01.02.2009 నుండి 07.02.2009 వరకు రాశి ఫలాలు:వేదాంతం శ్రీపతి శర్మ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు!

01.02.2009 నుండి 07.02.2009 వరకు రాశి ఫలాలు:

ఈ వారం రవి కుజ గురు రాహు గ్రహాలు మకరం లోనూ,బుధుడు ధను రాశిలోనూ, శుక్రుడు మీన రాశిలోనూ, కేతువు కర్కాటకం లోనూ, శని సింహంలోనూ, చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున రాశులలోనూ సంచరిస్తారు.

ఈ గ్రహ స్థితి రాజకీయ రంగాన్ని ఉధృతం చేస్తున్నది. కొత్త వ్యక్తులు ఈ వేదిక మీదకి ఎక్కనున్నారు! స్త్రీలు ముందుకు దూకబోతున్నారు! నువ్వా నేనా అనే స్త్రీలు కూడా బలాబలాలు తేల్చుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి బాధ్యత నిర్వహణ పట్ల తీవ్రమైన విమర్శలు ఎదరవుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. దొంగతనాలు విరివిగా జరుగవచ్చును.

మేష రాశి: ఈ రాశి వారికి చాలా మంచి వారం. అనుకోని డబ్బు అందుతుంది, అనుకున్నట్లు బంధువులు వస్తారు. ఒకరి పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ సోమవారం శివాలయం దర్శించండి.

వృషభ రాశి: ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో శ్రధ్ధ వహించాలి. వారాంతం బాగుంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే
చర్చలు చేసికొని వచ్చే వారం ప్రారంభించవచ్చును.

మిథున రాశి: మంచి అదృష్టం లసి వచ్చే వారం. ఏదైనా లకీ లాటరీ ఉంటే వెలికి తీయండి. ఉదుఓగంలో ఒక మార్పు ఉండవచ్చును. అధికంగా ఆలోచన వలన నిద్ర పట్టదు. పాత వస్తువొకటి మరమ్మత్తుకు రావచ్చును.

కర్కాటక రాశి: మీ పనులను వెరే వారు చేపడతారు. రాజకీయాలలోని వారికి మంచి ఆలోచనలు కలసి వచ్చే వారం. మీ కదలికలను చాలా మంది గమనిస్తున్నారు. ఆలోచించి అడుగులు వేయండి.

సింహ రాశి: మీ నడవడి అందరినీ ఆకటుకుంటుంది. మీ క్రింద పని చేసే వారి పట్ల జాగ్రత్త వహించాలి. ఆహార విషయాలలో శ్రధ్ధ చూపాలి. ఈ శుక్రవారం ఒక మంచి వార్త వింటారు.

కన్య రాశి: అజీర్ణం బాధిస్తుంది. జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరుపుతారు. గత స్మృతులు కొద్దిగా కలవర పెడతాయి. స్త్రీలకు కోపం పెరుగుతుంది. దుర్గా దేవిని దర్శించండి. ఒక పెద్ద పనిని మీరు త్వరలోనే చేపట్టబోతున్నారు!

తుల రాశి: ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఫోనులో కంటే వెళ్లి సంప్రదిస్తే లాభం ఎక్కువ ఉండగలదు. వ్యాపారం కలసి వస్తుంది. నూనె వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం బాగుంటుంది. ఇంటిలో పని చేసే వారిని కనిపెట్టి ఉండండి.

వృష్చిక రాశి: మంచి ఆలోచన చేసి ఉండటం చేత నలుగురికీ చెప్పాలని అనిపిస్తుంది. ఆగండి! ఇది సమయం కాదు. మీరు అనుకున్నట్లు అందరూ అర్థం చేసుకునే సమయం కాదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ చూపాలి. దానానికి డబ్బు వెచ్చిస్తారు.

ధను రాశి: వారం ప్రారంభం స్త్రీలతో వివాదంతో ప్రారంభమవుతుంది. సంయమనం పాటించండి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చును. మీ ఇంటిలో ఎవరైనా అద్దెకు ఉన్నట్లయితే వారు ఖాళీ చేయవచ్చును. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

మకర రాశి:బాధ్యతలు పెరుగుతాయి. బాధగా కూడా ఉండగలదు. అన్నిటినీ విధిగా నిర్వర్తించండి. గురువారం మీకు మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. స్త్రీలు అధికంగా శ్రమించకూడదు. పాటలు పాడే వారికి మంచి అవకాశాలు వస్తాయి.

కుంభ రాశి: మౌనం ఎక్కువగా పాటించినందుకు మంచి ఫలితాలు ఉంటాయని తెలుసుకుంటారు. విదేశాల నుండి మంచి వార్తలు వింటారు. సోదరుల కలయిక ఉండవచ్చును. ఒక ఒప్పందం మీద సంతకాలు చేస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు కాగలదు. చింతించకండి!

మీన రాశి: నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. విరివిగా చర్చలు జరుపుతారు. ఇంటిలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతుంది. చక్కెర జబ్బు ఉన్న వారు జాగ్రత్త వహించాలి. ఈ వారం శివునికి అభిషేకం జరిపించండి.

ఈ వారం మంచి మాట:

ప్రభురగ్ని: ప్రతపనే భూమిరావపనే ప్రభు:
ప్రభు: సూర్య: ప్రకాశిత్వే సతాం చాభ్యాగత: ప్రభు:

(మహా భారతం ఆదిపర్వం లోని సంభవ పర్వం 88.13)

అగ్నిలో తపించు శక్తి ఉన్నట్లు, పృథ్విలో నాటిన విత్తనాన్ని ధరించు శక్తి ఉన్నట్లు, సూర్యునిలో ప్రకాశించు శక్తి ఉన్నట్లు సాధు సంతులను శాసించు శక్తి కేవలం అభ్యాగతునికి ఉంటుంది.

‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శత నామ పద్యమాల’-పుస్తక పరిచయం

శ్రీ లక్ష్మ్యష్టోత్తరములలోని 108 నామాలకు డా. వి.ఏ. కుమారస్వామి గారు 108 పద్యాలు భావార్థములతో పాటుగా ‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామ పద్యమాల ‘ అను పేరుతో రచించి యున్నారు.

ఈ పుస్తకం ముందుగా అష్టోత్తర నామాలకు గల అర్థాలను, గూఢార్థాలను సరళంగా చెబుతున్నది. ఆ అర్థాలను కవిత్వంలోకి రంగరించుకుని చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో పద్యాలలోకి మార్చినట్లు (అమర్చినట్లు)కనిపిస్తున్నది.

లక్ష్మీ దేవి యొక్క 108 నామముల గురించి తెలుసుకోవలనుకున్నా పద్యరీతిలో ఆస్వాదించాలనుకున్నా, ఒక సారి పుస్తకాన్ని చదివి తీరాలి.

నిజం చెప్పాలంటే ఈ ఆలోచనే చిత్రమైనది!
ఈశ్వరుని సృష్టి యావత్తూ ఒక కవనమే అనుకుంటే ఒకలా ఉంటుంది. భగవంతుని, ఆయన విన్యాసలనూ కలిపి కవిత్వంలోకి రంగరించ గల్గటం మన సంస్కృతికి, మన సాహిత్యానికే చెల్లింది.

ఈ పుస్తకానికి పీఠిక సాహిత్య అకాడమీ , తెలుగు అడ్వైసరీ బోర్డ్ కన్వీనర్ డా. పోరంకి దక్షిణామూర్తి గారు వ్రాశారు.

కవి భూమికలో చెబుతున్నారు-

విలసదమేయ వాగ్విభుడు భీష్మపితామహుచేత స్వస్తుతుల్
పలుగకజేసెనెవ్వడు, కృపా పర తంత్రత వాడు నేడు నా
సలలిత మాతృ భాష పయి సాదరుడై సరసార్థ వాగ్ఝరిన్
పలుగక జేసె మద్రచన ప్రాఙ్ఞ్యజనస్తవనీయ శైలిలో!

ఈ భూమికను ఆయన ముక్కోటి ఏకాదశి రోజున రచించారు. విష్ణు సహస్రనామ పారాయణ అను ఉపాసన కవితా పిపాసకు హేతువయి తల్లిని గూర్చి చెప్పు భాషను ‘ సలలితం ‘ గా లాలిత్యంతో మేళవించి ‘ మాతృభాష ‘ అనగా సామాన్యులకు తల్లి ఇందులోంచి పలికిన కవిత్వంగా చెప్పి మాన్యుల స్తవనీయ శైలి కూడా చూసిన వారికి కనిపిస్తుందని చిత్రంగా చెప్పారు!

మామూలు మనుషులకు ఆసక్తికరంగా కొన్ని కనిపిస్తాయి. మచ్చుకు ‘ యశస్విని ‘ అను నామాన్ని తీసుకుందాం :

చదువు రాని వాళ్లకు సమస్యను సరస్వ
తి సృజనము చేసి కీర్తివిసృజన చేసె
పర్వతమునెక్క వలయును పార్వతి గన
కనులవిందగు నిను యశస్విని నుతింతు!

చదువు రాని వారికి సరస్వతి గురించి తెలియటం కష్టం. పర్వతం ఎక్కనిదే పార్వతి కనిపించదు. కానీ ధనం రూపంగా అందరికీ కనిపించు లక్ష్మి అందరికంటే ఎక్కువ పాపులర్ అని చెప్పారు!

ఈ నామములలోని ఇతర ఉపాసనా పధ్ధతుల సమన్వయము కూడా కనిపిస్తుంది :

నవదుర్గలు నీ రూపము
నవార్ణ మంత్రము నా వంతు, లస
న్నవదుర్గా, నైకవిధం
బవనము చూపించు నీకు నాశ్రితుడ కదా!

నవదుర్గల రూపంలో ప్రజలను రక్షణ చేయుచున్నది లక్ష్మియేనని చెప్పటమైనది.

మొదటి పద్యం, చివరి పద్యం గురించి ఇక్కడ ఉదహరించవలసి ఉన్నది :

ప్రకృతి యన నీవ యగుదువు
సుకృతమ్ములు చేయువారి సుఖములకెల్లన్
ప్రకృతివి ప్రధానమీవే
వికటింపగ లక్ష్మి, నా కవిత్వము వినవే!

ప్రకృతి అనగా ప్రధానమని కూడా అర్థమున్నది. భారతీయ తత్వ శాస్త్రములో మూలప్రకృతిని లక్ష్మి అనే చెప్పారు. అట్టి లక్ష్మీ దేవిని తన కవిత్వమును వినవలసినదిగా ప్రార్థిస్తూ ఈ కవనమనేది ఆమె పాల్గొంటున్న ప్రకృతిగా నాందివచనం చెప్పటం, చెప్పగల్గటం విశేషం!

చివరగా :

భువనేశ్వరి కిదెవందన
మవనిన్ సాష్టాంగ సరణి నగుగావుత, నా
కవనము నాకవనంబై
నవరీతిని సుమనసులకు నందనమగుతన్!

ఇది కవన ప్రక్రియలో చరమస్థాయి! సృష్టియే కవిత్వమని చెప్పుకున్నాము! మరి ఆమె భువనేశ్వరి కదా? సుమనస్ అను శబ్దమునకు పువ్వులు, సత్పురుషులు, దేవతలు..అని చాలా అర్థములున్నవి. ఈ కవనము స్వర్గములో నందనవనమై సత్పురుషులకు నందనము-సంతోషము కలిగించుగాక అని అర్థాంతరము.

ఇక్కడ రెండు రకాల శ్లేష కనిపిస్తుంది-నా, కవనము-నాకవనము (స్వర్గవనము)-ఇది సభంగ శ్లేష. సుమనసులు నందనము అన్నప్పుడు అర్థశ్లేష అలంకారములు ఆహ్లాదకరంగా సాగాయి!

ఇదే రీతిలో వారు శ్రీ విష్ణు సహస్రనామముల నామార్థములను పద్యాల రూపంలో భావార్థములతో పాటు రచించి యున్నారు. ప్రచురణ చేయ దలచిన వారు ముందుకు రాగలరు!

ఈ పుస్తకం కేవలం 45 పుటలు. ధర వ్రాయబడినట్లు లేదు. పుస్తకం లభించు స్థలం:
శ్రీమతి ఇ. గీత
బి-1240, ఎన్.జి.ఓ కాలనీ
వనస్థలిపురం
హైదరాబాదు-500070

మొబైల్: 9989063749

-వేదాంతం శ్రీపతి శర్మ

బిగ్ బాస్ వ్యవహారాలు-వేదాంతం శ్రీపతి శర్మ

మన దేశంలోని రాజకీయ విశ్లేషకులు ఒబామా ఎంచుకున్న పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ ఎన్వై రిచర్డ్ హోల్బ్రూక్ పరిధి లోంచి కశ్మీర్ వ్యవహారాన్ని తొలగించినoదుకు సంతోషిoచారు. యూ. ఎస్. లోని కొందరు భారతీయులు కూడా కొద్ది సేపు హమ్మయ్య అన్నారు. కొన్ని చోట్ల ఇది భారత దేశపు దౌత్యానికి ఒక విజయం అని కూడా వ్యాఖ్యానించారు. ఇదేంటి?

హోల్బ్రూక్ ని బుల్డోజర్ అని 1995 తరువాత పిలువటం ప్రారంభించారు. బోస్నియాలో యుధ్ధం జరుపుతున్న ఇద్దరినీ భయపెట్టి మాటలలోకి దింపి ఈయన యుధ్ధాన్ని ఆపిన వ్యక్తి. అటువంటి వాడు పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ వ్యవహారాలతో పాటు కశ్మీర్ ను కూడా చంకలో పెట్టుకుని ఇటు వైపు బయలుదేరితే మంచిది కాదని దక్షిణ ఆసియా వ్యవహారాలు సమీక్షించే మేధావులు అభిప్రాయ పడ్డారు.

మన దేశంలో కొన్ని పత్రికలు ఇది పెద్ద ఉపయోగకరమైనది కాదని చెబుతున్నాయి.
యు.ఎస్. రిసెషన్ కు సంబంధించి చైనాతో జరుపు సంబంధ వ్యవహారాలూ, అఫ్ఘాన్ పరిస్థితి వలన పాకిస్తాన్తో పెట్టుకున్న సంబంధాలు, ఒబామా సి.టి. బి.టి మీద చూపుతున్న మొగ్గు యు.ఎస్. భారత సంబంధాలకు అంత మంచి సూచకాలు కావని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

26.01.2009 రోజున ఒబామ భారత దేశానికి యు.ఎస్.ను మించిన మిత్రుడు లేడని సినిమా పక్కీలో చెప్పిన గంటలో ఆ దేశంలో కంపెనీలు కేవలo భారతీయులనే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని ప్రకటించాయి!

కొద్దిగా లోపలికి వెళితే ప్రపంచ వ్యవహారాలలో మన దేశం సక్రియంగా ఈ మధ్య పాల్గొనకపోవటం వలన మన సమస్యలను మనకు యు.ఎస్. ఎక్కువగా వదిలేయటం జరుగుతోందని ఎకనమిక్ టైంస్ చెబుతోంది.

కశ్మీర్, పాకిస్తానుకు వస్తే మనం స్వయంగా ఏమి చేయగలుగుతున్నాం? ఏమీ కనపడదు. ముంబయిలో జరిగిన దానికి ప్రపంచ దౌత్య వ్యవహారాలను వేగం పెంచి హడావుడి చేశారు. మరల మెదలకుండా కూర్చున్నారు. ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం అంటూ చొక్కాలు చించుకున్నారు…

కాకపోతే హోల్బ్రూక్ ను ఈ గొడవ నుంచి తప్పించి యు.ఎస్. మన దేశానికి మంచి మాటే చెప్పింది. ‘ మీ గొడవ మీది ‘ అని ఒప్పుకుంది. చాలా కాలం క్రితమే ఐరోపా దేశాలు భారత దేశం బార్డర్స్ దాటినప్పుడు కదా మేము సమర్థిస్తామా లేమా అన్నది చెప్పేది అని ప్రకటించి యున్నాయి. బాధింప బడ్ద వాడు ముందు లేచి నిలబడి నా జోలుకి ఎందుకు వస్తున్నావు అని దెబ్బ కొట్టి అడగాలి. అది లేనప్పుడు ఏ దేశం ఏమి మాట్లాడుతుంది?

ఫొటోక్విజ్12-వేదాంతం శ్రీపతి శర్మ

ఈ ఫోటో మన చరిత్రలోని ఏ ఘట్టాన్ని చెబుతోంది?

Follow

Get every new post delivered to your Inbox.