01.02.2009 నుండి 07.02.2009 వరకు రాశి ఫలాలు:వేదాంతం శ్రీపతి శర్మ
31 జన 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-ఫలములు
శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు!
01.02.2009 నుండి 07.02.2009 వరకు రాశి ఫలాలు:
ఈ వారం రవి కుజ గురు రాహు గ్రహాలు మకరం లోనూ,బుధుడు ధను రాశిలోనూ, శుక్రుడు మీన రాశిలోనూ, కేతువు కర్కాటకం లోనూ, శని సింహంలోనూ, చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున రాశులలోనూ సంచరిస్తారు.
ఈ గ్రహ స్థితి రాజకీయ రంగాన్ని ఉధృతం చేస్తున్నది. కొత్త వ్యక్తులు ఈ వేదిక మీదకి ఎక్కనున్నారు! స్త్రీలు ముందుకు దూకబోతున్నారు! నువ్వా నేనా అనే స్త్రీలు కూడా బలాబలాలు తేల్చుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి బాధ్యత నిర్వహణ పట్ల తీవ్రమైన విమర్శలు ఎదరవుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. దొంగతనాలు విరివిగా జరుగవచ్చును.
మేష రాశి: ఈ రాశి వారికి చాలా మంచి వారం. అనుకోని డబ్బు అందుతుంది, అనుకున్నట్లు బంధువులు వస్తారు. ఒకరి పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ సోమవారం శివాలయం దర్శించండి.
వృషభ రాశి: ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో శ్రధ్ధ వహించాలి. వారాంతం బాగుంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే
చర్చలు చేసికొని వచ్చే వారం ప్రారంభించవచ్చును.
మిథున రాశి: మంచి అదృష్టం లసి వచ్చే వారం. ఏదైనా లకీ లాటరీ ఉంటే వెలికి తీయండి. ఉదుఓగంలో ఒక మార్పు ఉండవచ్చును. అధికంగా ఆలోచన వలన నిద్ర పట్టదు. పాత వస్తువొకటి మరమ్మత్తుకు రావచ్చును.
కర్కాటక రాశి: మీ పనులను వెరే వారు చేపడతారు. రాజకీయాలలోని వారికి మంచి ఆలోచనలు కలసి వచ్చే వారం. మీ కదలికలను చాలా మంది గమనిస్తున్నారు. ఆలోచించి అడుగులు వేయండి.
సింహ రాశి: మీ నడవడి అందరినీ ఆకటుకుంటుంది. మీ క్రింద పని చేసే వారి పట్ల జాగ్రత్త వహించాలి. ఆహార విషయాలలో శ్రధ్ధ చూపాలి. ఈ శుక్రవారం ఒక మంచి వార్త వింటారు.
కన్య రాశి: అజీర్ణం బాధిస్తుంది. జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరుపుతారు. గత స్మృతులు కొద్దిగా కలవర పెడతాయి. స్త్రీలకు కోపం పెరుగుతుంది. దుర్గా దేవిని దర్శించండి. ఒక పెద్ద పనిని మీరు త్వరలోనే చేపట్టబోతున్నారు!
తుల రాశి: ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఫోనులో కంటే వెళ్లి సంప్రదిస్తే లాభం ఎక్కువ ఉండగలదు. వ్యాపారం కలసి వస్తుంది. నూనె వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం బాగుంటుంది. ఇంటిలో పని చేసే వారిని కనిపెట్టి ఉండండి.
వృష్చిక రాశి: మంచి ఆలోచన చేసి ఉండటం చేత నలుగురికీ చెప్పాలని అనిపిస్తుంది. ఆగండి! ఇది సమయం కాదు. మీరు అనుకున్నట్లు అందరూ అర్థం చేసుకునే సమయం కాదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ చూపాలి. దానానికి డబ్బు వెచ్చిస్తారు.
ధను రాశి: వారం ప్రారంభం స్త్రీలతో వివాదంతో ప్రారంభమవుతుంది. సంయమనం పాటించండి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చును. మీ ఇంటిలో ఎవరైనా అద్దెకు ఉన్నట్లయితే వారు ఖాళీ చేయవచ్చును. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.
మకర రాశి:బాధ్యతలు పెరుగుతాయి. బాధగా కూడా ఉండగలదు. అన్నిటినీ విధిగా నిర్వర్తించండి. గురువారం మీకు మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. స్త్రీలు అధికంగా శ్రమించకూడదు. పాటలు పాడే వారికి మంచి అవకాశాలు వస్తాయి.
కుంభ రాశి: మౌనం ఎక్కువగా పాటించినందుకు మంచి ఫలితాలు ఉంటాయని తెలుసుకుంటారు. విదేశాల నుండి మంచి వార్తలు వింటారు. సోదరుల కలయిక ఉండవచ్చును. ఒక ఒప్పందం మీద సంతకాలు చేస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు కాగలదు. చింతించకండి!
మీన రాశి: నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. విరివిగా చర్చలు జరుపుతారు. ఇంటిలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతుంది. చక్కెర జబ్బు ఉన్న వారు జాగ్రత్త వహించాలి. ఈ వారం శివునికి అభిషేకం జరిపించండి.
ఈ వారం మంచి మాట:
ప్రభురగ్ని: ప్రతపనే భూమిరావపనే ప్రభు:
ప్రభు: సూర్య: ప్రకాశిత్వే సతాం చాభ్యాగత: ప్రభు:
(మహా భారతం ఆదిపర్వం లోని సంభవ పర్వం 88.13)
అగ్నిలో తపించు శక్తి ఉన్నట్లు, పృథ్విలో నాటిన విత్తనాన్ని ధరించు శక్తి ఉన్నట్లు, సూర్యునిలో ప్రకాశించు శక్తి ఉన్నట్లు సాధు సంతులను శాసించు శక్తి కేవలం అభ్యాగతునికి ఉంటుంది.
‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శత నామ పద్యమాల’-పుస్తక పరిచయం
31 జన 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-విద్య

శ్రీ లక్ష్మ్యష్టోత్తరములలోని 108 నామాలకు డా. వి.ఏ. కుమారస్వామి గారు 108 పద్యాలు భావార్థములతో పాటుగా ‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామ పద్యమాల ‘ అను పేరుతో రచించి యున్నారు.
ఈ పుస్తకం ముందుగా అష్టోత్తర నామాలకు గల అర్థాలను, గూఢార్థాలను సరళంగా చెబుతున్నది. ఆ అర్థాలను కవిత్వంలోకి రంగరించుకుని చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో పద్యాలలోకి మార్చినట్లు (అమర్చినట్లు)కనిపిస్తున్నది.
లక్ష్మీ దేవి యొక్క 108 నామముల గురించి తెలుసుకోవలనుకున్నా పద్యరీతిలో ఆస్వాదించాలనుకున్నా, ఒక సారి పుస్తకాన్ని చదివి తీరాలి.
నిజం చెప్పాలంటే ఈ ఆలోచనే చిత్రమైనది!
ఈశ్వరుని సృష్టి యావత్తూ ఒక కవనమే అనుకుంటే ఒకలా ఉంటుంది. భగవంతుని, ఆయన విన్యాసలనూ కలిపి కవిత్వంలోకి రంగరించ గల్గటం మన సంస్కృతికి, మన సాహిత్యానికే చెల్లింది.
ఈ పుస్తకానికి పీఠిక సాహిత్య అకాడమీ , తెలుగు అడ్వైసరీ బోర్డ్ కన్వీనర్ డా. పోరంకి దక్షిణామూర్తి గారు వ్రాశారు.
కవి భూమికలో చెబుతున్నారు-
విలసదమేయ వాగ్విభుడు భీష్మపితామహుచేత స్వస్తుతుల్
పలుగకజేసెనెవ్వడు, కృపా పర తంత్రత వాడు నేడు నా
సలలిత మాతృ భాష పయి సాదరుడై సరసార్థ వాగ్ఝరిన్
పలుగక జేసె మద్రచన ప్రాఙ్ఞ్యజనస్తవనీయ శైలిలో!
ఈ భూమికను ఆయన ముక్కోటి ఏకాదశి రోజున రచించారు. విష్ణు సహస్రనామ పారాయణ అను ఉపాసన కవితా పిపాసకు హేతువయి తల్లిని గూర్చి చెప్పు భాషను ‘ సలలితం ‘ గా లాలిత్యంతో మేళవించి ‘ మాతృభాష ‘ అనగా సామాన్యులకు తల్లి ఇందులోంచి పలికిన కవిత్వంగా చెప్పి మాన్యుల స్తవనీయ శైలి కూడా చూసిన వారికి కనిపిస్తుందని చిత్రంగా చెప్పారు!
మామూలు మనుషులకు ఆసక్తికరంగా కొన్ని కనిపిస్తాయి. మచ్చుకు ‘ యశస్విని ‘ అను నామాన్ని తీసుకుందాం :
చదువు రాని వాళ్లకు సమస్యను సరస్వ
తి సృజనము చేసి కీర్తివిసృజన చేసె
పర్వతమునెక్క వలయును పార్వతి గన
కనులవిందగు నిను యశస్విని నుతింతు!
చదువు రాని వారికి సరస్వతి గురించి తెలియటం కష్టం. పర్వతం ఎక్కనిదే పార్వతి కనిపించదు. కానీ ధనం రూపంగా అందరికీ కనిపించు లక్ష్మి అందరికంటే ఎక్కువ పాపులర్ అని చెప్పారు!
ఈ నామములలోని ఇతర ఉపాసనా పధ్ధతుల సమన్వయము కూడా కనిపిస్తుంది :
నవదుర్గలు నీ రూపము
నవార్ణ మంత్రము నా వంతు, లస
న్నవదుర్గా, నైకవిధం
బవనము చూపించు నీకు నాశ్రితుడ కదా!
నవదుర్గల రూపంలో ప్రజలను రక్షణ చేయుచున్నది లక్ష్మియేనని చెప్పటమైనది.
మొదటి పద్యం, చివరి పద్యం గురించి ఇక్కడ ఉదహరించవలసి ఉన్నది :
ప్రకృతి యన నీవ యగుదువు
సుకృతమ్ములు చేయువారి సుఖములకెల్లన్
ప్రకృతివి ప్రధానమీవే
వికటింపగ లక్ష్మి, నా కవిత్వము వినవే!
ప్రకృతి అనగా ప్రధానమని కూడా అర్థమున్నది. భారతీయ తత్వ శాస్త్రములో మూలప్రకృతిని లక్ష్మి అనే చెప్పారు. అట్టి లక్ష్మీ దేవిని తన కవిత్వమును వినవలసినదిగా ప్రార్థిస్తూ ఈ కవనమనేది ఆమె పాల్గొంటున్న ప్రకృతిగా నాందివచనం చెప్పటం, చెప్పగల్గటం విశేషం!
చివరగా :
భువనేశ్వరి కిదెవందన
మవనిన్ సాష్టాంగ సరణి నగుగావుత, నా
కవనము నాకవనంబై
నవరీతిని సుమనసులకు నందనమగుతన్!
ఇది కవన ప్రక్రియలో చరమస్థాయి! సృష్టియే కవిత్వమని చెప్పుకున్నాము! మరి ఆమె భువనేశ్వరి కదా? సుమనస్ అను శబ్దమునకు పువ్వులు, సత్పురుషులు, దేవతలు..అని చాలా అర్థములున్నవి. ఈ కవనము స్వర్గములో నందనవనమై సత్పురుషులకు నందనము-సంతోషము కలిగించుగాక అని అర్థాంతరము.
ఇక్కడ రెండు రకాల శ్లేష కనిపిస్తుంది-నా, కవనము-నాకవనము (స్వర్గవనము)-ఇది సభంగ శ్లేష. సుమనసులు నందనము అన్నప్పుడు అర్థశ్లేష అలంకారములు ఆహ్లాదకరంగా సాగాయి!
ఇదే రీతిలో వారు శ్రీ విష్ణు సహస్రనామముల నామార్థములను పద్యాల రూపంలో భావార్థములతో పాటు రచించి యున్నారు. ప్రచురణ చేయ దలచిన వారు ముందుకు రాగలరు!
ఈ పుస్తకం కేవలం 45 పుటలు. ధర వ్రాయబడినట్లు లేదు. పుస్తకం లభించు స్థలం:
శ్రీమతి ఇ. గీత
బి-1240, ఎన్.జి.ఓ కాలనీ
వనస్థలిపురం
హైదరాబాదు-500070
మొబైల్: 9989063749
-వేదాంతం శ్రీపతి శర్మ
బిగ్ బాస్ వ్యవహారాలు-వేదాంతం శ్రీపతి శర్మ
31 జన 2009 వ్యాఖ్యానించండి
in వార్తాలాపం

మన దేశంలోని రాజకీయ విశ్లేషకులు ఒబామా ఎంచుకున్న పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ ఎన్వై రిచర్డ్ హోల్బ్రూక్ పరిధి లోంచి కశ్మీర్ వ్యవహారాన్ని తొలగించినoదుకు సంతోషిoచారు. యూ. ఎస్. లోని కొందరు భారతీయులు కూడా కొద్ది సేపు హమ్మయ్య అన్నారు. కొన్ని చోట్ల ఇది భారత దేశపు దౌత్యానికి ఒక విజయం అని కూడా వ్యాఖ్యానించారు. ఇదేంటి?
హోల్బ్రూక్ ని బుల్డోజర్ అని 1995 తరువాత పిలువటం ప్రారంభించారు. బోస్నియాలో యుధ్ధం జరుపుతున్న ఇద్దరినీ భయపెట్టి మాటలలోకి దింపి ఈయన యుధ్ధాన్ని ఆపిన వ్యక్తి. అటువంటి వాడు పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ వ్యవహారాలతో పాటు కశ్మీర్ ను కూడా చంకలో పెట్టుకుని ఇటు వైపు బయలుదేరితే మంచిది కాదని దక్షిణ ఆసియా వ్యవహారాలు సమీక్షించే మేధావులు అభిప్రాయ పడ్డారు.
మన దేశంలో కొన్ని పత్రికలు ఇది పెద్ద ఉపయోగకరమైనది కాదని చెబుతున్నాయి.
యు.ఎస్. రిసెషన్ కు సంబంధించి చైనాతో జరుపు సంబంధ వ్యవహారాలూ, అఫ్ఘాన్ పరిస్థితి వలన పాకిస్తాన్తో పెట్టుకున్న సంబంధాలు, ఒబామా సి.టి. బి.టి మీద చూపుతున్న మొగ్గు యు.ఎస్. భారత సంబంధాలకు అంత మంచి సూచకాలు కావని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
26.01.2009 రోజున ఒబామ భారత దేశానికి యు.ఎస్.ను మించిన మిత్రుడు లేడని సినిమా పక్కీలో చెప్పిన గంటలో ఆ దేశంలో కంపెనీలు కేవలo భారతీయులనే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని ప్రకటించాయి!
కొద్దిగా లోపలికి వెళితే ప్రపంచ వ్యవహారాలలో మన దేశం సక్రియంగా ఈ మధ్య పాల్గొనకపోవటం వలన మన సమస్యలను మనకు యు.ఎస్. ఎక్కువగా వదిలేయటం జరుగుతోందని ఎకనమిక్ టైంస్ చెబుతోంది.
కశ్మీర్, పాకిస్తానుకు వస్తే మనం స్వయంగా ఏమి చేయగలుగుతున్నాం? ఏమీ కనపడదు. ముంబయిలో జరిగిన దానికి ప్రపంచ దౌత్య వ్యవహారాలను వేగం పెంచి హడావుడి చేశారు. మరల మెదలకుండా కూర్చున్నారు. ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం అంటూ చొక్కాలు చించుకున్నారు…
కాకపోతే హోల్బ్రూక్ ను ఈ గొడవ నుంచి తప్పించి యు.ఎస్. మన దేశానికి మంచి మాటే చెప్పింది. ‘ మీ గొడవ మీది ‘ అని ఒప్పుకుంది. చాలా కాలం క్రితమే ఐరోపా దేశాలు భారత దేశం బార్డర్స్ దాటినప్పుడు కదా మేము సమర్థిస్తామా లేమా అన్నది చెప్పేది అని ప్రకటించి యున్నాయి. బాధింప బడ్ద వాడు ముందు లేచి నిలబడి నా జోలుకి ఎందుకు వస్తున్నావు అని దెబ్బ కొట్టి అడగాలి. అది లేనప్పుడు ఏ దేశం ఏమి మాట్లాడుతుంది?
ఫొటోక్విజ్12-వేదాంతం శ్రీపతి శర్మ
31 జన 2009 అభిప్రాయములు
in శ్రీ-సరదాలు!

ఈ ఫోటో మన చరిత్రలోని ఏ ఘట్టాన్ని చెబుతోంది?
‘బకాసురుడొచ్చాడు!’
30 జన 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

‘ అమ్మా! బకాసురుడెప్పుడొస్తాడు? ‘, చిన్న పిల్ల వాళ్ల అమ్మని అడిగింది. ఆవిడ కళ్లు పెద్దవి చేసింది. బకాసురుడేమిటి, మన ఇంటికి రావటమేమిటి, ఎప్పుడొస్తాడని ఈ పిల్ల అడగమేమిటి?
‘ ఎవరే బకాసురుడు? ‘ అడిగింది.
‘ నువ్వంటూ ఉంటావే వాడే! ‘
‘ నేనెప్పుడన్నానే? ‘
‘ నువ్వే…నువ్వే అన్నావు. నేను నువ్వు కంచంలో పెట్టింది తినకపోతే ఇదిగో చూడూ, బకాసురుడు వచ్చేస్తున్నాడు అని చెప్పావు. నేను వెంటనే భయపడి తినేసాను! ‘
‘ అయితే? ఇప్పుడు వస్తున్నట్లు నీకెవరు చెప్పారు? ‘
‘ నువ్వే కదా ఫోనులో డాడీ ఈ రోజు వస్తున్నారని ఎవరితోనో అంటున్నావు? ‘
ఆవిడకి మతి పోయింది. ‘ నీ దుంప తెగ! డాడీ బకాసురుడని నేనన్నానా? ‘
పిల్ల లేచి నిలబడింది. ‘ అమ్మా, మొన్న డాడీ ఎందుకో గట్టిగా అరుస్తుంటే నువ్వే కదా బకాసురుడిలా అరవద్దన్నావు? ‘
బాగుంది. ఆ ఇల్లాలికి పాపం బకాసురుడు ఊతపదమైతే ఆ పిల్ల నోటికి పూత పూసుకున్నట్లు పూసుకుంది!
అదలా ఉంచండి.
అప్పుడప్పుడు మా ఆఫీసులో ఒకాయన రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడుగుతాడు. కూర్చో పెట్టుకున్నాక కొద్ది సేపే మాట్లాడకుండా గడుపుతాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగగానే ‘ చూశారా? ‘
అంటాడు. ‘ ఏమిటండీ? ‘ అనగానే ‘ ఆ పోలీసు ఏమి చేయగలడు చెప్పండి. రోజంతా వాళ్లావిడ ఇంటిలో పోరుతూ ఉంటే ఏమి పని చేస్తాడు? ఇక్కడ అలా పాపం ఏదో నిలబడ్డాడు. ఎవరి దారిన వారు పోతున్నారు. అంతే! ‘
ఏదో బాధలో ఉన్నాడనుకున్నాను. కానీ మొన్న కొద్ది మంది తాజ్ మహల్ హోటల్ లో జరిగిన విషాదం గురించి తీవ్రంగా చరించుకుంటున్నారు. తీవ్రవాదులు కూడా అలా మాట్లడరేమో అనుకున్నాను. ఒకరి గొంతు అసలు ఎక్కడికో వెళ్లి పోయింది. ఈయనొక్కడినీ పాకిస్తాన్ మీదకు వదిలేస్తే అందరినీ కాల్చి వస్తాడనుకున్నాను! ఇద్దరి మొహాలు చలికాలంలోనే ఎర్రబడి పోయాయి. ఇంతలో ఈ మిత్రుడు వచ్చాడు. అందరినీ ఆపేశాడు. హమ్మయ్య, కొద్ది సేపు అందరూ శాంతించారు. ఈయన ఏమి చెబుతాడో అని చూసాను. రెండు చేతులూ పైకి పెట్టాడు. ‘ ఇదంతా కాదు. తెల్లరి లేచినప్పటి నుంచీ ఇంటిలో ఒకటే పోరుతుంటే ఆ కోస్ట్ గార్డ్ వాళ్లు మటుకు ఏమి చేస్తారండీ? ఉద్యోగం చేయటానికి వెళ్లినప్పటి నుంచీ నువ్వు వచ్చేయి, వచ్చేయి, అక్కడొద్దు, నేనిక్కడ ఉండలేక పోతున్నాను. ఇంతే! దట్సాల్!. ‘
వోర్ర్నాయనో! అనుకున్నాను. ఆఫీసు నుంచి వస్తున్నాను. చక్కగా ఆపి నా వెనుక కూర్చుని నా చిన్ని భుజాన్ని ప్రేమతో తాకాడు. రెండు సార్లు కొట్టాడు. అతనికి అలవాటు. ఏమి చేయటానికి లేదు. దట్సాల్. కొద్ది సేపు బండీ ముందుకు వెళ్లింది. ఒకాయన కూరలు రెండు సంచుల నిండా మొసుకు పోతున్నాడు. ‘ ఏమి చేస్తాడండీ? ‘, అన్నాడు, ‘ ఇంటికెళ్లగానే కూరలో కూరలో అంటే అతను మటుకు ఏమి చేస్తాడండీ? చూడండీ, ఎలా కొంగలా ఒంగిపోయి ఉన్నాడో? రూట్! అసలు అన్ని సమస్యలకూ రూట్ అక్కడ ఉంది. ‘
ఈయన డాక్టర్ దగ్గరకి కళ్లు సరిగ్గా కనిపించటంలెదంటే ఆ డాక్టర్ కూడా ఇటువంటి వాడే అయి ఉంటాడు. అన్ని సమస్యలకూ స్త్రీలే మూలంగా కనిపించేటట్లు అద్దాలు తయారు చేసి మరీ ఇచ్చినట్లున్నాడు.
ఈయనకు ఆవిడ లేకపోతే క్షణం గడవదు. ఎక్కడికైనా వెళితే మూడు నిమిషాలకు మూడు ఫోన్ లు చేస్తాడు. అతనిని ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చూసి చిరునవ్వు నవ్వితే ఫోన్ పెట్టాక ‘ ఆడవాళ్లతో చాలా ఇబ్బందిగా ఉంది…’, అంటాడు, ‘ పెళ్లి అయ్యే వరకు మా నాన్న అమ్మ లాంటి ఆడదాన్ని ఎందుకు చేసుకోవద్దనే వాడో తెలిసేది కాదు. అసలు పెళ్లి అనేది ఒక కేక్తస్ లాంటిది…’
అందరం అటు తిరిగాం. ఏదో జీవిత సత్యం చెబుతున్నాడనుకున్నాం. ‘ పెళ్లి ఒక కేక్టస్. ఒంటె ఉంది చూశారూ, దానికి ఈ కేక్టస్ చాలా ఇష్టం. అది నోటిని పూర్తిగా చీల్చి రక్తం కారుస్తూనే ఉంటుంది. అయినా దానికి అదే ఇష్టం. అదే తింటూ ఉంటుంది. ఈ పెళ్లి అనేది ఈ ప్రక్రియ లాంటిది. అందరినీ కరుస్తుంది. అయినా అందరూ అదే కావాలంటారు! ‘
అతనికి అందరూ ఒక నమస్కారం పెట్టేసి తప్పుకున్నాం. ఈ మధ్య ఎందుకో కనిపించటం లేదు.
ఎందుకో మొన్న మరో ఆఫీసులో కనిపించాడు. అక్కడకు బదిలీ అయినట్లుంది. అతను చేతులు కట్టుకుని ఎవరినో చూస్తున్నాడు. అటు వైపు చూశాను. నలుగురు వ్యక్తులు చిరంజీవి, ఆయన పార్టీ గురించి గురించి బ్రేక్ ఇవ్వకుండా మాట్లాడుకుంటున్నారు. శబ్దం స్థాయిని మీరుతున్నది. ఇతను దగ్గరగా వచ్చాడు. అందరికీ తన రెండు చేతులూ చూపించాడు. ఒకరిద్దరు ఎవర్రా ఇతను అన్నట్లు కళ్ల జోడు సద్దుకుని చూశారు. కాకపోతే అందరూ ఆగిపోయారు. ఒకరు ఆవేశంలో ఇంకా ఏదో అనబోతున్నాడు. అతనికి మరో సారి చేయి చూపించాడు. వద్దు, మాట్లాడకు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. అతనూ ఆగిపోయాడు. ఈయన గొంతు ఏ మాత్రం పెంచలేదు. ‘ ఏమీ లేదండీ..’, అన్నాడు, ‘…రోజంతా ఇంట్లో నువ్వింక ఏమి చేస్తావు, ఏమి చేస్తావు, నువ్వు లాభం లేదు, లాభం లేదు అని వాళ్లావిడ ఒకటే పోరతా ఉంటే అతను మటుకు ఏమి చేస్తాడు? పార్టీ పెట్టేశాడు. నో…దట్సాల్! ‘ ఈ చివరి మాట మటుకు గట్టిగా మాడ్యులేషంతో చెప్పేశాడు!
బకాసురులు ఎక్కడో లేరు. ముద్రలు వేసుకుని అన్నింటిలో ఒక మాటే చెప్పే వారు మన మధ్యలో రోజుకి ఒకరిని తింటూ మనలోనే ఉన్నారు!
–వేదాంతం శ్రీపతి శర్మ
నాయకులు-ఎన్నికలు-చేపలు!
29 జన 2009 అభిప్రాయములు

ఎక్కడైనా నలుగురు కలిస్తే ఎవరైతే ఏదో ఒకటి పాడి వినిపించాలనుకుంటారో ఉన్నట్టుండి ‘ ఎవరైనా పాడండి విందాం ‘ అంటారు. చివరకు ఎవరూ పాడరు. ఇలా మొదలు పెట్టిన వారు కావలసినన్ని పాటలు పాడేసి అందరినీ కింద పడేసి ఇంటికి వెళుతూ ఉంటారు.
ఆఫీసులో బాస్ కూడా లోపలికి పిలచి ఏదో ఆయనకు నచ్చిన దానిమీద ఒక రెండు గంటలు బాదుతాడు. మధ్యలో మర్యాదకి రెండు కప్పులు కాఫీతో గొంతు తడుపుతాడు. ‘ అసలు మన ఆఫీసులో అందరికీ దీని గురించి చెప్పేందుకు ఒక స్పెషల్ లెక్చర్ ఏర్పాటు చేయాలోయ్ ‘ అంటాడు. భజన చేసే విధం తెలిసిన వాడు ‘ సార్, మీరు ఉండగా ఎవరో ఎందుకు సార్ ‘ అని ఎక్కడ లేని బాధను మొహం లోని నరాలను బిగ బట్టి మరీ చూపిస్తాడు. ‘ నేను ఇక్కడ చెప్పాను కానీ…’
భజన్ లాల్ ఊర్కోడు. ముక్కు మీద వేలు పెడతాడు. ‘ ఎంత మాట సార్, మీరు ఒక సారి పూనుకోండి. అదే అయిపోతుంది. మేము అసలు మీ స్కిల్ ను మీరు చూడనీయటం లేదు. తప్పు సార్ ‘ అంటాడు. అంతే! వారం తిరగకుండా కాంఫరన్స్ హాల్ లొ ఒక సమావెశం. ఆవేశంలో ఆఫీసర్ అటాక్! చప్పట్లు, మైకులు, ఒహో…
మర్నాడు రూములో ఆయన టై సద్దుకుంటాడు. ‘ ఇది ఒక్క సారే! నాకు పబ్లిసిటీ ఇష్టముండదు ‘ అంటాడు.
భజన్ లాల్ మొబైల్ తీస్తాడు. ‘ ఇదిగోండి. ఇందులో నాకు వచ్చిన కాల్స్ చూడండి! ఇద్దరినైతే నేనే రావద్దన్నాను. మిమ్మల్ని కలుసుకోవాలని అంటున్నారు…’
ఆ టై అలా ఉచ్చు లాగా బిగుసుకుపోతు ఉంటుంది.
‘ మనలోంచి ఒక నాయకుడు పుట్టాలి…’ అంటూ కుర్చీలోకి వెనక్కు వాలుతాడు ఒకడు, ‘…లైక్ మైండెడ్ వాళ్లందరూ ఒక సంఘాన్ని స్థాపిస్తే ఎలాఉంటుంది? ‘
ఇలా నాలుగైదు వారాలు వాగుతూనే ఉంటాడు. రెండు నెలలు తిరిగే సరికి గోడల మీద ఒక పోస్టర్ ఉంటుంది-సాంస్కృతిక సమితి కార్య దర్శి-వీడి ఫొటో అక్కడ పడిపోతుంది!
సిడ్నీ యూనివర్సిటీ లోని ఆష్లే వార్డ్ అనే ఆయన స్టికల్బాక్ చేపల మీద ఒక పరిశోధన చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు. ఈ చేపలు శారిరికంగా గట్టి వాడిని నాయకునిగా ఎంచుకుంటాయట. అయితే ఆ సమూహం సైజు పెరుగుతున్న కొద్దీ ఆ ఎంపిక ఇంకా గట్టి వాడి వైపు మారుతూ ఉంటుందట!
ఎవరు నాయకులవాలో ముందుగా ఎంచుకుని ఉంటాయి ఈ చేపలు. అయితే కొన్ని మరోలా కూడా ఎంచుకుంటాయి. కాకపోతే ఇలా బహుమతానికి భిన్నంగా ఎంచుకున్న చేపలు మెల్లగా బహుమతంలోకి వచ్చేస్తాయి కూడా!
ఒక సమూహం అందరికీ సమ్మతమైన అభిప్రాయంతో పోతోందా లెదా అనేదానిని ఎలా పరీక్షించాలో తొలుత ఫ్రెంచ్ తత్వ వేత్త కొందోర్సెత్ 18 వ శతాబ్దంలో చెప్పాడు. ఆయన సిధ్ధాంతం ప్రకారం ఒక సమూహం సైజు పెరుగుతున్నప్పుడు స్వతంత్రంగా కరెక్టు గా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుంది. అదే సిధ్ధాంతాన్ని ఈ స్టికలర్ చేపలు చూపిస్తున్నాయి అని శాస్త్రఙ్ఞులు చెబుతున్నారు.
బాగుంది. ఓటు వేసే వారి జనాభా మరి పెరిగినదికదా? మరి నాయకుడిని సరిగా ఎంచుకుంటామా?
ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ‘ ఒక సమూహం సైజు పెరుగుతున్నప్పుడు స్వతంత్రంగా కరెక్ట్ గా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుంది ‘ అన్నారు. స్వతంత్రంగా మనలో ఎంతమంది ఆలోచిస్తామండీ?
అందుకే రవీంద్రుడు అన్నాడు-వేర్ ద మైండ్ ఈస్ విథవుట్ ఫియర్…ఇంటు దట్ వర్ల్డ్ ఆఫ్ ఫ్రీడం…
ఉన్నదా ఆ స్వాతంత్య్ర్యం? ఆ ప్రపంచం?
-వేదాంతం శ్రీపతి శర్మ
ఫొటో క్విజ్ 9 కు సమాధానం-వేదాంతం శ్రీపతి శర్మ
29 జన 2009 వ్యాఖ్యానించండి
in శ్రీ-సరదాలు!

ఈ భవనం కోల్కటాలోని ‘ రైటర్స్ ‘ బిల్డింగ్ ‘


ఇటీవలి అభిప్రాయములు