
సుబ్బారావు ఉదయాన్నే మరల అరుగు మీదకు వచ్చి కూర్చున్నాడు.అరుగు అంటేనే ఆయనకు వల్లమాలిన ప్రాణం.ఆంధ్రుడికి,ఆరు బయట అరుగుకీ మా సెడ్డ సంబంధం ఉంది లెండి.
‘కాఫీ…’ ఆవిడ గొంతు వినిపించింది.జాగ్రత్తగా అందుకున్నాడు.
‘దారే పోయే వాళ్లమీదే ధ్యాస! ఆ అమ్మాయి సందు తిరిగే వరకూ నేను అస్సలు కనిపించలేదు…’ వార్తా పత్రికలోని హెడ్ లైను చదివినట్లు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సుబ్బారావు చిరునవ్వు నవ్వాడు. కాఫీ గ్లాసును జాగ్రత్తగా చూశాడు.
‘ చిట్టీ…ఓ మాట అనుకుందాం. ఇంద్రభవనాన్ని వెనకాల పెట్టుకుని ఇంటి బయట ఇలా అరుగు మీద కాఫీ ఎందుకు సేవిస్తున్నానో తెలుసా?’
ఆవిడ వెనక్కి చూసింది.ఇది మన ఇల్లేనా అనే సందేహం కూడా కలిగింది.
‘ఏముందీ…కథలు చెప్పటానికి!’
ముక్కు మీద వేలు పెట్టాడు సుబ్బారావు.
‘ అదేవన్నమాట? మనం కథలు చెప్పం, వ్రాయం. మన గురించి…’
‘ప్రపంచం కథలు చెప్పుకుంటుంది. అంతేనా?’
‘ మరల పప్పులో కాలేశావు. ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు.రెండు దశాబ్దాల తరువాత నా మీద పరిశోధన చేసి రేట్లు నిర్ణయించి మరీ డాక్టరేట్లు తీసుకుంటారు!’
‘అరుగు మీద ఎందుకు కూర్చున్నారు మాష్టారూ?’
‘గుడ్ క్వెష్చన్! మనం ఆంధ్రులం. అందరి బాగోగులు మనకి ప్రధానం. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి.’
‘ కొద్దిగా మారుస్తాను.’
‘అలాగే. అర్థాంగికి అర్ధం మార్చే అధికారం ఉంది. అంటే సగమే!’
‘ అందరూ బాగుండాలి అని కాదు. అమ్మాయి బాగుంటే చాలు. అదీ సంగతి!’
‘ ఐ విల్ ఎక్స్ ప్లెయిన్. ఇది గూఢమయినది.’
‘ఏమిటి? అమ్మాయిలని చూడటమా?’
‘ అది కాదు.అది కూడా ఆర్టే అయినా నేను దాని గురించి ఆట్టే చెప్పను.నేను ఫుట్ బోర్డు ట్రావెల్ గురించి చెబుతున్నాను.’
‘ మన కాలనీలోకి బస్సులెప్పుడు వచ్చాయి?’
‘ అక్కర్లేదు. అదుగో ఆయనను చూడు.చెవిలో మొబయిల్ పెట్టుకుని అవతల ఉన్న ఆయనకి సైగలు చేస్తూ ఎటో పారిపోతున్నాడు. అన్నీ సగం సగమే! ఆఫీసరు కూడా ఎక్కడినుండో ఫోను చేసి నువ్వున్నావా? ఉండు అంటాడు.నేనా, వస్తున్నానని రోజంత చెబుతూనే ఉంటాడు. ఆఫీసుకు వచ్చిన వాడు కూడా ఇపుడే ఇదుగో ఇప్పుడే వస్తానని మొబయిల్ పట్టుకుని పారిపోతాడు. ప్రొగ్రాం కూడా ఇదుగో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అంటుంది.అంత సగమే! ఎవరిని కదిలించినా మళ్లీ మాట్లాడుతాను అంటాడు. అప్పుడు మటుకు మట్లాడడు.అందరూ ఫుట్ బోర్డు మీద ప్రయాణమే…లోపలికి వెళ్లం, కిందకి దిగం.’
‘ అందుకా మీరు అరుగు మీద కూర్చుంది? ఇదో ఇంటి ఫుట్ బోర్డన్నమాట!’
‘ప్రతి దానినీ ఎత్తి పొడవకూడదు చిట్టీ! ఇది నేను చెప్పినట్లు లోక సంరక్షణార్థం! అసలు ఇల్లు కట్టేదే అరుగు కోసం. ఆలోచించు.అరుగు మీద కూర్చుని ఇలా నీ చేతి కాఫీ త్రాగుతుంటే ఒకటి ఏమిటి? దేని మీదనైనా మాట్లాడేయవచ్చు ‘
‘ బావుంది వరస. నేను లోపలికి వెళతాను.’
‘ అరే! అంత తొందరగా వెళితే ఎలా? పార్టీలన్నీ తెలంగాణా మీద చేసింది ఫుట్ బోర్డు ట్రావెలే!’
‘ ఓహో!’
‘ అదన్నమాట. ప్రజలు చేతిలో కర్ర పట్టుకుని దిగుతావా, బస్సు లోపలికి పోతావా? అన్నారు. చచ్చినట్లు రాజీనామాలు చేసి మేకపోతు గాంభీర్యంతో అటూ ఇటూ చూస్తున్నారు.’ ‘ అవునూ,ఒకటి చెప్పండి…’
‘ ఒకటేమిటి? ఇది అనాదిగా వస్తున్న అరుగు పీఠం. ధర్మరాజు తొలుత ఇటువంటి అరుగు మీదే అరంగేట్రం చేశాడు. ఈ అరుగు మీదనే అడుగు!’
‘ ఇంతకీ తెలంగాణా రావాలా? వద్దా?’
‘ ఖచ్చితంగా అక్కరలేదు.’
‘ ఆ? అంత ధైర్యంగా చెబుతున్నారా?’
‘అబ్బా అడిగింది చెప్పరు కద?’
‘ అరే! అలా చెప్పేస్తే కాలానూగుణంగా నడుచుకోడు వెధవ అంటారు.ఇది ఫుట్ బోర్డు ట్రావెల్ చేయవలసిన కాలం.ముందు సగమే! అసలు తెలంగాణా ప్రాంతం వారు తప్ప అందరు ఎం.ఎల్.ఏలూ రాజీనామా చేసేస్తే శాసనసభలో మిగిలింది తెలంగాణా ఎం.ఎల్.ఎలే కదా?’
‘కరెక్ట్!’
‘ అయిపోయింది. తెలంగాణా శాసనసభ సింపుల్ గా ఏర్పడిపోయింది.’
‘ ఇవి మీ అరుగు తెలివి తేటలు! అరుగు మీద తెలివి అరిగిపోతోంది మరి!’
‘ఎంత మాట? అసలు ఒక కొత్త రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది అనేది గృహమంత్రికి, ఆర్థిక మంత్రికి, ప్రధానమంత్రికి తప్ప అందరికీ తెలుసు!’
‘ అధిష్ఠానం?’
‘ దానికి పుట్టినరోజు పండుగల గురించి తప్ప మరేదీ తెలియదు. నాలుగు పూల బస్తాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు!’
‘ఇంతకీ మీరు లోపలికి దయ చేస్తారా లేక అరుగు దిగి అటు నుంచి అటే…’
‘ ఎంత మాట? నేను నీ ప్రతినిధిని. నకు వోటేసి ఎన్నుకుని, సెలెక్ట్ చేసి పెండ్లి చేసుకున్నావు. మనం స్థిర నివాసం ఏరపరచుకున్నాము.’
‘ అంటే అర్థం కాలేదు. అటు వెళతారా ఇటు లోపలికి వస్తారా?’
‘ ఇక్కడ కూర్చున్నంత మాత్రాన బయటకు వెళతానని అర్థం కాదు. వస్తాను. అరుగు మీద రోజంతా కూర్చోలేము కదా?’
‘ సరే లోపలికి రండి.’
‘ అలాగే! తప్పకుండా. నీ చేతితో మరో కప్పు కాఫీ అందించు. ఈ లోపల ఇలా వెళుతున్న ఫుట్ బోర్డు ట్రావెలర్సును చూసేద్దాం…’
‘ఖర్మ!’
~~~***~~~