రంగా అనిపించి ఒరే, ఏంటిరా అది, ఎవరు నేర్పారురా అన్నాడుట. ఆ కుర్రాడు మా మేడం చెప్పింది అన్నాడుట. ఇలా కుదరదని ఆయన నేరుగా స్కూలుకే వెళ్లాడు. ప్రిన్సిపాల్ గారు మేడం ని పిలిపించారు. ఆవిడ అంతా విని కాదండీ, నేను చెప్పింది త్రీ ఇంటు ఫోర్ ద సం ఆఫ్ విచ్ ఈస్ ట్వెల్వ్…ఇలా అని!
కొడుకు మరొకటి విన్నందుకు నాలుక కరుచుకున్నాడు ఆ తండ్రి!
~~~***~~~
ద రేపిస్ట్!
19 జూలై 2009 అభిప్రాయములు
ఒక నర్సింగ్ హోం లో కొద్ది సేపు ఆ మఘ్య నిలబడి ఉన్నాను. నాకు కుడి పక్క ఒక నోటీస్ తగిలించి ఉంది. ఏమిటా అని చదివాను…
‘the rapist will visit the hospital
every thursday between 06.00 and 08.00 hours ‘
చుట్టు ప్రక్కల అటూ ఇటూ చూశాను. ఇదేమిటి? ఎవరు అనుమతిస్తారు వీడిని? అసలు ఎవడు వీడు? సుప్రీం కోర్టు వారు కొత్తగా కొందరిని అనుమతించినట్లు ఇలా ఈ ‘వృత్తిని ‘ కూడా చట్టబధ్ధం చేశారా? ఆశ్చర్యం వేసింది.
ఇది తప్పు అయి ఉంటుంది అనుకుని ఇంకా జాగ్రత్తగా చూశాను.
ఆ నోటీసు ఎవరో రెండు భాగాలుగా చింపి అతికించారు!
(చించేశాడన్నమాట)
The Physio…
the rapist will visit the hospital
every thursday between 06.00 and 08.00 hours ‘
అయితే ‘ద ‘ కీ ‘థెరేపిస్ట్ ‘ పదానికీ కూడా చిన్న గాప్ ఇవ్వటంతో బలేగా మారింది!
ఇంతలో నా వెనుక ఒక ముసలాయన వీల్ చెయిర్ లో వచ్చాడు.
‘ అల్లా చూడక్కరలేదు ‘, అన్నాడు ( గోదావరి వారు అలా..ని అల్లా అంటారు లెండి, అల్లా అన్నమాటండీ! )
ఆయన చెప్పాడు, ‘ వాళ్లు వ్రాసింది కరెక్టే! ఈ తెరేపీ చేయించుకునే వాడికి తెలుస్తుంది ఆ బాధ. శరీరం యావత్తూ అల్లా రేప్ అయిపోతుంది. పైగా ఈ ఎరేపిస్టు ఫిసియో…ద రేపిస్ట్! ఇతను రేపిస్టు ముందు, ఫిసియో తరువాతన్నూ! ‘
నిజమే అనుకున్నాను. స్టివెన్ పూల్ అనే ఆయన భాష యొక్క ‘అనర్థపు ‘ ప్రయోగం మీద ‘ అన్స్పీక్ ‘ అనే పుస్తకం వ్రాశాడు. చాలా మంచి పుస్తకం. ఆయన భాష యొక్క ప్రభావం ఎన్ని విధాలుగా ఉంటుందో సూక్ష్మంగా వివరించాడు. చివరకు తీవ్రవాదం మీద కూడా ఎలా ఉంటుందో చెప్పాడు.
‘స్వ ‘ తంత్రం లో అన్నీ ‘రేపు ‘ లే! ఏమిటంటే భాష ఎవరికి కావాలీ, భావం వ్యక్త పరచటం చాలు అంటూ ముందుకు వెళ్లిపోతారు.
మన రిపబ్లిక్ లో పబ్లిక్ ‘బూతులు ‘ జన సామాన్య భాష అయిపోయాక ఈ తరంలో ఉన్న కుర్రాళ్ల భాష గురించి ఏమి మాట్లాడుతాం?
ఆ మధ్య ఒక ఎడిటర్ గారు ‘ సార్, మీరు ఏదైనా నీతి చెప్పాలనుకున్నా ఒక చిన్న సైజు బూతులో సద్దేయండి సరిపోతుంది ‘ అని చిన్నగా చెప్పాడు.
మాతృభాష ఘోషిస్తోంది సోదరా!
ఈ రోజు ఈ ‘ రేపు ‘ గురించి కొద్దిగా ఆలోచిద్దాం…
~~~***~~~
19-25 జులై 09 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ
18 జూలై 2009 అభిప్రాయములు
in శ్రీ-ఫలములు

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి: రవి బుధ కేతువులు కర్కాటకం, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం, కుజ శుక్రులు వృషభం, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక, సింహ రాశులు సంచరిస్తారు.
22.07.2009 బుధవారం ఆశాఢ బహుళ అమావాస్య రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణం ఉన్నది. ఇది ఉదయం 5.39 ఘడియలకు ప్రారంభమయి 7.20 కి విడుదల అవుతుంది. మధ్య కాలం 6.19 అని గమనించాలి. పునర్వసు, పుష్యమి నక్షత్రాల వారు ప్రత్యేకమైన శాంతులు, కర్కాటక రాశి వారు సామాన్య శాంతులు జరిపించుకోవటం మంచిదని సూచించుట అయినది. మేష, కర్కాటక, ధను, సింహ రాశుల వారు గ్రహణం అనంతరం శివాలయంలో అభిషేకం జరిపించుకొనుట మంచిది. స్త్రీలు, పైన చెప్పిన రాశుల వారు ఈ గ్రహణం చూడటం మంచిది కాదు.
ఈ సూర్య గ్రహణం విషయంలో చాలా అపోహలు వినవస్తున్నాయి. ఒక మాసంలో మూడు గ్రహణాలని, ఇలా ద్వాపర యుగాంతం సమయంలో సంభవించెనని, ఇప్పుడు కూడా యుగాంతం దగ్గరలోనే ఉన్నదని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు. మాసం అనగా రెండు పక్షాలు-ఒక పౌర్ణమి, ఒక అమావాస్య అంతమటుకే! గ్రహణం ఈ రెండు తిథులకే కాబట్టి మన మాసంలో మూడు గ్రహణాలు సంభవించటం హాస్యాస్పదం, అవివేకం. ద్వాపర యుగాంతం ముందు ఇటువంటి విషయాల గురించి ప్రస్తావన లేదు. ఆ పరిస్థితులు, ఆ గ్రహ స్థితులు వేరు. ఏ రకమైన ఆందోళన ఇందులో లేదు. మిత్రులు గమనించవలసినదిగా మనవి.
ఉపాసనాపరులు ఈ సమయంలో గాయ్త్రి జపించటం మామూలు. ఈ గ్రహణం దక్షిణాయనం ప్రారంభంలోనే (17 నుంచి దక్షిణాయనం ప్రారంభమైనది) జరగటం ఒక విధంగా మంచి సందేశం. ఈ గ్రహణం తరువాత వాతావరణానికి పట్టిన అసలు గ్రహణం తొలగిపోగలదు. మేఘాలు వర్షించగలవు.
కాకపోతే గ్రహాలను బట్టి కొన్ని కాల లక్షణాలను చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని అనుసరించి కొన్ని విషయాలను పేర్కొనవచ్చును. వాయువ్య దేశాలకు, గల్ఫ్ దేశాలకు, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చును. ఈ ప్రాంతాలలో భూమి కంపించవచ్చును. విచ్చలవిడిగా శృంగారం కోరుకునే వారికి వ్యాధులు, వారి వలన మరి కొన్ని వింత వ్యాధులు ఉండగలవు.
ప్రజలు మహాసౌరం, భూమిసూక్తం చదువుకుంటే ఎటువంటి ఆపద ఉండబోదని మనవి.
మేష రాశి: ఇంటి సమస్యలు పెరిగి పూర్తిగా సమసిపోగలవు. నిదానం, ఓర్పు అవసరం. ఒక్క రోజులో ప్రపంచం మారదు. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. తొందరపాటు ఈ వారం తగదు. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: కొత్త పనులు చేపడతారు. ఉత్సాహం పెరుగుతుంది. అవివాహితులకు మంచి వారం. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. వారాంతంలో విశ్రాంతి అవసరం. శ్రీసూక్తం చదవండి.
మిథున రాశి: నరాల సమస్యలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. దంతాల విషయంలో వైద్యుని సంప్రదించవచ్చు. ఆదిత్య హృదయం చదవండి.
కర్కాటక రాశి: గ్రహణం సంగతి ప్రక్కన పెడితే ఈ వారం మంచి ఫలితాలుంటాయి. ఉపాసనా మార్గంలో ఉన్న వారు కొత్త విషయాలను తెలుసుకోగలరు. ఒక ఆహ్వానం అందుకుంటారు. పగలు రేయి అని కాకుండా శ్రమించే వారికి చక్కని ఫలితాలున్నాయి. లఘున్యాసం చేయండి.
సింహ రాశి: వారం కొన్ని సమస్యలతో ప్రారంభమైనప్పటికీ వారాంతంలో మంచి వార్తలు వింటారు. పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేయగలరు. ఉద్యోగంలో మార్పు ఉండగలదు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కన్య రాశి: శత్రువులు మిత్రులు కాగలరు. నలుగురిలో మీ ప్రతిభ ప్రాచుర్యం పొందుతుంది. కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. దూరపు బంధువులు దగ్గరవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంటుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
తుల రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. స్త్రీలతో విభేదాలు ఉండగలవు. సైనస్ ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు లాభిస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన సందేశాలను మీరే పాటించలేని పరిస్థితి రాగలదు. సహచరులు సహకరిస్తారు. లలితా సహస్రనామం చదవండి.
వృశ్చిక రాశి: పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం కాని వారికి బంధు వర్గంలోనే వివాహ సంబంధాలు దొరకగలవు. విద్యార్థులకు మంచి వారం. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభాలుండగలవు. బుధవారం ఏ నిర్ణయం తీసుకోకండి. శనివారం మీ ఇష్టదైవాన్ని సందర్శించుకోండి.
ధను రాశి: ఈ మధ్య మీరు ఖర్చుల వైపు ఎక్కువగా మనసు మళ్లిస్తున్నారు. కొంత ఆపుకోవాలి. అయినప్పటికీ ఒక ఖర్చు చేస్తారు. ఒంటి కణత నెప్పి ఉన్న వారు అధికంగా శ్రమించకూడదు. విదేశాలలో ఉన్న వారికి పరిస్థితులు కొద్దిగా మారగలవు. చింతించకండి. మహాసౌరం పఠించండి.
మకర రాశి: ఓర్పుతో బాధ్యతలు నిర్వర్తించినా కొందరు ఆ మాటా ఈ మాటా అనేస్తారు. వివాదాలలోకి దిగకండి. అన్నదానం చేయండి. వారాంతంలో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కార్యాలయంలో కూడా మార్పులు ఉండగలవు. విష్ణు సహస్రనామం చదవండి.
కుంభ రాశి: వ్యసనాలకు దూరంగా ఉండవలసిన వారం. (పై వారం అక్కరలేదని కాదు!) జీవిత భాగస్వామి దగ్గర డబ్బు దాచటం ఉత్తమం. వారాంతంలో ఒక దీర్ఘ కాలీనమైన పని పూర్తి కాగలదు. దైవానుగ్రహం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. స్వాధ్యాయం చేయండి.
మీన రాశి: గతంలో చేసిన పొరపాటును దిద్దుకుంటారు. ఆవేశం మంచిది కాదని తెలుసుకుంటారు. మీకు కొన్ని చక్కని అవకాశాలు రాబోతున్నాయి. కళాకారులకు, రచయితలకు మంచి వారం. పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందగలరు. హనుమాన్ చాలీసా చదవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: చత్వారి కర్మాణ్యభయంకరాణి
భయం ప్రయఛ్చన్నత్యయథాకృతాని
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయఙ్ఞ:
(మహాభారతం సంభవపర్వం)
అగ్నిహోత్రం, మౌనం, అధ్యయనం, యఙ్ఞం-ఈ ఆరు కర్మలు మానవులను భయం నుండి విముక్తులను చేస్తాయి. కానీ ఇవి సరిగ్గా చేయకపోయినా, అభిమానపూర్వకంగా అనుష్ఠించినా విరుధ్ధమైన ఫలితాలనివ్వగలవు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
The English version can be seen at www.sripati.com
‘నిన్న లేని అందమేదో’ (18)-వేదాంతం శ్రీపతి శర్మ
17 జూలై 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

అంతా నిశ్శబ్దంగా ఉంది. నదిలోని నీటి మీద మెల్లగా అడుగులు వేస్తున్నా ఎందుకో ఏమీ కావటం లేదు. కింద ఉన్నది నీళ్లా లేక ఏవైనా రాళ్లు ఉన్నాయా? ఏమో…ఎక్కడో ఒక ముసలి వారెవరో ఏదో విన్న పాట లాగా ఉంది, చక్కగా పాడేస్తున్నాడు. ఎవరో తెలియటంలేదు.ఇంతకీ ఆవలి ఒడ్డుకు ఇలానేనా వెళ్లటం? నీటి మీద నడకేమిటి? నీళ్లలో ఏవో ప్రతిబింబాలు…ముందు తన మొహమే కనిపిస్తోంది, తరువాత మబ్బులు కైలాయి. అవి కదలగానే అటూ ఇటూ తల తిప్పింది వాసంతి. టక్కున మెలకువ వచ్చింది. లేచి కూర్చుంది. ఏమిటీ కల? కిటికీ బయటకు చూసింది. చల్లని గాలి ఎటు వైపో పయనిస్తోంది. దూరంగా ఆ కిటికీ కూడా తెరిచే ఉంది. ఎందుకో తల వంచుకుంది. ఈ మబ్బుల్లో ఏముంది? అవునూ, అసలు ఈ మధ్య ఈ ఆలోచనలేమిటి? మబ్బులు, నీళ్లు, అవునూ, ఈ కలలేమిటి? చిన్నగా నవ్వుకుంది. తనలో ఏదో మార్పు వస్తోంది. దుప్పటీ దగ్గరకు లాక్కుంది. అసలు గతంలో ఇంత ఆలోచన చేసేదా? ఏమో! మోకాళ్ల మీద తల ఆంచి మరీ ఆలోచిస్తోంది. కిటికీ రెక్క చిన్నగా కదులుతోంది. తల ఆంచే కను మూల నుంచి అటు చూసింది…మబ్బులు దూరంగా చంద్రుడిని దాటి వాటి దారిన అవి వెళ్లిపోతున్నాయి. ఈ మబ్బులకు పని లేదు! మధ్యలో వస్తాయి, మధ్యలోనే వెళ్లిపోతాయి. ఎందుకో మధ్యలో కొద్ది సేపు ఆ జాబిలిని కప్పేసి వింత ఆట ఒకటి ఆడుకుంటాయి. ఈ చంద్రుడికి ఎన్నడూ నిలకడ లేదు. నిలకడ లేని మబ్బులను సైతం కవ్విస్తాడు. అమాయకుని లాగా కనిపిస్తాడు…ఇదేంటి? లేచి కిటికీ రెక్క దగ్గరకు వచ్చింది…ఏవో పాటలు పాడుకునే తను ఇలా వింత ఆలోచనలతో కవిత్వం చేసేస్తోంది? నో! ఏదో ఉంది…
తనెవరు? అతనెవరు? ఎవరేమిటి? తను వాసంతి, అతను శరత్…దట్స్ ఆల్!
కాదు. కాకూడదు. ఎందుకో ఊపిరి గట్టిగా పీలుస్తోంది. మరల మబ్బుల వైపు చూసింది. ఇలా ఎందుకు కాకూడదు? హృదయమే పెళ్లికూతురు, హృదయమే పెండ్లి కొడుకు, ఆ మబ్బుల మీదకి పరుగులు తీయాలి, అక్కడే ఎక్కడో బొమ్మల పెళ్లిలాగా పెళ్లి జరిగిపోవాలి.
మరల దిండు దగ్గరకు వచ్చింది వాసంతి. తెలుగు సినిమాలు ఇంతగా చూడకూడదు!
నిజమే! జీవితం కటిక నేల. ఆకాశం మబ్బుల లాంటి వాటికి పుట్టినిల్లు. నిలబడేది ఏది?
పైన ఫాను తిరుగుతోంది. శరత్ మాటలను బట్టి అతను దుర్మార్గుడు కాడు. ఎవరు చెప్పారు? నిజమే!
కళ్లు మూసుకుంది. మరల మబ్బులు తిరుగుతున్నాయి. అతను కళా పిపాసి. వింత ప్రేమికుడు. పిచ్చి వాడు కాడు…
భావుకుడు కావచ్చు. నాన్న ఒక సారి అన్నట్లు భావుకులు తొందరగా బావుకోలేరు!
ఊ…అసలు తనకి ఏమి కావాలి? తెలియదు! నిద్ర పట్టటం లేదు. మబ్బులే ఎందుకు పీడిస్తున్నాయి?
శరత్ గీసిన మబ్బులా? కాదు. అతను ఉన్న మబ్బులను ఫొటో తీశాడు. అతను ఏమీ గీయలేదు. అతనికే ఎందుకు దొరుకుతాయి ఇలాంటివి? ఏమో!
కళ్లు మూసుకుని అటూ ఇటూ ఒరిగింది. ఎవరో తట్టినట్లు మరల కళ్లు తెరిచింది. తనకు నిద్ర పట్టటం లేదని తెల్లారిపోవాలా? సరే! పడుకుందాం అనుకుంది.నిశ్శబ్దం అలానే ఉంది. మనసు ఊయల ఊగుతోంది. అయినా వెర్రి పిల్లకు నిద్ర రావటం లేదు! చిరు గాలి ఏదో ఈల పాట కూడా పాడేస్తోంది. అయినా రెప్ప వాలటం లేదు! ఊయల ఇక్కడ కాదు, ఆ మబ్బుల మీదకి వెళ్లి ఊగాలనున్నప్పుడు శరీరంలో కూడా ఏదో వద్దన్నా ఉత్సాహం, పాట ఇక్కడ కాదు, ఆ చంద్రునితో…అవునూ…శరత్ చంద్రునితో కలసి అక్కడే పాడాలి! ఎంత ఆశ! నవ్వుకుంది…అర్థమయ్యేవన్నీ మరోలా అనిపిస్తున్నాయి. కనిపించనివి కూడా కనిపించినట్లు కదులుతున్నాయి. ప్రపంచమంతా ఊగుతోంది. ఏదో అవుతోంది. మరేదో అయిపోతోంది!
…ఇదేనా ప్రేమ ఓ పిచ్చి వాసంతీ? ఎందుకో ఇంక కాసేపట్లో నిద్ర పట్టేయగలదు అనిపించింది. కలలోని ఆ నీటి మీద నడక సాగి ఆగిపోవచ్చేమోననిపించింది. ఒక తీరం అక్కడే దొరకగలదేమో అనిపించింది వాసంతికి!
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే)
‘తీవ్రవాదం ‘ పుస్తకం పై వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష
15 జూలై 2009 1 వ్యాఖ్య
in శ్రీ-విద్య
కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన ఈ పుస్తకాన్ని పాలపిట్ట బుక్స్ అను ప్రచురణ సంస్థ వారు ప్రచురించారు.2001 మార్చ్ నుంచి ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన 36 వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కె.పి. అశోక్ కుమార్ గారు తేదీల వారీగా ఈ వ్యాసాలను కూర్చినట్లు కనిపిస్తున్నది. రచయిత ఆయన ముందు మాటలో అశోక్ కుమార్ గారు విషయం ప్రకారం వర్గీకరించి సమకూర్చారని పేర్కొనటం జరిగినది…
ఈ ముందుమాటలో చివరగా ఆయన ప్రచురించిన…..లకు కృతఙ్ఞతలు అని వ్రాసి యున్నారు. కస్తూరి ప్రచురణలు అని పుస్తకం మీద ఉన్నది. ఒక వేళ పాలపిట్ట బుక్స్ వారు, కస్తూరివారు కలసి చేసారేమో అనిపించింది. ఇటువంటివి లేకుండా చూస్తే పుస్తకాలకు మరింత విలువ పెరుగుతుంది….
~~~***~~~
‘ తీవ్రవాదం ‘ అనే పుస్తకం ఒక్కో వ్యాసానికీ గల అనుబంధమైన సమకాలీనమైన స్థితిగతులతోనూ, వార్తలతోనూ కలిపి చదువ వలసి యుంటుంది. కొన్ని వ్యాసాలలో చక్కని విశ్లేషణ, సమయస్ఫూర్తి, సామాన్యంగా సామాన్య మానవులు అనుకునే విషయాలతో పాటు పలు చోట్ల లోతులలోకి రచయిత వెళ్లటం జరుగుతుంది. తీవ్రవాద సంస్థల పుట్టు పూర్వోత్తరాలు వగైరాలు కావలసిన సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఎక్కువ చోట్ల జరిగినది చెప్పారు. ప్రపంచ రాజకీయ వ్యవహార విశ్లేషణలో మరి కాస్త ప్రబలమైన దృక్పథం, సమాలోచన అవసరమైనదని అనిపించింది. ముఖ్యంగా 27.11.2003 నాటి వ్యాసం అందరూ అనుకునే నాయకుల రాజకీయాలే తీవ్రవాదానికి మూలం అని చెప్పినప్పుడు రచయిత మరి కాస్త కృషి చేయలేకపోయారా లేక కేవలం ఎవరైనా తొందర పెట్టారా అనిపిస్తుంది…
ఈ వ్యాసాలలో భాష చాలా సరళంగా, సజావుగా సాగినది. ఒక గట్టు మీద నిలబడి ఇద్దరు ముగ్గురకు త్వర త్వరగా అనుకున్నవన్నీ చెబుతున్నట్లు వ్యాసాలు సాగిపోతాయి. ఆ మాటకొస్తే ఒక రకమైన 100 మీటర్ల పరుగు తీయాలనే ఆదుర్దా మురళీకృష్ణ గారు దాదాపు అన్ని రచనలలోనూ కనబరుస్తారు. అది కొన్ని విషయాలకు సరిపోవటం కూడా జరుగుతుంది!
~~~***~~~
తీవ్రవాదం అనే అంశం గురించి వ్రాస్తున్నప్పుడు పర్స్పెక్టివ్ అనునంది ఎంతో ప్రాముఖ్యతను కనబరుస్తుంది. కారణం ఏమిటంటే నేపథ్యం కాదనలేని నిజం అయినప్పటికీ విశ్లేషణ అనేది సక్రియంగా ఉన్న ప్రక్రియలలోకి తొంగి చూడకుండా చేయతగనిది. దీనికి చరిత్రతో పాటు సమకాలీనమైన ఆర్థిక పరంపరలు-భౌగోళికమైనవి, స్థానికమైనవి అన్వయించి చెప్పవలసి యుంటుంది. వీటికి సాంఘికపరమైన, సాన్స్కృతికపరమైన విషయాలు సమానాంతరంగా సాగి వ్యావహారిక స్పందన వైపు విషయం సజావుగా సాగాలి. ఈ దృక్పథం రచయిత ఎందుకు చేపట్టలేదంటే ఇది వ్యాసాల సంకలనం కానీ తీవ్రవాదం అనే విషయం మీద సమగ్రమైన పుస్తకం లాగా ఆయన ఎంచుకోలేదు.
ముఖ్యంగా కొన్ని గీతలు గీసుకుని ఆ పరిధిలో విషయాన్ని పరిశీలించి ఉంటే మరి కాస్త ఆసక్తికరంగా ఉండేది. పాటుగా సోవియట్ రషియా విభజన తరువాత, అలాగే కోల్డ్ వార్ అంతమైన తరువాత బాల్టిక్ స్టేట్స్ వ్యవహారం, ఇస్లాం యొక్క మరో రూపం ప్రపంచలో ఒక ప్రక్కకు వ్యాపించటం, ఆయుధాల వ్యాపారం ఇలా కాల గమనంలోని మైలు రాళ్లను గట్టిగా నిలిపి ధారావాహికంగా సాగ వలసిన అవసరం తీవ్రవాదం అనే విషయానికి ఉంటుంది.
ఈ అంశానికి ఒక నాటకీయత ఉన్నది. చిటికెలో ఆకట్టుకునే విషయం ఇది. ఆ దిశగా పుస్తకాన్ని ప్లాన్ చేసి ఆంతరంగికమైన మానవీయ స్పందనలు, వాటి వెనుక గల కథలు, నిజాలు అనే అంశాల మీద బర్నార్డ్ మాలముడ్, యెవ్జెనీ బోగాట్ వంటి వారు వ్రాసినవి ఒక పర్యాయం అధ్యయనం చేసి చూస్తే బాగుంటుంది. ఒక పరంపరను ఇతివృత్తంగా ఎంచుకుంటే ఒక మూలస్తంభానికి ఆనుకుని పాఠకుడిని ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఫోకస్ చేయిస్తూ తీసుకుని పోవచ్చు…
That is what is ‘perspective’ all about.
ఏది ఎలా ఉన్నా తీవ్రవాదం గురించి తీవ్రంగా ఆలోచించాలనుకునే వారికీ, కొన్ని చరిత్రల గురించి తెలుసుకోవాలనుకునే వారికీ ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.
ఇటీవలి అభిప్రాయములు