పురాణ కాలక్షేపం(3)-వేదాంతం శ్రీపతి శర్మ

హరి: ఓం!

శ్లో:ప్రాత: స్మరామి భవభీతి భయార్తి శాంత్యై
    నారాయణం గరుడ వాహన మంజునాభం
    గ్రాహాభిభూత మదవారణ ముక్తిహేతుం
    చక్రాయుధం తరుణ వారిజపత్రనేత్రం

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ:బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

నారాయణుడు సకల జగన్నివాసుడు, పరమాత్మ, శ్రీమహావిష్ణువు, వైకుంఠాధిపతి,చతుర్భుజుడు,శంఖ, చక్ర, గదాధరుడు, పీతంబరధారి. ఆయన భార్య లక్ష్మీ దేవి సకల ఐశ్వర్యప్రదాయిని, సంపత్ప్రదత్రి. ఈ లక్ష్మీనారాయణులు వైకుంఠమున శ్రీమహావిష్ణువుగాను,శ్రీమహాలక్ష్మిగాను విలసిల్లుచు జగత్తునకు పరిపాలకులుగా జీవకోటిని అనుగ్రహించుచున్నారు.శ్రియ:పతిని ఆరాధించువారు ఆపదలనుండి విముక్తులై ఇహలోకమున సర్వసుఖములను పొంది భగవదనుగ్రహము చేత ముక్తిని కూడా పొందగలుగుతున్నారు.అవతారములలో విష్ణువుతో లక్ష్మి నిత్య అనపాయినిగా యుండును (విడిచిపెట్టక).

శ్లో: చతుర్ముఖాంభోజ వరహంసవధూ: మమ
     మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ

బంగారము వంటి ప్రశస్తమైన ఙ్ఞానము కలవాడు బ్రహ్మ, వేదనిధి, సృష్టికర్త.సరస్వతీదేవి విద్యాప్రదాయిని,వాగ్దేవత.

వందేమహి చ తాం వాణీం అమృతాం ఆత్మన: కలాం

అమృతస్వరూపిణి, ఆత్మకళయగు వాణిని నమస్కరించవలయును. సరస్వతీదేవి యొక్క అనుగ్రహము వలన

‘ అశృతే బుధ్యతే గ్రంథ: ప్రాయ: సారస్వత: కవి:’

ఇదివరకు వినని గ్రంథములు అర్థమగును. అవశ్యము కవిత లభించును!
 

బ్రహ్మదేవుని ముఖమున సరస్వతి,విష్ణువు వక్షస్థలమున లక్ష్మీ దేవి,శివుని వామాంగమున పార్వతి నివసింతురని పురాణేతిహాసములు చెప్పుచున్నాయి. లోకమందు కూడా భార్యాభర్తలు అన్యోన్యానురాగముచే ఒకే తత్వముగా పరిగణించబడుతున్నారు. వీరు యుగళమూర్తులు. ఇలాగే సీతారాములు, రాధకృష్ణులు, యుగళమూర్తులుగా ఉపాసించబడుతున్నారు.త్రిమూర్తులు తమ భార్యలకు తమ శరీరమందు స్థానము కల్పించుట ఆదరము, ప్రేమాతిశయమును సూచించును.

శ్లో: సంతుష్టో భార్యయా భర్త్రా భర్త్రా భార్యా తథైవచ
     యస్మిన్నేవ గృహే నిత్యం కళ్యాణం తత్రవై ధృవం

భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ సంతుష్టులగుచు ఏ గృహమున నివసింతురో అచట నిశ్చయముగా శుభములు స్థిరముగా నుండును. కనుక భారతదేశమున భార్యాభర్తలు ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, సరస్వతీబ్రహ్మదేవులను ఆదర్శములుగా నిడుకొని అన్యోన్య అనురాగముతో, సహకారముతో గృహకృత్యములను సంసార బాధ్యతలను నిర్వర్తించుకొనుచు పుత్ర పౌత్రాది సంతతితో, ధర్మదృష్టితో మసలుకొనవలెను.

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

‘శ్రీకృష్ణ పాండవీయం ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

1966 లో నటించి దర్శకత్వం వహించి ఎన్. టి. రామారావు గారు ప్రజల ముందుకు తీసుకుని వచ్చిన ఈ చిత్రానికి చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

పౌరాణిక పాత్రలు ఎలా ఉంటాయి అనేది రవి వర్మ గారి పెయింటింగుల నుంచి ఊహించగలిగితే బాపు గారి బొమ్మలలో గొప్పగా రూపు దిద్దుకున్నాయి. ఈ రెండిటినీ కలబోసి సజీవంగా తెర మీద చూడాలనుకున్నప్పుడు ఎన్.టి.ఆర్ గారు తప్ప మరొకరు కనిపించరు.
‘ ఆర్యన్ ‘ నాసిక, విశాల వక్షస్థలం, అందమైన కళ్లు,చక్కని గాత్రం, హుందా తనం ఆయనకే చెల్లింది.
పౌరాణిక కథలకు అద్దం పట్టిన తెలుగు పద్య నాటక ప్రక్రియ నుంచి, ఆ మేటి కళాకారుల నడక, భావ విన్యాసం నుంచి తెలుగు చిత్రం అలవోకగా తెర మీదకు దూకిన విన్యాసం చెప్పుకోదగ్గది.

ఈ చిత్రం కొన్ని స్టేండర్డ్స్ సెట్ చేసిన చిత్రం.
రెండు పాత్రలు-శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు-ఇవి రెండూ ఎన్.టి.ఆర్ గారు పోషించి వైవిధ్యం చూపించి పాత్రలకు ఉన్న నేపథ్యం, నటనా చాతుర్యం చక్కగా తీసుకుని వచ్చారు.

కథ తెలిసినదే. భారతంలో ఏమున్నదీ లేనిదీ అనేది ప్రక్కన పెట్టి కాన్సెప్చువల్ గా కథను చూడాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా నాటక ప్రక్రియ ప్రభావం అని అందరికీ తెలిసినదే.

శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలచి అడుగడుగునా ఆదుకొనటం, ఆయన గాంధర్వ వివాహం, మయ సభలో సుయోధనుని పరాభవం, దంతవక్త్ర, జరాసంధ వధ, బకాసుర వధ, హిడింబ తో భీముని వివాహం,ఇలా సాగి చివరకు ధర్మజుడు తలపెట్టిన రాజసూయం లో శిశుపాల వధతో కథ ముగుస్తుంది.

మామూలుగా ఆలోచిస్తే శ్రీకృష్ణునికీ, పాండవులకీ మధ్య గూఢమైన సంబంధం కృష్ణార్జునుల నరనారాయణ స్వరూపం.అది కృష్ణావతారం లోని ఒక భాగం.కాకపోతే తాత్వికంగా కాకుండా కథా స్వరూపంగా తలపెట్టి అటు ప్రతినాయకులను వారి అంతరంగం ద్వారా చూపించి పాందవులలో భీముని ముందుకు తేవటం జరిగింది…అందు చేత శకుని వృత్తాంతం, సుయోధనుని మయ సభ ఘట్టం ప్రధానంగా కనిపిస్తాయి.

శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తున్నప్పుడు కనుల విషయంలో ఎన్.టి.ఆర్ గారిని జాగ్రత్తగా పరిశీలించాలి. దీనిని ‘లుకింగ్ బియాండ్ ‘ అని గుర్తించాలి. ఎదురుగా నిలబడిన పాత్ర వైపే కాకుండా కొద్దిగా దూరంగా చూస్తున్నట్లు కళ్లను నిలపటం ఒక ప్రక్రియ. కళ్లు పెద్దవి చేసి చిరునవ్వు నవ్వటం శ్రీకృష్ణుని రూపంలో ఆయనకే చెల్లింది. అదే దుర్యోధనుని దగ్గరకు వచ్చినప్పుడు కళ్లు పెద్దవి చేస్తారు. కానీ కనుబొమ్మలను కొద్దిగా సంకుచితం చేసి
తల కొద్దిగా వంచటం జరుగుతుంది.ఇది చిత్రమైన విషయం. జాగ్రత్తగా చూస్తే ఇలా చేసినప్పుడు వ్యక్తిలోని క్రౌర్యం ,కపటం ప్రతిబింబిస్తాయి. ఇది నటునిలోని ప్రతిభా పాటవం.
నడక దగ్గరకు వస్తే దుర్యోధనుని నడక ఇలా తప్ప మరోలా ఉండదు అనిపిస్తుంది. ఎడమ చేయి కొద్దిగా ముందుకు వచ్చి అర క్షణం ఆగి ఒక అర్థ చంద్రాకారంలో మరల వెనక్కి వెళుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో పాటలు గొప్పగా ఉంటాయి. ‘స్వాగతం ‘ పాట వెంపటి చిన్న సత్యం గారి నాట్య కళకు ఒక తార్కాణం.సంగీతం అందించిన టి.వి.ఎస్. రాజు ఇలా ఎన్ని సినిమాలు చేశారో తెలియదు. సంగీతం పాత్రలకు, సన్నివేశాలకు అలా అద్దం పట్టినట్లుంటుంది. ‘ప్రియురాల సిగ్గేలనే ‘ పాట ఘంటసాల గారి గళంలో భగవంతుడు పాడితే ఇలా ఉంటుందేమో మరి అని ఒక క్షణం అనుకుంటామేమో!
వీటికి భిన్నంగా హిడింబకు పాడిన జిక్కీ గారు మాధుర్యానికి మరో పేరు అనిపించారు. ‘అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా…’
ఇందులో ‘ అయ్యారే ‘, ‘ ఇయ్యాలని…’-ఈ రెండు పదాలను పలికిన తీరు అద్భుతం! ఒక్క సారి ఝాంగురే బంగారు జిక్కీ రాణీ అనిపించింది!

ఈ సినిమాలో చివరి సన్నివేశం తో పాటు మయ సభ, హిడింబ పాట ఇలాంటివి తలచుకున్నప్పుడు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్, ఆర్ట్ దర్శకుడు కె.వి.రాజు గార్లను మెచ్చుకోకుండా ఉండలేము.ముఖ్యంగా రాజసూయం చివరిలో పురుషసూక్తం వినిపిస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు దైవం ఒక ఘటనలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో అనిపించేలా చిత్రీకరించారు.

ఈ చిత్రం కూడా కొన్ని పాత చిత్రాల లాగా రంగులు పూసుకుంటే మరో సారి చరిత్ర సృష్టించగలదని అనిపిస్తోంది!

సినిమాలో ఒక చోట కొద్దిగా నవ్వొచ్చింది. ‘ మత్తు వదలరా ‘ పాట దగ్గర భీముడు కళ్లు మూసుకుని పడుకుని ఉంటే శ్రీకృష్ణుడు రెండు వేషాలలో చెట్టుకు అటూ ఇటూ ఎవరు చూసేందుకు వేషాలు మారాడో అనుకున్నాను.అవసరం లేదనిపించింది.

మన నాటక ప్రక్రియలోని ప్రతిభను తెర మీదకి తెచ్చి, మన పురాణాల లోని అద్భుతమైన సన్నివేశాలను చిరకాలంగా నిలచిపోయేటట్లుగా, పౌరాణిక పాత్ర పోషణ ఇలా ఉండాలీ అనుకునేటట్లుగా, తెలుగు వారికే ఉన్న ఈ విలక్షణమైన ప్రతిభను ప్రపంచానికి చాటిన నందమూరి వారు ధన్యులు!

అందుకే ఆయన ‘సకల మహీపాల మకుట శోభా నీరాజితుడైన రారాజుగా ‘ అందరి గుండెల్లో అలా నిలచిపోయి ఉన్నారు!

రాశిఫలాలు(31మే-6 జూన్2009)-వేదాంతం శ్రీపతి శర్మ

 

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:

రవి వృషభం, బుధుడు మేష, వృషభ రాశులు, శుక్ర కుజులు మేషం, కేతువు కర్కాటకం, శని సింహం, గురువు కుంభం, రాహువు మకరం, చంద్రుడు సింహ, కన్య, తుల వృశ్చిక రాశులు సంచరిస్తారు.

దీర్ఘకాల సమస్యల పరిష్కారం వైపు చాలా మంది ఆలోచనలు చేస్తారు. తాడో పేడో తేల్చుకొనే దిశగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవలసిన వారం. రవి గ్రహం ఒక అద్భుతమైన యోగం ఇస్తున్నది. అధికార వర్గం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోగలదు.ఉపాసన మార్గంలో ఉన్నవారు సరిక్రొత్త అనుభూతులను పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.

మేష రాశి: ఈ వారం మనసులో విపరీతమైన ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది. వారం మధ్య నుంచి మనస్తాపాలు తొలగిపోతాయి.అధికంగా అన్నిటినీ పట్టించుకున్న వారు, అధిక ప్రేలాపనలు చేసే వారు మౌనం పాటించాలి. ఈ ప్రవర్తన హానికరం. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: ఇంటిలో ఒక వస్తువు రిపెయిరుకు రెడీగా ఉంది.చేయించండి. దీర్ఘకాలీన ప్రణాలికలు రూపొందుతాయి.మీ శ్రమ ఫలిస్తుంది.ప్రేమ వ్యవహారం ఒకటి బయట పడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.

 మిథున రాశి: మనసు ఒక విషయంలో కలవరపడుతుంది.దైవం అనుకూలిస్తుంది. వారాంతంలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆదాయం బాగుంది. గుండె సమస్యలున్నవారు జాగ్రత్త వహించాలి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: సమస్యలు, పరిష్కారాలు వెనువెంటనే ఉన్నాయి. ఏదో చేయాలని పూనుకుంటే సమస్య కాగలదు.కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.ఆరోగ్యం మందగిస్తుంది. రుద్రం పారాయణ చేయండి.

సింహ రాశి:ఒక మంచి పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అవరోధాలూ వస్తున్నాయి. తిరిగి ఈ వారం యోచన చేస్తారు. అందరినీ సంప్రదిస్తే ఇలానే ఉంటుంది. చేయాలనుకున్న పని తలపెట్టే ముందు శివాలయం దర్శించండి.ఒక విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు.

 కన్య రాశి: నిర్భయంగా తలచినా పనులలో ముందుకు వెళతారు. మీ నేర్పు మిమ్మల్ని కాపాడుతుంది.ఋణ విషయంలో అవరోధాలు తొలగిపోతాయి.అనుకోని చోటు నుంచి డబ్బు అందుతుంది. అనుకూలించటం లేదని అనిపించినా నిజానికి పరిస్థితులు మీ వైపే ఉన్నాయి.కుల దైవాన్ని కొలవండి.

తుల రాశి:గతంలో సామాన్యంగా ఎవరూ చేయని పనిని ఎవరినీ సంప్రదించకుండా చేసిన పనికి తీవ్రమైన పశ్చాత్తాపం పడు వారం ఇది. కొన్ని కలహాలు కనిపిస్తున్నాయి.అనవసరమైన వాద్వివాదాలు మానుకొనాలి. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: మీ ఇంటిలో ఆచారం ప్రకారం జరుప వలసిన వ్రతం లేదా పూజ ఏదైనా ఉంటే జరిపించటం మంచిది. మీ ఇంటికి అది మంచిది.ఆదాయం బాగుంది. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. సుబ్రహ్మణ్య కవచం చదవంది.

 ధను రాశి:కళ్ల విషయంలో శ్రధ్ధ చూపాలి. సైనస్ ఉన్న వారు జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ఒక మార్పుకు రంగం సిధ్ధమవుతున్నది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది.స్త్రీలు చర్మ వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.

మకర రాశి:ఇంకొకరి విషయంలో చేసిన జోక్యం వలన కొద్దిగా సమస్యలు ఉండవచ్చు.మీ ఉత్సాహాన్ని అపార్థం చేసుకునే వారున్నారు. జాగ్రత్త వహించండి.కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.విష్ణు సహస్రనామం చదవండి.
 

కుంభ రాశి:రక రకాల ఆలోచనలు బాధిస్తాయి.నిస్సహాయులుగా అనిపిస్తారు. అలాంటిది ఏమీ లేదు.మంచి కాలం ముందు ఉంది.సహజమైన ప్రవర్తనకు భిన్నంగా ఏదైనా చేసే సంకల్పం మానుకోండి.అది మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టగలదు.మహా సౌరం చదవండి.

 మీన రాశి:గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లటం మంచిది కాదు. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు చూస్తారు.బంధువర్గం వలన కొన్ని కలతలు ఉండవచ్చు. సంఘంలో గౌరవం బాగుంది.మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మౌనంగా ఉండవలసిన చోట ఏదో మాట్లాడి సమస్యలు తెచ్చుకోగలరు. జాగ్రత్త వహించండి.ధ్యాన మార్గం అవలంబించండి.

ఈ వారం మంచి మాట:

మనయేవ జగత్సర్వం
మనయేవ సదారిపు:
మన ఏవహి సంసారో
మనయేవ జగత్రయం

(తేజబిందు ఉపనిషత్)

మనస్సే కలలోని వస్తువులు ఉన్నట్లుగాని భావించి సుఖదు:ఖములను పొంది భంగపాట్లు చెందుతున్నది. జాగ్రదవస్థలో కూడా ఈ మనస్సే లేని వస్తువులను సత్యమని భావించి సంయోగ వియోగ రూపంలో సుఖదు:ఖాలను కలుగచేస్తోంది. అందుచేత దు:ఖం, అశాంతి పోవాలంటే మనస్సును నిగ్రహించుకొని శమదమాది షట్ సంపత్తిని అభ్యాసం చేయాలి.

సచ్చిదానందమాత్రోహం అనుత్పన్నమిదం జగత్
కాలం నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవచ

(తేజబిందు ఉపనిషత్)

సత్యమైనది సచ్చిదానంద పరమాత్మ ఒక్కటే!అంతయూ పరబ్రహ్మమయం.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 ~~~***~~~

ఫొటోలో ఎవరున్నారు?-వేదాంతం శ్రీపతి శర్మ

Follow

Get every new post delivered to your Inbox.