పురాణ కాలక్షేపం(3)-వేదాంతం శ్రీపతి శర్మ

హరి: ఓం!

శ్లో:ప్రాత: స్మరామి భవభీతి భయార్తి శాంత్యై
    నారాయణం గరుడ వాహన మంజునాభం
    గ్రాహాభిభూత మదవారణ ముక్తిహేతుం
    చక్రాయుధం తరుణ వారిజపత్రనేత్రం

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ:బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

నారాయణుడు సకల జగన్నివాసుడు, పరమాత్మ, శ్రీమహావిష్ణువు, వైకుంఠాధిపతి,చతుర్భుజుడు,శంఖ, చక్ర, గదాధరుడు, పీతంబరధారి. ఆయన భార్య లక్ష్మీ దేవి సకల ఐశ్వర్యప్రదాయిని, సంపత్ప్రదత్రి. ఈ లక్ష్మీనారాయణులు వైకుంఠమున శ్రీమహావిష్ణువుగాను,శ్రీమహాలక్ష్మిగాను విలసిల్లుచు జగత్తునకు పరిపాలకులుగా జీవకోటిని అనుగ్రహించుచున్నారు.శ్రియ:పతిని ఆరాధించువారు ఆపదలనుండి విముక్తులై ఇహలోకమున సర్వసుఖములను పొంది భగవదనుగ్రహము చేత ముక్తిని కూడా పొందగలుగుతున్నారు.అవతారములలో విష్ణువుతో లక్ష్మి నిత్య అనపాయినిగా యుండును (విడిచిపెట్టక).

శ్లో: చతుర్ముఖాంభోజ వరహంసవధూ: మమ
     మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ

బంగారము వంటి ప్రశస్తమైన ఙ్ఞానము కలవాడు బ్రహ్మ, వేదనిధి, సృష్టికర్త.సరస్వతీదేవి విద్యాప్రదాయిని,వాగ్దేవత.

వందేమహి చ తాం వాణీం అమృతాం ఆత్మన: కలాం

అమృతస్వరూపిణి, ఆత్మకళయగు వాణిని నమస్కరించవలయును. సరస్వతీదేవి యొక్క అనుగ్రహము వలన

‘ అశృతే బుధ్యతే గ్రంథ: ప్రాయ: సారస్వత: కవి:’

ఇదివరకు వినని గ్రంథములు అర్థమగును. అవశ్యము కవిత లభించును!
 

బ్రహ్మదేవుని ముఖమున సరస్వతి,విష్ణువు వక్షస్థలమున లక్ష్మీ దేవి,శివుని వామాంగమున పార్వతి నివసింతురని పురాణేతిహాసములు చెప్పుచున్నాయి. లోకమందు కూడా భార్యాభర్తలు అన్యోన్యానురాగముచే ఒకే తత్వముగా పరిగణించబడుతున్నారు. వీరు యుగళమూర్తులు. ఇలాగే సీతారాములు, రాధకృష్ణులు, యుగళమూర్తులుగా ఉపాసించబడుతున్నారు.త్రిమూర్తులు తమ భార్యలకు తమ శరీరమందు స్థానము కల్పించుట ఆదరము, ప్రేమాతిశయమును సూచించును.

శ్లో: సంతుష్టో భార్యయా భర్త్రా భర్త్రా భార్యా తథైవచ
     యస్మిన్నేవ గృహే నిత్యం కళ్యాణం తత్రవై ధృవం

భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ సంతుష్టులగుచు ఏ గృహమున నివసింతురో అచట నిశ్చయముగా శుభములు స్థిరముగా నుండును. కనుక భారతదేశమున భార్యాభర్తలు ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, సరస్వతీబ్రహ్మదేవులను ఆదర్శములుగా నిడుకొని అన్యోన్య అనురాగముతో, సహకారముతో గృహకృత్యములను సంసార బాధ్యతలను నిర్వర్తించుకొనుచు పుత్ర పౌత్రాది సంతతితో, ధర్మదృష్టితో మసలుకొనవలెను.

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

‘శ్రీకృష్ణ పాండవీయం ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

1966 లో నటించి దర్శకత్వం వహించి ఎన్. టి. రామారావు గారు ప్రజల ముందుకు తీసుకుని వచ్చిన ఈ చిత్రానికి చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

పౌరాణిక పాత్రలు ఎలా ఉంటాయి అనేది రవి వర్మ గారి పెయింటింగుల నుంచి ఊహించగలిగితే బాపు గారి బొమ్మలలో గొప్పగా రూపు దిద్దుకున్నాయి. ఈ రెండిటినీ కలబోసి సజీవంగా తెర మీద చూడాలనుకున్నప్పుడు ఎన్.టి.ఆర్ గారు తప్ప మరొకరు కనిపించరు.
‘ ఆర్యన్ ‘ నాసిక, విశాల వక్షస్థలం, అందమైన కళ్లు,చక్కని గాత్రం, హుందా తనం ఆయనకే చెల్లింది.
పౌరాణిక కథలకు అద్దం పట్టిన తెలుగు పద్య నాటక ప్రక్రియ నుంచి, ఆ మేటి కళాకారుల నడక, భావ విన్యాసం నుంచి తెలుగు చిత్రం అలవోకగా తెర మీదకు దూకిన విన్యాసం చెప్పుకోదగ్గది.

ఈ చిత్రం కొన్ని స్టేండర్డ్స్ సెట్ చేసిన చిత్రం.
రెండు పాత్రలు-శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు-ఇవి రెండూ ఎన్.టి.ఆర్ గారు పోషించి వైవిధ్యం చూపించి పాత్రలకు ఉన్న నేపథ్యం, నటనా చాతుర్యం చక్కగా తీసుకుని వచ్చారు.

కథ తెలిసినదే. భారతంలో ఏమున్నదీ లేనిదీ అనేది ప్రక్కన పెట్టి కాన్సెప్చువల్ గా కథను చూడాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా నాటక ప్రక్రియ ప్రభావం అని అందరికీ తెలిసినదే.

శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలచి అడుగడుగునా ఆదుకొనటం, ఆయన గాంధర్వ వివాహం, మయ సభలో సుయోధనుని పరాభవం, దంతవక్త్ర, జరాసంధ వధ, బకాసుర వధ, హిడింబ తో భీముని వివాహం,ఇలా సాగి చివరకు ధర్మజుడు తలపెట్టిన రాజసూయం లో శిశుపాల వధతో కథ ముగుస్తుంది.

మామూలుగా ఆలోచిస్తే శ్రీకృష్ణునికీ, పాండవులకీ మధ్య గూఢమైన సంబంధం కృష్ణార్జునుల నరనారాయణ స్వరూపం.అది కృష్ణావతారం లోని ఒక భాగం.కాకపోతే తాత్వికంగా కాకుండా కథా స్వరూపంగా తలపెట్టి అటు ప్రతినాయకులను వారి అంతరంగం ద్వారా చూపించి పాందవులలో భీముని ముందుకు తేవటం జరిగింది…అందు చేత శకుని వృత్తాంతం, సుయోధనుని మయ సభ ఘట్టం ప్రధానంగా కనిపిస్తాయి.

శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తున్నప్పుడు కనుల విషయంలో ఎన్.టి.ఆర్ గారిని జాగ్రత్తగా పరిశీలించాలి. దీనిని ‘లుకింగ్ బియాండ్ ‘ అని గుర్తించాలి. ఎదురుగా నిలబడిన పాత్ర వైపే కాకుండా కొద్దిగా దూరంగా చూస్తున్నట్లు కళ్లను నిలపటం ఒక ప్రక్రియ. కళ్లు పెద్దవి చేసి చిరునవ్వు నవ్వటం శ్రీకృష్ణుని రూపంలో ఆయనకే చెల్లింది. అదే దుర్యోధనుని దగ్గరకు వచ్చినప్పుడు కళ్లు పెద్దవి చేస్తారు. కానీ కనుబొమ్మలను కొద్దిగా సంకుచితం చేసి
తల కొద్దిగా వంచటం జరుగుతుంది.ఇది చిత్రమైన విషయం. జాగ్రత్తగా చూస్తే ఇలా చేసినప్పుడు వ్యక్తిలోని క్రౌర్యం ,కపటం ప్రతిబింబిస్తాయి. ఇది నటునిలోని ప్రతిభా పాటవం.
నడక దగ్గరకు వస్తే దుర్యోధనుని నడక ఇలా తప్ప మరోలా ఉండదు అనిపిస్తుంది. ఎడమ చేయి కొద్దిగా ముందుకు వచ్చి అర క్షణం ఆగి ఒక అర్థ చంద్రాకారంలో మరల వెనక్కి వెళుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో పాటలు గొప్పగా ఉంటాయి. ‘స్వాగతం ‘ పాట వెంపటి చిన్న సత్యం గారి నాట్య కళకు ఒక తార్కాణం.సంగీతం అందించిన టి.వి.ఎస్. రాజు ఇలా ఎన్ని సినిమాలు చేశారో తెలియదు. సంగీతం పాత్రలకు, సన్నివేశాలకు అలా అద్దం పట్టినట్లుంటుంది. ‘ప్రియురాల సిగ్గేలనే ‘ పాట ఘంటసాల గారి గళంలో భగవంతుడు పాడితే ఇలా ఉంటుందేమో మరి అని ఒక క్షణం అనుకుంటామేమో!
వీటికి భిన్నంగా హిడింబకు పాడిన జిక్కీ గారు మాధుర్యానికి మరో పేరు అనిపించారు. ‘అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా…’
ఇందులో ‘ అయ్యారే ‘, ‘ ఇయ్యాలని…’-ఈ రెండు పదాలను పలికిన తీరు అద్భుతం! ఒక్క సారి ఝాంగురే బంగారు జిక్కీ రాణీ అనిపించింది!

ఈ సినిమాలో చివరి సన్నివేశం తో పాటు మయ సభ, హిడింబ పాట ఇలాంటివి తలచుకున్నప్పుడు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్, ఆర్ట్ దర్శకుడు కె.వి.రాజు గార్లను మెచ్చుకోకుండా ఉండలేము.ముఖ్యంగా రాజసూయం చివరిలో పురుషసూక్తం వినిపిస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు దైవం ఒక ఘటనలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో అనిపించేలా చిత్రీకరించారు.

ఈ చిత్రం కూడా కొన్ని పాత చిత్రాల లాగా రంగులు పూసుకుంటే మరో సారి చరిత్ర సృష్టించగలదని అనిపిస్తోంది!

సినిమాలో ఒక చోట కొద్దిగా నవ్వొచ్చింది. ‘ మత్తు వదలరా ‘ పాట దగ్గర భీముడు కళ్లు మూసుకుని పడుకుని ఉంటే శ్రీకృష్ణుడు రెండు వేషాలలో చెట్టుకు అటూ ఇటూ ఎవరు చూసేందుకు వేషాలు మారాడో అనుకున్నాను.అవసరం లేదనిపించింది.

మన నాటక ప్రక్రియలోని ప్రతిభను తెర మీదకి తెచ్చి, మన పురాణాల లోని అద్భుతమైన సన్నివేశాలను చిరకాలంగా నిలచిపోయేటట్లుగా, పౌరాణిక పాత్ర పోషణ ఇలా ఉండాలీ అనుకునేటట్లుగా, తెలుగు వారికే ఉన్న ఈ విలక్షణమైన ప్రతిభను ప్రపంచానికి చాటిన నందమూరి వారు ధన్యులు!

అందుకే ఆయన ‘సకల మహీపాల మకుట శోభా నీరాజితుడైన రారాజుగా ‘ అందరి గుండెల్లో అలా నిలచిపోయి ఉన్నారు!

రాశిఫలాలు(31మే-6 జూన్2009)-వేదాంతం శ్రీపతి శర్మ

 

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:

రవి వృషభం, బుధుడు మేష, వృషభ రాశులు, శుక్ర కుజులు మేషం, కేతువు కర్కాటకం, శని సింహం, గురువు కుంభం, రాహువు మకరం, చంద్రుడు సింహ, కన్య, తుల వృశ్చిక రాశులు సంచరిస్తారు.

దీర్ఘకాల సమస్యల పరిష్కారం వైపు చాలా మంది ఆలోచనలు చేస్తారు. తాడో పేడో తేల్చుకొనే దిశగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవలసిన వారం. రవి గ్రహం ఒక అద్భుతమైన యోగం ఇస్తున్నది. అధికార వర్గం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోగలదు.ఉపాసన మార్గంలో ఉన్నవారు సరిక్రొత్త అనుభూతులను పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.

మేష రాశి: ఈ వారం మనసులో విపరీతమైన ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది. వారం మధ్య నుంచి మనస్తాపాలు తొలగిపోతాయి.అధికంగా అన్నిటినీ పట్టించుకున్న వారు, అధిక ప్రేలాపనలు చేసే వారు మౌనం పాటించాలి. ఈ ప్రవర్తన హానికరం. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: ఇంటిలో ఒక వస్తువు రిపెయిరుకు రెడీగా ఉంది.చేయించండి. దీర్ఘకాలీన ప్రణాలికలు రూపొందుతాయి.మీ శ్రమ ఫలిస్తుంది.ప్రేమ వ్యవహారం ఒకటి బయట పడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.

 మిథున రాశి: మనసు ఒక విషయంలో కలవరపడుతుంది.దైవం అనుకూలిస్తుంది. వారాంతంలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆదాయం బాగుంది. గుండె సమస్యలున్నవారు జాగ్రత్త వహించాలి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: సమస్యలు, పరిష్కారాలు వెనువెంటనే ఉన్నాయి. ఏదో చేయాలని పూనుకుంటే సమస్య కాగలదు.కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.ఆరోగ్యం మందగిస్తుంది. రుద్రం పారాయణ చేయండి.

సింహ రాశి:ఒక మంచి పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అవరోధాలూ వస్తున్నాయి. తిరిగి ఈ వారం యోచన చేస్తారు. అందరినీ సంప్రదిస్తే ఇలానే ఉంటుంది. చేయాలనుకున్న పని తలపెట్టే ముందు శివాలయం దర్శించండి.ఒక విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు.

 కన్య రాశి: నిర్భయంగా తలచినా పనులలో ముందుకు వెళతారు. మీ నేర్పు మిమ్మల్ని కాపాడుతుంది.ఋణ విషయంలో అవరోధాలు తొలగిపోతాయి.అనుకోని చోటు నుంచి డబ్బు అందుతుంది. అనుకూలించటం లేదని అనిపించినా నిజానికి పరిస్థితులు మీ వైపే ఉన్నాయి.కుల దైవాన్ని కొలవండి.

తుల రాశి:గతంలో సామాన్యంగా ఎవరూ చేయని పనిని ఎవరినీ సంప్రదించకుండా చేసిన పనికి తీవ్రమైన పశ్చాత్తాపం పడు వారం ఇది. కొన్ని కలహాలు కనిపిస్తున్నాయి.అనవసరమైన వాద్వివాదాలు మానుకొనాలి. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: మీ ఇంటిలో ఆచారం ప్రకారం జరుప వలసిన వ్రతం లేదా పూజ ఏదైనా ఉంటే జరిపించటం మంచిది. మీ ఇంటికి అది మంచిది.ఆదాయం బాగుంది. పిల్లలు మంచి వార్తలు చెబుతారు. సుబ్రహ్మణ్య కవచం చదవంది.

 ధను రాశి:కళ్ల విషయంలో శ్రధ్ధ చూపాలి. సైనస్ ఉన్న వారు జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ఒక మార్పుకు రంగం సిధ్ధమవుతున్నది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది.స్త్రీలు చర్మ వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.

మకర రాశి:ఇంకొకరి విషయంలో చేసిన జోక్యం వలన కొద్దిగా సమస్యలు ఉండవచ్చు.మీ ఉత్సాహాన్ని అపార్థం చేసుకునే వారున్నారు. జాగ్రత్త వహించండి.కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.విష్ణు సహస్రనామం చదవండి.
 

కుంభ రాశి:రక రకాల ఆలోచనలు బాధిస్తాయి.నిస్సహాయులుగా అనిపిస్తారు. అలాంటిది ఏమీ లేదు.మంచి కాలం ముందు ఉంది.సహజమైన ప్రవర్తనకు భిన్నంగా ఏదైనా చేసే సంకల్పం మానుకోండి.అది మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టగలదు.మహా సౌరం చదవండి.

 మీన రాశి:గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లటం మంచిది కాదు. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు చూస్తారు.బంధువర్గం వలన కొన్ని కలతలు ఉండవచ్చు. సంఘంలో గౌరవం బాగుంది.మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మౌనంగా ఉండవలసిన చోట ఏదో మాట్లాడి సమస్యలు తెచ్చుకోగలరు. జాగ్రత్త వహించండి.ధ్యాన మార్గం అవలంబించండి.

ఈ వారం మంచి మాట:

మనయేవ జగత్సర్వం
మనయేవ సదారిపు:
మన ఏవహి సంసారో
మనయేవ జగత్రయం

(తేజబిందు ఉపనిషత్)

మనస్సే కలలోని వస్తువులు ఉన్నట్లుగాని భావించి సుఖదు:ఖములను పొంది భంగపాట్లు చెందుతున్నది. జాగ్రదవస్థలో కూడా ఈ మనస్సే లేని వస్తువులను సత్యమని భావించి సంయోగ వియోగ రూపంలో సుఖదు:ఖాలను కలుగచేస్తోంది. అందుచేత దు:ఖం, అశాంతి పోవాలంటే మనస్సును నిగ్రహించుకొని శమదమాది షట్ సంపత్తిని అభ్యాసం చేయాలి.

సచ్చిదానందమాత్రోహం అనుత్పన్నమిదం జగత్
కాలం నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవచ

(తేజబిందు ఉపనిషత్)

సత్యమైనది సచ్చిదానంద పరమాత్మ ఒక్కటే!అంతయూ పరబ్రహ్మమయం.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 ~~~***~~~

ఫొటోలో ఎవరున్నారు?-వేదాంతం శ్రీపతి శర్మ

గురువారం క్విజ్(4)-వేదాంతం శ్రీపతి శర్మ

క్రిందటి వారం ప్రశ్నలు, సమాధానాలు:

1. నిత్యదేవికి తిథిలోని రాత్రి భాగానికి ఏ స్వరూపం ఉంటుంది? (విమర్శాంశ)
2. పంచదశాక్షరీ మంత్రంలోని 15 అక్షరాలకు ఎవరు ఆధిపత్యం వహిస్తారు? (నిత్య దేవినులు)
3. నిత్యదేవికి తిథిలోని పగటి భాగానికి ఏ స్వరూపం ఉంటుంది? (ప్రకాశాంశ)
4. నిత్యదేవినులందరూ ఏ తిథి యందు చంద్రునిలో ఉంటారు? (పౌర్ణమి)
5. దశ మహావిద్యలలో త్రిపురసుందరి పేరేమి? (షోడశి)
6. ఏ తంత్రం దశ మహావిద్యలను విష్ణుమూర్తి దశావతారాలుగా వివరిస్తుంది? (తోడల తంత్రం)
7. తోడల తంత్రం ప్రకారం నృసింహావతారం ఏ మహావిద్య స్వరూపం? (ఛిన్నమస్త)
8. దక్షిణామూర్తి సంహిత ఏ విద్య గురించి విపులముగా చెబుతుంది? (శ్రీవిద్య)
9. హరితాయన సంహిత మరో పేరేమి? (త్రిపురా రహస్యం)
10. దేవీ మాహాత్మ్యం మూల ప్రకృతి ఎవరని పేర్కొన్నది? (మహాలక్ష్మి)
ఈ వారం ప్రశ్నలు:
1. శ్రీవిద్య రహస్య గ్రంథమైన ‘ వరివస్యా రహస్యం ‘ ఎవరు రచించారు?
2. వేద మాతను (గాయత్రిని) ఉపాసించే వారందరూ శక్తి ఉపాసకులేనని ఏ గ్రంథం చెబుతుంది?
3. పార్వతి కోశము నుండి ఆవిర్భవించిన అంబికకు ఏ పేరు వచ్చినది?
4. ‘ నీవు ఇతరుల బలముతో పోరు సల్పుతున్నావు ‘ అని దుర్గతో ఏ అసురుడు పల్కెను?
5. దేవి సమాధానమేమి?
6. దీనికి తార్కాణముగా ఏమి జరిగెను?
7. శుంభుని దేవి ఏ అయుధముతో సంహరించెను?
8. ‘ యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా…’
ఏ సూక్తములోనిది?
9. గర్భం ధరించిన వారి గర్భాన్ని కాపాడే ‘ గర్భ రక్షకాంబిక ‘ ఆలయం ఎక్కడున్నది? కోణం)
10. గర్భ రక్షకాంబికగా ఎవరిని పిలుస్తారు?

‘నిన్న లేని అందమేదో ‘(12)-వేదాంతం శ్రీపతి శర్మ

‘ లింగా…’
‘ సార్!’
‘ నిన్న లేని ఈ విచిత్రం ఏమిటి లింగా?’
‘ ఏమైంది సార్?’
‘ ఆ రోజు చక్కగా ప్రేమ లేచి నిలబడి మనతో పాటు నడిచింది అని ఎంచక్కా జెండా ఎగరేశామా?’
‘ కరెక్ట్. నేనే ఎక్కువగా చొక్కా చించుకున్నాను.’
‘ మరి ఇలా నా వొడిలో వాలి నా ప్రాణాలు తీస్తూ అలా దిగులుగా ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నావు?’
‘ నాకూ అదే అర్థం కావటం లేదు సార్! నాకు కలిగిన ఆ ధైర్యం, ఆ మాటలు క్షణికమేనా?’

‘ ఏమైంది లింగా?’
‘ డాబా మీదకి మరల నిన్న వెళ్లాను!’
‘ వెరీ గుడ్!’
‘ ఎదురుగా రంగా!’
‘ ఛా!’
‘ అవును. ఈ రోజు తను ముందుగా డాబా మీదకి వచ్చింది…’
‘ నువ్వు లేవ వయ్యా లింగా! లే!’
‘ ఎందుకు సార్?’
‘ అరే! నేను స్పందించాలంటే ఇలా కుదరదు!’
లింగా లేచాడు.’ యస్?స్పందించండి మరి!’
‘ ఆ…అర్థమైంది.అమ్మాయి మనసు కదులుతోంది. నువ్వు నా వొడిలోంచి లేచినట్లు, బుట్ట లోంచి పాము ఉన్న పళంగా లేచినట్లు, నేను ఇలా స్పందించుటకు కదిలి సద్దుకున్నట్లు ఒక సున్నితమైన భావం ఒక కెరటంలా అలా కొట్టుకుని వస్తోంది లింగా. ఆలోచించు!’
‘ నన్ను చూడగానే అటు తిరిగి పిట్టగోడ దాకా అలా వెళ్లిపోయింది సార్!’
‘ సిగ్గు లింగా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా?’
‘ కావచ్చు. కానీ మరీ అలా తేలును చూసినట్లు పారిపోతే ఎలా సార్?’
‘ తప్పు లేదు లింగా.ప్రేమ విషయంలో తేలయినా తొండైనా ఫరవాలేదు. అలా వెళ్లకుండా అమాంతం మీద వాలిపోతే ఆలోచించాలి గానీ…’
‘ అన్యాయం సార్!’
‘ ఏమిటీ?’
‘ అబ్బా ఇంతకీ చెప్పేది వినండి సార్!’
‘ చెప్పు. అటు తిరిగి సూర్యాస్తమయాన్ని చూస్తూ తన ఆలోచనలను నీతో పంచుకుందా? లేక సాయం సంధ్య రాగం ఒకటి నీ కోసం ప్రత్యేకంగా పాడటం మొదలు పెట్టిందా?’
‘ చేతులు కట్టుకుంది.’
‘ వెరీ గుడ్!’
‘ నా పాట వింటే గానీ చదవలేవా లింగా? అని అడిగింది.నీకు నమ్మకం లేదా? అని అడిగాను. నాకు ఇటువంటివి నచ్చవు అనేసింది.’
‘ ఓహో! నువ్వు తగ్గద్దు. ఏమన్నావు?’
‘ నేను నిజం చెప్పాను అన్నాను.’
‘ అద్దీ!’
‘ నువ్వు ఒకటి నమ్ముతావనీ, మరొకటి నమ్మవనీ నేను మాట్లాడను, అన్నాను ‘
‘ ఇంత ధైర్యంగా మాట్లాడి ఇలా నీరు గారుతావేమిటి లింగా?’
‘ ధైర్యంగా మాట్లాడటం ఒక వైపు. ఆమెకు నొప్పి కలుగకుండా మాట్లాడటం మరో వైపు…’
ఇది ఆలోచించాలి అనిపించింది.
‘ అది కాదు లింగా!మనసు విప్పి నిజం చెప్పే వాళ్లని అమ్మాయిలు ఇష్ట పడతారు కదా?’
‘ కావచ్చు. అన్ని చోట్లా పనికి రాదు.కావాలని ఓడిపోవటం ప్రేమలో ఒక భాగమని అర్థమవుతోంది సార్!’
‘ ప్రేమ ఎక్కడుందో ఏమో! దానితో పాటు చాలా నేర్చుకుంటున్నావు లింగా!’
‘ నిజమే సార్!ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ రాజధాని అంటే కాదనను!’
‘ ఛా!’
‘ అవును. హైదరాబాదేమో అంటాను!’
‘ మరి అమ్మాయితో ఏమన్నావు?’
‘ రంగా,నేను అలా నీ పాట విషయంలో ఎందుకన్నానో తెలుసా? అని అడిగాను. నా కళ్లల్లోకి సూటిగా చూసింది.’
లింగా భుజం మీద చేయి వేశాను.
‘ ఎలా అనిపించింది లింగా?’
‘ నేను ఇంతకాలం గుడ్డివాడిలాగానే బ్రతికాను అనుకున్నాను సార్! అదేదో వెలుగు కొత్తగా అనిపించింది. నేను ఈ మధ్యనే అసలు చూడటం మొదలు పెట్టాను…’
 ’ ఇంతకీ ఏమన్నావు?’
‘ నేను…రంగా నేను…’
‘…’
‘ అమ్మాయి అలా చూస్తూనే ఉంది…’
‘ చెప్పు లింగా, ప్లీస్ చెప్పు లింగా.మానవ జాతి జీవిత చరిత్ర ఈ రెండు పెదాల మధ్య లోంచి జారే ఈ రెండు పదాల మధ్య ఉంది.’
‘ రంగా…అదేమిటో సార్, అమ్మాయి రెప్ప ఆర్పకుండా చూసింది.ఆ చూపులో అర్థమేమిటో తెలియలేదు. నేను లోలోన కొట్టుకున్నాను కానీ మాట రాలేదు.’
‘ నో! అమ్మాయి వెళ్లిపోయిందా?’
‘ నేను కళ్లు మూసుకుని తెరిచే లోపు అటు తిరిగి నాలుగు అడుగులు వేసింది. నీ బాధ ఏమిటో నాకు తెలుసు లింగా. కుర్రాళ్లు చాలా మంది ఈ వయసులో ఇలాగే ప్రవర్తిస్తారు.ఏదో ఊహించుకుంటారు.ఇది అంత తేలిక కాదు…నేనూ ఆగలేదు.’
‘ గుడ్! ఏమన్నావు?’
‘ నువ్వేమైనా అనుకో రంగా! నేను చెప్పదలచుకున్నది చెప్పే తీరుతాను. నేను…అమ్మాయి నువ్వు అంది ఇటు తిరగకుండానే!’
‘ చెప్పావా?’
‘ నేను నిన్ను ప్రేమిస్తున్నానేమోనని అనుమానంగా ఉంది రంగా అన్నాను!’
నా తెరచిన నోరు అలానే ఉంది!’ ఏమిటది? అనుమానమా?’
‘ అమ్మాయి కూడా అటు తిరిగి అదే మాట అంది. ఈ మాట దగ్గరే అనుమానం అయితే ఇంకా ఆ పైన ఏది ఎలా ఉంటుందో, లింగా, గాడ్ బ్లెస్ యు! అని గబ గబా దిగిపోయింది!’
‘ అనుమానం…ఇదేమిటి లింగా?’
‘ తెలియదు సార్! ఇప్పుడు ఏమవుతుందోనని ఇంతాకటి నుంచీ ఆకాశం వైపు చూస్తున్నాను.’
‘ అనుమానమే! వాన కురవక పోవచ్చు!’

~~~***~~~

(తరువాయి భాగం త్వరలోనే!)

ఫొటో క్విజ్ 114-వేదాంతం శ్రీపతి శర్మ

ఇది ఒక స్వాతంత్ర్య సమరయోధుని నివాసం.ఎవరిది?
This was the residence of a Freedom Fighter. Who was it?

ఫొటో క్విజ్113-సమాధానం

డెవిల్ ఫైయర్ ఫిష్
Devil Fire Fish

ఈ బొమ్మలోనిది నిజమా?-వేదాంతం శ్రీపతి శర్మ

పురాణ కాలక్షేపం(2)-వేదాంతం శ్రీపతి శర్మ

శ్లో: యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
      తయో: సంస్మరణాత్ నిత్యం సర్వతో జయమంగళం
ఏ పనినైనా ప్రారంభించే ముందు, ప్రయాణం ముందు ఈ శ్లోకం చదివి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను స్మరిచ్ణుకోవటం ఉత్తమమైన ఆచారం.
శివుడు ఆనందస్వరూపుడు.శబ్దార్థములలో అర్థమునకు అధిస్ఠాన దేవత, సర్వాత్మకుడు.సర్వమంగళ-పార్వతి వాగధిస్ఠాన దేవత-శబ్దప్రపంచమునకు అధిష్ఠాన దేవత. పార్వతీపరమేశ్వరులను ఆరాధించిన రమణీయములగు శబ్దార్థములు స్ఫురించును. ఆరాధన, పూజ, జపస్తుతి,కీర్తనములు, ధ్యానము…వీటిలో పూజ కాయికము (శరీరము చేయునది). జప, స్తుతి, కీర్తనములు వాచికములు (వాక్కుతో చేయునవి), ధ్యానము మానసము.
పార్వతియే గౌరి. వివాహాదులందు గౌరి పూజ ప్రసిధ్ధము. అన్యోన్యానురాగమును ఈ పూజ వర్ధిల్లజేయును. నామజపము, స్తోత్రపాఠము, నామ సంకీర్తనము దురితక్షయము చేసి వాక్ శుధ్ధికి కారణమగును.ఈశ్వరానుగ్రహము సిధ్ధింపజేయును…

యుగము అనునది యోగము నుండి ఉద్భవించినది. యుగళగీతమన్నా ఇద్దరు కలసి పాడునది. ఈ సృష్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలసి పాడు యుగళగీతమే!

ఇక్కడ విశేషమేమిటంటే పరమేశ్వరుడు, పార్వతీ-ఇద్దరూ ఒకటిగా ఉన్నప్పుడే శబ్దమునకు అర్థము. ఒకరికి ఒకరు తాత్పర్యం! ఒక్కరిగా ఇద్దరికీ అర్థం లేదు. అక్కడ ఉన్న అన్యోన్యం అది.

ఒక వస్తువు లేదా విషయం, అది కాలభాగం కానీ గ్రహభాగం కానీ లేదా ఏ ప్రాణశక్తి అయినా కానివ్వండి. అది నిలబడి ముందుకు వెళుతున్నదీ అంటే, వెళ్లాలీ అంటే పార్వతీపరమేశ్వరుల అనుగ్రహమే కానీ మరొకటి కాదు…

అందు చేత ‘సర్వతో జయమంగళం ‘అని కోరుకునే ముందు ఆదిదంపతులను స్మరించుకోవలసి ఉన్నది.

శివుని ఆఙ్ఞ లేనిదే చీమ అయినా కదలదు. చీమ కదులుతోందీ అంటే ఆయన ఆఙ్ఞ ఉన్నట్లే! అంటే ఆయన ఆశీర్వాదం ఉన్నట్లే!

మనకు ఇంకేమి కావాలి?

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.