‘ నిన్న లేని అందమేదో ‘ (16)-వేదాంతం శ్రీపతి శర్మ

గబ గబా కిటికీ దగ్గర కూర్చుని ఆ తెల్ల కాగితాన్ని తెరచి చూసింది. అవునూ, ఇంత ధైర్యంగా ఇలా ఎలా తెచ్చేసింది? ఏమిటో! ఈ పాటను తనకు తెలియకుండానే ఎలా పాడుకుంటూ వెళుతోందీ? ఇది నిజమేనా?
‘…ఎన్ని సార్లు పొడిచినా తెల్ల కాగితం వదలనంటున్నది…’
ఎవరిని వదలనంటోంది? శ్వాస బరువుగా సాగుతోంది. తను చేస్తున్నది తప్పు. ఇవి పిచ్చి వ్రాతలే కావచ్చు. కానీ ఈ కాగితం అతనిది. అతనికి తిరిగి ఇచ్చేయాలి. కుర్చీలో వెనక్కి వాలింది వాసంతి. ఒక పుస్తకంలో భద్రంగా దాచి పెట్టింది. ఒక్క సారి తల విదిలించుకుని వంటింటి వైపు నడిచింది. వెనక్కి తిరిగి పుస్తకాన్ని మరల తెరచి ఆ కాగితం ఉన్న పేజీ తిప్పింది. పేజీ పైన పేజీ నంబరు చూసింది…212 అయిదు తన అదృష్ట సంఖ్య! ఒక్క సారి గట్టిగా మూసేసింది. గబ గబా మరల ఆ టేబిలు వదలి నాలుగు అడుగులు వేసింది.  తెల్ల కాగితం వదలనంటోంది…
~~~***~~~

లేదు. ఇది అతను ఏదో చూసి మరేదో వ్రాసుకున్న గీతలు. తనని వదలననటం ఏమిటి? పిచ్చి కానీ! ఆలోచనలు అలానే పొడుస్తూ ఉన్నాయి. క్షణం తీగెలా సాగి కాలం సాగనన్నట్లున్నది. సాయంత్రం త్వరగా కాదు కదా! కావాలి. తనకి ఏదో కావాలి. ఆవలి గట్టున ఏదో ఉంది. ఈ కాగితం ఇచ్చేయాలి. సాయంత్రం కావాలి. మరల టేబిలు దగ్గరకు వెళ్లి ఆ పుస్తకాన్ని తడుముకుని చూసింది. ఏముంది ఈ కాగితంలో? ఏమీ లేదు. ఎలా తీసుకుని వెళ్లాలి? పుస్తకం తో పాటుగా అయితే బాగుంటుంది. దారిలో ఎగిరిపోకుండా ఉండాలంటే అంతే చేయాలి మరి. ఈ అమ్మాయిలు రాకుండా ముందే బయలు దేరి పోవాలి. అవునూ…కాగితం తిరిగి ఇవ్వటానికేనా ఇంత ఆతృత? అతను ఏమి చేస్తాడు తనని, కాగితాన్నీ చూసి? ఇలా లాక్కుని అలా వెళ్లిపోతాడు. వెళితే మటుకు? తనకేమిటి? లేదు. అలా చేయడు. మరి? పేరడుగుతాడు. ఎందుకు లాక్కెళ్లావని అడుగుతాడు. ఏమి చెబుతుంది? ఆలోచన బాగుంది అందుకని…
అందుకని? తీసేసుకోవాలనిపించింది!
తీసుకుని?
పాడుకోవాలనిపించింది!
తరువాత?
రెండు చేతులతో మొహాన్ని కప్పుకుంది.

నిజమే. కాగితమే పొడుస్తోంది…
~~~***~~~
మరో సారి సూర్యుడు ఆ కొలను చాటున ఒదిగాడు. ఉదయం నుంచి వేచి వున్న ఆ నీటి మీద స్వర్ణ రేఖలు దిద్దాడు. మండే మార్తాండుడు కూడా ఒక్కింత చన్నీటిని కవ్వించాడు. కొండల మాటున కొద్ది సేపు ఆ కొలను ఏమి చేస్తుందా అన్నట్లు దాగాడు!
వాసంతి జింకలా అటు దూకింది. అటూ ఇటూ చూస్తూ పరుగిడుతున్నట్లు అడుగులు వేసింది…అవునూ, అసలు ఆ మనిషి ఎందుకు రావాలి? అక్కడికే ఎందుకు రావాలి? ఆగింది. చుట్టూతా చూసింది. మెల్లగా గుట్ట మీద ఉన్న ఆ కిటికీ దగ్గర ఆగి జాగ్రత్తగా చూసింది. ఎవరూ లేరు. నిర్ధారించుకుని నీటితో పాటు ఉరకలు వేస్తూ వెళ్లిపోయింది.దారి సన్నగా ఉంది. ఎవరూ కనిపించరే? చాలా దూరం నడిచింది. లేదు. ఈ రోజు రాడేమో! ఇంక వెళ్లిపోదాం, చీకటి పడుతోంది…
‘ ఈ రోజు పాడరా? ‘
ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది. అతను నవ్వుతున్నాడు.
‘  నన్ను ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ‘
‘ ఆ పుస్తకం లోంచి నా కాగితం జారిపోతుందేమోనని అనిపించినప్పటినుంచీ…’
పుస్తకం తీసి వెంటనే కాగితం తీసి ‘ తీసుకోండి ‘, అంది.
అతను పుచ్చుకుని తనివి తీరా తన కవితను చూసుకున్నాడు. ఎందుకో నవ్వి జేబులో పెట్టుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. అటు తిరిగి నడక ప్రారంభించాడు.
మెల్లగా అనుసరించింది.
‘ ఆ కాగితం అంటే మీకు అంత ప్రాణమా?’, అడిగింది.
వెనక్కి తిరగకుండానే చెప్పాడు, ‘ ప్రాణమంటే?’
‘ అదేంటీ? ప్రాణం అంటే మరి ప్రాణం…’
‘ అది ఎక్కడుంటుంది? ‘
‘ …’
‘ తెలియదు కదూ? నాకు తెలుసు. ‘
‘ ఎక్కడుంటుంది? ‘
‘ నా మాటలు కాగితం గుండెకు హత్తుకున్నప్పుడు కాగితం లో ప్రాణం చేరుతుంది. దాని గుండె కొట్టుకుంటుంది. ఒక లయ ఎక్కడి నుంచో జలపాతంలా ఉరకలు వేస్తుంది. ఆ కాగితం కనపడనప్పుడు నాలో ఎక్కడో ప్రళయం కనిపిస్తుంది. అక్కడే నా ప్రాణమని నాకు తెలుసు…’
‘ మీ కవిత బాగుంది ‘
‘ కవితలో ఏది బాగుంది?’
ఓరి నాయనో! ఎలా?
‘ నిన్న లేని అందమేదో…’
‘ మరి నిలబడక నడుస్తున్నారెందుకు? ‘
‘ మీరు ఆగటం లేదు కదా?’
‘ మీ పేరు? ‘
‘ వాసంతి! ‘
‘ చదువుతారా?’
‘ ఏమిటి?’
‘ అందాన్ని! ‘
‘…’
‘ జవాబు చెప్పలేదు? ‘
‘ తెలియదు. ‘
‘ నా వెనకాలే వస్తారా? మీ ఇలెక్కడ? ‘
‘ తెల్ల కాగితం వదలనంటోంది ‘, అనేసి నాలుక కరుచుకుంది!
అతను ఆగిపోయాడు. ఇటు తిరిగాడు. అదోలా చూసి నవ్వాడు.
‘ ఈ కాగితం మీద ఎన్ని సార్లో ఈ కలం తో పొడిచాను. అయినా వదలనంటోంది…’
వాసంతి కళ్లు పెద్దవి చేసింది. ‘ కాగితమే దెబ్బ తిన్నదా? ‘
‘ ఎన్ని సార్లో! అయినా అందంగానే నిలబడి వదలనంటోంది ‘
‘అటు తిరిగి మరల నడక ప్రారంభించాడు.
‘ ఇదే జీవితం…ఏదో పదమంటుంది…పదములు కావు, పాదములు కదలవంటుంది…’
మెల్లగా వెనుక నడిచింది వాసంతి. చీకటి పడుతూ ఉంది. ఆ నీటి ఒడ్డున ఏవో శబ్దాలు అలా వినిపిస్తున్నాయి. కాగితాలెందుకు, పొడవటం ఎందుకు? పదములెందుకు? పాదములెందుకు?
ఈ కవితలో సంగీతం ఉందా? ఈ ఆలోచనలో నాదం ఉన్నదా? ఏమో! లేకపోతే తను పాట ఎలా పాడేసింది? ఏమో!
~~~***~~~

21-27 జూన్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉన్నది: రవి మిథునం, కేతువు కర్కాటకం,శని సింహం,రాహువు మకరం, గురువు కుంభం, కుజ శుక్రులు మేషం,బుధుడు వృషభం,చంద్రుడు వృషభ, మిథున,కర్కాటక, సింహ రాశులలో సంచరిస్తారు.

ఈ గ్రహస్థితి మంచి యోగాలను సూచిస్తున్నది. ధార్మిక చింతనకు, వ్యావహారికమైన జీవన విధానానికీ మధ్య కొన్ని నప్పని అంశాలు ముందుకు రాగలవు. ఆదాయం బాగుంటుంది. భార్యా భర్తల విభేదాల వలన ఇతరులు లాభాలు పొంద గలరు.శత్రువులు రహస్యంగా వ్యూహాలు రచించగలరు. రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు ముందుకు వస్తాయి.

మేష రాశి:అన్ని విధాలా పురోగతి కనిపించు వారం ఇది. శ్రమకు తగ్గ ఫలితాలు ఉండగలవు.మిత్రులు సహకరిస్తారు. వారాంతం లో కొన్ని విపరీతమైన ఆలోచనలు రాగలవు. సకాలానికి ధనం అందగలదు. కొంత ధ్యాన మార్గం అవలంబించాలి.

వృషభ రాశి: పలుకుబడి పెరగనున్నది.వారారంభంలో కొన్ని చిన్న తగాదాలు ఉండవచ్చు. తల నొప్పి బాధించగలదు. కుటుంబం లోని వారు కొన్ని అధిక ప్రసంగాలు చేయగలరు. వారాంతంలో తలచిన పనులు పూర్తి కాగలవు. విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి:మీ బాధ్యతలు మీరు చాలా సమర్థంగా నిర్వర్తించారు.ఇతరుల మాటలు పట్టించుకోకండి. మంచి రోజులు ముందున్నాయి. ఉబ్బసం గల వారు జాగ్రత్త వహించాలి. బంధువులు మీ యోగ క్షేమాల గురించి తెలుసుకుంటారు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

cancer

కర్కాటక రాశి: ఇతరుల యోచనలను తక్కువగా అంచనా వేయగలరు. మరో సారి ఆలోచించండి.కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.కొత్త విషయాలను తెలుసుకుంటారు.పెట్టుబడుదారులకు మంచి వారం. శ్రీసూక్తం చదవండి.

సింహ రాశి: మీరు గతంలో చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు ఈ వారం పొందగలరు. వారాంతంలో కొన్ని ఖర్చులు తప్పవు. స్త్రీలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: ఒక అద్భుతమైన సంఘటన ఈ వారం జరుగనున్నది. మీ కార్య కలాపాలకు ప్రాచుర్యం రానున్నది. ఇతరుల వ్యవహారాలు మీకు అర్థం కావు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా అనవసరం. మీ దారిన మీరు పయనించండి. శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: వారం ఒకటి రెండు రోజులు కొద్దిగా కలవర పెడతాయి. వారాంతానికి సమస్యలు కొన్ని పరిష్కారం కాగలవు. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: ఒక బదిలీ కనిపిస్తున్నది. ఆదాయం బాగుంటుంది. కలుషిత నీరు త్రాగటం వలన ఆరోగ్య సమస్య ఎదురు కాగలదు. భార్యా భర్తల విభేదాలు ముందుకు రాగలవు. జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం జరిపించండి.

ధను రాశి: మనసు ఈ మధ్య అనవసరమైన ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించటం మానేయండి. అదే అర్థమవుతుంది. కొన్ని పనులు పూర్త్ కాగలవు. కళ్ల విషయం లో శ్రధ్ధ వహించాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

మకర రాశి: సోదరీ మణుల గురించిన సమస్య ముందుకు రాగలదు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.ఒక స్థిరాస్తి వ్యవహారం తలెత్తగలదు. ప్రబుధ్ధులను సంప్రదించండి. హనుమాన్ చాలీసా చదవండి.

కుంభ రాశి; ఒక అధిక ప్రసంగం వలన నాలుక కరచుకునే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించాలి. ఒంటరిగా ఉన్న వారికి ఒక తోడు దొరక గలదు. నూతన విద్యాభ్యాసం చేయాలని సంకల్పిస్తారు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మీన రాశి: ఇంటి పనులు పూర్తి కాగలవు. వారం మధ్యలో ఒక ప్రయాణం సంభవం. విశ్రాంతి అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించాలి. బంగారం కొనాలనుకుంటారు. మంచిదే! లక్ష్మీ అష్టోత్తరం చదవండి!

~~~***~~~

ఈ వారం మంచి మాట:

శ్లో: యద్యధర్మం న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర:
స్యాదయం సురలోకస్య స శక్రస్యాపి రక్షితా
(సుందర కాండ)

కేవలం అధర్మం చేత రావణుడు బలహీనుడు. అదే (అధర్మం) లేకుంటే అతను ఇంద్రుని, సురలోకాన్ని పాలించ గల వీరుడు.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

(The English version is available at www.sripati.com)

నిన్న లేని అందమేదో (15)-వేదాంతం శ్రీపతి శర్మ

fa

 

ఇంటిలోని పనులన్నీ గబ గబా ముగించుకుని ఎందుకో ఆ గుట్ట మీద ఉన్న ఇంటి వైపు చూస్తూ కూర్చోవాలనిపించేది. ఒక్కో సారి అక్కడి దాకా వెళ్లి ఆ నీటి ఒడ్డున కూర్చుని ఆ కిటికీ వైపు చూసే దానిని. ఆ కుర్రాడికి ఏమి కనిపిస్తోందని అలా ఏదో వ్రాస్తూ ఉంటాడు? ఆకాశమా? నక్షత్రాలా? ఈ నీళ్లా? ఏమో! ఏదో పదమంటుంది…అంటే ఎక్కడికో ఏదో వెళదామంటోందనా లేక ఒక పదము తనతో మాట్లాడుతున్నదా?
 
ఒక్కో సారి ఒంటరిగా ఆ నీటితో పాటు నడుచుకుంటూ అలా దూరంగా వెళ్లిపోయి వెనక్కి తిరిగి చూసేది. ఆ ఇల్లు ఒక చిన్న బొమ్మలా కనిపించేది. ఆ ఇంటికీ ఈ నీటికీ మధ్య పెరిగిన దూరం వలన ఇప్పుడు ఆ గుట్ట, తన చిన్న పల్లెటూరు ఒక చక్కని దృశ్యం లా కనిపించేది. పదములు కావు, పాదములు కదలవంటుంది…కదలనివి పదములు కావా? ఆ కవితల్ ఓని పాదములు ముందుకు వెళ్లటం లేదా? ఓహో! అంత బాగుందా ఈ ఊరు? ఆలోచిస్తుండగా ఎందుకో తనూ కదల లేదు. ప్రక్కన నీళ్లు అలా చిన్న శబ్దం చేసుకుంటూ జారి పోతున్నాయి. ఎవరో మాట్లాడుతున్నట్లనిపించింది. చుట్టూతా చూసింది. ఏమీ లేదు.వాసంతికి తనతో తాను మాట్లాడుకోవటం ఎందుకో అలవాటయిపోయింది. అలాంటప్పుడు ఎవరూ లేకపోయినా ఎవరో మాట్లాడినట్లుంటుంది! ఒక చెట్టును ఆనుకుని నీటి వైపు చూసింది.నిజమే! ఇంత దగ్గరగా ఉంటున్నా ఈ అందాలు ఎన్నడూ కనపడలేదు. నీటిలో కనిపిస్తున్న తన ప్రతిబింబం, ఆ చెట్టూ తనని నిలబెట్టేసినట్లు ఉంది. నిన్న లేని అందమేదో నిలబడి పొమ్మన్నది! నిలబడమన్నదా? నిలబడి పొమ్మన్నదా? ఒక్క సారి గుండె ఝల్లు మంది.
  

నీటికి అటు వైపు ఆ కుర్రాడు ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు.తనని చూసి అలా చూస్తూ ఉండి పోయాడు.ఈ లోకం లోకి వచ్చి మెల్లగా వెనక్కు తిరిగింది.

‘ నా పాట…’

వెనుక నుంచి వినిపించింది.ఆగి అటు తిరిగింది.

‘ ఏ పాట? ‘
‘ నిన్న లేని అందమేదో…’
‘ నాకు తెలియదు!’
‘ నా కాగితం మీరే తీసుకున్నారు ‘
‘ మీకెలా తెలుసు నేనేనని? నాతో ఇంకా ముగ్గురున్నారు!’
‘ ఆ పాట మీరే పాడుతున్నారు. నేను వింటూ మీ వెనుక వస్తున్నాను.’
‘ నిజమా?’
‘…’

~~~***~~~

ఒక్క ఉరుకున పరుగు తీసి ఇంటిలోకి వచ్చి ఊపిరి తీసుకుంది.అతను ఏదో అంటున్నాడు. వినిపించలేదు. వినిపించుకోలేదు. నవ్వొచ్చింది. చీకటి పడుతోంది. అమ్మో! మళ్లీ అలా వెళ్లకూడదు. ఇంకేమైనా ఉందీ? చదువుతున్న ఒక నవల లోంచి ఆ కాగితం తీసింది. ఎన్ని సార్లు పొడిచినా ఈ కాగితం వదలనంటున్నది…

~~~***~~~

14-20 జూన్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి : రవి బుధులు వృషభం, కేతువు కర్కాటకం, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం, శుక్ర కుజులు మేషం, చంద్రుడు కుంభ, మీన, మేష రాశులు సంచరిస్తారు.

ప్రజలలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువగా ఉండే వారం ఇది. ఆదర్శాలు వల్లించి కళ్లు మూసుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. మరొకరి ధనం మీద ఆశ, వివాహేతర సంబంధాల వైపు ఆలోచనలు విరివిగా సాగుతాయి. దీర్ఘకాలం గా వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. స్త్రీ పురుషుల సంబంధాల విషయంలో అనవసరమైన వాగ్వివాదాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించాలి.

మేష రాశి: మాట జారే ముందు ఆలోచన అవసరం. ప్రధానమైన విషయాలను మరచి చిన్న చిన్న వాటి మీద శ్రధ్ధ చూపుతున్నారు. వారం తరువాత భాగం ఉత్సాహంతో గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి, మందులు రసాయనాల వ్యాపారస్తులకు లాభసాటి వారం. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: ఒక పెద్దమనిషి వ్యవహారం గురించి నిర్ణయం తీసుకోవటానికి గతం లో జరిగిన విషయాలను మననం చేసుకోవలసి యుంటుంది. కొందరి పనుల వలన చిత్రమైన పరిస్థితిలోకి వెళ్లగలరు. ప్రశాంతంగా ఉండండి. రచయితలకు మంచి వారం. విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: చాలా విషయాలను మౌనంగా తీసుకుంటున్నారు. ఈ వారం కూడా అది కొనసాగించండి. అయినప్పటికీ నలుగిరిలో మాట్లడవలసి యుంటుంది. ఉద్యోగంలో ఉన వారికి ఒక కొత్త పని ఇవ్వటం జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: పెట్టుబడుల విషయంలో ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అదనపు బాధ్యతలు చేతికి వస్తాయి. తటస్థంగా ఉంటున్నట్లు కనిపించినప్పటికీ తెలియకుండా జోక్యం చేసుకునే మీ అలవాటును కొందరు గమనిస్తున్నారు. అందుచేత మీ బంధువులతో జాగ్రత్తగా మసలుకోవలసిన వారం. రుద్రం పారాయణ చేయండి.

సింహ రాశి: వారం ప్రారంభంలో ప్రేమ వ్యవహారం ఒకటి కనిపిస్తున్నది. మీ విచక్షణ సవాలును ఎదుర్కొంటుంది. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నది కానీ వెనక్కు వెళతారు. కీళ్ల నెప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి.

కన్య రాశి: బంధువులూతో సరదాగా గడుపుతారు. తలచిన పని నెరవేరుతుంది కానీ శ్రమ వలన నీరస పడతారు. మీ సహచరుల చిత్రమైన ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. తగిన విశ్రాంతి తీసుకుని మీ పనులను వ్యవస్థీకరించుకోండి. ధ్యాన మార్గం అవలంబించండి.

తుల రాశి: కొత్త పనులు ప్రారంభించటానికి మంచి వారం. ఒక స్నేహం వలన స్త్రీలు లబ్ధి పొందగలరు. ఒక సమస్య పరిష్కారానికి వస్తుంది. రాజకీయాలలోని వారు కొంత శాంతం వహించాలి. పదునైన మాటలు అల్పకాలానికే పనికొస్తాయి. సమీకరించుకోండి. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఒక ప్రయాణం ఉన్నది. జీవిత భాగస్వామి మీద శ్రధ్ధ చూపాలి. వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. పెట్టుబడుదారులకు వారం ప్రారంభంలో బాగుంటుంది. వారాంతంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిత్య హృదయం చదవండి.

ధను రాశి: ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉన్నది. ఆస్తుల అమ్మకం విషయంలో మరింత చర్చ జరపటం అవసరం. ఒక పుణ్య క్షేత్రం సందర్శనం వలన మనసు మారవచ్చును. ఇంటిలో ఒక సమావేశం జరుపుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

మకర రాశి: ఇంటిలోని స్త్రీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మీరు మధ్యలోకి వెళ్లి న్యాయమూర్తిలా వ్యవహరించటం వారికి ఇష్టం ఉండకపోవచ్చు. ఒక పనిని ఒక సారి చేయండి. కీళ్ల నొప్పులు బాధించగలవు. జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి

కుంభ రాశి: మీ ఆదాయం ఒక సారి లెక్క చూసి కొత ఆలోచనలు అమలులోకి తేవటానికి ఇది మంచి వారం. కొత్త వాహనం కొనటానికి ఉత్సాహం చూపుతారు. మీ మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. కళ్ల విషయం లో జాగ్రత్త వహించాలి. లలితా సహస్రనామం చదవండి.

మీన రాశి: మీ ఆధ్యాత్మిక చింతనలు మిమ్మల్ని కొద్దిగా మీ బంధువులకు దూరం చేస్తున్నాయి. అవి అనుభవానికి సంబంధించినవి. ఈ వారం మీ ఊహా శక్తి ఒక క్లిష్టమైన పరిస్థితిలోంచి బయట పడేందుకు ఉపయోగ పడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తారు. ఉత్సాహంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి

ఈ వారం మంచి మాట;
శ్లో: ఇహలోకేచ పితృభిర్యా స్త్రీ యస్య మహామతే
అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్యభావేపి తస్యసా
భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖ దు:ఖయో:
నేతుమర్హసి కాకుత్ స్థ సమాన సుఖ దు:ఖనీం
(వాల్మీకి రామాయణం)
ఈ లోకమున తల్లి దండ్రులచే, నే కన్యక, ఎవ్వనికి శాస్త్రవిధిని అనుసరించి పాదములు కడిగి దానము చేయబడునో అట్టి వధువు తన పాతివ్రత్యధర్మముననుసరించి పరలోకమున గూడ అతనికే భార్యగ నుండును.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

(Readers who would like to read this version in English-predictions based on Rasis and constellations may visit the site www.astro.sripati.com)

క్రిందటి గురువారం క్విజ్ సమాధానాలు-వేదాంతం శ్రీపతి శర్మ

1. పంచ కేదార క్షేత్రాలలో ఒకటైన మధ్యమేశ్వరం  శివుని శరీరంలోని ఏ భాగమని ప్రతీతి? (నాభి)
2. మాండుక్యోపనిషత్ ఏ వేదానికి చెందినది? (అథర్వ వేదం)
3. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన… వీటి గురించి ఏ ఉపనిషత్ వివరిస్తుంది? ( ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్)
4. ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్ ఏ వేదానికి చెందినది? (కృష్ణ యజుర్వేదం)
5. సావిత్రి దేవి విశ్వ రూపాన్ని ఏ బ్రాహ్మణం ధ్యానిస్తుంది? (దేవతాధ్యాయ బ్రాహ్మణం)
6. శ్రీరాముడు రాజ్యాభిషేకానికి ధరించిన కిరీటం ఎవరు తయారు చేసినది? (బ్రహ్మ)
7. ఇది తొలుత ఎవరు ధరించినది? (మనువు)
8. వాయుదేవుడు సమర్పించిన ముక్తాహారాన్ని శ్రీరాముడు ఎవరికిచ్చెను? (సీత)
9. శ్రీరాముని అనుఙ్ఞతో ఆ హారాన్ని సీతాదేవి ఎవరికిచ్చెను? (హనుమంతుడు)
10.ఏ నాలుగు గకార యుక్త నామములను స్మరించేవారికి సంసారంలో మరల జన్మ ఉండదని మహభారతం చెబుతుంది? ( గీత,గంగ,గాయత్రి,గోవిందుడు)

I shall restrict henceforth

It appears as though placing several posts from a single blogger is not in the interests of various bloggers. I may please be excused since I was quite unaware of this. I have decided to restrict to a couple of posts in a week.

Sripati

పురాణ కాలక్షేపం(6)-వేదాంతం శ్రీపతి శర్మ

హరి: ఓం!
చాలా మంది గుడిలోని దేవుడిని చిత్రమైన కోరికలు కోరుతూ ఉంటారు.కోడలు అత్తగారిని పంపించమని, అత్తగారు ఇక్కడే ఉండి నా పెత్తనాలు భరించేటట్లు చేయమని, దొంగవాడు మంచి చోటు దొరకాలని…ఇలా అన్నీ కోరికలే. మరి దేవుడు ఎవరి కోరికని తీర్చాలి?
ఇవన్నీ ప్రక్కన పెట్టండి. ఒకరు ఇలా ఆలోచించారు-పరమాత్మ ఏడు కొండల మీద నిలబడి ఉంటే ఇంకా జనులకు సమస్యలు, లోకంలో అరాచకాలు ఇవన్నీ ఎందుకు జరగాలి? ఆయన కరుణ అంతటా వ్యాపించి యున్నది కదా?

నిజమే!

ఆలోచిస్తే అలాగే ఉంటుంది. సృష్టిలోని సమస్యలు, సమాధానాలు, దైవానుగ్రహం ఇలాంటివి ధర్మం,స్వధర్మం , సత్కార్యాచరణ, సదాచారం, స్వాధ్యాయం, ఉపాసన, తపస్సు, నిర్మలమైన హృదయం మీద ఆధారపడి యున్నాయి.

సామాన్యంగా నేను కొండకు వచ్చాను అని అనుకోవటం పొరపాటు. భగవంతుడు దూరాలు, కాల పరిమితులకు అతీతుడు. ఆయన మనలను తలచుకున్నప్పుడు మనం ఒక క్షేత్రానికి వెళ్లాము అనుకునే బదులు ఆయన మన దగ్గరకు వచ్చాడు అనుకోవాలి. ఇది ధర్మాచరణ మీద ఆధారపడియున్నది.
‘ ధరతి, ధారయతి ఇతి వా ధర్మ: ‘-లోకమును వ్యవస్థతో కాపాడునది, వ్యక్తులను, జాతిని రక్షించునది ధర్మము.
జైమిని మహర్షి ‘ చోదనాలక్షణోర్థో ధర్మ: ‘ అని చెప్పి యున్నాడు. వేదములయందు, స్మృతులయందు, ఈ పనులు చేయవలసింది అని చెప్పినవి ధర్మములు. ఆ రీతిగా ఆచరించినప్పుడు పశు, పుత్ర, ఐశ్వర్యాదులు, ఇహలోక సుఖము, పరలోక సుఖము, తత్వ జిఙ్ఞాస, ఆత్మ సాక్షాత్కారము కలుగుతాయి.

కొన్ని ధర్మములు సామాన్య ధర్మములు-అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియనిగ్రహ:
రామాయణం సత్యము, ధర్మము గురించి చెబుతుంది. ‘ సత్యధర్మానురక్తానాం నాస్తి మృత్యుకృతం భయం ‘-(యుధ్ధకాండ)
అరణ్య కాండలో -
శ్లో: ధర్మాదర్థ: ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్

అని మహర్షి చెప్పి యున్నాడు.

(ధర్మం గురించి మరి కొన్ని విషయాలు తరువాయి భాగంలో)

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

10000 లైట్ ఇయర్స్ దూరం నుంచి సూర్యుడు-వేదాంతం శ్రీపతి శర్మ

As seen from a distance of 10000 light years

‘నిన్న లేని అందమేదో ‘(14)-వేదాంతం శ్రీపతి శర్మ

ఆ పలెటూరులో దూరంగా ఒక గుట్ట మీద ఒక పెద్ద ఇల్లు ఉండేది. చాలా మంది ఆ ఇల్లు ఎవరో ఒక పెద్ద ఆఫీసరు గారిది అని చెబుతూ ఉండే వారు. వారానికి రెండు రోజులు ఒక పెద్దాయన వచ్చి అందులో ఉండే వాడు. ఏమి చేసే వాడో పెద్దగా తెలిసేది కాదు. గుడి దగ్గర ఉన్న సోమసుందరం ఆ రెండు రోజులూ ఆయనను దొర లాగా చూసుకుని పంపించే వాడు. సోమసుందరాన్ని చాలా సార్లు మా అమ్మ అడిగింది. అప్పుడు ఆమె మా తాతకి ముగ్గురు ఆడ పిల్లలలో పెద్ద పిల్ల. సోమసుందరం రక రకాలుగా చెప్పే వాడు.
‘ వాసంతీ, ఈ ఊరును పాలించే ఓరు ఆళ్లు. ఒస్తారు, పోతారు.’
‘ నువ్వెందుకు వెళతావు?’
‘ మరి నేనే కదా సూడాలి.’
‘ ఆయన ఏమి చేస్తాడు?’
‘ అరె! ఇప్పుడే కదా చెబుతా…నీకెందుకు పిల్లా? ఇక్కడ ఏదో ఓ పెద్ద ఫేక్టరీ కడతారుట.’
‘ ఈయన కట్టిస్తాడా?’
‘ మరి? రాళ్లు మోసి ఆయనెట్టా కడతాడు పిల్లా? మంచి దానివే!’
‘ అవునూ…’
‘ అవును?’
‘ ఆ ఇల్లు ఒక సారి లోపల చూపిస్తావా?’
‘ ఎందుకు పిల్లా?’
‘ నాకు చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో!’
‘ అవునులే. ఇల్లు నిజంగానే చాలా బాగుంటుంది. కానీ పని వాళ్లు ఇల్లు తుడుస్తారు, ఎల్లిపోతారు. మన పని అంతే. నీకెందుకులే?’
‘ వద్దులే సోమూ.’
అలా వదిలిపెట్టేది కానీ ఎందుకో లోపలికి వెళ్లాలనీ, చూడాలనీ ఉండేది.ఒక రోజు ఆ ఇంటికి వెనుక వైపుకు నలుగురు అమ్మాయిలు కలసి వెళ్లారు.చెరువు గట్టు దగ్గర నుంచి చూస్తే ఒక కిటికీ కనిపించింది. అటు వైపు ఒక కురాడు కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు.
‘ నిన్నే చూస్తున్నాడు ‘
‘ కాదు. నిన్ను.’
‘ కాదు అసలు ఎవరినీ చూడటం లేదు. ఏదో వ్రాసుకుంటున్నాడు.’
‘ ఏమయ్యుంటుంది?’
‘ అడుగు.’
‘ సిగ్గు లేదు.’
‘ ఇక్కడంతా చాలా బాగుందీ, సెలయేరు, పిల్ల గాలీ, కొండలు, గుట్టలు…’
‘ అమ్మాయిలు!’
‘ నోరు ముయ్యి పిల్లా. సినిమాలు ఎక్కువయ్యాయి.’
‘ ఎవరికి వ్రాస్తున్నాడు?’
‘ వాళ్ల ఇంటికి.’
‘ జాగ్రత్తగా చూడు, వ్రాస్తున్నది ఉత్తరం కాదు.’
‘ మరి?’
‘ పేజీలు పేజీలు వ్రాస్తున్నాడు.’
‘ అమ్మో నవల!’
‘ నీకెలా తెలుసు?’
‘ చెరువు గట్టు చూస్తూ కిటికీ దగ్గర కూర్చున్న వారందరూ అలాంటి పనే చేస్తారు.’
‘ ఎవరు చెప్పారు?’
‘ నేను నవలలోనే చదివాను ‘
‘ ఈ నవలలు ఎవరి గురించో కాకుండా వాటి గురించే చెబుతాయి. నేను అందుకే చదవను.’
‘ మన స్కూల్లోనే కాదు.ఊళ్లో కాలేజీలో మాష్టారు కూడా అంతే! పాఠం తరువాత, తన పాట ముందు.’
‘ నిజమే! ఇతను మనల్ని చూస్తున్నాడు.’
‘ ఏ, ఇటు తిరగండి. మనం అటు తిరిగినప్పుడల్లా చూస్తున్నాడు.’
‘ నిన్ను ఎవరు తిరగమన్నారు?’
‘ తిరగకపోతే చూస్తున్నాడో లేదో తెలియటం లేదే!’
‘ అయినా కిటికీ అతనిది, కళ్ళు అతనివి ‘
‘ కిటికీలో కరెక్టుగా ఫ్రేములో ఫొటో కట్టినట్లున్నాడే…’
వాసంతి ఈ సారి జాగ్రతగా చూసింది.నిజమే! నొక్కుల జుట్టు,కళ్లజోడు, గొంగళిపురుగు మీసం, చక్కని నుదురు,చెక్కినట్లున్నాడు. ఏమి వ్రాస్తున్నాడో?
ఒక అమ్మాయి లేచి నిలబడింది.
‘ ఏమయిందే? నిన్ను పిలిచేశాడా?’
‘ ఊరుకోవే! లోపలికి వెళ్లాడు.’
అందరూ లేచారు. అటు తిరిగి చూశారు.మెల్లగా పరికిణీ కొద్దిగా పైకి పట్టుకుని దొంగ తనంగా పైకి ఎక్కారు. కిటికీ లోపలికి చూశారు.ఎంత పెద్ద ఇల్లో! టేబిలు మీద చాలా పెద్ద పుస్తకం ఒకటి. దాని పక్కన ఏవో కాగితాలు.ఒక కాగితం దగ్గరగా లాగింది వాసంతి…
‘ అదేదో పదమంటుంది
     పదం కాదు పాదం కదలనంటుంది
      నిన్న లేని అందమేదో నిలచి పొమ్మంటుంది
      ఎన్ని చోట్ల పొడిచినా ఈ కాగితం వదలనంటుంది…’

~~~***~~~

(తరువాయి భాగం త్వరలోనే!)

100 లైట్ ఇయర్స్ దూరం నుంచి సూర్యుడు-వేదాంతం శ్రీపతి శర్మ

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.